సాహిత్య చంద్రికలు (“రేపటి వర్తమానం” కవితా సంపుటి పరిచయం)

మనకు ఆధునిక కవులు చాలామంది ఉన్నారు. వందల సంఖ్యలో కవితలు ప్రచురితమవుతున్నాయి. వస్తు, శైలి, శిల్ప వైవిధ్యాలతో రచనలు వస్తున్నాయి. అయితే, వాటిలో కొన్ని బాగా ఆకట్టుకోగలుగుతున్నాయి. అందుకు కారణం వాటిలోని విశిష్టతే.
ఆకలి కవితలు, ఆక్రందన కవితలు, ఆహ్లాద కవితలుగానూ, నానీలు రెక్కలుగాను కవితలు విడిపోతున్నాయి. అలా జరుగుతున్నా మంచి కవితలే మనం చదవగలుగుతున్నాం.
కవిత్వాభినివేశం ఉన్నప్పుడు, భాషమీద పట్టు ఉన్నప్పుడు ఒక పరిణితి చెందిన ఛాయాచిత్రకారుదు తీసిన అరుదైన చిత్రాల వంటి గాఢమైన, హత్తుకోగల కవితలు రచించడం సాధ్యపడుతుంది.
కవిత్వానికి స్పందన, ప్రేరణలు మాత్రమే సరిపోవు. అనుభూతి, సానుభూతితో పాటు వాటిని యథాతథంగా అక్షరాలలోకి దించగల నైపుణ్యమూ ఉండాలి.
ప్రపంచమనే విశాల కాన్వాసు మీద, నిత్యమూ వాటికవే ఎన్నో వైవిధ్యాలతో సంఘటనల చిత్రాలు రూపుదిద్దుకుంటూ చెరిగిపోతూ ఉంటాయి. వాటిని చెరిగిపోకుండా పట్టుకోగలగాలి. పదిలంగా మనో మందిరంలో నిక్షిప్తం చేసుకోవాలి. అటుపైన ప్రసవ వేదనలాంటిది మొదలవుతుంది.
రచన కాగితం మీద ప్రసవించే వరకూ ఆ బాధ ఆగదు. అటు తర్వాత, అపురూపంగా అక్షరాలను తడిమి చూసుకుంటూ, చేర్పులూ మార్పులతో అక్షర శిల్పాన్ని అందంగా అద్భుతంగా కవి తీర్చిదిద్దుతాడు. సంగీత సరస్వతులు నడుస్తూ కూడా రాగారధనలు చేస్తుంటారు. సాహిత్య సరస్వతులు కూడా నడుస్తునే భావసంపదలని ఎంతో మురిపెంగా మోసుకు వెళ్తుంటారు. అక్షరారాధనలు చేస్తుంటారు. వారి అంతరంగమే ఒక భువన విజయ మందిరం.
ఒక కవికి ఇంతటి నేపధ్యం ఉంటుంది.
చంద్రుడు కేవలం ఒక గోళమయితే ఎలాంటి ఆకర్షణ ఉండదు. చంద్రుడు అక్కడే ఉండి, వెన్నెలని జగమంతా కురిపిస్తున్నప్పుడు, ప్రపంచం కృతజ్ఞతతో ఆ గోళాన్ని ఒక దేవతగా చూస్తుంది.
చంద్రుడు దిగిరాడు, చంద్రికల్ని తన దూతలుగా పంపుతాడు. కవి కూడా అంతే. అతని కవితా చంద్రికలే మనల్ని స్పృశిస్తాయి.
ఇంత ఉపోద్ఘాతం ఇస్తేగానీ అడిగోపుల సారస్వత స్వరూపం మనకి అవగతం కాదు. కొన్ని దశాబ్దాలుగా నాకు ఆయన మిత్రుడు. అయన తెల్లని కోకిల, కమ్మగా పాడే కోకిలకి దేవుడు నల్లరంగు ఇచ్చినా, సరస్వతీదేవి అడిగోపుల వ్యక్తిత్వానికి స్వచ్ఛతనిచ్చింది. అందుకే ఆయన తెల్లని కోకిల.
గొప్ప సాహిత్యకారులు గొప్ప వ్యక్తులు కూడా అయినప్పుడు వారు ఆదర్శమూర్తులవుతారు. అడిగోపుల నిండుకుండ. తొణకడు, బెణకడు. జీవితమంతా మానవత్వ వేదనలకే అంకితం చేసాడు. గొప్ప కథలు రాసినా, ఇంకా రాయగలిగినా, కవిత్వల్నే తన సాహిత్య సైంధవాలుగా ఎంచుకున్నాడు.
అందుకే మెట్టు మెట్టు ఎక్కుతు ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ప్రస్తుత పుస్తకం పదిహేడవది.
ఇందుకో ఆయన ఏం చెప్పాడోనని చూస్తే, అసలేమీ చెప్పలేదా అనిపిస్తుంది. అడిగోపుల అరుదైన పదచిత్రాల కూర్పులో తనకి తానే సాటి.
‘అక్షరాలు దర్జీ ముందు గుడ్డముక్కలు
కలిపితే అందమైన వస్త్రమవుతుంది ‘- ఇది అడిగోపులకి వర్తించే వ్యక్తీకరణ
వీరి కవితల్లో ముక్తాయింపులు ముత్యాల్లా మెరుస్తుంటాయి.
‘ఫిడేలు గానం మనసు నింపుతుంది
కడుపునింపడం లేదు’ అనేది శ్లేషలో చెప్పబడింది.

‘రోజూవారీ కూలీల డొక్కలు శబ్దాలు చేస్తుంటాయి
పాలకై పసిబిడ్డల ఏడ్పులు చందమామని చుట్టుకుంటాయి – ‘

నీతిని మరచిన మనుషులు
అవినీతికి సహచరులు
మనిషిని కొలవడానికి
ఆస్తిని తూకం వేస్తున్నారు
ఆర్జితం నీతా అవినీతా
ప్రశ్నించడం మరుస్తున్నారు!

ముదిమిన సంప్రాప్తించిన చెక్కిలి ముడతలు
బతుకు పుస్తక పాఠాలు – లోహితాస్యులు పాములు కరచి చనిపోతారు
చంద్రమతులు బలిపీఠాలు ఎక్కుతారు
ప్రజాస్వామ్యం తుప్పుపట్టిందని
సప్తాశ్వుడికి కబురుపెట్టండి
ఇది సరికొత్త వేకువ
నిద్రించే వాళ్ళని నిద్రపోనీకండి -

ఇలాంటి మెరుపులు ప్రతీ కవితలోనూ కనిపిస్తాయి.
కొందరికి సాహిత్యం ఒక అభిరుచి, కొందరికి కాలక్షేపం. మరికొందరికి జీవిక. కానీ అడిగోపులకి సాహిత్యం ఒక తపస్సు.
అక్షరాల ఆణిముత్యాలతో ఆయన నిత్యమూ విరామ రహితంగా, మానవత్వ కేతనం పక్కన నింపాదిగా కూచుని రేపటి తరం కోసం వర్తమానాన్ని లిఖిస్తునే ఉంటాడు. అదే ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన సుకవి.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
(చినుకు మాస పత్రిక మే 2012 సంచిక నుంచి)

* * *

రేపటి వర్తమానం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

రేపటి వర్తమానం On Kinige

సైన్సూ, ఫిక్షన్ కలిపి

కాలంలో ప్రయాణం ఆంగ్లంలో టైమ్‌ట్రావెల్ చిన్న టైటిల్‍తో వెలువడిన ఈ పుస్తకం కొంచెం ఊహాత్మక ప్రతిపాదనతోనూ, ఊహకు మరికొంత శాస్త్రీయ ఆధారంతోను నడిపించారు రచయిత మన్నె సత్యనారాయణ. 4-డైమెన్షనల్ కంటిన్యుమ్ సిద్ధాంతాన్ని ఈ నవలలో కొద్దిపాటి వివరణలతో నడిపించారు. శాస్త్రవిజ్ఞానం ఈనాటికి చేరిన స్థాయినీ, అది పురోగమిస్తున్న వేగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రచయిత చెపుతున్నారు. సంక్లిష్టమైన యంత్రం నుంచి ప్రజలు వాడుకునే చిన్న వస్తువుల తయారీ వరకు వృద్ధి చెందిన శాస్త్రవిజ్ఞానాన్ని తెలియజేస్తాయని చెబుతూ ఒకనాడు అసంభవం అనుకున్న సాధనాల్ని ఈనాడు శాస్త్రవిజ్ఞానం సాధించి చూపిస్తున్నదని రచయిత చెప్పుకుంటూ వచ్చారు. పైగా మనిషి చేసిన ప్రతి ఆవిష్కరణ ఊహతోనే ప్రారంభం అవుతుందని ఆ ఊహను ఆలోచనను మధించి ప్రయోగం జరిపితేనే సిద్ధాంతంగా రూపొందుతుందని చెప్పారు.
అందుకె రోజూవారీ ఆలోచనల మేలిమి రూపమే సిద్ధాంతం అన్న ఐన్‌స్టీన్ వ్యాఖ్యలను కూడా ఆయన ఉటంకించారు. సైన్సు ఫిక్షన్ చరిత్రల నేపథ్యంలో నడిచిన నవలగా చెబుతున్న కాలంలో ప్రయాణం గతంలో ఇంగ్లీషులో ఈ సబ్జెక్టుతో నవలలు వెలువడ్డాయి. ఆయా నవలలు ఆ రచయితలు ఆ భాషలు, ఆ దేశాల సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంలో రాసారు. అయితే ఈ రచయిత, తెలుగులో, తెలుగు సంస్కృతి నేపథ్యంలో రాయాలనిపించి సఫలీకృతులయ్యారు. టైమ్‌ట్రావెల్ అనేది ఫిక్షన్, ఆ నవల్లలో టైమ్ ట్రావెలర్ వెళ్ళింది కూడా కల్పనాకాలంలోకి. కానీ ఈ నవలలో టైమ్ ట్రావెలర్ తెలుగు చారిత్రక కాలంలోకి వెళతాడని రచయిత వివరించారు. అందువల్లనే ఆ నాటి తెలుగు చరిత్రని పరిశీలనగా చెప్పవచ్చని రచయిత గ్రహించారు. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంలోనికి, తరవాత నన్నయ్య, రాజరాజనరేంద్రుల కాలంలోకి టైమ్ ట్రావెలర్ వెళతాడు. చరిత్ర కావడంతో చారిత్రక వాస్తవాలకు దగ్గరగా రాయడానికి రచయిత ప్రయత్నించాడు. రాయలవారి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇద్దరు పోర్చుగీసు వారు రాసిన పుస్తకాలను కూడా రచయిత ప్రామాణికంగా తీసుకుని కాలంలో ప్రయాణం పూర్తి చేసారు. రాయల కాలంలో వ్యవసాయం, కొన్ని మౌలిక వసతుల కల్పన గురించి చెప్పడానికి రచయిత ప్రయత్నించారు. రాయల కాలంలోని నీటి వనరులు ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. అయితే వాటిని ఇప్పుడు పాతకాలం కాలవలని చెప్పడం రివాజు. సైన్సు, ఫిక్షన్, చరిత్ర అంశాలుగా నడచిన ఈ పుస్తకానికి మాజీ గవర్నర్ వి. ఎస్. రమాదేవి ముందుమాట రాసారు.

- గన్ని మోహన్
(వార్త దినపత్రిక 13 మే 2012)

* * *

“కాలంలో ప్రయాణం” రాష్ట్రస్థాయి నవలల పోటీలో రూ.20,000/- బహుమతిని పొంది, ఆంధ్రభూమి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన నవల. ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి.

కాలంలో ప్రయాణం On Kinige

చిన్న కథల పొది – “అస్త్రం”

పదమూడు కథలతో కూడిన “అస్త్రంకె.ఎల్.వి. ప్రసాద్ గారి రెండవ కథా సంపుటి. చూసిన, అనుభవించిన, ఎదురైన, సంఘటనలను కథలుగా మలచి పాఠకులకు అందించారు. చిన్న కథగా కథను మలచడంలో జాగ్రత్త, నైపుణ్యం, అవసరం. అనవసర విషయాలు ఉంటే కథ కుదరదు. ఈ విషయాలు తెలిసిన రచయిత వీరు మర్యాదస్తుడుగా మసలే మనిషి తీరును “అతడు – ఆమెలో” ప్రదర్శనకు పెడతారు. అమ్మాయిలకు పేర్లు పెట్టే రాజశేఖర్‌కు తన పెద్ద చెల్లెలి విషయంలో జరిగిన సంఘటనలో కళ్ళు తెరచినట్లయింది. ఈ సంగతిని కొసమెరుపు రూపంలో కథకుడు అందిస్తాడు. ఈ సంపుటిలో చదువుకు సంబంధించిన కథలు రెండు ఉన్నాయి. “అబ్బాయి చదువు”లో తల్లిదండ్రుల ఆకాంక్షకు వ్యతిరేకంగా తనేం చదవాలో అబ్బాయి నిర్ణయం తీసుకుంటే, “నేరం నాదికాదు” కథలో తన ఆసక్తికి వ్యతిరేకంగా తల్లి ఒత్తిడివల్ల చదివిన అమ్మాయి ఇంటర్ ఫెయిల్ అవడం కనిపిస్తుంది. ఈ రెండు కథలవల్ల తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల పట్ల ఎటువంటి దృష్టి కలిగి వుండాలో తెలుస్తుంది. పిల్లల ఆసక్తులను పరిగణలోకి తీసుకోవాలని కథలు చెబుతాయి.

అన్ని సమకూర్చుకొని, వేళకు వివాహం జరుపుకుందామనుకున్న ఆదర్శ జంటకు, మంత్రిగారి జోక్యం వల్ల, ముహూర్తం దాటాక పెళ్ళి జరగడం “ముడి”లో కనపడుతుంది. పేరుకోసం పత్రికలో చోటుకోసం వచ్చిన మంత్రి, వాస్తవంగా పెళ్లి చేసుకున్న జంటకు చేసిన మేలేమి లేదు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు, సమాజంలో జరిగే మంచి పనులకు చేయూత నివ్వడంకంటే, వాటి నుండి లబ్ధి పొందడమే పరమావధిగా రాజకీయ నాయకులు నడవడం తెలిసిన విషయమే. ఇలాంటి కథే “అంకితం” ఇందులోని రచయిత వ్యవహరించిన తీరు రాజకీయ నాయకుడి తీరుకు భిన్నంగా లేదు. లీడర్ పేరుకోసం తాపత్రయపడితే, రచయిత డబ్బుకోసం ఆశపడటం కనిపిస్తుంది. ఈ రెండు కూడా విపరీత పోకడలే. వీటిని ఆసక్తికరంగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది.

“తోటకూర నాడే మందలించాలి” అనే సూక్తిని గుర్తుకు తెచ్చేకథ “తప్పటడుగులు”. చిన్నప్పుడు కొడుకు చేసిన తప్పుపని, తండ్రికి సంతోషం కలిగిస్తే, అలాంటిపనే పెద్దయ్యాక చేయడంవల్ల తండ్రి ఉనికికే మోసం రావడం కథలో కనిపిస్తుంది. ఇది ఈనాడు సమాజంలో జరిగే తండ్రి, కొడుకుల తగాదాలకు అద్దంపట్టింది.

అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే లాంటివాళ్ళు గొంతెత్తితే రచయిత కథనెత్తాడు.”ఆటోవాలా” అనే కథలో లంచావతారం ఒకడైతే, శ్రమజీవి మరొకరు. అవినీతి తిండితో అరగక ఒకడు బాధపడుతుంటే, అవసరానికి ఆటో నడిపించే ఉద్యోగి మరొకరు. కథ కాస్త సినిమాటిక్‌గా ఉంది. లంచావతారాన్ని అతని భార్యే చీదరించుకోవడం బాగుంది.

అమ్మాయిలను మభ్యపెట్టి, మోసగించి జ్యోతిషం చెపుతున్న వ్యక్తి “బ్రతుకు దెరువు”లో కనిపిస్తే, యవ్వనంలో ఉండే, బస్సులో నిలబడచేతగాక కుంటివానిగా నడించిన వ్యక్తి “కుంటి మనస్సు”లో కనిపిస్తాడు. ఇద్దరూ చేసింది మోసమే. కాని హస్తిమశకాంతరం. నిజాయితీని వదిలిన యువకుని ఒక కథ చూపిస్తే, అమ్మాయిలను చూసి భ్రమసే వృద్ధుణ్ణి మరో కథ చిత్రిక పట్టింది. ఈ రెండు ధోరణుల నేటి వ్యాపార సమాజపు ప్రతిఫలనాలే.

శ్రద్ధగా చదువుకొని, తనను తాను సంస్కరించుకొన్న రాధ “ఆమె గెలిచింది”లో కనపడితే, కోరుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి నాటకమాడిన శ్రీనివాస్ “అస్త్రం” లో కనపడతాడు. నిజాయితీలో ఒకరు హృదయాన్ని జయిస్తే, మరొకరు గడుసుగా కాపురం నిలుపుకోవటం వల్ల పాఠకులకు రెండు కథలు ఆహ్లాదాన్ని పంచాయి.

“మనిషి” కథలో చెప్పులు కుట్టేవాని సంస్కారం, డబ్బున్న ఉద్యోగి కనులు తెరిపిస్తుంది. కార్మిక హృదయం ఒక మనిషిని చేరదీస్తే, మధ్య తరగతి ఆలోచన బేరం ఆడడం కనిపిస్తుందీ కథలో. అందుకే అతడు మనీషి అయితే, ఇతడు మనిషిగా మిగిలాడు.

వృత్తిరీత్యా డాక్టరుగా, ప్రవృత్తిరీత్యా సాహిత్యజీవిగా, అవసరం రీత్యా ప్రయాణికుడిగా, రచనారీత్యా కథకుడిగా, అవగాహనారీత్యా మానవతావాదిగా, అంతిమంగా తానే ఒక అస్త్రంగా కె.ఎల్.వి.ప్రసాద్ ఇందులో తారసిల్లుతాడు.

- బి.వి.ఎన్.స్వామి.
(ప్రజాసాహితి మే,2012 సంచిక నుంచి)

* * *

ప్రజాసాహితి” మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. ఈ క్రింది లింక్‌లని అనుసరించండి.

Kinige Newsletter 12 May 2012

Welcome to Kinige Newsletter V2.9
** Rudrani Thumb Image **రుద్రాణి
మధుబాబు – నవల
** EvaritO Ela Matladali Thumb Image ** ఎవరితో ఎలా మాట్లాడాలి?
‘రామాయణంలో హనుమంతుడు’ ఆధారంగా రూపొందిన పుస్తకం.
** Chaturnetrudu Thumb Image **చతుర్నేత్రుడు
మధుబాబు జానపద నవల.
** OperationCounterSpy Thumb Image ** ఆపరేషన్ కౌంటర్ స్పై
మధుబాబు – షాడో స్పై థ్రిల్లర్
** Prkaruti Varalu1 Thumb Image **ప్రకృతి వరాలు 1
గృహవైద్యం మీద శాస్త్రీయమూ, సమగ్రమూ అయిన పుస్తకం
** Chinese Beaty Thumb Image **చైనీస్ బ్యూటీ
మధుబాబు – షాడో స్పై థ్రిల్లర్


** Bharaitya Vyaktitvam Thumb Image **పరుసవేది
పాలో కొయిలో రచన
** Tilak Kathalu Thumb Image **తిలక్ కథలు
మొదటి భాగం
** Muddu Vaddanlu1 Thumb Image ** ముద్దు వడ్డన్లు 1
విశ్వనాథ సత్యనారాయణ గారి విశేషాలు
** Darshanam Thumb Image **దర్శనమ్ మే 2012
కావ్యేతిహాస పురాణాలు సరళమైన భాషలో
** Rudrani Thumb Image **రుద్రాణి
మధుబాబు – నవల
** MulikaVaidyam Thumb Image **మూలికా వైద్యంతో ఆరోగ్యం
డా. జి. లక్ష్మణరావు రచన
** OperationCounterSpy Thumb Image ** ఆపరేషన్ కౌంటర్ స్పై
మధుబాబు – షాడో స్పై థ్రిల్లర్
** Gunde Jabbulu Thumb Image **గుండె జబ్బులు ప్రత్యామ్నాయ పరిష్కారాలు
డా. జి. లక్ష్మణరావు రచన
** Tummeti Thumb Image **ప్రాచీన భారతదేశ చరిత్ర
డి.డి. కోశాంబి రచనకు పరిచయం

ఏటి ఒడ్డున వనమాల చారిత్రక వ్యాసమంజరి మతతత్వంపై బాలగోపాల్
పర్యావరణ కథలు తెలంగాణా అస్తిత్వ పోరాటం కృష్ణారెడ్డి గారి ఏనుగు సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం
तेलुगु साहित्य: एक अवलोकन Political Stories ముందే మేలుకో నేనూ… సావిత్రీ బాయిని

From Our Blogs:
** Alpajeevi Thumb Image ** వినవోయీ! అల్పజీవి!
పుస్తక పరిచయం
** New Agriculture Thumb Image ** New Agriculture
– A Permaculture Point of View

పుస్తక పరిచయం – ఆంగ్లంలో
** Telangana Astitva Poratam Thumb Image ** అస్తిత్వ ఆకాంక్షలను
ఆవిష్కరించిన వ్యాస సంకలనం

పుస్తక సమీక్ష

ద్రౌపది – నాలుగు ఈఃపుస్తకాలు 40 శాతం తగ్గింపు ధరకు!

ద్రౌపది – మహాభారతంలోని ప్రధాన పాత్ర. దీనిపై తెలుగులో ఇటీవలే వచ్చిన మూడు పుస్తకాలు ఇప్పుడు కినిగె మీకు అందుబాటులోకి తెచ్చింది. ఈ మూడు పుస్తకాలే కాకుండా ఎంబీయస్ ప్రసాద్ ద్రౌపది పుస్తకాల గురించి తన అభిప్రాయం చెప్పిన ఎంబీయస్ కబుర్లు జూలై 2012 కూడా కినిగెలో అందుబాటులో ఉంది.

Good news doesn’t stop there, now purchase all these four books and get 40% discount! Hurry, this is limited time offer. Offer valid only for couple of days. To purchase all these four eBook with only Rs. 174/- click this link http://kinige.com/koffer.php?id=39  (original price is Rs. 290/- You save Rs. 116/- )

1. ద్రౌపది – డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అసంఖ్యాక పాఠకులచేత చదవబడిన ఈ కాలపు నవల ఈ ద్రౌపది. ఈ పుస్తకం గురించి జంపాల చౌదరి వ్రాసిన సవివర పరిచయం పుస్తకం డాట్ నెట్లో ఇక్కడ http://pustakam.net/?p=3398 చదవండి.

2. సౌశీల్య ద్రౌపది – కస్తూరి మురళి కృష్ణ

సౌశీల్య ద్రౌపది నవల ప్రధానంగా వ్యాసభారతము, కవిత్రయ భారతాల ఆధారంగా రచించినది. అక్కడక్కడా, అవసరాన్ని బట్టి ఔచిత్యాన్ని పాటిస్తూ, కల్పనలు చేయబడ్డాయి. భారతీయ ధర్మాన్ని అర్థం చేసుకోని రచయిత రచించిన నవలిక ఈ సౌశీల్య ద్రౌపది.

ఈ పుస్తకం గురించి ఎంబీయస్ ప్రసాద్ వ్రాసిన పరిచయం ఇక్కడ పుస్తకం డాట్ నెట్లో http://pustakam.net/?p=5170 చదవండి.

3. తెలుగింటికొచ్చిన ద్రౌపది – డాక్టర్. ఎంవి రమణారెడ్డి

ఈ పుస్తకంలో రచయిత, తెలుగింటి ఆడపడుచుగా ద్రౌపదిని తాను గుర్తించడమే గాక మనందరి చేత గుర్తింపజేయడం లక్ష్యంగా ఈ రచన చేసారు. గుర్తింపు ఒక్కటే కాదు, తెలుగింట ద్రౌపదిని పెద్దపీటమీద కూర్చోబెట్టి ఆమె అంతస్తుకు తగిన విధంగా తమ గ్రంథంతో సత్కరించారు. మహాభారత మహారాజ్ఞిగా పాంచాలికి ‘పట్టాభిషేకం’ చేసారు.

“ద్రౌపది గురించి సినిమాలద్వారా మాత్రమే తెలుసుకున్న వారికి ఈ పుస్తకం చాలా ఉపయోగకరం” అంటున్న ఆంధ్రభూమి రివ్యూ ఇక్కడ చూడండి http://archives.andhrabhoomi.net/sahiti/draupadi-293

4. ఎమ్బీయస్ కబుర్లు జులై 2010 – ఎంబీయస్ ప్రసాద్

ద్రౌపదిని గురించి వచ్చిన పుస్తకాలను తనదైన శైలిలో విశ్లేషించిన ఎంబీయస్ ప్రసాద్ గారి విశేష వ్యాసాన్ని ఈఃపుస్తకంలో చదవండి.

ఈ నాలుగు పుస్తకాలు కలిపి ఒకేసారి ఒకే క్లిక్కుతో కొని 116 రూపాయలు అవును అక్షరాలా నూటపదహారు రూపాయలు ఆదా చేసుకోండి. 290 రూపాయల ఈ పుస్తకాలను కేవలం 174 రూపాయలకే స్వంతం చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి http://kinige.com/koffer.php?id=39 . త్వరపడండి ఈ అవకాశం కేవలం రెండు రోజులు మాత్రమే!

ప్రజాసాహితి మే 2012 సంపాదకీయం

నూతన ప్రజాస్వామికి సంస్కృతీ నిర్మాణానికి చైతన్య స్పూర్తి ‘మేడే’!

“రైతు, కాళ్ళను భూమిమీద నిలదొక్కి నిలుచుంటాడు… భూమి తనది కాకపోయినా రైతు దానిమీద నిలబడతాడు. దానికి సన్నిహితంగా ఉంటాడు. కానీ ఫ్యాక్టరీ కార్మికుడు పక్షిలాంటివాడు. అతనికి నా అన్న స్థలముండదు. ఇల్లూ, వాకిలి ఉండదు. ఇవ్వాళ ఇక్కడ వుంటాడు. రేపెక్కడికో పోతాడు. ఆడది కూడా అతడినొకచోట ఉండేటట్లు చెయ్యలేదు. కాస్తంత ఆమెతో తగాదా వస్తే, ఆమెను వదిలేసిపోతాడు. కానీ రైతు మాత్రం మేలైన పనికోసం వెతుక్కుంటూపోతాడు. కానీ రైతు మాత్రం తాడు తెంచుకొనిపోడు. ఉన్నదాన్ని బాగుచేసుకోవాలని తంటాలు పడతాడు.” (గోర్కీ “అమ్మ” నవల పేజి 159).

మానవసమాజానికి ‘శ్రమ’ మూల ఆధారం. శ్రామికశక్తితోనే మానవ సంస్కృతి వికసించి ముందడుగు వేస్తోంది. కానీ, ఉత్పత్తి సాధనాలు భూస్వాముల, పెట్టుబడిదారుల ఆధిపత్యంలో ఉన్నంత కాలం, ‘సొంత ఆస్తి’ని పాలనాపద్ధతులూ, చట్టాలూ పెట్టుబడీదారీ విధానపు కొమ్ముకాస్తున్నంతకాలం నిర్మాణాత్మకమైన ‘శ్రమ’ బండచాకిరీగా మారి, శ్రామికుడు పరాయీకరణకి గురవుతాడు.

‘పని’ కష్టజీవిని లాలించే చల్లని తల్లి ఒడికాకుండా, పళ్ళచక్రాల మధ్య నుజ్జు నుజ్జు చేసే కర్కశ రాపిడి అయిన దగ్గర- రోజుకి 18-20 గంటల తరబడి చాకిరీ కొలిమిలో కుతకుతలాడిపోయిన నాడు – రోజుకి ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగో కార్మికుల 1886 మే 1 ఉద్యమం, ప్రపంచవ్యాపితమై పెల్లుబికింది. “నీ వర్గం శ్రేయస్సే నీ దేశం శ్రేయస్సు. కష్టించే జనావళికి దేశపు సరిహద్దు లేల. ప్రపంచ కార్మికులంతా ఒకే తల్లి బిడ్డలురా. ప్రపంచ కార్మికులంతా ఒకే కొమ్మపువ్వులురా”!! (శివసాగర్). ‘పెట్టుబడి’ పెరిగినకొద్దీ, కార్మికవర్గం పెరుగుతూ ఉంటుంది. శ్రామికుల చలనానికి ఆంక్షలు విధించే పెట్టుబడి, దేశాల సరిహద్దులను ఖాతరు చేయదు. అమ్మకపు సరుకులై భూగోళం అంచులదాకా విహరిస్తుంది. వలస రాజ్యాలుగా దేశాలకు దేశాలను తన గుప్పెట్లో బిగిస్తుంది. ద్రవ్య పెట్టుబడి ఎగుమతిదారై మట్టికాళ్ళ మహారాక్షసిలా వికటాట్టహాసంచేస్తుంది. తన సంక్షోభాల అంటువ్యాధులను ప్రపంచీకరణగావిస్తుంది ఇతరుల ఇంధన సంపదలన్నీ తనవేనంటుంది. బడుగుల “దేశమాత” గుండెల్ని తన ఆయుధ పరీక్షల ‘గురి’ చేసుకుంటుంది. నేటి ప్రపంచం అమెరికా-ఆర్థిక, సాంస్కృతిక పడగనీడలో ఉంది. ప్రపంచయుద్ధాల ఆయుధ బేహారిగా శవాలమీద డబ్బులేరుకొనే ‘అగ్ర’ రాజ్యంగా నిలబడిన అమెరికా ఆర్థిక సంక్షోభం వెనుక అసలు రహస్యం ప్రజోపయోగ సరుకుల ‘ఉత్పత్తి’ ఆధారంగాకాక ‘చట్టా’ (సెక్యులేటివ్) వ్యాపారంద్వారా సంపదలు పెంచుదామనుకోవటం.

‘ఒక దళారీ పశ్చాత్తాపం’ లో చెప్పినట్లు-”ఏ దేశమైనా కరెన్సీ ముద్రించాలంటే దానికి తగ్గ బంగారు నిల్వలు లేదా ఇంకేదయినా వనరులు ఉండితీరాలి. అమెరికా అటువంటి నియమాలు ఏమీ పెట్టుకోలేదు. బంగారంవంటి నియంత్రణలేవీ లేకుండా అమెరికా తన ఇష్టం వచ్చినన్ని డాలర్లు ముద్రిస్తుంది. ప్రపంచానికి డాలర్ పై గల అచంచలమైన విశ్వాసమే దాని విలువను నిలబెడుతోంది.” (పేజీ.156). బహుశా దాని ఆయుధబలంపై గల భయం కూడా!!

మానవ సమాజంలో ఏదేశానికైనా ‘శ్రమ’ ఆధారిత ఆర్థిక నిర్వహణే మౌలిక విధానం కావాలి. ఈ కీలక సందర్భంలో ప్రజల పక్షం వహించే రచయితగానీ, కవిగానీ ఒక కీలక అంశాన్ని ఆకళింపు చేసుకోవాల్సి వుంది. “పాత భావాలతోనూ, సనాతనులతోనూ, అభివృద్ధి నిరోధక శక్తులతోనూ ప్రజలు జరిపే పోరాటాల్లో స్వయంగా పాల్గొని వాళ్ళతో ముందుకు సాగాలి. అంతేకానీ పైపైన పరిశీలిస్తూ, స్వంత గొప్పలు చెప్పుకొంటూ, తన ప్రగతితత్వాన్ని చాటుకోవడానికి ప్రజల వూసెత్తేవాడు రచయితే కాడు”. (‘జీవితం – రచన’ టింగ్ లింగ్).

కార్మికవర్గ చైతన్యమంటే కార్మిక-కర్షక ఐక్యత జీవగర్రగా సామ్రాజ్యవాద, భూస్వామ్య సంస్కృతులను ఎదుర్కోగల వర్గాలనన్నిటినీ సంఘటిత పరచగలిగినది.

“బిగి పిడికిలి కార్మికుడే నవజగతికి కర్ణధారి
మహితాత్ముడు కార్మికుడే నక్షత్ర కిరీటధారి”-(శివసాగర్)

ఇంకొక మాటలో చెప్పాలంటే-
గాయపడిన ప్రతి ఇంటినుండి
దోసెడు కన్నీటిని తీసుకురా
పెను ఉప్పెన పుట్టిద్దాం!
కనిపించని కుట్రల కొలిమిలో
కాలుతున్న బతుకుల్ని పిల్చుకురా
ఆయుధాల్ని నిర్మిద్దాం!
యుద్ధాన్ని హతమార్చే నిజమైన శాంతికోసం
అసలు యుద్ధాన్ని గానంచేద్దాం

ఈ నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పూర్తిచేసుకుని, సామ్రాజ్యవాద ఉక్కు పిడికిలి నుండి బయటపడి- సామ్యవాద సమాజంకేసి సాగడానికి – కార్మికవర్గ దృక్పథాన్ని సాహిత్య సృజనలో పొదువుకొని, సాంస్కృతిక విప్లవాన్ని ముందుకు తీసుకుపోవాలి.

పరాయీకరణ చెందిన శ్రమ, విముక్తి కావాలంటే కాలంచెల్లిన వ్యవస్థలను రద్దుపరచటం, అవి సృష్టించిన ప్రజావ్యతిరేక సంస్కృతులను అశాస్త్రీయ భావజాలాన్నీ ఓడించటం తప్పనిసరి. అలాంటి సమస్త సాంస్కృతిక సంకెళ్ళను ఛేదించగల స్ఫూర్తిని మేడే నుండి పొందటం శ్రమజీవన సౌందర్యాన్ని ఆహ్వానించే వారి కర్తవ్యం.

* * *

ప్రజాసాహితి మే 2012 డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్‍ని అనుసరించండి.
ప్రజాసాహితి మే 2012 On Kinige

వినవోయీ! అల్పజీవి!

వినవోయీ! అల్పజీవి! అనే పుస్తకం విల్‌హెల్మ్‌ రైక్‌ రాసిన Listen, Little Man! అనే రచనకు అనువాదం. మార్క్స్‌, ఫ్రాయిడ్‌ల ఆలోచనా రీతుల సంశ్లేషణకు ప్రయత్నించిన తొలి మేధావులలో రైక్‌ ఒకడు. ఈ ప్రయత్నం విజయవంతం కానప్పటికీ, కాలక్రమంలో ఈ రెండు మేధో సంప్రదాయాలతో తాను విభేదించినప్పటికీ, మనో విజ్ఞాన శాస్త్రంలో, మనో విశ్లేషణ సిద్ధాంతంలో మౌలిక ప్రాధాన్యత కల భావాలను ప్రతిపాదించి, వాటికై జీవితాంతం పోరాడిన మేధావి రైక్‌.

ఫాసిజాన్ని, నాజిజాన్ని రైక్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు. కమ్యూనిస్టు పార్టీ నియంతృత్వాన్ని రెడ్‌ ఫాసిజంగా విమర్శించాడు. వేల సంవత్సరాలుగా సహజాతాల అణచివేతపై ఆధారపడిన సామాజిక నిర్మాణం మనిషి స్వభావాన్ని ఎలా వికృతపరిచింది తన Listen, Little Man! అనే పుస్తకంలో పరిశీలించాడు.

రచయిత విల్‌హెల్మ్‌ రైక్‌ వెలిబుచ్చిన భావాలు ఈ రోజుక్కూడా విలువైనవే. 1897లో జన్మించిన విల్‌హెల్మ్‌ రైక్‌ 60 సంవత్సరాలు జీవించాడు. రెండు ప్రపంచయుద్ధాలు చూశాడు. సోషలిజం, జాతీయత పేర్లు చెప్పి హిట్లర్‌ ఏం చేశాడో చూశాడు. (నేషనల్‌ సోషలిస్టు పార్టీ-ఇది హిట్లర్‌ పార్టీ పేరు). గొప్ప పేర్లూ, ఆదర్శాలూ చెప్పి జనాన్ని ఎదగనీయకుండా చేసే రాజకీయాలు అప్పుడూ-యిప్పుడూ పెద్దగా మారకుండానే ఉన్నాయి. అవి జనాన్ని కూడా ఎదగనీయటం లేదు. యూరోపియన్‌ ఫాసిజం ఈ పరిశీలన తక్షణ సందర్భం. రైక్‌ వ్యక్తిగత జీవితంలోని ఘటనలు, ఒడిదుడుకులు ఈ అవగాహనను బలపర్చాయి. మానవ స్వభావంలోని చీకటి కోణాలు ఇందులో ప్రధానంగా ఆవిష్కరించబడినప్పటికీ, ఇది నిరాశావహ చిత్రణ కాదు. మేలుకొలుపు ప్రయత్నం. రుగ్మతను తెలియచెప్పడం, దానిని అధిగమించడానికి దోహదపడుతుంది. రైక్‌ రాసిన నాటి చారిత్రక సందర్భం నేడు లేనప్పటికీ, రైక్‌ ఎత్తి చూపిన అల్పత్వ లక్షణాలు ఇప్పటికీ సమాజ జీవనంలో ప్రబలంగా ఉన్నాయి. వీటి మూలాలను అర్ధం చేసుకోవడానికి ఈ అనువాదం ఉపయోగపడుతుంది.

జర్మన్‌ మూలానికి ధియోడార్‌ పి. ఊల్ఫ్‌ చేసిన ఆంగ్లానువాదం నుండి ఈ పుస్తకాన్ని డా. సుంకర రామచంద్రరావు తెలుగులోకి అనువదించారు. ”వినవోయీ! అల్పజీవి!” అనువాద గ్రంథమైనప్పటికీ, స్వేచ్ఛానువాదం కాదు. విషయం కొంత క్లిష్టమైనదే అయినా, గొంతు పట్టుకున్నట్లుగా కాకుండా సులభంగా చదవగలం. రామచంద్ర రావు జర్నలిస్టుగా పని చేశారు. ‘సమ్మర్‌ హిల్‌’, ‘మీ ప్రతిభ మీరు తెలుసుకోండి’, ‘పిల్లలు ఎలా నేర్చుకుంటారు’ అనే పుస్తకాలు గతంలో అనువదించారు. వీటిలో ముఖ్యంగా ‘సమ్మర్‌ హిల్‌’ తెలుగునాట పిల్లల పెంపకం, పిల్లల చదువులకు సంబంధించిన ఆలోచనలపై గణనీయమైన ప్రభావం చూపింది. అనువాదకుడు రైక్‌ జీవితాన్ని, కృషిని పరిచయం చేస్తూ సంక్షిప్త వ్యాసాన్ని కూడా పొందుపర్చారు.

”ఫలానా వ్యక్తి చెప్పాడు కాబట్టి వినాల్సిందే” అంటే అర్థం మనం అల్పజీవులుగా మిగలటమే. అలా అల్పజీవులుగా మిగలొద్దనే రైక్‌ చెప్పింది. “ఆయన చెప్పిన పరిశోధనాంశాలు సరయినవా కాదా అనేది పరిశోధనా క్షేత్రాలు తేల్చాల్సిందే. పనికొచ్చే వాటిని వినమ్రంగా స్వీకరిద్దాం. పనికిరాని వాటిని ‘ఇవి పనికిరావిప్పుడు’ అని నమ్రతగానే నిరాకరిద్దాం.” అంటారు డా. బ్రహ్మారెడ్డిగారు.

ఆలోజింపజేసే చక్కని పుస్తకం ఇది.

వినవోయి! అల్పజీవి!” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

వినవోయీ! అల్పజీవి! On Kinige

మీ పుస్తకాలు కినిగెకు సబ్‌మిట్ చేయండి సులభంగా ఇలా…

 

మీరు రచయితలా? మీరు రచయిత్రులా? మీ పుస్తకాన్ని ఇప్పుడు ఈ-పుస్తకంగా కినిగెలో ఉంచి పాఠకులకు చేర్చడం చాలా సులభం. మీరు ఇప్పుడు ప్రింట్ పుస్తకాన్నే కాదు, ఈ-పుస్తకం కూడా అమ్మవచ్చు.

మీరు మీ ప్రింట్ పుస్తకం కోసం వేలు ఖర్చుపెట్టి పాఠకులకు చేర్చే ముందే, అతి తక్కువ ఖర్చుతో ఈపుస్తకాన్ని కినిగె ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి తీసుకురండి.

కినిగెలో పుస్తకం సబ్‌మిట్ చెయ్యడానికి కావాల్సినవి

1.     పుస్తకం కవర్ పుట – జేపెగ్ ఫార్మాటులో ఐదు యంబీ కన్నా తక్కువ సైజులో.

2.    పుస్తకం రన్నింగ్ పాఠ్యం – పీడీయఫ్ లేదా పేజ్ మేకర్ ఫైళ్ళు. పరిమాణం ఐదు యంబీ కన్నా తక్కువ.

3.    పుస్తకం యొక్క పూర్తి కాపీరైట్ హక్కులు ఎటువంటి సమస్యా లేకుండా మీ వద్దే ఉండాలి.

 

మీ వద్ద పైన చెప్పిన ఫైళ్ళు ఎక్కువ పరిమాణంలో ఉన్నా, వేరే ఫార్మాటులలో ఉన్నా (ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ వర్డ్) కినిగె సపోర్ట్ కు ఒక వేగు పంపండి. సహాయం మీకు వేగు దూరమే. support@kinige.com

ఇహ కినిగెలో పుస్తకం సబ్‌మిట్ చెయ్యడం ఎలానో వివరంగా చూద్దాం.

మొదటగా మీరు www.kinige.com దర్శించి, అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోడం అంటే మీ పేరు మీద ఓ ఖాతా సృష్టించుకోడమే.  కినిగె ఖాతా సృష్టించుకోవడం పూర్తిగా ఉచితం మరియు సులభం కూడా. (రిజిస్టరు చేసుకోవడం కోసం మరింత సహాయం కోసం ఈ పుటలో వివరించిన సోపానాలు చూడండి – http://enblog.kinige.com/?p=169 )

clip_image002

http://kinige.com మీ విహారిణిలో తెరిచి తరువాత, కుడి వైపుకి పై భాగంలో ఉన్న Submit your book అని ఉన్న లింకు నొక్కండి. అక్కడ ఈ దిగువ చూపిన ఆప్షన్లు కనిపిస్తాయి.

 

మీ పుస్తకానికి సరిపోయే ఆప్షన్ ఎన్నుకోని ముందుకు వెళ్లండి. తరువాత మూడు స్క్రీన్లలో మీ పుస్తకం గురించిన వివిధ వివరాలు (పేరు, వివరణ, కవర్, రన్నింగ్ టెక్స్ట్ వంటివి) ప్రవేశపెట్టి కినిగెకు మీ పుస్తకాన్ని అతి సులభంగా సమర్పించవచ్చు.

ఈ ప్రక్రియని వివరంగా చూద్దాం.

selfPublish1

పుస్తకం పేరు (పుస్తకంలోని భాషలో ఉన్నది ఉన్నట్లుగా), ఆంగ్లంలో పుస్తకం పేరు, పుస్తకం భాష, పుస్తకం గరిష్ట వెల, (తగ్గింపు తర్వాతి) పుస్తకం వెల నింపాలి. ఆ తరువాత, నెల సరి అద్దె, జరిగిన ప్రతీ అమ్మకంపై మీకు అందే పైకం, అద్దెకు తీసుకున్న ప్రతీ పుస్తకం పై మీకు వచ్చే పైకం వివరాలను కంప్యూటర్ లెక్కించి గడిలో నింపుతుంది. మీ పుస్తకం పెద్దలకు మాత్రమేఅయితే, సంబంధిత గడిలో టిక్ పెట్టాలి.  తరువాత రచయిత పేరు రాయాలి. రచయిత యొక్క ప్రాంతాలను (కనీసం రెండు) నింపాలి.

 

నియమనిబంధనలను అంగీకరిస్తున్నట్లుగా Next బటన్‌పై నొక్కి, తర్వాత అంచెకి వెళ్ళాలి.

మీకు తెరమీద ఇలా వస్తుంది

 

clip_image006

మీ పుస్తకం యొక్క కవర్ పేజిని (జె.పి.జి ఇమేజ్ రూపంలో), పాఠ్యాన్ని (పిడిఎఫ్ రూపంలో లేదా పేజ్ మేకర్ ఫైల్ రూపంలో) అప్‌లోడ్ చేయాలి.

తర్వాత, Next బటన్‌పై నొక్కి, తర్వాత అంచెకి వెళ్ళాలి.

అప్పుడు మీకు తెరమీద ఇలా వస్తుంది

clip_image010

మీ పుస్తకాన్ని సూచించే కీలక పదాలు (కీ వర్డ్స్ లేదా టాగ్స్) నిర్ధారిత గడిలో నింపాలి (కనీసం మూడైనా ఉండాలి).  తరువాత మీ పుస్తకాన్ని సూచించే విభాగాలను (కేటగిరీ) – రెండింటిని ఎంచుకోవాలి (డ్రాప్ డౌన్ మెను ద్వారా).  మీ పుస్తకం గురించి తెలిపేందుకు నిర్ధారిత గడిలో (పుస్తకం యొక్క భాషలోనే) వివరణ రాయాలి.

 

చివరగా, “ఫినిష్అనే బటన్ నొక్కితే చాలు.  మీ పుస్తకం కినిగెపై ప్రచురణకు సిద్ధమైనట్లే.

మీకింకా ఏవైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే support@kinige.com కు ఈ-మెయిల్ చెయ్యండి.

అస్తిత్వ ఆకాంక్షలను ఆవిష్కరించిన వ్యాస సంకలనం

ఇపుడంతటా తెలంగాణ సంగతులే చర్చనీయాంశాలు. గత నవంబర్‌ నుండి కొనసాగుతున్న ఈ వాతావణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు అట్లాగే ఉంటుందని చెబితే అది సరియైన అంచనా అవుతుంది. 2001 నుండి 2009 వరకు ఒక కథ అయితే, గత ఏడాది నవంబర్‌ నుండి రెండవ కథ. ఈ కథలోనే తెలంగాణ ఉద్యమం బలోపేతమైంది. వ్యవస్థీకృత రూపాన్ని సంతరించుకున్నది. భాగ్యనగరంమొదలుకొని మారుమూల చిన్న పల్లెల వరకు ‘జాక్‌’ లు ఏర్పడ్డాయి. ఒకవైపు రాజకీయ పోరాటాలు ఉధృతమవుతోంటే, అదే వేగంతో సాంస్కృతిక ఆలోచనలు, అన్వేషణలు కూడా వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా పుస్తకం ‘తెలంగాణ అస్తిత్వ పోరాటం‘ (The Telangana Struggle for Idendity) రూపొందింది. ఐదువందలకు పైగా పేజీలున్న ఈ వైవిధ్య వ్యాస సంకలనాన్ని తెలంగాణ సాంస్కృతిక వేదిక ప్రచురించింది. ప్రసిద్ధ విద్యావేత్తలు డాక్టర్‌ వెలిచాల కొండలరావు, ఆచార్య రాఘవేంద్రరావులతో పాటు సుప్రసిద్ధ దర్శకులు బి. నర్సింగరావు ఈ సంకలనానికి సంపాదకత్వం వహించారు. సంకలనంలో తెలుగు-ఇంగ్లీషు వ్యాసాలున్నాయి. ప్రముఖుల తాజా రచనలు, ప్రసిద్ధుల పాత వ్యాసాలు కూడా కనబడతాయి. నాటి వ్యాసాల అవసరం నేడు మరీ ఎక్కువగా ఉందని ఈ వ్యాసాలు చదివితే అర్థమవుతుంది.

ఇంగ్లీషు వ్యాసాల్లో విషయ పరిజ్ఞానాన్ని బాగా పెంచగలిగే రచనలు కొన్ని, మరికొన్ని నాటి హైదరాబాద్‌ స్మృతి పరీమళాల్నినిండుగా వెదజల్లేవి. హైదరాబాదీ సంస్కృతిలోని ప్రత్యేకతల్ని ఇవి విప్పి చెప్పాయి. ఉన్నతాధికారిగా సేవలందించిన నరేంద్ర లూథర్‌ ఇంగ్లీషులో ఎంతో చక్కని రచయిత. ‘And still I long for Hyderabad’ పేరుతో ఆయన రాసిన వ్యాసం అద్భుతంగా ఉంది. 1998లో లూథర్‌ రచించిన ‘Hyderabad the power of glory’ అన్న పుస్తకం నుండి ఆ వ్యాసాన్ని తీసుకున్నారు. హైదరాబాదీయత్‌ పై డాక్టర్‌ ఎం.ఏ.ఖాన్‌ మంచి వ్యాసాన్ని రచించారు. సి.రాఘవాచారి, రమామేల్కోటే, కె.విజయ రామారావు, హసనుద్దీన్‌ అహమద్‌ వంటి ప్రముఖుల వ్యాసాలు బాగున్నాయి. ‘హిస్టారికల్‌ తెలంగాణ’ పేరుతో చరిత్రకారుడు డాక్టర్‌ జె.రమణయ్య ఇక్కడి చరిత్రను సంక్షిప్తంగా సింహావలోకనం చేశారు. వీటితోపాటు ఆచార్య జి.హరగోపాల్‌, సిహెచ్‌. హనుమంతరావులు రచించిన వ్యాసాలు విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. సంకలన సంపాదకుల్లో ఒకరైన వి.కొండలరావు సంస్కృతికి సంబంధించిన వివరణలతో కొన్ని వ్యాసాలు రచించారు. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటికి సమర్పించిన అంశాల్ని ఇందులో పొందుపర్చారు. ఇకపోతే ‘The city I know’ పేరుతో ప్రసిద్ధ సినీ దర్శకులు శ్యాంబెనగల్‌ రచించిన వ్యాసం సుదీర్ఘమైన స్మృతి గీతం వలె అద్భుతంగా ఉంది. ఇంగ్లీషు వ్యాసాలన్నీ చదివిన తర్వాత హైదరాబాద్‌ నగరపు నాటి సంస్కృతిపై అవగాహన పెరుగుతుంది. తెలంగాణ పోరాటం వెనుక ఉన్న సాంస్కృతికమైన ఆరాటాలు బాగా అర్థమవుతాయి.

తెలుగు వ్యాసాల్లో కొన్ని ఆణిముత్యాలు. ఆనాటి కిన్నెర వంటి పత్రికల నుండి ఎంపిక చేసిన వ్యాసాలు తెలంగాణ గత వైభవాన్ని శ్రావ్యమైన సంగీతం వలె మనముందు నిలుపుతాయి. తెలంగాణ నాటకాలు, తెలంగాణలో తెలుగు భాషా సాహిత్యాల వికాసం – అనే శీర్షికలతో ‘ఆంధ్ర బిల్హణ’ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి రచించిన వ్యాసాల్ని ఈ పుస్తకంలో చేర్చారు. ఇందులో తెలంగాణ నాటకాలు కొన్ని విస్తృత విషయాల్ని ఆవిష్కరించింది. మాదిరాజు విశ్వనాథరావు వంటి అజ్ఞాత నాటక రచయితల్ని పరిచయం చేసింది. నాడు నిజాం కళాశాలలో నిర్వహించిన ‘ఆంధ్రాభ్యుదయోత్సవాల’ పరిచయ వ్యాసాల్ని సంకలనంలో పొందు పరిచారు. సుప్రసిద్ధ విమర్శకులు జి.రామలింగం ఆ రోజుల్లో రచించిన ‘తెలంగాణ, సీమ-కవుల దర్శనం’ విలువైన వ్యాసం. ప్రసిద్ధ చరిత్రకారులు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు రచించిన ‘తెలంగాణము ప్రాచీన శిల్పకళ’ వ్యాసం ఎంతో విలువైనది. జానపద కళల్లో తెలంగాణ ప్రత్యేకతను జయధీర్‌ తిరుమలరావు వ్యాసం విశ్లేషించింది. తెలంగాణ సంస్కృతిపై కె.శ్రీనివాస్‌ రాసిన రెండు వ్యాసాలు పలు మౌలికమైన అంశాల్ని పాఠకులకు పరిచయం చేస్తాయి. సాహిత్య చరిత్ర రచనలో కవులను అంచనా వేయడంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆచార్య ఎస్వీ రామారావు వ్యాసం వివరించింది – డాక్టర్‌ గండ్ర లక్ష్మణరావు ‘తెలంగాణ ప్రాచీన కవిత్వ దృక్పథం’ ఎన్నో సూత్రీకరణల్ని ప్రతిపాదించింది. ఈ సూత్రీకరణలతో భవిష్యత్తులో ఎంతోమంది పరిశోధక విద్యార్థులు ముందుకు కదలవచ్చు. తనముందు చోటుచేసుకుంటున్న పరిణామాలపై తనదైన రీతిలో స్పందించవలసిన బాధ్యత మేధావులది. ”తెలంగాణ అస్తిత్వ పోరాటం” గ్రంథం వెలువడడానికి ప్రధాన ప్రేరణగా నిలిచిన డాక్టర్‌ వెలిచాల కొండలరావు ఈ రకమైన బాధ్యతగల మేధావిగా వ్యవహరించారు. తెలంగాణ గతం – వర్తమానం – భవిష్యత్తుల్ని వివరిస్తూ సమాచార ప్రతిపాదనలతో, సవిమర్శకమైన వ్యాఖ్యలతో రమారమి పాతిక వ్యాసాల్ని రచించారు. ఇవి ఒక క్రమంలో లేకపోవచ్చు కానీ బలమైన ప్రతిస్పందనలకు ప్రతిరూపాలు. ఆరు దశాబ్దాల కాలవ్యవధిలో నిరంతరం కొనసాగిన పక్షపాత వైఖరిని ఈ వ్యాసాలు ప్రశ్నిస్తున్నాయి. స్వతహాగా విద్యారంగంతో ప్రత్యక్ష సంబంధం ఉంది కనుక ఆ రంగానికి సంబంధించి మరింత బలమైన వ్యాసాల్ని కొండలరావు రచించారు.

”హైదరాబాద్‌ ఒక చాందినీ మహల్‌, పండగ సందడిగా వెలిగే ఒక మహఫిల్‌; ఆకాశం మతిపోగొట్టే తారల ముజ్రా, హైదరాబాదంటే పురాతన మట్టిలోంచి ప్రేమగా వీచే సుగంధ సమీరం” అంటూ ఆశారాజు రాసిన కవిత్వం భాగ్యనగరపు నిసర్గ రాగమయతత్వాన్ని అనుభూతిమయంగా వర్ణించింది. పాగల్‌ షాయర్‌ కావ్యం నుండి సంకలనం కోసం ఎంపిక చేసిన ఆశారాజు కవితలు హైదరాబాద్‌ను వస్తువుగా చేసుకున్న వచన కవిత్వంలో మణిపూసలు.

ఇంతటి విపుల వ్యాస సంకలనంలో ఒకటి రెండు చిన్న లోపాలూ కనబడతాయి. వ్యాసాలు ఒక క్రమపద్ధతిలో లేకపోవడం ఒక లోపం. తెలుగు విభాగంలో ఒకటి రెండు వ్యాసాల్ని తీసుకోకున్నా పెద్దగా లోపమేదీ ఏర్పడేది కాదు. ఇంగ్లీషులో ‘Summing up – Regionalism in India’ వంటి ఒకటి రెండు వ్యాసాలు లేకున్నా ఫర్వాలేదేమో. ప్రసిద్ధ పరిశోధకుడు డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఎంతో శ్రమతో ‘ముంగిలి’ అనే గ్రంథాన్ని రచించారు. తెలంగాణ సాహిత్య చరిత్ర ఇది. ఈ గ్రంథం వెలువడి ఒకటిన్నర సంవత్సరాలు దాటుతోంది. అందులో సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఆచార్య రవ్వాశ్రీహరి, డాక్టర్‌ ముదిగంటి సుజాతారెడ్డి రాసిన వ్యాసాల్ని ఈ సంకలనంలో తిరిగి ముద్రించారు. ప్రస్తుత సంకలనంలో ఇవి అవసరంలేదేమో. దీనికి బదులుగా సుంకిరెడ్డి పరిశోధనలో వెలుగు చూసిన డజనుమంది గొప్ప కవుల పరిచయాల్ని సంక్లిప్త వ్యాసంగా ప్రచురిస్తే ఇంకా బాగుండేది. ఇంత పెద్దవ్యాస సంకలనంలో ఇటువంటి చిన్న లోపాల్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవలసిన అవసరం లేదు.

”తెలంగాణలో కవులు పూజ్యము” అన్న మడుంబై రాఘవాచార్యుల వారి ప్రశ్నకు ”గోలకొండ కవుల సంచిక” ద్వారా సురవరం ప్రతాపరెడ్డి సరియైన సమాధానం చెప్పారు. అట్లానే ”తెలంగాణ రాష్ట్రం ఎందుకు?” అని ప్రశ్నిస్తున్న సీమాంధ్ర మేధావి వర్గానికి, నాయకులకు ”తెలంగాణ సాంస్కృతిక వేదిక” చెప్పిన జవాబే ”తెలంగాణ అస్తిత్వ పోరాటం” వ్యాస సంకలనం.

కొండలరావుగారు అభినందనీయులు.

- డా. జి. బాలశ్రీనివాసమూర్తి
(జయంతి త్రైమాసిక పత్రిక, ఏప్రిల్ – జూన్ 2011 సంచిక)

* * *

“తెలంగాణ అస్తిత్వ పోరాటం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి.

తెలంగాణా అస్తిత్వ పోరాటం On Kinige

నడుస్తున్న చరిత్ర మే 2012 సంపాదకీయం

తెలుగు’పెరియార్‌’ అయ్యుండాల్సిన సత్యమూర్తి

* * *

ఆర్ధిక విముక్తితో హెచ్చుతగ్గులులేని సోషలిస్టు సమాజం ఏర్పడుతుందనీ అందుకు మార్క్సిజమే సరియైున దారి అనీ నమ్మినవారు మనదేశంలో కమ్యూనిస్టు రాజకీయ పంథాలో నడిచారు. ఎత్తుగల్లో, ఉద్యమరీతుల్లో వచ్చిన అభిప్రాయభేదాలవల్ల వారు వేర్వేరు బాటల్లో నడిచినా అందరి లక్ష్యమూ సోషలిస్టు సమాజ స్థాపనే. అయితే, భారతదేశంలో వ్రేళ్లూనికొని ఉన్న కులవ్యవస్థ కమ్యూనిస్టు పార్టీలనూ, ఉద్యమాలనూ ప్రభావితం చేసింది.

బడుగుల సమస్యలన్నిటికీ అంతిమ పరిష్కారం కూడ మార్క్సిస్టు లక్ష్యసాధనలోనే ఉందని, సోషలిస్టు సమాజ స్థాపనతో తమ ఆర్ధిక సమస్యలతోపాటు సామాజిక వెనుకబాటుతనం కూడ మటుమాయం అవుతుందని, కమ్యూనిస్టు నాయకులైన సత్యమూర్తి లాంటి వారు భావించారు. అయితే కొన్ని సందర్భాలలో కలిగిన చేదు అనుభవాలతో లోలోపల సంఘర్షణకు గురై, కళ్లముందు కన్పించే వాస్తవాలకు తలొగ్గి విప్లవాగ్ని జ్వాలల్లోంచి ఎగసిన ఒక జ్వాలగా, ఒక సామూహిక అస్తిత్వానికి ప్రతినిధిగా ఆయన తలెత్తాడు. స్వాభిమానం నుండి ఎగసిన కవితా ఖడ్గంగా శివసాగరుడిగా గొంతు విప్పాడు.

తెలుగు నుడిపై ఆయనకున్నంత పట్టు చాలా తక్కువ మందిలో చూస్తాం. ఆరేళ్ల క్రిందట మూడుసార్లుగా ఆయనతో వివరంగా మాట్లాడిన సందర్భాల్లో తన అనుభవాలను, అభిప్రాయాలను ఆయన నాతో చెప్పారు. దళిత సమాజపు వర్తమాన సంఘర్షణను ఆయన విశ్లేషించిన తీరు, దానికి పరిష్కారాలుగా ఆయన సూచించిన మార్గాలు అచ్చెరువు గొల్పుతాయి.

మార్క్సిస్టు సిద్ధాంతం పట్ల ఆయనకున్న నమ్మకం అప్పటికి ఏమీ సడల్లేదు. కాని, దళిత జనులకేగాక, మొత్తం బడుగు వర్గాలందరికీ సామాజిక గౌరవమూ, సాంస్కృతిక మర్యాదా లభించే పరిస్థితులుంటేనే రాజకీయంగా అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతామని ఆయన గట్టి నిర్ణయానికే వచ్చాడు. అప్పటికప్పుడు గానీ, సమీప కాలంలోగాని మార్క్సిస్టు విప్లవ మార్గంలో బడుగులు పయనించం సాధ్యం కాదనీ, కులాధిపత్య వర్గాల పికిలి నుండి ఉద్యమ సంస్థలను విడిపించం అయ్యేపని కాదనీ ఆయన అభిప్రాయ పడ్డారు.

అంబేద్కర్‌ మార్గం సరైనదేగాని, ఆ బాటలో నడిపించగల నేతలు లేకపోవడమే బాధ కలిగిస్తున్నదని సత్యమూర్తి అన్నారు. ఇప్పుడు శారీరకంగా శక్తి నశించినందున తాను కొత్తగా ఉద్యమ నిర్మాణం చెయ్యగలననుకోవడం లేదని, కొత్తతరం ముందుకు వస్తుందని మాత్రం నమ్మకముందని ఆయన అన్నారు.

భాష విషయంలో తన అభిప్రాయాల్ని చెప్తూ బడుగువర్గాలు తమ భాషనూ, సంస్కృతినీ దూరం చేసుకోకుండనే ఆంగ్లాన్ని కూడ బాగా నేర్చుకోవాలన్నారు. ఆంగ్లాన్ని నేర్చుకోబట్టే ఉన్నతవర్గాల నుంచి నాయకులు తయారయ్యారనీ, అంబేద్కర్‌ ఆంగ్లం నేర్చుకొని, ఉన్నత చదువులు చదివివుండకపోతే, జాతీయస్థాయి నాయకుడుగా ఎదగగలిగేవాడు కాదనీ అన్నారు. అయితే, వేల ఏండ్లుగా తమ వారసత్వమైన భాషాసంస్కృతుల పునాదుల మీద నిలబడే, వాటి అండతోనే ఈ దేశపు బడుగువర్గాలు తేలిగ్గా ఆధునిక విద్యా సంపదను అందుకోగలుగుతాయన్నారు. బడుగుల భాషలో ప్రాచీన విజ్ఞానాన్నీ, ఆధునిక విజ్ఞానాన్నీ అందకుండ చేయడం కోసమే అసలైన తెలుగు నుడిని త్రొక్కివేశారన్నారు. ఒకనాడు సంస్కృతం, ఇప్పుడు ఆంగ్లం ఆధిపత్యంతో తమదైన విజ్ఞానాన్ని కోల్పోవడంతోపాటు, ఆధునిక విజ్ఞాన ప్రగతినీ అందుకోలేకపోతున్నారని అన్నారు. అందువల్ల – ప్రజల తెలుగులోనే అత్యంత ఆధునిక విజ్ఞానమంతా వారికి అందుబాటులోకి రావాలన్నారు. చైనాలో జరుగుతున్నదిదే అనీ, చైనాలో ఉత్పత్తులు అన్నిరంగాల్లో పెరగనికి ప్రజల భాషలో అత్యాధునిక విజ్ఞానాన్నంతా వారికందించమే కారణం అని సత్యమూర్తిగారన్నారు. (ఇదే మాటను ఈ ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాషోద్యమ సమాఖ్య నిరసన దీక్షాశిబిరంలో మాట్లాుతూ మార్క్సిస్టు పార్టీనేత బి.వి. రాఘవులు కూడ అన్నారు).

తెలుగు భాషోద్యమం పట్ల సత్యమూర్తి గారి విశ్లేషణ, ఉద్యమం ఎలా ముందుకు సాగాలో ఆయన చెప్పిన తీరు మరపురానిది. ఇలాంటి అవగాహన ఇప్పుడు దళితనాయకులుగా పోరాటాలు చేస్తున్నవారిలో ఎంతవరకు ఉన్నదో ఎవరికివారు ఆలోచించుకోవలసిందే.

తెలుగు భాషోద్యమం బడుగులకు వ్యతిరేకమైనదనే ఆరోపణను ఆయన త్రోసిపుచ్చారు. తెలుగు బడుగుల భాష. వారి భాష వారికెలా వ్యతిరేకమవుతుంది? వారి సొత్తు అది.. అని అన్నారాయన. ‘సంస్కృతాన్ని విపరీతంగా తెచ్చి తెలుగును తొక్కివేశారు. అసలు చదువునే మాకు అందకుండ చేశారు. మా భాషలో ఏదీ నేర్చుకోలేని స్థితిని తెచ్చిపెట్టి, ఇప్పుడు ఇంగ్లీషును కూడ అందకుండ చేస్తున్నారు అన్నదే మావాళ్ల బాధ’ -అని సత్యమూర్తిగారు స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ బడులలో తప్ప ప్రయివేటు బడులలో చేరగల స్తోమత బడుగులకెక్కడిది? అందువల్లే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం కావాలని వారంటున్నారు. దీన్ని ఎలా తప్పుపట్టగలం? అని ఆయన ప్రశ్నించారు.’మా భాషలో మాకు ఆధునిక విజ్ఞానాన్నంతా అందివ్వండి, ఉద్యోగాలివ్వండి, బ్రతుకుదెరువుకు మార్గాలు చూపండి. ఇదే సరైనదారి. అలా ఇవ్వలేనప్పుడు ఉన్నతవర్గాలతోపాటు మేమూ ఇంగ్లీషు బడులలో చదువుకునే మార్గాలు కల్పించండి. వారు చదివే చదువే మాకూ కావాలి. అందుకు మా వాళ్లకు రిజర్వేషన్లు కావాలి.’ ఇదీ సత్యమూర్తి గారి వాదం.

”ఇంగ్లీషు మీడియంలో చదువులు మాకూ కావాలని కోరుతున్నామంటే అర్థం మా తల్లిభాష తెలుగును వద్దంటున్నామని కాదు. మమ్మల్ని అణగదొక్కేందుకు ఆయుధంగా మరో భాషను ఉపయోగించుకోవద్దని అంటున్నాము. మాదగ్గర ఉన్న బలమైన ఆయుధం మా తల్లిభాష తెలుగు. దాని శక్తి మాకు తెలుసు. మా భాషలోనే మాకు సైన్సూ, లెక్కలూ, అన్నీ కావాలి. అది సాధ్యంకాక పోవడనికి కారణం ప్రభుత్వం అగ్రకులాధిపత్యంలో ఉండమే. అందువల్ల మా భాషను అణగద్రొక్కుతున్నారు. ఐనా, అది మా సాంస్కృతిక చైతన్యవాహినిగా మాలో ఎప్పుడూ బలంగానే ఉంటుంది. మా ప్రభుత్వం వచ్చినపుడు అది అన్నిరంగాల్లోనూ విజృంభిస్తుంది. అప్పటిదాకా మా బిడ్డలను అణగారిపొమ్మని చెప్పలేంగదా. కనుకనే ఉన్నతవర్గాల పిల్లలతో సమంగా మాకు చదువుల్లోనూ అన్ని అవకాశాలూ కావాలంటున్నాం.” – ఇదీ వారి సిద్ధాంత సారాంశం.

సత్యమూర్తి గారు వాస్తవవాది. అందువల్లే ఆయన కవితలు చిరకాలం నిలిచిపోయేంతగా గుర్తింపుకొచ్చాయి. తెలుగులో వచ్చిన ప్రజా కవిత్వాన్ని విలువకడితే శివసాగర్‌ కవిత మొదటివరుసలో నిలబడుతుంది. ఇతర కవుల కవితలు కూడ కొన్ని ఇదే వరుసలోకి వచ్చినా, వాటిలో పోరాట నేపథ్యంలోంచీ, బడుగు జీవితాల నేపథ్యంలోంచీ వచ్చినవి ఒక చేతివ్రేళ్లమీద ఎంచదగినంత మందివే.

ఆయనతో మాట్లాడినప్పుడు నాకనిపించింది – ఈయన తెలుగువారికి ‘పెరియార్‌’ అయితే ఎంత బాగుణ్ణు అని. పెరియార్‌ రామస్వామి నాయకర్‌ తమిళనాడులో నిర్మించిన ద్రవిడ ఉద్యమం బడుగువర్గాల సామాజిక రాజకీయ చైతన్యానికి, తమిళ భాషా సంస్కృతులు బలోపేతం కావడనికి దారితీసింది. అందుకు కారణం ఆ ఉద్యమ స్వభావంలో ఉంది. అక్కడి బడుగువర్గాలు ఎక్కువగా పాల్గొన్నందువల్లనే తమిళనాట సామాజిక రాజకీయోద్యమాల్లో స్థానిక భాషా సంస్కృతులు కీలకాంశాలు అయినాయి. అంతటి మార్పును తెలుగునాట తేగల నేతల అక్కర మనకు ఉంది.

సత్యమూర్తి గారు 84 ఏళ్లు జీవించాడు. ఒక రాజకీయ యోధునిగా, విప్లవకవిగా ఆయన ఎక్కువకాలం శ్రమించాడు. సామాజిక సంస్కర్తగా, జాతి పునర్నిర్మాణ దీక్షతో ఆయన కొన్నేళ్లయినా శ్రమించివుంటే, దాని ఫలితం బడుగువర్గాల మీద బలంగా ఉండేది. వారి సాంస్కృతిక రాజకీయ పునరుజ్జీవనానికి రాచబాట పడేది కూడ. ఆయన ఆ మార్గాన్ని ఎంచుకొనే సమయానికే ఆయన శరీరం పట్టుతప్పింది. అదను కుదరలేదు. ఆ జీవితం తాను నమ్మిన ఆశయాల సాధనకై చేసిన కృషిలోనే ముగిసింది. ఆయన స్ఫూర్తితో బడుగువర్గాల నేతలు అస్తిత్వ ఉద్యమాలకు భాషాసాంస్కృతిక బలాన్ని కలిగించినపుడే శక్తివంతమైన సామాజిక రాజకీయ పోరాటాల్ని తీర్చిదిద్దగలుగుతారు.

సామల రమేష్ బాబు

* * *

నడుస్తున్న చరిత్ర మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. తాజా సంచిక కోసం ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

నడుస్తున్న చరిత్ర మే 2012 On Kinige