చారిత్రక యానాం కథలు

ఇవి యానాం కథలు. వంతెన అవతల 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి తారాజువ్వలు ఆకాశంలో వెలుగులు జిమ్ముతుంటే వంతెన ఇవతల చీకట్లో మూగగా నిలబడిపోయిన ఫ్రెంచి వలసలోని తెలుగు ప్రజలు… నోరొచ్చి ఇన్నాళ్ళకు చెప్పుకున్న కతలు. సాహిత్యం కూడా చరిత్ర ఖజానానే అనుకుంటే… దాట్ల దేవదానం రాజు ‘యానాం కథలు’ చారిత్రక గనేనని చెప్పాలి. చరిత్ర రచనలో చిక్కటి భావుకత్వం కలగలిస్తేనే ఇలాంటి కథలు తయారవుతాయనిపిస్తుంది.

ఫ్రెంచి వలసల్లో బతుకు సాపేక్షంగా బ్రిటిష్ వలసలకన్నా మెరుగేననేది ఈ సంపుటిలోని 18 కథలు చదివాక అర్థమయ్యే విషయం. దోపిడీ లేదని కాదు గానీ, స్థానిక సంస్కృతులు, సంస్కారంపై చిన్నచూపు లేదని కాదు గానీ, యానాం జనజీవనంలోని వైవిధ్యాన్ని మాత్రం చెదరగొట్టలేదు ఫ్రెంచి దొరలు. ప్రపంచంలోనే గొప్ప పౌర సమాజానికి ప్రతినిధులమన్న అభిజాత్యం వారి పాలనలోనూ, వ్యవహార, వ్యక్తీకరణల్లోనూ కనిపిస్తుంది. మనసుపడిన యువకుడితో గడిపేందుకు తన భార్యను అనుమతించిన పాల్ షెల్జ్‌లో (కథోర్‌జియ్) కనిపించేది ఈ అభిజాత్యమే. ప్రేమించిన కామాక్షి కోసం యానాంలోనే ఉండిపోవాలని రొబేర్ నిర్ణయించుకోవడం (లా’మూర్’) అలాంటి వ్యక్తీకరణే. తోటి బ్రిటిష్, డచ్ అధికారుల సాంగత్యంతో పొగరుగా వ్యవహరించిన ఒకరిద్దరు పౌర అధికారులు మినహాయిస్తే, చాలావరకు యానాంతో ఏదో ఒక సంబంధంలోకి వచ్చినవారే.

ఈ మినహాయింపు యానాంలోని బ్రాహ్మణ కులానికీ వర్తిస్తుంది. ఫ్రెంచి పాలన పట్ల పట్టింపుతోనూ, వంతెన అవతలి బ్రిటిష్ వలస పాలనలోని ఎదుర్లంకలో రెక్క విప్పిన ఆధునికత, జాతీయోద్యమం పట్ల మమేకతతోనూ ఉన్న కులమది. దొర బంగ్లాపై జెండా ఎగరేసిన బాపన్న, జంధ్యం తెంపిన దొరపై తిరుగుబాటు లేవదీసిన వెంకటయ్య (తీర్పు వెనుక), ఆధునిక విద్యలు నేర్చుకుని బతుకును మెరుగుపరుచుకున్న రామశాస్త్రి (మండువా లోగిలి)… ఈ ప్రభావాలకు ప్రతినిధులే.

తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఈ కథలకు గొప్ప ప్రాసంగికత ఉండడం మరో ప్రత్యేకత. తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉండడం తప్పా అనేది ప్రాంతీయవాదుల ప్రశ్న. కానీ, అలా జరిగితే రెండు కాదు, మూడు ప్రాదేశిక సరిహద్దుల్లో తెలుగు ప్రజలు జీవించాల్సి ఉంటుంది. ఎందుకంటే, గత అరవై ఏళ్ళుగా యానాం విడిగానే ఉంది. అలా ఉండడం ద్వారానే సాంస్కృతికంగా, సామాజికంగా, చారిత్రకంగా తమ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను కాపాడుకోగలమని మెజారిటీ యానాం ప్రజలు భావిస్తున్నారు. నాలుగు కూడళ్ళ మధ్య నిలబడి ఈనాడు తెలంగాణ కోరుతున్నదీ ఇదే కదా!

వి. అరవింద్
ఆదివారం అనుబంధం, ఆంధ్రజ్యోతి దినపత్రిక, 24 మార్చి 2013

* * *

“యానాం కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ చూడండి.

యానాం కథలు On Kinige

Related Posts:

మాస్టర్ స్టోరీటెల్లర్ -వల్లంపాటి వెంకటసుబ్బయ్య

ప్రముఖ రచయిత, విమర్శకుడు, అనువాదకుడు అయిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథలపై సాక్షి దినపత్రికలో “ఒక కథావిమర్శకుడి తొలి అడుగుజాడలు” అనే శీర్షికతో వెలువడిన సమీక్ష ఇది.

* * *

కథలు ఎలా రాయాలో కథాశిల్పం అంటే ఏమిటో అని పుస్తకాలు రాసిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథలు ఎలా ఉంటాయి అనే కుతూహలం పాఠకులకు రావడం సహజం. వాటిని చదవాలని ఆశపడటమూ సహజం. అయితే మంచి తేయాకు ఏదో ఆ తేయాకు నుంచి మంచి డికాక్షన్ వస్తుందో రాదో పరీక్షించి చెప్పే నిపుణుడికి తేయాకు పండించడం తెలియకపోవచ్చు. బహుశా వల్లంపాటి ఈ ఎరుకతోనే కథలు రాయడం మానేశారా? లేదా సృజనలో నిమగ్నమైతే తానొక్కడే లబ్ధి పొందుతాడు… సృజన కోసం ప్రయత్నించేవాళ్లకు సహాయకారి కాగలిగితే అనేకమందికి ఉపయోగపడతాడు అనే సూత్రం కనిపెట్టడం వల్ల కథాసృజనను వదిలిపెట్టి కథావిమర్శను స్వీకరించారా?

ఏమైనాగాని ఆయన చనిపోయిన రెండుమూడేళ్లకు ఆయన కథలన్నీ ‘వల్లంపాటి కథలు’గా రూపుదాల్చడం చాలామంది పాఠకులకు సంతోషం కలిగించే విషయం. అసలు వల్లంపాటి ఇన్ని కథలు రాశారా అని ఆశ్చర్యపోయే నేటి తరం రచయితలు కూడా ఉన్నారు. 1958లో కథలు రాయడం ఆరంభించిన వల్లంపాటి 1970ల వరకూ కథలు రాసినట్టున్నారు. ఆ తర్వాత రాయలేదు. ఈ కథలన్నింటిని పరిశీలిస్తే వీటిలో కూడా ఆ రోజుల్లోని కథల ధోరణి, పేదరికం, మధ్యతరగతి విలువలు, రచయిత తననుతానే రచయితగా ప్రధానపాత్రగా ప్రవేశపెట్టి రాయడం వంటివి కనిపిస్తాయి. రాసిన ప్రతి కథా ఏదో ఒక సమస్యను చూపడానికి ఏదో ఒక విలువను ప్రతిపాదించడానికి ఏదో ఒక పతనాన్ని సూచించడానికి ప్రయత్నించడం అర్థమవుతుంది. అదే సమయంలో దృక్పథం అంటూ ఏమీ లేకుండా కలం నుంచి జారిన కథలు కూడా లేకపోలేదు. అందుకే వీటిని వల్లంపాటి ప్రామాణికమైన రచనలుగా ఎంచకుండా తొలి అడుగుజాడలుగానే చూడాలి. అందుకనే ఏమో తాను జీవించి ఉండగా, వీటి అవసరం ఉందా లేదా అనే సంశయంతో వల్లంపాటి వీటిని పుస్తకంగా తెచ్చి ఉండరు.

కాని- కథాపాఠకులు, మరీ ముఖ్యంగా కథారచయితలు ఈ కథలను తప్పక చదవాలి. ఒకకాలపు జీవితం గురించి తెలుసుకోవడానికి కథాపాఠకులు, ఒక రచయిత/విమర్శకుడు కథారచనను సాధన చేసిన పద్ధతిని ఆ పద్ధతిలో అతడి జయాపజయాలను అర్థం చేసుకోవడానికి కథా రచయితలు ఈ పుస్తకాన్ని చదవాలి.

వల్లంపాటి ఈ సంకలనంలో కచ్చితంగా కొన్ని కథలతో గాఢమైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. ‘రానున్న శిశిరం’ వంటి కథల్లో తన చేయి తిరిగిన రచనాశైలితో ఆశ్చర్యం గొలుపుతారు. కథకు అవసరంలేని వృధావర్ణనలు, వృధా సంఘటనలు కథలో ఉండరాదు అని నమ్మిన వల్లంపాటి తన కథలన్నింటిలోనూ ఆ సూత్రాన్నే పాటించారనిపిస్తుంది. స్ట్రయిట్‌గా పాయింట్‌లోకి దిగడం చూడవచ్చు.

అయితే ఇవి ఇప్పుడు ఔట్ డేటెడా?
మధ్యతరగతి ఉన్నంతకాలం మధ్యతరగతి గురించి రాసిన ఏ కథా ఔట్‌డేటెడ్ కాదు. కాకపోతే కాసింత మేకప్ మార్చుకొని మళ్లీ మళ్లీ కనిపిస్తుంటుందంతే. ఆ సంగతి అటునుంచితే- ప్రతి రచయితా చేసిన కృషి రికార్డు కావాల్సిందే. ఆ మేరకు వల్లంపాటి కథలకు సంబంధించి ఈ సంపుటి ఒక నాణ్యమైన రికార్డు. రాయలసీమ భాషకు, జీవితానికి దర్పణం లాంటి నవలను రాయాలన్న కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వల్లంపాటి తన కోరికను తీర్చుకోలేకపోవడం ఒక లోటైతే అలాంటి ఎన్నో కలలు కనే సాహిత్యకారులకు స్ఫూర్తిగా వారిని ప్రోత్సహించే శక్తిగా ఉండి వారి కలలు సాకారం కావడానికి ప్రయత్నించిన ఆయన ప్రెజెన్స్ లేకపోవడం చాలా పెద్ద లోటు. పుస్తకం ప్రింటింగ్, క్వాలిటీ చాలా బాగున్నాయి.

కె.సువర్చల

“వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథలు” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.
వల్లంపాటి కథలు On Kinige

Related Posts:

చైతన్యపు చీకటి

పుస్తకం: నికషం
జానర్: చైతన్య స్రవంతి/నవల
రచయిత: కాశీభట్ల వేణుగోపాల్
కథాంశం: పాతనగరం చీకటివీధి అనాధ ‘బొల్లిమచ్చల’ పెయింటర్ అలెక్స్ రామసూరికీ, ‘మెలాయిడ్ లుకేమియా’ బారినపడ్డ ప్రియమ్మాయికీ మధ్యగల సహజాసహజ బాంధవ్యపు దుఃఖం కేంద్రంగా… అవసరార్థ స్నేహాన్నీ, స్నేహపు అవసరాన్నీ, ఏమీలేనితనాన్నీ, అన్నీవున్నసమయాన్నీ ఒక దగ్గర కుట్టిన తీవ్రమైన జీవితోన్మాదపు నగ్నచిత్రమిది.
శైలి: అగ్నిపర్వతపు లావా ఒక రూపంలోకి ఒదగనట్టే, గుండెలోతుల్లోంచి భావావేశం ఎగజిమ్మినప్పుడు ఒక నిర్దిష్టాకృతిని ఆశించడం అత్యాశ! కాశీభట్ల కలం అక్షరాల్ని అలా ‘కక్కుకుంటూ’ వెళ్లిపోతుంది. అట్టడుగు పొరల్లో మనిషి పొందే పెనుగులాటను అబ్‌స్ట్రాక్ట్‌గా, కవితాత్మకంగా చిత్రిస్తూ సాగిపోతుంది.

రాజి (సాక్షి ఫన్‌డే)

* * *

“నికషం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ చూడండి.
నికషం On Kinige

Related Posts:

రసజ్ఞ నాటకం – లవంగి

ఒక సాంఘిక నాటకాన్ని రాయాలంటే నిజ పరిస్థితుల్ని ఆలోకనం చేసుకుంటు ఎన్ని మలుపులైనా తిప్పవచ్చు. కావాల్సిన రీతిలో ప్రేక్షకులు మెచ్చే విధంగా ముగించవచ్చు. అయితే ఒక చారిత్రక నాటకం రాయాలంటే అందున జగన్నాధపండిత రాయల చరిత్రను నాటకంగా మలచడమంటే సామాన్యమైన విషయం కాదు. నాటి రాజ్యభౌగోళిక స్వరూపం, ఆహార్యం, స్వరూప స్వభావాలు ఇంతకు ముందు ఈ చరిత్రను రాసిన కవుల విశ్లేషణలు, వాటి పైన వచ్చిన విమర్శలు వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని రూపొందించాలి. ఏ మాత్రం దారి తప్పిన సాహిత్య పిపాసకుల విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే శర్మగారు చాకచక్యంగా నాటకాన్ని నడిపించారు. నాటకంలో పండిత రాయల వ్యక్తిత్వాన్ని సాహిత్య ఔన్నత్యాన్ని ఉన్నతీకరించడానికి చాలా ఔచిత్యవంతమైన శ్లోకాలనీ, పద్యాలనీ, హితోక్తుల్ని, సూక్తుల్నీ పొందుపర్చారు. నేటి కాలానికి అనుగుణంగా ప్రదర్శించే విధంగా “లవంగి” ని తీర్చిదిద్దడంలో రచయిత కృతకృత్యులయ్యారు.

శ్రీ మహర్షి (చిత్ర నవంబర్ 2012 మాసపత్రిక నుంచి)

* * *

“లవంగి” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేసి లవంగి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

లవంగి On Kinige

Related Posts:

ఎవరికి తెలియని కథలివిలే? (“చందనపు బొమ్మ” – సమీక్ష)

పప్పు అరుణ రాసిన కథల సంకలనం “చందనపు బొమ్మ” పై గ్రేట్ ఆంధ్రా. కామ్ వారి సమీక్ష నుంచి… కొన్ని భాగాలు.

* * *

మన చుట్టూ చాలా సమాంతర ప్రపంచాలు ఉంటాయి. వాటిలోకి మనం తొంగి చూస్తే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. మన చుట్టూ ప్రతి రోజు కనిపించే మనుషుల్లోనే కొత్త కోణాలు ఆవిష్కృతమవుతాయి. అలాంటి కోణాలను స్పృశిస్తూ వెలువడిన ఒక కథాసంకలనమే ‘చందనపు బొమ్మ’.

ఈ మధ్యకాలంలో తెలుగుకథలలో పూర్తిస్థాయి తెలుగువాడుక తగ్గుతూ వస్తోంది. తెలుగులో పదాలున్న భావాలకు కూడా ఇంగ్లీషు పదాలను ఉపయోగించడం సామాన్యమైపోయింది. ఈ కథలలో స్వచ్ఛమైన తెలుగు కనిపిస్తుంది.

మంచి తెలుగు కథలు కావాలనుకొనేవారు చదవాల్సిన సంకలనమిది.

సమీక్ష పూర్తి పాఠానికి ఇక్కడ నొక్కండి.

* * *

“చందనపు బొమ్మ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
చందనపు బొమ్మ On Kinige

Related Posts:

సజీవన చిత్రణ (జీవన శిల్పం సమీక్ష)

రచయిత్రి కన్నెగంటి అనసూయ జీవన శిల్పం బాగా పట్టుకున్నారు. అందుకే ఆవిడ కథానికల్లో శిల్పం, శైలి అంటూ ప్రాకులాడక మానవ జీవన సంవేదనలకు ఆలోచనాత్మకమైన అక్షరాకృతి నివ్వడమే ప్రధానంగా రచన చేసారు. జీవితాన్ని జీవించడం తప్ప నటించడం సరికాదని ప్రగాఢంగా విశ్వసించిన కలం తనది. కథలు కథలకోసమే కాదు సాటివారి జీవన వ్యధలు సాధ్యమైనంత మేరకు తీర్చగలిగే సేవా దృక్పథానికి ప్రోది కావాలన్న సంకల్పం గల రచయిత్రి కనుకనే మానవ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి తన రచనలే కాక మాటలూ, చేతలూ కూడా సాటివారి సహకారంతో తదనుగుణంగా నిర్వర్తిస్తున్న సేవాపరాయణ అనసూయ. అమ్మగారి స్ఫూర్తితోనే కమ్మని కథలు రాయడం అలవడిందంటారు.

ఇరవై కథల ఈ సంకలనంలోని కథలన్నీ అనురాగాలకు, ఆర్ద్రతలకు, మానవీయతకూ అద్దం పట్టేవిగా ఉన్నాయి.

‘బియ్యపు రవ్వ ఉప్మా’ అనే కథలో అమ్మ ఆప్యాయతకే కాదు, మాతృభూమి మమకారానికీ ‘ఉపమ’గా వృద్ధాప్యపు రాజారావు జ్ఞాపకాల మనుగడను మనోజ్ఞంగా చిత్రించారు. మనసుకు మనసు పరంబగునప్పుడు కంటికి నీరు ఆదేశంబగునని చాటుతూ రాసిన చిన్న కథే అయినా ‘ఏ సంధి’ అంతరంగపు సందులోకి చొరబడకుండా వుండదు. పినతల్లే తల్లిగా పసివాడి వసివాడని విశ్వాసాన్ని కథనం చేసిన తీరు బాగుంది.

మోసం, వంచన అనే వాటికి ‘జెండర్’ అంటూ ఏమీ లేదు. మోసం చేయడానికైనా, మోసపోవడానికైనా. రచయిత్రి తాను స్ర్తి అయివుండీ కొందరు సంఘంలో స్ర్తిలే ఎలాంటి వంచనలు చేస్తుంటారో ‘రెండొందలు’ కథలో చిత్రించారు. అంతేకాదు మహిళా సంఘాలు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌ల వంటివి కూడా అలాంటి వారిని వెనకేసుకు రాకూడదని ధ్వనింపచేసారు.

‘పడమటి సంధ్యారాగం’ అనే కథ పేరు ఆ కథకి ఎలా నప్పిందో తెలియదుగానీ, సాహిత్యాభిలాష ఉన్న ఓ పంజాబీ సైకియాట్రిస్ట్ రైల్వే స్టేషన్‌లో పిచ్చిదానిగా పుస్తకాల మూటతో నలుగురితో చీత్కరింపబడుతూ కనబడే విషాద సంఘటనను కథగా చిత్రించారు. కానీ ఆవిడ అలా మారడానికి గల కారణం కథలో ఎక్కడా చిత్రించబడలేదు. అంత విద్యాధికురాలు పిచ్చిదవడానికి గల హేతువు వివరించకుండా చెప్పడంవల్ల ఆ పాత్రమీద సానుభూతికి సాంద్రత గాఢత సమకూడినట్టు తోచదు.

వయోజన విద్య గూర్చిన అక్షర దీక్షా చైతన్యాన్ని ‘చైతన్యం’ వంటి కథలో చూపించి ప్రభుత్వ పథకాలని త్రోసిరాజనక ప్రజాప్రయోజన అంశాలు అందరూ అందిపుచ్చుకుని ప్రచులితం కావించవలసినవేనని అనిపించారు.

‘‘ఒక్క చిరునవ్వుతో సగం రోగాన్ని డాక్టరు నయం చెయ్యగలడు. మిగతా సగం రోగానికే డాక్టరు మందిచ్చేది. ఆ ఒక్క చిరునవ్వు ఆ రోగిలో ఎంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందో అంతే నమ్మకాన్ని డాక్టరుపట్ల పెంచుతుంది’’
‘‘మాటలూ భావాలూ ఏమీ లేని మొక్క కూడా ఒక చోట పీకి ఇంకోచోట వేస్తే మట్టీనీరూ రెండూ ఉన్నా, సరిగ్గా నిలబడడానికి వారం పైనే పడుతుంది. తర్వాత ఏ ఆటంకం లేకుండా అది ఎదుగుతూనే ఉంటుంది. ఇక మనుష్యుల సంగతి వేర్వేరు చోట్ల పెరిగొచ్చిన ఇరువురు వ్యక్తుల అభిప్రాయాలు కలవటానికి, ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి వారం, నెల లేదా సంవత్సరం పట్టవచ్చు. అచ్చంగా మట్టిలో బతకడానికి ప్రయత్నించే మొక్కలు. కాకపోతే ఈలోపు కాస్త ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలగాలి అంతే!’’
రెండు విభిన్న పాత్రల ద్వారా ఈ సందేశాలను సంకలించిన కథ ‘చిరునవ్వు’. అదృష్టం మనతోనే మనని వెన్నంటి ఉంటుందట. మనం కష్టపడితే అదృష్టమూ కష్టపడుతుందట. మనం నిద్రపోతే అదీ నిద్రపోతుందట అన్న అంశంతో చిత్రించిన కథ ప్రోత్సాహం.

అనసూయ కథల నిండా ఇలా జీవన సారస్యాన్ని వివరించే మంచి పంక్తులు సంభాషణలుగా, వ్యాఖ్యానాలుగా ఔచిత్యంతో తొణికిసలాడుతుంటాయి. అందుకే జీవన శిల్పం అంటే ఉదాత్త ఆశయాల విలవల శిల్పీకరణమే అనిపింపచేస్తారు. చదివించే మంచి శైలి అలవాటే ఈ యలమాటి పుట్టింటి పడతికి. కన్నెగంటి అనసూయగారి వెన్నవంటి మృదుభావాల మానవీయ కథానికల సంపుటి ‘జీవన శిల్పం’.

అల్లంరాజు
ఆంధ్రభూమి దినపత్రిక, 28/10/2012

* * *

“జీవన శిల్పం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

జీవన శిల్పం On Kinige

Related Posts:

ప్రత్యక్ష సంఘటనలకు అక్షర రూపం (అడ్డా పుస్తక సమీక్ష)

ఈ పుస్తకంలో ఏ కథానిక చదివినా రచయిత్రి తానెగిరిన, కళ్ళెదుట చూసిన సంఘటనలకు అక్షర రూపమిచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. సమాజం, వ్యవస్థ – గాడి తప్పుతోందనే ఆవేదన, మనుషులు అత్యాశలకి పోయి నిండు జీవితాలని బలి పెట్టుకుంటున్నారనే ఘోష పుట పుటలోనూ కనిపిస్తాయి. వాస్తవిక ఆలోచనలకు ప్రతిరూపం “ప్రేమ శిఖరాల మీద” కథ అయితే, స్త్రీకి ఉండే చట్టాన్ని దుర్వినియోగం చేసుకుని భర్తని, అత్తగారిని జైలుపాలు చేసే కథ “జాతర”. సామాజిక దృక్కోణం, అవినీతి, అన్యాయం, కునారిల్లుతున్న అనుబంధాలు, వంచన, అవహేళన….. ఇలాంటి వాటికి వ్యతిరేకమైన భావన ఈ రచయిత్రి ప్రతీ కథానికలోనూ కనిపిస్తుంది.
ఇన్ని ఉండబట్టే వేదాంత తత్వం ఆమెలో “బతుకు ఒక కలైతే….?” అనే కథని రాయించిందని ఇట్టే తెలిసిపోతుంది.
మనిషి ప్రాపంచిక సుఖాల కోసం అత్యాశాలకు పోతూ, స్వార్థంతో ద్వేషాన్ని పెంచుకుని, తమ గోతిని తామే తవ్వుకుంటారనే వాస్తవాన్ని కల ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించారు రచయిత్రి. అంతే కాదు – కల గన్న పాత్ర మేల్కొని, తమ తప్పు తెలుసుకుని, జీవితాన్ని మార్చుకోవాలనుకోవడం రచయిత్రి మనోభావాలని, భావోద్వేగాన్ని పాఠకులు గ్రహిస్తారు. రోడ్డు మీద పోతూ, మనకి కలిగే అనుభవాలని, సంఘటనల్ని గుర్తు చేస్తూ, వాటికి ఆశావహ దృక్పథంతో చెప్పే ముగింపు ప్రతి కథానికలోనూ మనల్ని ఆలోజింపచేస్తాయి.

కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ (చిత్ర మాసపత్రిక, అక్టోబరు 2012 సంచిక నుంచి)

* * *

“అడ్డా” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేసిన్ ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

అడ్డా On Kinige

Related Posts:

ఇది గొల్లపూడి ‘మారుతీయం’

ప్రముఖ సినీనటుడు గొల్లపూడి మారుతీరావు మంచి రచయిత, కవి అని కూడా చాలా మందికి తెలుసు. సినిమాలలో ఆయన నటనను ఎవరూ ఇష్టపడకుండా ఉండలేదు. ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. ఈ సెప్టెంబరులో ఆయన ‘మారుతీయం – గొల్లపూడి మారుతీరావు కవితా హృదయం‘ అనే పేరుతో ఒక పుస్తకం ముద్రించారు.

ఆయన చెప్పినట్లే…. ఏభై సంవత్సరాల ఊసులవి. ఆయన జీవితంలో పరుచుకున్న అన్ని రుచులూ అంటే తీపి, చేదూ, వగరూ, విగరూ, ప్రేమా, చిరునవ్వూ, బాధా, కోపం, తాపం అన్నీ ఉన్నాయి ఇందులో. కవితలు, పాటలు మొత్తం పది విభాగాలుగా ఉన్నాయి. ప్రేమగీతాలు, ఆసుపత్రి పాటలు, వాసుస్మృతులు, మళ్ళీ మళ్ళీ వసంతం, ఉగాది కవితలు, స్వాతంత్ర్య గీతం, ఏరిన పూలు, హైకూలు, పాటలు పల్లవులు అనే ప్రధాన విభాగాలుగా ఉన్నా, ఒక్కో విభాగంలో మరికొన్ని కవితలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పుస్తకం చదివేడప్పుడు పాఠకుడిని మారుతీరావు పూర్తిగా ఆవహించేస్తారు. ఎందుకంటే తెలుగు ప్రజలకు బాగా పరిచితుడు కావడం, ఆయనది ఒక ప్రత్యేక శైలి కావడం, ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో ఆయనకు ఒక శైలి ఉండడంతో, ఈ పుస్తకంలో ఏ కవిత, ఏ వాక్యం చదివినా ఆయన డైలాగ్ చెప్పినట్టే ఉంటుంది. గట్టిగా ప్రయత్నిస్తే గానీ దాని నుంచి బయటపడలేం. ఇక అన్ని కవితలూ బావున్నాయి. నిత్యసత్యాలు అనే కవితలో నుదుటిన ఎర్రటిమంట అది బొట్టు. నోట్లో వాడిగా మాట అది తిట్టు. గుండెల్లో చిక్కని పొంగు అది ఆవేశం. ఇలా అనేక నిత్యసత్యాలకు నిర్వచనం చెప్పిన దిట్ట. ఆయన కవిత్వంలో వ్యంగ్యం కూడా ఉంది. బడ్జెట్ ప్రతిపాదన కవితలో రాజకీయ బాగోతం గురించి బాగా చెప్పారు. ఒక మంత్రి – బడ్జెట్‌ని ప్రతిపాదించిన మంత్రి ఆ బడ్జెట్‌తోనే దేశంలో సోషలిజం వచ్చేసినట్లు చెబుతాడు. చివరకు ‘సుఖపడే అన్ని అవకాశాలు మన చేతుల్లోనే ఉన్నాయి కనుక, కలగనే ఒక్క అవకాశాన్నీ తప్పని సరయి మినహాయిస్తున్నాం’ అని ముగింపు వ్యంగ్యంగా చెబుతూ బడ్జెట్ బండారాన్ని బయట పెట్టారు.

ఇలా ఆయన కవితలు, మాటలు, అన్నీ కూడా విలువైనవే. చదువుకోడానికి, పదిమందితో చెప్పుకోవటానికి కూడా ఉపయోగపడేవే.

ఎన్‌క్యూబ్
వార్త దినపత్రిక, 28 అక్టోబరు 2012

* * *

మారుతీయం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ప్రింట్ బుక్ ఆర్డర్ చేసి తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
మారుతీయం On Kinige

Related Posts:

ఇవి మహనీయుల స్వరభాస్వరాలు

మరణించిన వారు బతికి ఉన్న సమయంలో చెప్పిన మాటలు మధురంగా, ఒక్కోసారి ఆశ్చర్యంగా, ఒక్కోసారి అద్భుతంగా గోచరిస్తాయి. అయితే వారి మాటలను ఏరి కూర్చి ‘అభౌతిక స్వరం‘ అనే పేరుతో పుస్తక రూపం ఇచ్చారు మాధవ్ సింగరాజు. నిరంతరం ఆలోచిస్తూ, అపుడపుడు అతి దగ్గరివారితో నవ్విస్తూ అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు ఉండే మాధవ్ కలం నుంచి ఒక దినపత్రికలో వారం వారం జాలువారిన ధారావాహికకు పుస్తక రూపం ఇది. ప్రతి వారం పాఠకులకు విసుగు కలిగించకుండా, అందరినీ ఆకట్టుకునేలా రాయడమంటే మాటలు కాదు. కానీ ఎక్కడా వైవిధ్యం చెడకుండా ఒక ప్రవాహంలా తనదైన శైలిలో సాగిపోతుంది ఈ రచన. ఇక్కడ ఒకటి రెండు ఉదాహరణలందించి ఈ పుస్తకాన్ని రుచి చూపాలనిపిస్తోంది.

చార్లీ చాప్లిన్ అధ్యాయంలో ఇలా ఉంది.
“దగ్గర్నించి చూస్తే ఏ జీవితమైనా గొప్పగా ఉండదు. లాంగ్ షాట్‌లో చాప్లిన్ మీకు అందంగా కనిపించడమే, జీవితంలోని విషాదం. నాలో అహంకారం, అరాచకం మాత్రమే కాదు, ఇంకా అనేకం ఉన్నాయి. బద్దకం, అబద్ధం, అసంబద్ధత అన్నీ కలిస్తే నేను. నా కారును నేను ఎక్కువ దూరం డ్రైవ్ చెయ్యలేదు. నడపడం ఇష్టం అలా ఎంత దూరమైనా, కొంచెం స్విమ్మింగ్ వచ్చు, ఆటలు ఆడడం రాదు, ఆ మధ్య ఒక పత్రికలో నా ఫొటో వచ్చింది. పోలో ఆడుతూ గుర్రం పక్కన నిలబడి ఉన్నట్లు. అదో జోక్….. విశ్రాంతి కోసం కొరొనాడో వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఒకడు తన పోలో గేమ్ డ్రెస్ ఇచ్చి, దాన్ని తొడుక్కుని ఫొటో దిగమన్నాడు. అపుడు తీసింది ఇది” అంటూ చెప్పుకొచ్చారు. ఎదిగిన వారు కొద్దిగా ఒదిగి ఉండాలంటారు. అదే విధంగా ఎదిగిన వారు ఎప్పుడూ వాస్తవాలు చెప్పుకోడానికి వెనుకాడరు. ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు.

ఇక ఒక కవి అదీ భారత దేశానికి నోబెల్ బహుమతి తెచ్చిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఊహలు, కలలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఒక మచ్చుతునక. “రాత్రి చిత్రమైన కల వచ్చింది. కలకత్తాను మహత్తరమైన మంచు మేఘమేదో కమ్మేసింది. ఇళ్ళు భవనాలు కనిపించడం లేదు. అప్పుడు నేను పార్క్ స్ట్రీట్‌లో గుర్రపు బగ్గీపై వెళుతున్నాను. సెయింట్ జేవియర్స్ కాలేజి దగ్గరకు రాగానే ఒక్క సారిగా ఆ భవంతి పెరగడం మొదలైంది. చాలా వేగంగా, ఎత్తుగా, చిక్కటి మంచుని చీల్చుకుంటూ అలా ఆకాశంలోకి పెరుగుతూ ఉంది. ఊర్లోకి ఎవరో కొత్త మనుషులు వచ్చి ఇలాంటి మాయలు చేస్తున్నారని జనం వింతగా చెప్పుకుంటున్నారు” అంటూ ఇది సాగుతుంది. ఆ కవి ఊహాజనిత ఘటనపై ఎంత బాగా చెప్పారో ఇది తెలియజేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో వ్యక్తిది ఒక్కో ప్రత్యేకత. ఇలా సుమారు 50 మంది అభౌతికి స్వరాలను ఇందులో వినిపించారు. పుస్తక ముద్రణలోనూ ఒక ప్రత్యేకత కనిపించేలా ప్రయోగాలు చేసారు. పుస్తకం మొదటిదైనా ఎంతో అనుభవం దాని వెనుక దాగి ఉందని పాఠకులకు తెలిసిపోతుంది.

టి వేదాంత సూరి, ఆదివారం అనుబంధం, వార్త దినపత్రిక 28 అక్టోబరు 2012

* * *

అభౌతిక స్వరం On Kinige

Related Posts:

  • No Related Posts

కాలాతీత భావాలు

చలసాని ప్రసాదరావుఇలా మిగిలేం‘ ప్రతి ముద్రణా ఒక అలజడే! మొదటిసారి 1991 ఆగస్టులో వెలువడినప్పుడు మరే గ్రంథం మీదా జరగనంత విస్తృత చర్చ జరిగింది. మోటూరి హనుమంతరావును సైతం నిలదీయడానికి చలసాని వెనకాడలేదు. రావి నారాయణరెడ్డిని పెద్ద మితవాదిగా పేర్కొన్నారు. గజ్జెల మల్లారెడ్డిని వూసరవెల్లిగా చిత్రించారు. ‘ఖడ్గమృగోదగ్ర విరావం – పులి చంపిన లేడి నెత్తురు’ను తిరగేసి శ్రీశ్రీకే వేసికొట్టాలని చూసిన బాలగంగాధర తిలక్ కవితని ‘చాపల్యం’గానే భావించారు. ఇవన్నీ చలసాని ప్రత్యక్షానుభవాలనుంచి వచ్చినవే. అన్నీ స్వీయానుభవంలోనివయినప్పుడు దాపరికం ఎందుకన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు. ఓ ‘బాధ్యత’గానే ఇదంతా రాశానని చెప్పుకున్నారు. కమ్యూనిస్టు మహోద్యమం ఇలా ఛిన్నాభిన్నమైపోవడానికి గల కారణాల్లో ‘కొన్నింటిని’ ఆ ఉద్యమ నాయకులు సరిదిద్దుకోవాలన్నది ఈ రచనాలక్ష్యం. ఆలోచనను రేకెత్తించటం వరకూ అది నెరవేరిందనే అనుకుంటున్నానని మలిముద్రణవేళ వాసిరెడ్డి నవీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చలసాని పదో వర్ధంతి సందర్భంగా వచ్చిన మూడో ముద్రణ ఇది.

జివిఎన్ మూర్తి
ఈనాడు ఆదివారం అనుబంధం 22 జులై 2012.

* * *

‘ఇలా మిగిలేం’ డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా తక్కువ ధరకే ప్రింట్ బుక్ ఆర్డర్ చేయవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
ఇలా మిగిలేం On Kinige

Related Posts: