రన్ ఫర్ ది హైలాండ్స్

ప్రముఖ రచయిత మధుబాబు కలం నుంచి జాలువారిన మరో షాడో అడ్వెంచర్ – “రన్ ఫర్ ది హైలాండ్స్“.

షాడో గజదొంగగా ఉన్నప్పటి కథ ఇది. కొద్ది కాలం క్రితం లక్షదీవులలో జరిగిన గొడవల్లో షాడోవలన కిల్లర్ గ్యాంగ్ తీవ్రంగా నష్టపోతుంది. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న కిల్లర్స్ గ్యాంగ్ బీహారులోని బక్ బక్ బల్హారీ, షాహిరీ షబ్నమ్ సింగ్, షేక్ రఫూక్, మహబూబ్ ఖాన్, పాపా హజ్రత్ వంటి పేరుమోసిన రౌడీలందరినీ ఒక జట్టుగా చేసి షాడో మీదకి ఉసిగొల్పుతుంది.

షాడో ఎంతగానో గౌరవించే మాజీ న్యాయమూర్తి ఛటర్జీని, ఆయన మేనకోడలు మల్లికను రౌడీమూకలు కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెడతారు. షాడోని కవ్విస్తారు.

చివరికి షాడో భరత్‌పూర్‌లో అడుగుపెడతాడు. గంగారాం సాయంతో రౌడీల పీచమణుస్తాడు. ఈ క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కుంటాడు. స్పెషల్ బ్రాంచ్ ఏజంట్లు కుట్ర ఏమిటి? షాడోకి నమ్మినబంటుగా ఉన్న రామభక్త హనుమాన్ ఎవరు? పోలీసులు షాడోని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఛటర్జీని, మల్లికని షాడో ఎలా విడిపించాడు? కులకర్ణిగారు షాడో ముందు ఉంచుదామనుకున్న ప్రస్తావన ఏమిటి? షాడో జపాన్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ ఆసక్తికరమైన నవలలో లభిస్తాయి.

రన్ ఫర్ ది హైలాండ్స్ డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

రన్ ఫర్ ది హైలాండ్స్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

ప్రత్యామ్నాయ సంస్కృతికి తల్లినుడే కీలకం

అంబేద్కర్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 14న దేశమంతా పండుగ. బడుగుల ఆత్మగౌరవ ప్రకటనకు అంబేద్కర్‌ ప్రతీకయ్యాడు. దళితుడిగా పుట్టి, ఈసడింపులతో అణచివేతతో సంఘర్షిస్తూ, ఒక మేధావిగా, మహానాయకుడిగా ఎదిగి, చివరికి బౌద్ధమే తనవారికి దిక్కు అని గట్టిగా నమ్మి, ఆ దారిన తన అడుగువేసి తోటి దళిత బడుగు జీవులకు దిక్సూచి అయ్యాడు. స్వాభిమాన పతాకను చేపట్టి బౌద్ధమార్గాన్ని అనుసరించడం ద్వారా తాను ఈ సమాజానికి చెప్పదలచుకున్నదంతా చెప్పేశాడు. అప్పటిదాకా వ్రాసినదంతా, మాట్లాడినదంతా, పొందిన జ్ఞానాన్నంతా ఆ ఒక్క నిర్ణయంతో, ఆ ఒక్క అడుగుతో ప్రపంచానికి చెప్పేశాడు.
తన భూమిని, తన జనాన్ని, తన తాత్విక భూమికను తన ఆత్మగౌరవానికి సంకేతాలుగా చూపించాడు. అందులో తరతరాల అణచివేతకు, అసహనానికీ, దోపిడికి, ఆధిపత్య భావజాలానికి సవాలు విసిరాడు. భయంతో కన్నీటితో బీదరికంతో కునారిల్లుతున్న బడుగులను ఓదార్చి, వారి సమస్యలకు పరిష్కారంకోసం ముందుకు సాగాల్సిన త్రోవను చూపించాడు.
ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి మాట్లాడేవారంతా అంబేద్కర్‌ నిర్ణయాన్ని, ముందడుగును లోతుగా అధ్యయనం చెయ్యాలి. ఈ సమాజంలో ఉన్న కులాల కుళ్లును, ఆధిపత్య భావజాలపు దుర్మార్గాన్ని, అణచివేతను ఎదుర్కోదలచిన వాళ్లంతా అడుగులు వేయాల్సిన త్రోవ అదే. ఆ త్రోవ దేశీయం. సర్వజనావళికి సుఖశాంతుల్ని కలిగించేది. అన్ని కాలాలకూ వర్తించేది. వేల ఏండ్ల జాతి సమస్యలకిదే పరిష్కారం.
ఈ ప్రత్యామ్నాయ సంస్కృతికి ఆధారం ‘తనది’ అనే భావం. ఈ ‘తనానికి’ మూలం – తాను పుట్టిపెరిగిన నేలపైన, తోటి జనంపైన నెనరు – అభిమానం. తన భాష, తన కళలు, తన తెలివితేటలు ఆధారంగా విశ్వమంతా తానుగా ఎదగమే ప్రత్యామ్నాయ సంస్కృతి.
బడుగులు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాల్లో దూసుకురాలేకపోవడనికి రెండు మౌలికమైన అడ్డంకులున్నాయి. మొదటిది – ఇష్టారాజ్యంగా పెరిగిన సంస్కృత భావజాలం బడుగులను వారి సాంప్రదాయక నుడి సంపదకు, తమ వృత్తులతోపాటు, కళలతోపాటు ఎదిగిన సంస్కృతికి, తమదైన ఆలోచనకు దూరంచేసింది. ఆత్మన్యూనతకు గురిచేసింది. ఈ నేల మూలవాసులు తమ భాషాసంస్కృతులకు దూరంకావడం సహజంగా జరిగింది కాదు. బయటివారి సాంస్కృతిక దాడికి బలై ఆత్మన్యూనతకు లోనయ్యారు. కాగా, రెండవ అడ్డంకి మరొకవైపు నుంచి వచ్చింది. పైనచెప్పిన మొదటి అడ్డంకిని దాటడనికి, పరాయి పాలకుల కాలం నుండి నేటి వరకూ చూపబడుతున్న మరోదారే వారి స్వయంప్రకాశానికి మరో అడ్డంకి అయింది. ఇది పరభాష రూపంలో, పరమత రూపంలో వారికి అడ్డంకిగా నిలిచింది. ఈ రెండు అడ్డంకులనూ గుర్తించిన వైద్యుడు అంబేద్కర్‌. అందుకే సరైన మందుకోసం అన్వేషించాడు. దాన్ని సూచించాడు. అదే బౌద్ధమార్గం. వేల ఏండ్ల చరిత్రలో అనేక విధాలుగా చెదిరిపోయిన తీరులను అధ్యయనం చేసి, బౌద్ధాన్ని ఈ కాలానికి కావలసిన రీతిలో వివరించాడు అంబేద్కర్‌.
పైన పేర్కొన్న రెండు అడ్డంకుల్లోంచీ బడుగులు బయటపడలేకపోతున్నారు. ఆ రెండు అడ్డంకుల మధ్యా నలిగిపోతున్నారు. ఆయన చూపిన త్రోవలో నడవడనికి వేలాది బడుగులు ముందుకు వచ్చారు. భద్రజీవుల్లో కూడ దేశభక్తులు, మానవతను ప్రాణంగా నమ్మినవారు ఆయనకు తోడయ్యారు. కాని, అంబేద్కర్‌ ఆశించిన ఆ ‘గొప్ప సామాజిక మార్పు’ ఆయన అకాల మరణంతో ఆదిలోనే ఆగిపోయింది. సాగవలసినంతగా ముందుకు సాగలేదు. ఆ మహోన్నత వ్యక్తి మరి కొంతకాలం బ్రతికివుంటే పై రెండు అడ్డంకుల నుంచీ బడుగులు బయటపనికీ, స్వాభిమాన ప్రాతిపదికన తమదైన ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించుకోవడనికీ బలమైన త్రోవ ఏర్పడి వుండేది. ఆయనలేని లోటును పూడ్చగల అంతటి నేతృత్వం బడుగులకు నాటికీ నేటికీ ఒనగూడలేదు.
అందువల్ల ఆధిపత్య భావజాల విషసంస్కృతిలో తాము కూడ భాగమవుతున్నారు. ఆంగ్ల సంస్కృతి మోజులోపడి తమదైన మౌలిక శక్తియుక్తులను, భాషాసంస్కృతులను కోల్పోతున్నారు. గత 50 ఏళ్లుగా ఈ దేశంలో పెరుగుతున్న విషరాజకీయాల్లో భాగమై తమ ఎదుగుదలకు తామే అడ్డుకట్టలు వేసుకొంటున్నారు.
బడుగులు అన్నివిధాలుగా ఇప్పుడు సంఘర్షణను ఎదుర్కొంటున్నారు. ఆత్మన్యూనత నుండి బయటపడడానికి తమకు రాజకీయాలే మార్గమనీ, అధికారంలోకి రావడమే పరిష్కారమనీ భావిస్తున్నారు. నేటి రాజకీయాల్లోకి ఎలాగైనా చొచ్చుకు రావడంకోసం పార్టీల ఎత్తుగడలకు పావులవుతున్నారు తప్ప, తమ బలాన్ని పంచి ఇస్తున్నారు తప్ప, బడుగులందరి అభివృద్ధి కోసం అన్ని రంగాల్లోనూ జరగవలసిన కృషి గురించి నిర్మాణాత్మకంగా ఆలోచించే ధోరణి లేకుండా పోయింది.
ఈ దేశంలో బడుగువర్గాలకు తమదైన భాష ఉంది. తమవైన వృత్తినైపుణ్యాలున్నాయి. తమవైన కళారూపాలున్నాయి. తమవైన మానవీయ జీవన విలువలున్నాయి. అవి కులాలవారీగా వున్నాయి. నేటి పరిస్థితుల్లో వారు తమ కులాల వారసత్వాన్ని ఆత్మన్యూనతా చిహ్నాలుగా భావించకూడదు. అవి ఉన్న పళంగా పోవు. కనుక వాటికి విలువను సంతరింపచేసుకోవడమే మార్గం. మాదిగ కులస్థుడు తన పేరు చివర ‘మాదిగ’ అని చేర్చుకొని దాన్ని ఒక ఆత్మగౌరవ చిహ్నంగా చేసుకొన్నట్లే బడుగులంతా తమ కులాల గుర్తుల్ని తమ పేరుచివర ఆత్మగౌరవ సంకేతాలుగా ఉంచుకోవడనికి ఇక ఏమాత్రం సంకోచించనక్కరలేదు. కులాల సంకేతాల్ని పేరులోంచి తొలగించుకోవడనికి అందరూ ఇష్టపడనంతకాలం బడుగుల ఆత్మగౌరవానికి వారి కులాలు అడ్డుకాకూడదు.
అంతేకాదు, తమ వృత్తులతోపాటు ఎదిగిన తమ తల్లి నుడిని కించపరచుకోకూడదు. తమ నుడినీ, నుడికారాన్నీ తమ ఆత్మగౌరవ అంశాలుగా, తమ సంపదగా భావించాలేగాని, వాటిని ఆత్మన్యూనతకు చిహ్నాలుగా అనుకోకూడదు. తరతరాలుగా తమ ఆస్తిగా వచ్చిన తమ నుడి సంపదకు సంస్కృతంవల్లా ఆంగ్లంవల్లా కలిగిన నష్టాన్ని వారు తెలుసుకోవాలి. తమ నుడి సంపద రక్షణకోసం వారు పోరాడలి. నేటి అవసరాలకు తగ్గట్లుగా ఆంగ్లంలోనో, మరొక భాషలోనో ప్రవీణులు కావడనికి తమ భాషను కోల్పోనక్కరలేదు. పరభాషల్ని నేర్చుకోవడనికి, ఈకాలపు అవసరాల్లో దూసుకుపోవడనికి వారి భాషాసంపదే వారికి గొప్ప పెట్టుబడి. తాము నివసిస్తున్న సమాజంలోగాని, ఇతర దేశాల సమాజాల్లోగాని వికసించడానికి తమ నుడి సంపద ఎంత గొప్పగా పనికొస్తుందో వారు తెలుసుకోవాలి. దాన్నే వారొక ఆయుధంగా మలచుకోవాలి. ఈ దేశాన్ని అన్ని రంగాలలో ఏలడానికి మూలవాసులుగా వారికి హక్కు ఉంది. దానికి వారి తల్లినుడి, తరతరాలుగా తమవైన కళలు, చేతివృత్తులు పెట్టుబడులు. తమ కళల్ని, తమ నుడిని, తమ సంస్కృతిని కాపాడుకోవడమంటే తమ ప్రగతిని నిరోధించుకోవడం కాదు – తమ వారసత్వాన్ని ఆధునికం చేయడం. వాటికి గౌరవాన్ని సంతరించుకోవడం. అనేక బడుగు కులాల్లో నిలిచివున్న జానపద కళారూపాలకు సామాజిక గౌరవాన్ని సంపాదించి వాటిపట్ల అన్ని వర్గాలకూ ఆకర్షణ కలిగించిననాడు అవి కూడ భరతనాట్యం వలె, కూచిపూడివలె గౌరవకేంద్రాలవుతాయి. అదే విధంగా తమ వృత్తులలోని విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా ఎదిగించుకొని ఆయా వృత్తులకు గౌరవాన్ని సాధించాలి.
తెలుగు భాషోద్యమంలోకి బడుగువర్గాలు దూసుకురావాలి. తెలుగంటే తెలుగే. అది బడుగు జీవులనుండి, శ్రామికుల నుండి పుట్టింది. వారి సాహిత్యం నుండి వికసించింది. సామాజిక, రాజకీయ పెత్తందారీతనంవల్ల, ఆధిపత్యంవల్ల అది క్రమంగా తన తనాన్ని కోల్పోతూ వచ్చింది. ఉద్యమాల ఫలితంగా తెలుగు నుడి ప్రజాస్వామ్య త్రోవలో కొచ్చింది. అది ఇంకా మౌలికంగా ప్రజలభాష కావాల్సి ఉంది. ఆ పనీ మొదలయింది. ఇదంతా అత్యంత సహజంగా జరిగేదే. అడ్డంకుల్ని అధిగమించగల శక్తి తెలుగు నుడికి ఉంది. అయితే ఇందుకు పెద్ద ఎత్తున ఉద్యమం సాగాలి. అది బడుగువర్గాల వల్ల, మహిళలవల్ల మాత్రమే వీలవుతుంది. ప్రత్యామ్నాయ సంస్కృతికి తల్లి నుడే కీలకం. అంబేద్కర్‌ ఆశయసాధన కోసం బడుగుల త్రోవ – తల్లి నుడిని కాపాడుకుంటూ స్వాభిమానంతో ముందుకు సాగడమే. అంబేద్కర్‌ చూపిన బౌద్ధమార్గానికి ప్రాతిపదిక ఇదే. తన నుడి, తన నాడు, తన నెనరు (స్వాభిమానం) మాత్రమే బడుగుల కరదీపికలు.
– సామల రమేశ్‌బాబు (నడుస్తున్న చరిత్ర ఏప్రిల్ 2012 సంచిక సంపాదకీయం)

* * *

నడుస్తున్న చరిత్ర మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. తాజా సంచిక కోసం ఈ క్రింది లింక్ చూడండి.

నడుస్తున్న చరిత్ర ఏప్రిల్ 2012 On Kinige

Related Posts:

త్రిపుర కథలు

“విలక్షణతే… ప్రధాన లక్షణం!” అనే శీర్షికతో త్రిపుర కథలపై సుధామ రాసిన సమీక్ష 8 ఏప్రిల్ 2012 నాటి ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది.

కేవలం 15 కథలతోనే తెలుగు కథా ప్రపంచంలో తనకొక ఉనికికి ఏర్పరుచుకున్న కథకుడు త్రిపుర అని సుధామ పేర్కొన్నారు.

త్రిపుర కథల విలక్షణత అయన ఎత్తుగడలో ఉంటుందని, ఈ కథలకి తర్జన భర్జనలు తప్పవని త్రిపుర గురించి మరో రచయిత చెప్పడాన్ని సుధామ ఉటంకించారు.
రచయితల రచయిత త్రిపుర అని వ్యాఖ్యనించారు సుధామ.

సమీక్ష పూర్తి పాఠం కోసం ఈ లింక్ అనుసరించండి. లేదా పూర్తి సమీక్షని ఈ దిగువ చిత్రంలో చదవచ్చు.

Tripura Kathalu Review by Sudhama Eenadu 8 April 2012

త్రిపుర కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

కినిగె వెబ్ సైట్ నుంచీ ప్రింట్ బుక్‍ని కూడా ఆర్డర్ చేయవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

త్రిపుర కథలు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

సిసిలియన్ ఎడ్వెంచర్

ప్రముఖ డిటెక్టివ్ రచయిత మధుబాబు కలం నుంచి జాలువారిన మరో షాడో స్పై ఎడ్వెంచర్ “సిసిలియన్ ఎడ్వెంచర్“.

సిసిలో దేశపు సైనికాధికారి మేజర్ సఫారీ. అతను ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని, వివిధ దేశాలను తన చెప్పుచేతలలో ఉంచుకోవాలని కలలు కంటూంటాడు.
సైంటిస్ట్ అయిన డాక్టర్ కెల్లీతో చేతులు కలిపి, ప్రాణాంతక రసాయనాలతో స్కెలిటన్ టాబ్లెట్లని తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తూంటాడు. రోడ్ల మీద ఒంటరిగా వెళ్ళే బాటసారులను, వాహనదారులను కిడ్నాప్ చేసి ఈ టాబ్లెట్‌ని వారిపై ప్రయోగిస్తూంటారు. ఆ టాబ్లెట్స్‌ని సేవించిన వారు ముందుగా ఫిట్స్ వచ్చినట్టుగా గిలగిలా కొట్టుకుంటారు. అరగంట తర్వాత వారి శరీరంలో కదలికలు ఆగిపోతాయి. శరీరం దుర్వాసన వేస్తుంది. మరి కాసేపటికి శరీరంలో మాంసం, రక్తం, నరాలు అన్నీ మాయమై శవం ఎముకల గూడులా మారుతుంది.

ఈ గాంగ్‌ని పట్టుకోవడానికి సిసిలీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ ఎందుకు కొరగాకుండా పోయాయి. దాంతో వాళ్ళు ఇంటర్‌పోల్ సాయం కోరుతారు. ఇంటర్‌పోల్ తరపున శ్రీకర్, ముఖేష్, షాడోలు ఈ అసైన్‌మెంట్‌లో పాలుపంచుకుంటారు.

ముందుగా శ్రీకర్, ముకేష్ వచ్చి ఈ గాంగ్ స్థావరం ఎక్కడో కనుక్కుంటారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరు దొరికిపోయి, గ్యాంగ్ చేతిలో చిత్రహింసలకి గురవుతారు. షాడో అంకోనాలో అడుగుపెడుతూనే, అతన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తారు ప్రత్యర్థులు. అతని హోటల్ రూంలో బాంబు పేలుడు సంభవిస్తుంది. షాడో అంకోనాని వదిలి, బ్రిండిసి పట్టణానికి వస్తాడు. అతను అక్కడ విమానం ఎక్కి, మెస్సినీ వెళ్లాలని అతడి ఆలోచన. అయితే ఉన్నట్లుండి స్థానిక విమానాశ్రయంలో పేలుడు సంభవించి రాకపోకలు రద్దవుతాయి. ఓ ప్రైవేటు విమానాన్ని అద్దెకు తీసుకుని బయల్దేరుతాడు షాడో. కొద్ది సేపట్లోనే ఆ విమానం దారి మళ్ళుతుంది. ఉన్నట్లుండి సముద్రంలో కూలిపోతుంది.

షాడో ఎలా తప్పించుకున్నాడు? ఈ ప్రమాదాల వెనుక ఉన్నది ఎవరు? శ్రీకర్, ముఖేష్, స్కెలిటన్ టాబ్లెట్ ప్రభావం నుంచి ఎలా తప్పించుకున్నారు? షాడోకి సాయం చేసిన ఈ సిసిలియన్ సుందరి ఎవరు? డాక్టర్ కెల్లీ, మేజర్ సఫారీలు చట్టానికి చిక్కారా?

ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు కావాలంటే ఈ థ్రిల్లర్ చదవాల్సిందే. ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

సిసిలియన్ ఎడ్వంచర్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

విశ్వనాథ వారి ముద్దువడ్డన్లు-5

జనప్రియంగా సాహిత్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్న సంస్థ హైదరాబాద్‌కు చెందిన విశ్వనాథ సాహిత్యపీఠం. విశ్వనాథ వారి ముద్దువడ్డన్లు-5 అనే పుస్తకం విశ్వనాథ సాహిత్యపీఠం ప్రచురణ. ఆయా రచయితలతో, పరిచయం ఉన్నవారి చేత, విశ్వనాథ వారి హాస్య సంభాషణలు రాయించి వాటిని సంకలనాలుగా తీసుకువచ్చింది విశ్వనాథ సాహిత్యపీఠం.

పుస్తకం పేరులోని ముద్దువడ్డన్లు అనే పదప్రయోగం విభిన్నంగా ఉందని అనిపిస్తుంది. “ముద్దు వడ్డనలు” అనేది తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలలో ప్రాచుర్యంలో ఉన్న నుడికారం. వడ్డన అనే పదాన్ని వెటకారంతో కూడిన సంభాషణలు, సంబోధనలకు వాడుతారు. విశ్వనాథ గారి చతురోక్తులను సంకలనం చేసి ప్రచురించిన పుస్తకాలకి “విశ్వనాధ వారి ముద్దువడ్డన్లు” అనే శీర్షిక పెట్టారు. ఈ సంకలనాల క్రమంలో ఐదో పుస్తకాన్ని పరిచయం చేసుకుందాం.

ఈ పుస్తకంలో విశ్వనాథ వారితో తన అనుభవాలను ప్రస్తావించినది ప్రముఖ కవి శ్రీ అద్దేపల్లి రామమోహన్‍‌రావు. విశ్వనాథ గారితో తన వ్యక్తిగత అనుభవాలను వివరించడమే కాకుండా, విశ్వనాథ గారితో తన్న సన్నిహిత మిత్రులకున్న అనుభవాలను సైతం సేకరించి ఈ పుస్తకంలో పాఠకులకు అందించారు.

ఓ సాహితీ దురంధరుడి జీవితంలోని భిన్న కోణాలను తెలుసుకునేందుకు ఈ తరహా రచనలు ఉపకరిస్తాయి.

మాములుగా గొప్ప రచయితలు లేదా కవులపై రాసే వ్యాఖ్యానాలు, విమర్శలు వ్యగ్రతతో చదవవలసినవి. కొద్దిమందికే అవి ఆనందం కలిగిస్తాయి. కానీ హాస్యోక్తులుగాని, అభిప్రాయాలుగాని, అందరూ ఇష్టంగా చదువుతారు. దీన్ని ‘లైట్ రీడింగ్’ అని ఇంగ్లీషులో అంటారు. ‘కులాసాగా చదువుకోడం’ అని తెలుగులో అనవచ్చు. ఆ కోవలేనిదో ఈ పుస్తకం కూడా.

* * *

విజయవాడలో, ఏదో ఒక సందర్భంలో విశ్వనాథ అంటే గిట్టనివాళ్ళు ఒక కరపత్రం వేశారుట. అందులో…
‘లారీల కొద్దీ పుస్తకాలు రాసిన విశ్వనాథ ‘ అని వేళాకోళంగా రాసారుట.
అప్పుడు మిత్రులు విశ్వనాథతో, “దాన్ని గురించి మీరేమనుకుంటున్నారు? బాధపడుతున్నారా?” అని అడిగారట.
ఆయన ఇలా అన్నారుట..”దీన్లో బాధపడేందుకేముంది? లారీల కొద్దీ రాశానన్నారుగాని, బాగా రాయలేదని అనలేదు గదా. అంటే మంచి పుస్తకాలు లారీల కొద్దీ రాశాననని వాళ్ళ అభిప్రాయం. అది సంతోషమే గదా!

* * *

“నేను ఎంతో పేదరికంలో ఉన్నప్పుడు ఈ గవర్నమెంటు నాకేమి ఇవ్వలేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత, నన్ను వృత్తి పన్ను అడుగుతుందేమిటి?”

* * *

ఒక రోజు ముగ్గురు మిత్రులం విశ్వనాథ ఇంటికి వెళ్ళాం. ఆయన వాకిట్లో నులకమంచం మీద కూర్చున్నారు. మేం వెళ్ళి ఇంకోమంచం మీద కూర్చున్నాం. ఆ రోజు ఎన్నెన్నో విషయాలు వచ్చినై. పతనమైపోతున్న సంస్కృతి, రాజకీయాలు ఆనాటి ముఖ్యవస్తువు అయింది. ఒక మిత్రుడు ‘ఇది ట్రాన్సిషన్ పీరియడ్’ అన్నాడు. వెంటనే విశ్వనాథ అతి తీవ్రమైన స్వరంతో, ‘నో, ఇది ట్రాన్స్‌గ్రెషన్ పీరియడ్’ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రావడం దగ్గర్నుండి, ఆనాటి రాజకీయ పరిస్థితులన్నీ మాట్లాడారు. మధ్యలో వ్యంగ్యం, హాస్యం ఎన్నేన్నో.

* * *

ఒకసారి మండలి కృష్ణారావుగారి జన్మదిన వేడుకలకు అప్పటి గవర్నరు ఓబుల్‌రెడ్డిగారూ, ముఖ్యమంత్రి వెంగళరావుగారూ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ జగన్మోహానరెడ్డిగారూ, అక్కినేని నాగేశ్వరరావు గారూ మొదలైన పెద్దలంతా హాజరైనారు. ఆ సభలో విశ్వనాథవారు మాట్లాడుతూ ఇలా అన్నారు.
“ఈ సభ చాలా బాగా జరుగుతోంది. ఇటువంటి సభనే నెప్పుడూ ఏర్పాటు చెయ్యలేదు, నాకెవ్వరూ ఏర్పాటు చెయ్యలేదు”.
అది విని అందరూ నవ్వుకున్నారు.

* * *

ఒకసారి ఒక సభలో సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు విశ్వనాథను పుష్పమాలతో సత్కరించినప్పుడు, ఆయన ఇలా చమత్కరించారు.
“గుమ్మడిగారు గుమ్మడికాయ నిస్తారనుకున్నాను గాని, పూలమాలతో సరిపెట్టారేమిటి?”
సభనిండా నవ్వులు!

* * *

జ్ఞాన పీఠ అవార్డు వచ్చిన తర్వాత విలేఖరులు వచ్చి అడిగారు.
“మీరు సినిమా పాటలెందుకు రాయకూడదు?”
విశ్వనాథ వారి జవాబు ఇది.
“ఇప్పుడు నేను పీట మీద (అంటే జ్ఞాన పీఠం) ఉన్నానుగా, ఇంక పాట ఎందుకూ?”

* * *

ఇలాంటి సరదా సంభాషణలు, చెణుకులు ఇంకా ఉన్నాయి ఈ పుస్తకంలో. “విశ్వనాథ వారి ముద్దువడ్డన్లు-5” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

ముద్దు వడ్డన్లు 5 On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: