పరిచయం (నండూరి రామమోహనరావు గారు 1964లో వేలుపిళ్ళై కథలకు)

వేలుపిళ్లై On Kinige

సి. రామచంద్రరావుగారి కథలంటే నాకు చాలా ఇష్టం. అవి ఇంకా చాలామందికి ఇష్టం కావడానికి కనీసం ఒక శతాంశమైనా నేను కారణం కావడం నా కిప్పటికీ సంతోషం కలిగిస్తుంది.

రామచంద్రరావుగారిని చూస్తే కథలు రాసేవాడిలా, అందులోనూ తెలుగులో రాసేవాడిలా కనిపించరు. తెలుగు కథలు రాసేవారి కొక ప్రత్యేకమైన తరహా వుంటుందని నా ఉద్దేశం కాదు. అయినా, రామచంద్రరావుగారిలో కథా రచయితను చటుక్కున పోల్చుకోవడం కష్టం. తెలుగును, ఇంగ్లీషును కూడా ఇగ్లీషు యాసతో మాట్లాడే ఆయనను టెన్నిస్ ప్లేయరనో, ఏ టీ, కాఫీ ఎస్టేట్ల మేనేజరనో పరిచయం చేస్తే తేలిగ్గా నమ్మవచ్చు. నిజానికి ఆయన ఈ రెండూ కావడమే కాక, కథా రచయిత కూడా కావడం ఒక విశేషం.

ఈ కథలలో స్థలం తెలుగుదేశం కాదు; పాత్రలు, వాతావరణం తెలుగువికావు. అందుచేత వీటిలో తెలుగుదనం లోపించిందంటే నేనేమీ చెప్పలేను – తెలుగు వాతావరణం వుండటమే తెలుగు కథలకు గొప్పదనం కాదని తప్ప. ఈ కథావస్తువులన్నీ రచయిత తనకు తెలిసిన, పరిచితమైన జీవితంలో నుంచి ఏరుకుని, పరిశీలించి, భావనచేసి రాసినవే. అందుచేత, వీటిలో ఒక నిజాయితీ, ఒక వాస్తవికత వున్నాయి. కనుకనే, అవి సజీవంగా కదులుతున్నట్టు వుంటాయి; మనల్ని కదలిస్తాయి. ఈ గుణ విశేషం, వల్ల అవి నిస్సందేహంగా గొప్ప కథలే. అవి రాసినవాడు తెలుగువాడు కావడం మరొక విశేషం.

ఈ సంపుటిలో అన్నిటిలోకి నాకు నచ్చిన కథ ఏదంటే త్వరగా చెప్పలేను. అన్నీ అన్ని రకాలు; దేని వైచిత్రి దానిదే. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా మానవ స్వభావేన్మీలనం చేయడంవల్ల ఈ కథల వైవిధ్యం పఠితలను ఎంతైనా ఆకర్షిస్తుంది. అయినా నిగ్గతీసి అడిగితే, ఈ సంపుటిలోని రెండవ కథను, దానికంటే ముందుగా మొదటి కథను పేర్కొంటాను. మొదటికథ నాకు బాగా నచ్చడానికి కారణం వారపత్రిక పోటీలో మొదటి బహుమతి పొందినదని మాత్రమే కాదు. చదవండి, మీకే తెలుస్తుంది.

రామచంద్రరావుగారు తరుచుగా వ్రాయరు. ఒక కథకు, మరొక దానికి మధ్య చాలా వ్యవధి వుంటుంది. ఇవి మొదట్లో ఆంధ్ర వార పత్రికలో ప్రచురిత మవుతున్నప్పుడు మళ్ళీ ఆయన కథ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పాఠకులు పెక్కుమంది వుండేవారు. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు తోచినప్పుడు ఆయన కథ రాస్తారు. ఉద్యోగ విధులు అడ్డురావడం దీనికి ప్రధాన కారణం కాకపోవచ్చు. ఒకసారి అడిగితే ఆయన చెప్పినట్లు జ్ఞాపకం – మంచి కథావస్తువు దొరికేవరకు, దాని ఎత్తుగడనుంచి ముగింపు వరకు సంవిధానమంతా మనస్సులో స్పష్టంగా రూపు కట్టేవరకు తాను కథ రాయలేనని. ఇది నిజం కావచ్చు. కనుకనే, ఈ కథలలో ఇంత మంచి శిల్పం, వైవిధ్యం సాధించారేమో ననిపిస్తుంది. ఏమైనా, ఈ సంపుటిలోని కథలన్నీ నాలుగైదేళ్ళ క్రిందట రాసినవే. ఆ తరువాత ఆయన కథ రాసినట్టు నాకు జ్ఞాపకం లేదు.

ఎందుకు రాయడం లేదు సి.రా.రావు గారూ?

-నండూరి రామమోహనరావు

విజయవాడ,

14-12-64

వేలుపిళ్లై On Kinige

 

This eBook is now available on Kinige @ http://kinige.com/kbook.php?id=142

Related Posts:

One thought on “పరిచయం (నండూరి రామమోహనరావు గారు 1964లో వేలుపిళ్ళై కథలకు)

  1. Pingback: పుస్తకం » Blog Archive » వేలుపిళ్ళై కథలు ఎందుకు చదవాలి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>