అదివో… అల్లదివో….

ఎం. వెంకటేశ్వరరావు రాసిన 25 కథల సంకలనం “అదివో…అల్లదివో…“. మధ్యతరగతి మనస్తత్త్వాలకు అద్దం పట్టిన కథలివి. ఆశలు, కోరికలు, ఆశయాలు, ఊహలు, వాస్తవాలు, మధుర స్మృతులు, బాధాజ్ఞాపకాలు…. ఇలా మధ్యతరగతి జీవితాలని అలవోకగా వ్యక్తీకరించిన కథలివి.

కుటుంబాలు ఎలా ఛిద్రమవుతున్నాయో, ఆర్ధిక విలువలు మానవత్వాన్ని ఎలా శాసిస్తున్నాయో చెప్పే కథలు చాలానే వచ్చినా, ఇందులోని కథలకు ఇతివృత్తం చాలా వరకు అదే అయినా, కథనం నూతనంగా ఉంది. ముగింపు వాస్తవికంగా ఉంది.

అమెరికాకి ఎగిరిపోయిన కొడుకుల స్వార్ధం లేదా భార్యల మాటల జవదాటలేని అసమర్ధ భర్తలు…. మౌనంగా బాధలు సహించే అత్తమామలు ఇలాంటి పాత్రలెన్నో ఇతర కథల్లో తారసపడతాయి. అయితే, ఈ సంపుటంలోని కథలలో బాంధవ్యాలని స్వార్థపూరితం చేసిన మనుషులకు అంతే ధీటుగా సమాధానం చెప్పే పాత్రలు తారసపడతాయి. చదువరుల మెప్పు పొందుతాయి.

తమ ముందు తరం ప్రతినిధులైన పెద్దలకూ నచ్చజెప్పలేక, తమ తర్వాతి తరమైన తమ పిల్లలకు సుద్దులు చెప్పలేక సతమతమయ్యే కుటుంబీకులెందరో ఉన్నారు. అందుకే ఈ పుస్తకంలోని కథలు వర్తమాన సమాజాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పచ్చు.

ఉద్యోగ విరమణ చేసి ఇంట్లో ఖాళీగా ఉంటూ అనవసరంగా డబ్బులు వృధా చేసే ఓ తండ్రికి కొడుకు కోడలు పడుతున్న అవస్థలు ఎలా అర్థమవుతాయి? కాలికి చిన్న దెబ్బతగిలితేనే, అవసరం ఉన్నా లేకపోయినా ఎక్స్ రే తీయించుకోవాలనుకున్న ఆ వ్యక్తి తన అమెరికా ప్రయాణాన్ని ఎందుకు మానుకున్నాడు? ఆపరేషన్ చేసినా బ్రతుకుతాడో లేదో తెలియని యువకుడికి సాయం చేయాలని అతనికి ఎందుకు అనిపించింది? ఇలాంటి సంఘటనలు మధ్యతరగతి జీవితాల్లోనే సాధ్యమవుతాయి. అందుకే ఈ కథలు చదువుతుంటే మన కథలు అనిపిస్తాయి.

చాలా కథల్లో మనుషుల్లోని లోపాలను ఎత్తి చూపినా అవే కథల్లో వాటిని ఎలా సరిదిద్దుకోవచ్చో ఆయా పాత్రల ద్వారా చెప్పిస్తారు రచయిత.

తన పైఅధికారి తన పై అకారణంగా ద్వేషం పెంచుకుంటున్నందుకు బాధపడిన ఓ ఉద్యోగి, ఛిన్నాభిన్నమైన జీవితాన్ని పునర్నించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళ కూతురి పట్ల తాను కూడా అకారణంగా ద్వేషం పెంచుకుని ఆ పిల్లని అసహ్యించుకున్నట్లు గ్రహించగానే, తన తప్పు దిద్దుకుంటాడు. తనకెదురవుతున్న బాధ తన ద్వారా మరొకరు అనుభవించకూడదన్న జీవిత సత్యాన్ని అతను పాటించగలిగాడు.

విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉండాల్సిన పవిత్రబంధం సడలిపోతున్న తీరు, సమాజంలో వెర్రితలలు పోతున్న ఆధునిక పోకడలను కొన్ని కథలలో అద్బుతంగా వ్యక్తం చేసారు రచయిత. సంఘం ఇలా మారడంలో మన ప్రమేయం ఎంతవరకు అని పాఠకులు ప్రశ్నించుకోక మానరు.

ఈ సంపుటంలో చోటు చేసుకున్న రెండు రైతు కథలు కర్షక సోదరుల కష్టాలను, మౌన ఆక్రందనలను ఎలుగెత్తి చాటాయి. వ్యవస్థలో లోపమెక్కడా అని ఆలోచనలోకి దింపుతాయి. అన్నదాత వ్యథలెలా తీరుతాయోనని కించిత్ దిగులు కూడా కలుగుతుంది.

చివరగా, ఈ సంపుటానికి శీర్షిక అయిన “అదివో… అల్లదివో..” కథ గురించి చెప్పుకోవాలి. తిరుమల వెళ్ళాలంటే ఇప్పుడు సామాన్యలు ఎందుకు విముఖత చూపిస్తున్నారో ఈ కథ చదివితే అర్థం అవుతుంది. ఎన్ని అవకతవకలున్నా, ఇబ్బందులు పడుతున్నా, జనాలు ఇంకా ప్రతీ రోజు వేల సంఖ్యలో తిరుమల ఎందుకు వస్తున్నారో కూడా అర్థమవుతుంది.

మనుషుల్లోని నెగటివ్ లక్షణాలని ప్రస్తావించిన పాజిటివ్ కథలు ఇవి.

“అదివో…అల్లదివో…” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

అదివో… అల్లదివో! On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>