ఇవి యానాం కథలు. వంతెన అవతల 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి తారాజువ్వలు ఆకాశంలో వెలుగులు జిమ్ముతుంటే వంతెన ఇవతల చీకట్లో మూగగా నిలబడిపోయిన ఫ్రెంచి వలసలోని తెలుగు ప్రజలు… నోరొచ్చి ఇన్నాళ్ళకు చెప్పుకున్న కతలు. సాహిత్యం కూడా చరిత్ర ఖజానానే అనుకుంటే… దాట్ల దేవదానం రాజు ‘యానాం కథలు’ చారిత్రక గనేనని చెప్పాలి. చరిత్ర రచనలో చిక్కటి భావుకత్వం కలగలిస్తేనే ఇలాంటి కథలు తయారవుతాయనిపిస్తుంది.
ఫ్రెంచి వలసల్లో బతుకు సాపేక్షంగా బ్రిటిష్ వలసలకన్నా మెరుగేననేది ఈ సంపుటిలోని 18 కథలు చదివాక అర్థమయ్యే విషయం. దోపిడీ లేదని కాదు గానీ, స్థానిక సంస్కృతులు, సంస్కారంపై చిన్నచూపు లేదని కాదు గానీ, యానాం జనజీవనంలోని వైవిధ్యాన్ని మాత్రం చెదరగొట్టలేదు ఫ్రెంచి దొరలు. ప్రపంచంలోనే గొప్ప పౌర సమాజానికి ప్రతినిధులమన్న అభిజాత్యం వారి పాలనలోనూ, వ్యవహార, వ్యక్తీకరణల్లోనూ కనిపిస్తుంది. మనసుపడిన యువకుడితో గడిపేందుకు తన భార్యను అనుమతించిన పాల్ షెల్జ్లో (కథోర్జియ్) కనిపించేది ఈ అభిజాత్యమే. ప్రేమించిన కామాక్షి కోసం యానాంలోనే ఉండిపోవాలని రొబేర్ నిర్ణయించుకోవడం (లా’మూర్’) అలాంటి వ్యక్తీకరణే. తోటి బ్రిటిష్, డచ్ అధికారుల సాంగత్యంతో పొగరుగా వ్యవహరించిన ఒకరిద్దరు పౌర అధికారులు మినహాయిస్తే, చాలావరకు యానాంతో ఏదో ఒక సంబంధంలోకి వచ్చినవారే.
ఈ మినహాయింపు యానాంలోని బ్రాహ్మణ కులానికీ వర్తిస్తుంది. ఫ్రెంచి పాలన పట్ల పట్టింపుతోనూ, వంతెన అవతలి బ్రిటిష్ వలస పాలనలోని ఎదుర్లంకలో రెక్క విప్పిన ఆధునికత, జాతీయోద్యమం పట్ల మమేకతతోనూ ఉన్న కులమది. దొర బంగ్లాపై జెండా ఎగరేసిన బాపన్న, జంధ్యం తెంపిన దొరపై తిరుగుబాటు లేవదీసిన వెంకటయ్య (తీర్పు వెనుక), ఆధునిక విద్యలు నేర్చుకుని బతుకును మెరుగుపరుచుకున్న రామశాస్త్రి (మండువా లోగిలి)… ఈ ప్రభావాలకు ప్రతినిధులే.
తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఈ కథలకు గొప్ప ప్రాసంగికత ఉండడం మరో ప్రత్యేకత. తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉండడం తప్పా అనేది ప్రాంతీయవాదుల ప్రశ్న. కానీ, అలా జరిగితే రెండు కాదు, మూడు ప్రాదేశిక సరిహద్దుల్లో తెలుగు ప్రజలు జీవించాల్సి ఉంటుంది. ఎందుకంటే, గత అరవై ఏళ్ళుగా యానాం విడిగానే ఉంది. అలా ఉండడం ద్వారానే సాంస్కృతికంగా, సామాజికంగా, చారిత్రకంగా తమ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను కాపాడుకోగలమని మెజారిటీ యానాం ప్రజలు భావిస్తున్నారు. నాలుగు కూడళ్ళ మధ్య నిలబడి ఈనాడు తెలంగాణ కోరుతున్నదీ ఇదే కదా!
– వి. అరవింద్
ఆదివారం అనుబంధం, ఆంధ్రజ్యోతి దినపత్రిక, 24 మార్చి 2013
* * *
“యానాం కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ చూడండి.