మిధ్యావాదనల మీద మెరుపు దాడి – “అవుటాఫ్ క‌వ‌రేజ్ ఏరియా” పుస్తకంపై సమీక్ష

వలస పాలనాకాల౦లో అగ్రహారాల్లో ఉన్న బడుల్లో మనువాద కావ్యాలనే బోధించేవాళ్ళనీ,ఏవో కూడికలు,గుణకారాలు తప్ప ఇతర ప్రకృతి సాంఘిక శాస్తాలేవి బోధించలేదని మద్రాసు గవర్నర్ జనరల్ మన్రో తయారుచేసిన అధికారిక నివేదిక తెలుపుతోంది. సాహిత్యమే ఒక సంపూర్ణ జ్ఞాన వ్యవస్థ అని నమ్మిన ద్విజవర్గం దాన్ని సంస్కరించడానికీ , సమానంగా పంపిణీ చేయడానికి నిరాకరింరారు. వలసాధునిక విలువల చైతన్యంతో పునరుజ్జీవన ఉద్యమం మొదలైంది.అదే భూసురుల సంఘసంస్కరోద్యమ౦ అయింది. అన్ని సాహిత్య ఉద్యమాలూ నిచ్చెన మెట్లు అంతర్వుల సామాజిక వ్యవస్థను పరిరక్షించే ప్రయత్నం చేశాయి.అభ్యుదయ,దిగంబర,పైగంబర,విప్లవ, స్త్రీవాద,తెలంగాణ వాద సాహిత్య ఉద్యమాలన్నీ కుల వాస్తవికతను నిరాకరించటమో లేదా గుర్తించి విస్మరించటమో చేశాయి కాని దళితవాదం, ముస్లింవాదం మాత్రం కులవ్యవస్థకు మూలమైన బ్రాహ్మణవాద భావజాలం మీద అవిరామ పోరాటం చేస్తూనే ఉన్నాయి. దళిత కధ నిజమైన జీవితాన్ని చిత్రించింది.మాదిగ కధ సమాజ చలన సూత్రాన్ని వివరించింది.సామాజిక వాన్తవికతలోని సంబావ్యతలను దళిత కథ చిత్రికపడితే,మాదిగ కధ కుల వాస్తవికతలను సూటిగా నిర్మించింది.అందుకే కుల వాస్తవికతను నగ్నంగా ప్రదర్శించే కథారూపం కూడా ఎలాంటి ఆభరణాలు లేకుండా నిరాడంబరంగా నిలబడి పకపకా నవ్వుతుంది.డాక్టర్ పసునూరి రవీందర్ రాసిన ఈ కధలు అగ్రకుల పాఠకులను చికాకు పెడతాయి,ఆగ్రహం తెప్పిస్తాయి. అగ్రవర్ణ పాఠకులకు కోపం తెప్పించేలా,వారిలో మార్పు తెచ్చేలా కధలు రాసేవాడే నిజమైన కథకుడు.

దళిత రాజకీయాల సంక్షోభ సమయమిది. హిందూత్వ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సందర్భమిది. మానవ హనన రాజకీయాలకు సంపూర్ణ అధికారం దక్కిన విషాద సందర్బంలో ప్రచురిస్తున్న కథలవి. వేల సంవత్సరాలుగా దళితులను అస్పృశ్యులను చేసి,పరాధీనులను చేసి పాలిస్తున్న మనువాదానికి అనేక తలలున్నాయి.పెద్ద తల కాంగ్రెస్,చిన్నతల బీజేపీ. ఆ మనువాదానికి ప్రాదేశిక ముఖాలు చాలా ఉన్నాయి.వాటిలో ఒక ముఖం ఆంధ్రప్రదేశ్ ను పాలిస్తుంది, మరో ముఖం తెలంగాణను పాలిస్తుంది. దళిత రాజకీయాలను భూస్థాపితం చేసేందుకు బహెన్‌జీ మాయావతికి వ్యతిరేక౦గా ఈ అన్ని తలలూ అన్ని ముఖాలూ ఏకమయ్యాయి. తలలు వేరైనా, ముఖాలు ఎన్నైనా ఆత్మ మాత్రం ఒక్కటే.

మనువు వారసులకు,జాంబవంతుడి వారసులకూ మధ్య జరుగుతున్న సంగ్రామమే ఈ దేశ చరిత్ర అంటాడు విశారదన్.జాంబవంతుడి వారసుడిగా యుధ్ధనాదాన్ని వినిపిస్తున్నాడు డాక్టర్ పసునూరి రవీందర్. సాహితీ రంగంలో దళితుల కర్తవ్యం ఎలా ఉండాలన్న విషయం మీద సైధ్ధాంతిక చర్చలేవీ ఇప్పటివరకు జరగలేదు కాని దళిత రచయితలు మాత్రం సాహితీ క్షేత్రంలో చురుకైన పాత్రను పోషిస్తున్నారని ఈ కధలు నిరూపిస్తున్నాయి.ఈ కధలు ప్రపంచీకరణానంతర సాంఘిక జీవితాన్ని మన కళ్ళముందు పెడుతాయి. కులం ఒక పురాతన జ్ఞాపకమని దాన్ని అందరూ ఎప్పడో మరిచిపోయారని చాలామంది అగ్రవర్ణ పాఠకుల అభిప్రాయం.కులభావన ఆధునిక సమాజంలో ఎలాంటి ప్రాసంగికత లేని విషయమని,వివాహ నందర్భంలో తప్ప కులానికి ఎటువంటి విలువా సంఘ జీవితంలో లేదని ఆండ్రీబేతేయల్ లాంటి  సోషియాలజిస్టులు రాసేశారు. కులానికి ఆధునిక సమాజంలో ఎలాంటి ప్రాసంగితా లేదని వాదించిన ఆండ్రీ బేతేయిల్ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినప్పుడు 2004లో బహిరంగంగా వ్యతిరేకించాడు.

పట్టణీకరణలో భాగంగా వెలిసిన అనేక ప్రభుత్వ, ప్రవేటు సంస్థలు వ్యాపార వాణిజ్యకేంద్రాలకు కుల౦ పట్టింపు ఉ౦డదని ఈ సోషియాలజిస్టుల భావన.ధనిక. పేద తారతమ్యమే తప్ప కుల భేదాలకు అస్కారం లేదనీ, అ రకంగా కులం సంఘ జీవిత౦ ను౦చి కనుమరుగై పోయిందని అగ్రవర్ణ వాదన.ప్రపంచీకరణ జరిగిన తర్వాత కులం మరింత బలహీనసడిందని మరో వాదన . శాస్త్ర ,సాంకేతిక అభివృధ్ది ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్ రంగంలో వచ్చిన అభివృధ్ది ప్రజల ఆలోచనల్లో మార్పు తెచ్చిందన్నది వాళ్ల పిడివాదం.కాని రవీందర్ కధలు అగ్రకుల వాదనలేవీ పసలేవని నిరూపిస్తున్నాయి. ఆధునికతను పుణికి పుచ్చుకున్న అగ్రవర్ణాలు మరింత శక్తివంతులయ్యారు.శాస్త్ర ,సాంకేతిక వికాసం వలన బ్రాహ్మణ బనియాలు మునుసెన్నడూ లేని రీతిలో బిలియనీర్లయ్యారు.దళితులు , శూద్రులు, ఆదివాసులు, ధర్మపరివర్తిత మైనారిటిలు కేవలం ఆధునికతకూ దాని సాంకేతికతకూ కేవలం వినియోగదార్లుమాత్రమే అయ్యారు. ఆధునిక యజమాని అగ్రకులస్తుడు- దాని భాధితుడు బహుజనుడు.

కంప్యూటర్ హవా ముగిసింది.ఇప్పుడంతా రియల్ఎస్టేట్ హవా నడుస్తుంది . గేటెడ్ కమ్యూనిటీలన్నీ అగ్రవర్ణ గేరీలయ్యాయి.అత్యాధునిక అపార్ట్‌మెంట్ బిజినెస్ దళితులకు ఒక్క ఫ్లాటు అమ్మడం లేదు . రియల్ఎస్టేట్ వెంచర్లు దళితులకు ప్రవేశం లేదంటున్నాయి. ‘గోవర్ణం’కథలో రియల్ఎస్టేట్ నిజస్వభావాన్ని చూపించింది.దళిత ఉద్యమకారుల వైఫల్యాలను ‘ఊగి,ఊగి… ఉయ్యాల’చూపిస్తుంది. ‘మేరా నెంబర్ కబ్ అయేగా…?’ కథ పల్లెసీమలను పట్టిపీడిస్తున్నకులాధిపత్యాన్ని ప్రతిఫలిస్తుంది.ఆధునిక కులరాజ్యం (మోడర్న్ క్యాస్ట్‌స్టేట్) దళితులను సామూహిక నరమేధం చేస్తుంది. ఈ సామూహిక హనన క్రియకోసం ఆది కొత్త ఆయుధాలను ఉపయోగిస్తుంది. తాగుడుకు బానిసను చేసిదళితులను చంపేస్తుంది.ఈ హత్యాకాండకు ‘సంపుడు పంజెం’ కథ సాక్ష్యం,కంప్యూటర్, క్యాస్టు రెండూ కలిసి జ్ఞానాన్ని కూడా వెక్కిరిస్తున్నాయని ‘జాగీర్’కధ వివరిస్తుంది. ఒక్కటేమిటి ఈ సంకలనంలోని ప్రతికథ ఆమూల్యమైనది.

తెలంగాణ ఉద్యమంలో ఒళ్ళు తెలియని పూనకంతో వూగిపోతున్న కాలంలోనే ఈ కధలన్నీ రాశాడు .భౌతిక పరిస్థితులను మార్చినంత మాత్రాన సమాజం లోని మానవ జీవితం మారదనీ,వాళ్ళ ఆలోచనా ప్రపందాన్ని మార్చటం వల్లేసంఘ పరివర్తన తీసుకురావచ్చనే అంబేద్కర్ అవగాహనకు పసునూరి రవీందర్ కధలు ఉపకరిస్తాయి.జీవితానికి,రచనలకూ మధ్య వైరుద్యంలేని కథకుడితడు.అనేక కధల్లోని ప్రొటొగానిష్టు ఆతడే.కానీ అన్ని కధల్లోని అంటగానిష్టుమాత్రం క్యాస్ట్ సిస్టమ్.

-డాక్టర్ జిలుకర శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి-వివిధ, 10-11-2014.

10_11_2014_006_008

అవుటాఫ్ క‌వ‌రేజ్ ఏరియాడిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.  మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

అవుటాఫ్ క‌వ‌రేజ్ ఏరియా on kinige

 

OutofCoverageArea600

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>