తిరిగిరాని జీవనం – “కొల్లేటి జాడలు” పుస్తకంపై సమీక్ష

ఎవరయినా తమ చిన్న నాటి జీవితం గురించి ఎందుకు రాసుకుంటారు? ఎందుకు పాత జ్ఞాపకాలను కలబోసుకుంటారు? మక్సీమ్ గోర్కీ, అలివర్ గోల్డ్ స్మిత్, ఆర్కె నారాయణ్ తదితర ప్రపంచ ప్రసిద్ధ రచయితలు కీర్తి శిఖరాలను అధిరోహించిన  తర్వాత కూడా మళ్లీ వెనక్కు ఎందుకు తొంగిచూశారు? తాము ఎప్పుడో అధిగమించిన బాల్యాన్ని మళ్లీ ఎందుకు గుర్తు చేసుకున్నారు? అసలుకు… జనం ఎందుకు తమ పూర్వ జీవితాలను గుర్తు చేసుకుంటారు? వీటికి సమాధానం చెప్పడం ఎంత సులభమో.. అంత కష్టం కూడా. క్లుప్తంగా చెప్పాలంటే బాల్యం అనేది మనం మళ్లీ మళ్లీ వినాలనుకునే మధుర గీతం.

ఏ వర్గ జీవితం గడుపుతున్నా, ఏ ఆర్థిక స్థితిలో ఉన్నా తల్లిదండ్రుల ఆలనా పాలనలో మనిషి గడిపే భద్రజీవితం బాల్యం. అందుకే మనిషి ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా.. తమ చిన్ననాడు కుటుంబం కలిగించిన భద్రతను దానివెనుక ఉన్న జీవన సమతుల్యాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. కాని మన కళ్లముందే మనకు ఆనందం కలిగించిన ఆ మధురమైన ఊహలు చెదిరిపోతే… ఉమ్మడి కుటుంబ జీవితంతో పాటు ఒక ప్రాంత జీవితాన్ని చిరకాలం నిర్దేశించిన సమాజం, దాని జీవన వ్యవస్థ కరిగి, ఆవిరైపోతే… మనిషి తనకు తాను చేసుకుంటున్న విధ్వంసం మన పునాదులనే, మధుర జ్ఞాపకాలనే ఉన్నఫళాన పెకిలించి వేస్తుంటే.. ఆ జీవుడి వేదన ఎలా ఉంటుందో.. విషాదంగా, దయనీయంగా చిత్రించిన అరుదైన నవల ‘కొల్లేటి జాడలు
తెలుగు పాఠకలోకానికి సుపరిచితులైన అక్కినేని కుటుంబరావు చిత్రించిన బాల్య స్మృతులే ‘కొల్లేటి జాడలు‘. తన బాల్య జీవితాన్ని ఆనందంతో, కమ్మటి జ్ఞాపకాలతో నింపిన ఒక మంచి నీటి సరస్సును ఒకే ఒక్క తరం.. ధ్వంసం చేసిన తీరును, ఒక సామాజిక విషాదాన్ని భయానక స్వరంతో ఆయన ఈ పుస్తకంలో పొందుపర్చారు. తన కళ్లముందే ఆసియా ఖండపు అతి పెద్ద మంచినీటి సరస్సు సమూలంగా నాశనమైపోయిన తీరు పట్ల రచయిత విలాపమే ‘కొల్లేటి జాడలు‘. ఈ కోణంలో చూస్తే ఇది ఒక వ్యక్తి ఎప్పటికీ తిరిగి రాని బాల్యం గురించి రాసుకున్న కథ మాత్రమే కాదు. ఒక సమాజం చేజేతులా నాశనం  చేసుకున్న తిరిగిరాని జీవనం గురించిన మ్రోగించిన ప్రమాద ఘంటిక.
జీవితంలో డబ్బుకు కాకుండా అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ఉండిన రోజుల్లో కొల్లేరు ఒక మంచి నీటి సరస్సుగానే కాకుండా తనను నమ్ముకున్న వారందరికీ నిలకడైన, సరళంగా సాగిపోయిన స్థిర జీవితాన్ని అందించింది. మంచినీటి సరస్సులో పుష్కలంగా దొరికే చేపలను పట్టి బతికే జీవితంలో ఉన్న సరళత్వాన్ని ఈ నవల ఎంతో సహజంగా చిత్రించింది. అదే సమయంలో పెట్టుబడి సహస్ర రూపాల్లో ప్రవేశించి చేపలను, రొయ్యలను పెంచి, ఒక అద్భుత సరస్సును మురికినీటి కయ్యలుగా మార్చిన క్రమంలో… ఒక తరం జీవితంలో, ఒక సమాజ గమనంలో ప్రవేశించిన విధ్వంసాన్ని కూడా ఈ నవల పట్టి చూపింది. పక్క ఊళ్లకు పోయి చేపలమ్ముకుని బతికిన జీవితంలో భారీ పెట్టుబడి ప్రవేశించి దూరప్రాంతాలకు చేపల ఎగుమతిని ప్రారంభించిన జీవితం మొదలైన క్రమంలో అక్కడి ప్రజలు, సమాజం, వారనుభవించిన ఉమ్మడి సంస్కృతి ఎలా కళ్లముందే ఆవిరవుతూ వచ్చిందో కొల్లేటి జాడలు కళ్లకు కట్టేలా చూపింది.
ఈ నవల తనకు తానుగా, ఆనందం నుంచి విషాదం వరకు పయనించిన ఒక స్థల పురాణం. రచయిత అరవయ్యేళ్ల క్రితం మిగిల్చుకున్న కొల్లేటి బాల్య జ్ఞాపకాలను అక్షరం అక్షరంలా మలిచి ఒక సమాజ విధ్వంసాన్ని పాఠకులకు, తన ప్రాతం ప్రజలకు చూపించడానికి చేసిన ప్రయత్నమే కొల్లేటి జాడలు. వాళ్ల తప్పు వాళ్లకు తెలిసింది గాని చాలా ఆలస్యంగా తెలిసింది అంటూ కొల్లేటి ప్రాంత ప్రజల కనువిప్పును రచయిత పట్టుకున్న తీరు అక్కడ ఒక దశాబ్ద కాలంలో జరిగిన దుష్పరిణామాలను పట్టి చూపించింది.
కొల్లేరు అంటే ఒకప్పుడు ప్రకృతి, స్థానిక సమాజం ఒద్దికగా, సామరస్యంగా, సరళాతిసరళంగా సాగిన ప్రశాంత జీవితం. ఆ సరస్సు తీరం వెంబడి ఉన్న గ్రామాలు, మనుషులూ, గొడ్డూగోదా, పనిపాటలూ, వంటలు, తిండి, సంబరాలు, వినోదాలు, శ్రమ, అలవాట్లు, ఆచారాలు వంటి వన్నీ అక్కడ దొరికే చేపల చుట్టూ, పండే పంటల చుట్టూనే కాకుండా, ప్రకృతికి, మనిషికి మధ్య సహజ సంబంధానికి గుర్తుగా తారాడుతూ వచ్చాయి. ప్రకృతితో ఈ మానవీయ సంబంధాన్ని కొల్లేటి జాడలు అత్యంత మనోహరంగా చూపించింది. తరాలుగా దోనెలో కూచుని తిరిగిన జీవితాన్ని అక్కడిప్పుడు డబ్బు కమ్మేసింది. మామూలుగా కాదు.. ఒక జీవావరణ, జీవన, పాలనాపరమైన విషాదం అక్కడిప్పుడు తాండవిస్తోంది.
ఇప్పుడు కొల్లేటిని మనం రచయిత చూపుతున్న కొత్త దృష్టితోనే చూడాలి. ఆ ప్రాంతంలోని రెండు మూడు మధ్యతరగతి రైతు కుటుంబాల చుట్టూ తిరిగిన ఈ నవల, 60 సంవత్సరాల క్రితం జీవితంతో పోలిస్తే కొల్లేటికి ఇప్పుడు జరిగిన సామూహిక మానభంగం ఎంత హేయమైందో యావత్ సమాజానికి చూపిస్తూ ఒక సామూహిక భయాన్ని, తీవ్ర హెచ్చరికను చేస్తోంది. చిన్నతనంలో తమందరినీ సాకిన ఒక అద్భుతమైన నీటి సరస్సు ముక్కలై, విధ్వంసమై, మాఫియా చేతుల్లో చేపల చెరువులుగా మరణిస్తున్న దృశ్యం రచయితనే కాదు. పాత్రలనే కాదు, చదువుతున్న పాఠకులను కూడా కలకాలం వెంటాడుతుంది. ఆనాటి మంచి నీటి సరస్సు జాడల వెంట రచయిత జ్ఞాపకాల పడవ ప్రయాణమే కథ. ఇది కథ కంటే జీవితం. కాల్పనిక పాత్రలు కాకుండా కొల్లేటి ప్రాంత ప్రజలు సామూహికంగా తమను వ్యక్తం చేసుకున్న స్వీయ గాథ ఇది.
కమ్యూనిస్టు ఉద్యమాల ప్రేరణతో అక్కడ అయిదు వందల ఎకరాలలో సమిష్టి వ్యవసాయం మొదలై అయిదేళ్లు బంగారం పండించి కరువు సమస్యను దూరం చేసుకున్న మంచి ప్రయోగం కూడా రాజకీయాలు,  స్వార్థం కారణంగా ఎలా కుప్పగూలిపోయిందో, చివరికి ఆ ప్రాంతం ప్రాంతమే చేపల చెరువులుగా మారిపోయి జీవితాన్నే ఎలా కంపు పట్టించాయో రచయిత చెబుతున్నంత వరకు కొల్లేరు విషాదం తెలీదు.
లక్ష ఎకరాల విస్తీర్ణం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా, కృష్ణా జిల్లాలో తక్కువగా పరుచుకున్న కొల్లేరు, ఆసియాలో అత్యంత ప్రాచీనమైన మంచినీటి సరస్సు. ప్రపంచ ప్రసిద్ధమైన పక్షుల ఆవాస కేంద్రం. ఒకప్పుడు లక్ష పెలికాన్ జాతి పక్షులకు ఆశ్రయమిచ్చిన పలస కేంద్రం. అలాంటిది రోజుకు కొల్లేరు తీరప్రాంతం నుంచి 500 లారీల చేపలు కలకత్తాకు ఎగుమతి అయ్యేంతగా అక్కడ జీవితం ఎదిగిపోయింది.
ప్రపంచంలో మరే దేశంలో అయినా ఇంతపెద్ద మంచి నీటి సరస్సు ఉంటే ఇంత అన్యాయంగా దీని ఊపిరి తీసేవారా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రశ్న లేవనెత్తడమే ఈ నవల విశిష్టత. తమ ప్రాంతాన్ని మళ్లీ పూర్వ వైభవంలోకి తీసుకుపోవాలని ఇప్పుడక్కడ వ్యక్తులు, సంస్థలూ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని కోరుకోవడం తప్ప కొల్లేరు గురించి ఇంకేమీ ఆలోచించలేం.

- ఆంధ్రప్రభ , 21 మార్చి 2014.

 

కొల్లేటి జాడలు”నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

కొల్లేటి జాడలు on kinige

 

KolletiJaadalu600

 

Related Posts: