సినిమాలు మనవీ – వాళ్లవీ

ప్రముఖ సత్యజిత్ రే రాసిన వ్యాసాల సంకలనం”Our Films – Their Films” అనే పుస్తకానికిది తెలుగు అనువాదం. వి.బి. సౌమ్య అనువాదం చేసారు.

ప్రపంచ సినిమా యవనికపై భారతీయ మువ్వన్నెల రంగులద్దిన తొలి దర్శకుడు సత్యజిత్ రే. మూస సినిమాలకు భిన్నంగా, వాస్తవికతే ప్రధాన మాధ్యమంగా భారతీయ సినిమాకి ఓ పరిభాషని ఏర్పరిచి, భావి తరాలకి దిశానిర్దేశనం చేసిన గొప్ప దర్శకుడు రే. అటువంటి దర్శకుడి దృష్టికోణం నుంచి సినీచరిత్రని చూసే అవకాశం – ఈ పుస్తకాన్ని చదవడం.

ఈ పుస్తకంలోని కొన్ని వ్యాసాల గురించి తెలుసుకుందాం.

మన చిత్రాలతో సమస్యలు” అనే వ్యాసంలో సినిమాకి కావల్సిన ముడిసరుకు జీవితమేనని; మన జీవితంలోని ప్రాథమిక విషయాలతో కూడిన కథావస్తువులపై దృష్టి సారించినప్పుడే మన సినిమాలు అంతర్జాతీయ స్థాయికి ఎదగగలుగుతాయని రే అంటారు.

బెనారస్ డైరీ” అనే వ్యాసంలో కాశీ పట్టణంలో సినిమా షూటింగ్ చేయడంలోని అనుభవాలను వివరించారు రే.

ఓ చిన్న రోడ్డుపై చాలా సేపు” అనే వ్యాసంలో ’పథేర్ పంచాలీ’ షూటింగ్ తీయడంలో వారు పడ్డ అవస్థలను వివరించారు. “ప్రతీ సినిమాకి అందరూ కష్టపడే పనిచేస్తారు. కానీ సెట్లోనో, కటింగ్ రూంలోనో, కొన్ని మార్పులు చేయాల్సివస్తుంది కూడా. ఇది మంచికా? చెడుకా? మన తృప్తి ముఖ్యమా?లేక మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించాలా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియదు” అని అంటారు రే. 1957లో ఈ వ్యాసం రాసినప్పటికీ, ఈ ప్రశ్నలు నేటికీ వర్తిస్తాయి.

ఒక బెంగాలీ దర్శకుడి సమస్యలు” అనే వ్యాసంలో బెంగాలీ దర్శకులకి ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించారు. బెంగాలీ సినిమా ఇప్పటి దాకా ఏమైనా సాధించిందంటే అది ఆయా వ్యక్తుల మేధావితనం వల్ల కానీ, సాంకేతిక సహాయం వల్లకాదని రే అంటారు. బెంగాలీ సినిమా మార్కెట్ బాగా చిన్నదని, 90% సినిమాలకి పెట్టుబడి కూడా వెనక్కి రాదని అంటారు.

సినిమాలు తీయడం” అనే వ్యాసం తనకి అందరిలా ఏదో ఒక సినిమా తీసేయాలన్న ఉద్దేశం లేదని, ఆఫ్ బీట్ సినిమాలనే తీయాలన్న అవగాహన ముందునుంచీ ఉందని రే చెబుతారు. పూర్తిగా నటనానుభవం లేని వారితో పనిచేయడం తనకి ఇష్టమని, కానీ అనుభవజ్ఞులలో కలిపి వారిని నటింపజేసి, వారి సాహచర్యంలో కొత్తవారు ఆత్మవిశ్వాసాన్ని పొందితే, వీరి సాహచర్యంలో అనుభవజ్ఞులు కూడా పాఠాలు నేర్చుకుంటుంటే చూడడం ఇష్టమని రే అంటారు.

మనకున్న సవాళ్ళు” అనే వ్యాసంలో కథని ఎంచుకోడం, తారాగణాన్ని ఎంపిక చేసుకోడం, బడ్జెట్ తయారు చేసుకోడం, లాంగ్ షాట్లు తీయడం, సెన్సార్ చేయించడం, షూటింగ్ చేయడం మొదలైన వాటి గురించి వివరించారు.

నా దర్శకత్వంలో కొన్ని కోణాలు” అనే వ్యాసంలో తాను కథకి, స్ర్కిప్టుకి అధిక ప్రాధాన్యతనిస్తానని చెబుతారు రే. నటీనటులకి కొన్ని సూచనలు చేసి, వాటి ఆధారంగా నటించమని చెబుతానని అంటారు. తన సినిమాల కళాదర్శకుల పాత్రని వివరిస్తారు. కెమెరామన్ పాత్ర గురించి చెబుతూ, తన చిత్రాలకు తానే ఛాయాగ్రహణం చేయడానికి ఇష్టపడతానని చెప్పారు. అలాగే ’తీన్ కన్యా’ సినిమా నుంచీ తానే సంగీత దర్శకత్వం ఎందుకు చేపట్టవలసివచ్చిందో చెబుతారు.

భారతీయ నవతరంగం” అనే వ్యాసంలో మన దేశంలో వేళ్ళూనుకుంటున్న న్యూవేవ్ చిత్రాల గురించి కొత్త దర్శకుల గురించి చెప్పారు.

కలకత్తాలో రెన్వా” అనే వ్యాసంలో సుప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు రెన్వా కలకత్తాకి వచ్చినప్పుడు రే ఆయనని కలవడం, ఆయన సినిమాల గురించి చర్చించడం గురించి చెప్పారు. రెన్వా సినిమా తీసే పద్దతులను ఈ వ్యాసంలో వివరించారు.

తను చూసిన ’బైసికిల్ థీవ్స్’, ’బిట్టర్ రైస్’, ’ఇల్ మూలినో దెల్ పో’, ’సొట్టో ఇల్ సొలా ది రోమా’, ’ఎ ప్రేమావెరా’ వంతి సినిమాలను, వాటి దర్శకులను ప్రస్తావించి వాటి బాగోగులను చర్చిస్తారు రే “నేను చూసిన ఇటాలియన్ సినిమాలు” అనే వ్యాసంలో.

హాలీవుడ్ నాడు – నేడు” అనే వ్యాసంలో హాలీవుడ్‌లో కాలానుగుణంగా వచ్చిన మార్పులను ప్రస్తావించారు రే.

బ్రిటీష్ సినిమాల గురించి” అనే వ్యాసంలో అప్పట్లో బ్రిటీష్ సినిమాలు ఎందుకు వెనకబడి ఉండేవో చెబుతూ, వాటిలోని లోటుపాట్లను చర్చించారు.

బయట మలయమారుతం, లోపల అగ్నిగుండం” అనే వ్యాసంలో జపాన్ దర్శకుల సినిమాల గురించి, వారు ఎంచుకునే కథల సార్వజనీనత గురించి చెబుతారు రే.

చార్లీ చాప్లిన్ తీసిన గోల్డ్ రష్ సినిమా గురించి, ఆయన ఆత్మకథ గురించి రే వేర్వేరు వ్యాసాలలో ప్రస్తావించారు.

ఇంకా అకిరో కురొసవా గురించి, టోక్యో, క్యోటో గురించి రాసారు.

అనేక చక్కని వ్యాసాలున్న ఈ పుస్తకం సినీ ప్రేమికులకి, ఔత్సాహికులకి ఓ మార్గదర్శి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

నవతరంగం ఫిల్మ్ స్టడీస్ వారు ప్రచురించిన ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

సినిమాలు మనవీ – వాళ్ళవీ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: