లక్షకు పైగా శ్లోకాలున్న సంస్కృత మహాభారతంలోని విశేషాంశాలను తీసుకుని, ముఖ్యమైన కథలూ, ఘటనలేవీ పొల్లుపోకుండా దాదాపు అయిదువందల పేజీలకు కుదించి, హేతువాద దృక్పథంతో ‘ఇదండీ మహాభారతం‘ గ్రంథాన్ని ఆవిష్కరించారు రంగనాయకమ్మ. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఆమె రాసిన ‘రామాయణ విషవృక్షం‘ అనేకానేక చర్చలకు కేంద్ర బిందువుగా నిలిచింది. తాజా పుస్తకానికి- ‘మొగ్గా పువ్వూలేని, కాయాపండూలేని, మోడు! మాయల, మంత్రాల, వ్యర్థాల, వైరుధ్యాల, వికృతాల, వికారాల, క్రూరత్వాల, అబద్ధాల, కట్టుకథల, పుక్కిటి పురాణాల పుట్ట!’ అనే విశేషణాలు తగిలించడాన్నిబట్టి- ఆమె ఎంత తీవ్ర పదజాలంతో, భావజాలంతో విశ్లేషించారో అర్థంచేసుకోవచ్చు. ప్రజల్ని సంస్కృతి పేరుతో బుట్టలో వేసుకునే మత గ్రంథాల్లోని నిజానిజాలను ప్రజలకు తెలిపితీరాలన్నదే తన లక్ష్యమనీ ఆ ప్రయత్నంలో భాగమే ఈ పుస్తకమనీ రచయిత్రి చెబుతున్నారు. కె.ఎం.గంగూలీ, కవిత్రయం, పురిపండా అప్పలస్వామి రాసిన గ్రంథాలను ఆధారంగా తీసుకున్నారు. భారతంలోని అనేక కథలూ, ఘటనలూ, పాత్రలూ, వాటి స్వభావాలూ, ప్రవర్తనలకు సంబంధించి పలు సందేహాలు లేవనెత్తి, ప్రశ్నలు సంధించారామె. అనుచితమైన వర్ణనల్నీ, ఆనాటి సామాజిక పరిస్థితుల్నీ తనదైన, పదునైన శైలిలో విమర్శించారు. చివరికి ఫలశృతినీ వదల్లేదు. మొత్తానికి ఈ పుస్తకం కొత్త ఆలోచనలు రేకెత్తించేదిగానే ఉంది.
- దత్తు,ఈనాడు-ఆదివారం,4-1-2015.
“ఇదండీ మహాభారతం” డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
ఇదండీ మహాభారతం on kinige