షాడో మధుబాబు గారి సన్మాన పత్రం

ప్రఖ్యాత నవలా రచయిత, “షాడో” సృష్టికర్త
శ్రీ షాడో మధుబాబు గారికి
పాలకొల్లు – గజల్ శ్రీనివాస్ కళాపరిషత్ అందిస్తున్న
సువర్ణాక్షర సుమహారం

పరమపావన కృష్ణవేణీ నదీతీరంలో తోట్లవల్లూరు గ్రామంలో సూర్యనారాయణరావు-భారవి దంపతుల పుణ్యఫలంగా జన్మించి తెలుగు సాహితీరంగంలో సరిక్రొత్త విప్లవాన్ని సృష్టించి ఛాయాకేతనాన్ని ఎగురవేసిన ప్రతిభాశాలురు మీరు!

తొలినాళ్లలో సంస్కృతానువాదాలు, మలినాళ్ళలో పద్య ప్రబంధాలు, నవలికలు, గల్పికలతో అలరారిన తెలుగు భాషా యోషకు అపరాధ పరిశోధనాత్మకంగా ఒక నీడ కల్పించారు మీరు. యువతరాన్ని ఉఱ్ఱూతలూగించారు.

పాశ్చాత్య సాహితీ ప్రక్రియను తెలుగుజాతికి అనుసంధానించి సర్ ఆర్ధర్ కానన్ డయల్ వేసిన ఆంగ్లపు మాటను తెలుగువారికి పరిచయం చేసి; అచ్చతెలుగు షెర్లాక్ హోమ్స్‌గా షాడోను తీర్చిదిద్దిన ఘనులు మీరు.

1973లో మొదలైన మీ షాడో ప్రస్థానం అప్రతిహతంగా 150 నవలలదాకా సాగింది.తెలుగు యువకుల హృదయాలలో మీ ‘షాడో’ ఏర్పరచుకున్న స్థానం అనితరసాధ్యం. ఆ తరం విద్యార్ధులలో మీ పుస్తకం చదవనివారు లేరంటే అతిశయోక్తి లేదు. మొత్తంగా 250 పైన రచనలు చేసి అన్ని రచనలు ప్రజా హృదయాలలోకి జొప్పించగలిగారు మీరు.

వృత్తిపరంగా ఉపాధ్యాయునిగా ఎంతోమంది విద్యార్ధుల భవితకు పునాదులు వేశారు మీరు. నూజివీడు రసం మామిడిపండు కోసం ప్రజలంతా ఎలా ఎదురుచూస్తారో అలాగే నూజివీడు నుంచి వచ్చే మీ పుస్తకాలకోసం ఎదురుతెన్నులు నిత్యం వుండేవి.

తరం తరం నిరంతరంగా చదివించే పుస్తక రచయితగా నిలచిన మీకు తరాల అంతరాలు మారినా నిలిచే రచనలను అందించిన శ్రీ పినిశెట్టి శ్రీరామమూర్తి పురస్కారాన్ని అందిస్తోంది మా డా|| గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్.
మా పట్టణ అధిష్టాన దేవత శ్రీ క్షీరారామ రామలింగేశ్వరుని ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్ళు పచ్చగా వెచ్చగా వుండాలని ఆశిస్తూ..

డా|| గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్

పాలకొల్లు
02-03-2014

***

మధుబాబు గారి పుస్తకాలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాలను తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.

మధుబాబు గారి పుస్తకాలు on Kinige

Related Posts: