మిత్రవాక్యం (“నాన్నగారి వ్యాసాలు” నుంచి)

గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్‌మీడియేట్‌ చదివిన రెండేళ్ళు (1943-45), సత్యమూ నేనూ సహాధ్యాయులం. మా ఇద్దరికీ సాహిత్యాభిలాష ఉండేది, మా ఇద్దరి ఆర్థికస్థితిగతులూ తుల్యం; ఆరోజుల్లోనే నేను ప్రౌఢంగా పద్యాలు రాసేవాణ్ణి. ‘ఏరా’ అంటే ‘ఏరా’ అని పిలుచుకొనేంత చనువు మా ఇద్దరిమధ్య ఏర్పడ్డది. తెలుగు అధ్యాపకులకు (పళ్ళె పూర్ణప్రజ్ఞాచార్యులు, పిల్లలమర్రి హనుమంతరావుగార్లు, మొ. వారికి) మేమంటే ఇష్టం. మరికొందరు సహాధ్యాయులతో కలిసి ”ఆంధ్రసాహిత్య మండలి” అనే రచయితల సంస్థను సత్యమూ నేనూ స్థాపించాం. ఆ పేరుతో మా ఊళ్ళలో కొన్ని సభలు నిర్వహించాం.

ఇంటర్మీడియేట్‌ ప్యాస్‌ అయింతర్వాత మాదార్లు వేరైనాయి. అతను ఉద్యోగంలో చేరాడు. నేను అప్పుడు (1945) గుంటూరులో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు ఆనర్స్‌లో చదువు కొనసాగించటానికి చేరాను. ఆపై రెండేళ్ళా వాల్తేరులో చదివాను. అతను కాకినాడ, చిత్తూరు మొదలైన చోట్ల పనిచేసి 1948కి మళ్ళీ గుంటూరు చేరాడు. నేను ఆనర్సు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడనై గుంటూరు హిందూకాలేజీలో స్పెషల్‌ ట్యూటర్‌ ఉద్యోగంలో చేరాను. మళ్ళీ మా స్నేహం ఒక ఏడదిపాటు కలిసి ఉండటంతో బలీయమైంది.

1949లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో తెలుగుశాఖలో ఉపన్యాసకుడిగా ఎంపికై వాల్తేరు వెళ్ళాను. రేపల్లెలో 1950 ఫిబ్రవరి 26న జరిగిన నా వివాహానికి సత్యం వచ్చాడు. 1950 మే 26న జరిగిన అతని పెళ్ళికి, సత్యం కోరికమేరకు బెజవాడకు మా గురువులు పళ్ళె పూర్ణప్రజ్ఞాచార్యులవారిని గుంటూరు నించి నాతో తీసుకుని వెళ్ళాను. ఆ సందర్భంలో మూడుపద్యాలు రాసి చదివాను (చూ. నా చిన్ననాటి పద్యాలు (1998), సుమత్రయి, పుట 15).

సత్యం నాకంటే రెండేళ్ళు పెద్ద; నన్ను ‘తమ్ముడూ’ అంటుండేవాడు. అతని సహస్రపూర్ణచంద్రదర్శనోత్సవ సందర్భంగా అతని రెండో కూతురు, ప్రసిద్ధ కవయిత్రి, డా. చిల్లర భవానీదేవి అతను రాసిన వ్యాసాలన్నిటినీ సేకరించి చిన్న పుస్తకంగా అచ్చు వేయించటానికి చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం.

ఈ సంకలనంలో 1945-62 మధ్య అప్పుడప్పుడు సత్యం రాసిన ఎనిమిది వ్యాసాలున్నాయి. అతను ఉద్యమశీలి; సంస్కృతభాషాప్రచారిణీసభకు కార్యదర్శిగా చాలా ఏళ్ళుండి ఆ భాషా వ్యాప్తికి ఎంతో కృషిచేశాడు. సంస్కృతభాషను గురించి, సమకాలీన విద్యావిధానంలోని లోపాలను గురించి రాసిన వ్యాసాలు అతని స్వతంత్రాలోచనావిధానాన్ని ఆవిష్కరిస్తాయి. కొన్ని వ్యాసాలు అతని తెలుగు సాహిత్యాభిలాషను ప్రదర్శిస్తాయి. సత్యం తన ఉత్తరజీవితం ప్రధానంగా న్యాయవాద వృత్తికీ భగవచ్చింతనకు వినియోగించాడు.

నా మిత్రుడు శ్రీ కోటంరాజు సత్యనారాయణ శర్మ, సతీసమేతంగా శతవసంతాలకు తక్కువగాకుండ ఆరోగ్యంతో జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

భద్రిరాజు కృష్ణమూర్తి

* * *

నాన్నగారి వ్యాసాలు” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

నాన్నగారి వ్యాసాలు On Kinige

Related Posts: