‘ఆంధ్రనగరి’ చారిత్రక నవల ఇప్పుడు ఈ-బుక్ గా మీకోసం!

ఆంధ్రనగరి పుస్తకావిష్కరణ జరిగి ఈరోజుకి సరిగ్గా సంవత్సరం. అందుకే ఇదే రోజు ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులందరికీ కినిగె ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నారు రచయిత శ్రీ సాయి పాపినేని గారు.
ఎంతో పరిశోధించి, మరెంతో పరిశ్రమించి హాయిగా సాగిపోయే భాషలో ఈ చారిత్రక నవలను రచించారు రచయిత. విమర్శకుల ప్రశంసలను, పాఠకుల అభిమానాన్ని ఎంతగానో చూరగొన్న ఆంధ్రనగరి నవల కినిగెలో ఇప్పుడు ఈ-బుక్ మరియు ప్రింటు బుక్ రూపాలలో కూడా లభిస్తుంది.

18-06-2013న జరిగిన ఆంధ్రనగరి పుస్తకావిష్కరణ వివరాలు

 

 

 

 

 

 

 

 

 

 

 

తెలుగు సాహితీవనంలో ఒక తొలకరి జల్లు

ప్రస్తుతం ప్రపంచమంతా చారిత్రక నవలా సాహిత్యానికి ఎంతో ప్రాచుర్యం ఉంది. ఇంగ్లీష్ కాల్పనిక సాహిత్యానికి ఉన్న విస్తారమైన అదరణ వల్ల విజయవంతమైన రచయితలకి ఆర్థిక లబ్ధి కలుగుతుంది. అందువలన చారిత్రక నేపధ్యంపై విస్తృతమైన పరిశోధన జరపటం వాళ్ళకు సాధ్యమయింది. కానీ ప్రాంతీయ భాషా సాహిత్యానికి ఉన్న పరిమితమైన ఆదరణ దృష్ట్యా, ఎంతో ఖర్చుపెట్టి లోతుగా పరిశోధించటం అంత సులువైన పని కాదు. ప్రాంతీయ భాషలలో చారిత్రక నేపధ్యంతో పూర్తి అవగాహనగల రచనలు అంత తరచుగా రాకపోవటానికి ఇదే ముఖ్య కారణం. ఈ నేపధ్యంలో సాయి పాపినేని గారి ఆంధ్రనగరి మన తెలుగు సాహితీవనంలో ఓ తొలకరి జల్లు.
క్రీ.పూ. మూడవ శతాబ్దిలో వేళ్ళూని వెయ్యేళ్ళపాటు మహోజ్వలంగా సాగిన మహాంధ్ర సామ్రాజ్యచరిత్రకి అద్దంపట్టిన ఈ నవల, నిన్న హుస్సేన్‌సాగర్ నడిబొడ్డున బుద్ధవిగ్రహంవద్ద అవిష్కరించబడింది. ప్రముఖులు, సాహితీవేత్తలు, పాత్రికేయుల సమక్షంలో, సోమా గ్రూప్ అధినేత, శ్రీ మాగంటి రాజేంద్రప్రసాద్‌గారి చేతులమీదుగా, ఈ కార్యక్రమం జరిగింది. రాజేంద్రప్రసాద్‌గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “శ్రీ సాయి పాపినేనిగారు ఈ నవల గురించి ఎంతో లోతైన పరిశోధనచేసి దాని రచనని ఒక మహాయజ్ఞంగా నిర్వహించారు. ప్రాచీనాంధ్ర సంస్కృతిని మనవాళ్ళకి పరిచయం చేయాలనే ఆయన ఉద్దేశ్యం మంచిది. అదే వారి ప్రయత్నానికి కావలసిన సహకారం అందిచడానికి నన్ను ప్రేరేపించింది. వారి ఈ ప్రయత్నం సఫలమవ్వాలనీ, ఈ ఆంధ్రనగరి పుస్తకం లక్షలాది తెలుగువారిలో మన సంస్కృతిపట్ల అవగాహననీ, గౌరవాన్నీ పెంపొందించాలనీ ఆశిస్తున్నాను”, అన్నారు.
క్రీ.శ. 18వ శతాబ్దాంతంలో, అమరావతి స్తూపాన్ని కనుగొన్నప్పటినుండీ, అది పురాతన వస్తు సంగ్రహకులూ, పురాతత్వవేత్తలూ, ప్రభుత్వోద్యోగుల చేతుల్లోపడి ఈనాటికి నామమాత్రంగా మిగిలింది, అప్పటి వారి అనాలోచిత నిర్ణయాలవల్ల అమరావతి శిల్పసంపద అనేక మ్యూజియమ్‌లకి చేరి ప్రపంచపు నలుమూలలా ఖ్యాతిగాంచినా, మన తెలుగువాళ్ళకి మాత్రం దూరమయింది. వెయ్యేళ్ళు మన ఆంధ్రుల రాజధానిగా వైభవం కనుజూచిన ఈ మహానగరం, నేడొక మట్టి గుట్టగా మిగిలింది. రచయిత తన మనోనేత్రంతో ఆకాలానికివెళ్ళి, కృష్ణా నదీమతల్లి ఒడిలో వెలిసిన ఈ అపూర్వ నాగరికతయొక్క ఉత్థానపతనాలని, తన పాత్రలతో, కథనంతో పునరుజ్జీవింపజేసి కనులకు కట్టినట్లు మన ముందుంచాడు. అటు రోమన్ సామ్రాజ్యంనుండి, ఇటు చైనా వరకూ జరిగిన, సమకాలీన ప్రపంచ రాజకీయ, వాణిజ్యపరమైన ఘట్టాలని ముడివేస్తూ, ముఖ్యోద్దేశానికి ఏమాత్రం భంగం కలిగించకుండా కథ మలచబడింది. ఈ నవల యొక్క సరళమైన శైలీ, జీవం ఉట్టిపడే పాత్రలు, చరిత్రపట్ల మక్కువ కలిగిన ఏ కొద్దిమందికి మాత్రమేగాక చదివిన ప్రతి తెలుగువానికీ సంతృప్తినిస్తాయి.
ఈ నవల ఆర్ట్స్ & లెటర్స్, హైదరాబాద్ వారిచే ప్రచురించబడి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారిచే పంపిణీ చేయబడుతుంది. ప్రాచీన చరిత్రపై ఎన్నో పుస్తకాలను ప్రచురించి మనకందించిన ఆర్ట్స్ & లెటర్స్ సంస్థ అధ్యక్షులు శ్రీ చెన్నూరు ఆంజనేయరెడ్డిగారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఆంధ్రుల చరిత్రలో ప్రాచీన చారిత్రక యుగం ఎంతో ప్రాముఖ్యం సంతరించుకొంది. ఈనాటి ప్రజల జీవనంపైనా, ఆలోచనావిధానంపైనా ఆనాటి ప్రభావం ఎంతో ఉంది. అప్పటి సంఘంలో సర్వమానవాళితో స్నేహ సద్భావనలను వెల్లివిరిసాయి. మన ఆంధ్రదేశం ప్రపంచపు నలుమూలలకీ నాగరికతని పంచింది. మనచరిత్రలోని ఈ స్వర్ణయుగాన్ని మీముందుంచే ఈ నవలని అందించటానికి ఆర్ట్స్ & లెటర్స్, హైదరాబాద్ సంస్థ ఎంతో గర్విస్తుంది”, అన్నారు.
ప్రఖ్యాత తెలుగు రచయిత, విద్యావేత్త, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డిగారు ఆహూతులతో మాట్లాడుతూ, “భాషాపరంగా చూస్తే సాయి పాపినేనిగారిది చారిత్రక ఇతివృత్తానికి, నేపథ్య నిర్వహణకు పాత్రల చిత్రణకూ అనుగుణమైన రచన. సారళ్యము, ప్రసన్నత, గాంభీర్యము తగుపాళ్ళలో మేళవించిన ఆధునిక శైలి”, అని రచయితని ప్రశంసించారు.

-18th June 2013

***

ఆంధ్రనగరి” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి. 

ఆంధ్రనగరి on kinige

Related Posts:

చారిత్రక నవలాహారంలో మరో మణిపూస

భవిష్యత్తును సరిగ్గా నిర్మించుకోవాలంటే చరిత్రను అధ్యయనం చేయాల్సిందే. అందుకే దార్శనికులు చరిత్రను ప్రేమిస్తారు. చరిత్ర చుట్టూ సాహిత్యాన్ని ప్రదక్షిణ చేయిస్తారు. కావ్యాలు, నాటకాలు, రూపకాలు, కథలు, నవలలు రచిస్తారు.
సినారె కర్పూర వసంతరాయలు, ధర్మవరం రామకృష్ణమాచార్యుల విషాద సారంగధర నాటకం, అనేకమంది చేతులమీదుగా సృజించబడి ఒకే పేరుతో ప్రఖ్యాతమైన భువన విజయం, రూపకం, జాయపసేనాని, హుళక్కి భాస్కరుడు పేర్లతో దొరవేటి లాంటి వారు రాస్తున్న కథలు, గోనగన్నారెడ్డి, మల్లారెడ్డి లాంటి అడివి బాపిరాజు నవలలు చరిత్ర చుట్టూ అల్లుకున్న సృజనలే.
ముదిగొండ శివప్రసాద్‌గారన్నట్లు చారిత్రక నవలా రచన సులభంకాదు. అదొక యాగం. రచయిత పరకాయప్రవేశం చేసి కథాకాలంలోకి వెళ్ళాలి. ఆనాటి వేషభాషలు చారిత్రక ప్రామాణ్యంలో వ్యక్తీకరించాలి. రీడబిలిటీ తగ్గకుండా, ప్రమాణం పలుచబడకుండా రచన సాగితేనే రచయిత విజయం సాధించినట్లు లెక్క.
తిమ్మమ్మ మర్రిమాను చారిత్రాత్మక నవల రాయడంలో బాలగొండ ఆంజనేయులు విజయం సాధించారని ముదిగొండగారు చెప్పారు. తిమ్మమాంబ పూర్తిగా చదివాక ప్రతి పాఠకుడు అదే అభిప్రాయానికొస్తాడు.
అనంతపురం జిల్లా కదిరి సమీపంలో తిమ్మమ్మ మర్రిమాను ఉంది. ఈ మర్రిమాను వైశాల్యం దృష్ట్యా అది గిన్నీస్ బుక్‌లోకి ఎక్కింది. తిమ్మమ్మ మర్రిమాను కింది గుడిలో ఉన్న వివరాల ప్రకారం తిమ్మమ్మ 1394లో జన్మించి 1434లో మరణించింది. శెట్టిబలిజ కులస్తులైన సేనక వెంకటప్ప, మంగమ్మల కూతురు. బాలవీరయ్య భార్య. అనంతపురం జిల్లాలో ప్రచారంలో ఉన్న స్థానిక కథనాల ప్రకారం ఆమె శ్రీ వేంకటేశ్వరుని వరపుత్రిక, మహాసాధ్వి. అనారోగ్యంతో మరణించిన పతి చితిమీద సహగమనం చేసింది. వారు మరణించినచోట ఈశాన్య భాగంలో లేచిన మర్రిచెట్టే ఇప్పటి తిమ్మమ్మ మర్రిమాను.
ఈ ఐతిహాసాన్ని, తిమ్మమ్మకు సంబంధించిన కుటుంబ వివరాలు, జనన మరణాలు ఆధారంగా ‘తిమ్మమాంబ’ నవల రాసారు బాలగొండ ఆంజనేయులు. కథాకాలం విజయనగర రాజులలో తొలివారైన సంగమ వంశస్థులది. రెండవ హరిహరరాయలు వారసుడు దేవరాయలు పెనుగొండ కేంద్రంగా పాలిస్తుంటాడు. తన రాజ్యాన్ని వివిధ సంస్థానాలుగా విభజించి పాలెగార్లను నియమిస్తాడు. కథాకాలంనాటికి ‘బుక్కపట్నా’న్ని చెన్నక వెంకటరాయలు, ‘గూడిబయలు’ను రంగరాజు, ‘తలపుల’ను బోయ నరసింహానాయుడు పాలిస్తున్నారు.
చెన్నక వెంకటరాయలుకు వేంకటేశ్వరుని వరప్రసాదాన జన్మించిన బిడ్డ తిరుమలాంబ. ఈమె చిన్నతనంనుండీ భక్తి, దయాగుణాలతో విలసిల్లుతూ తన మేనబావ ‘గూటిబయలు’యువరాజును మనసులో ప్రతిష్టించుకొంటుంది. గూటిబయలు యువరాజు బాలవీరుడు విజయనగర మహాసామ్రాజ్యపు సంస్థానాధీశుల వారసులందరిలోకెల్లా శక్తిమంతుడుగా, మహావీరుడిగా గుర్తించబడతాడు. ఆయన శక్తిసామర్థ్యాలను గుర్తించిన విజయనగర మహారాజు ఆపద సమయంలో అతన్ని సేనానిగా నియమించి యుద్ధానికి పంపిస్తాడు. ఆ యుద్ధంలో అతడు దాదాపుగా ఓడిపోతున్న దశలో ఒక సైనికుడి చతురతవల్ల తను గెలవడమేకాకుండా ఫిరోజ్‌షా, పెదకోమటి వేములను బంధించి దేవరాయల ముందు ప్రవేశపెడతాడు. అందుకు కారణం సైనికుడి రూపంలో శ్రీ వేంకటేశ్వరుడే వచ్చి సాయంచేయడం. అలా విజయనగరానికి ఘన విజయం సమకూర్చి పెట్టినందుకు ఘనంగా రత్నరాసులను బహుకరిస్తాడు మహరాజు. ఆ కానుకలన్నింటినీ తిమ్మమ్మ సలహాతో ప్రజాసంక్షేమానికి వినియోగిస్తాడు బాలవీరుడు.
గూటిబయలు అంతఃపుర కుట్రలకు తిమ్మమ్మ కొడుకు చనిపోతాడు. బాలవీరుడు తిమ్మమ్మ యాగం మొదలుపెడతారు. అదే సమయంలో వారి చిరకాల శత్రువు తలపుల యువరాజు ఫణీంద్ర దాడిచేసి బాలవీరున్ని తీవ్రంగా గాయపరుస్తాడు. ఆ గాయం నయంకాకుండా బాలవీరుడు మరణిస్తాడు. తిమ్మమ్మ సహగమనం చేస్తుంది. స్థూలంగా ఇదీ కథ.
సన్నివేశాలు సృష్టించడం, కాలానుగుణమైన ధర్మాల్ని, భాషను, వేషభూషాదులను పోషించడంలో రచయిత కృతకృత్యులయ్యారు. అభూత కల్పనలు, మహిమలు కొన్ని ఉన్నప్పటికీ అవి నవలా రచనలో ఔచిత్యాన్ని దెబ్బతీయలేదు. నవల చదువుతుంటే ఐదువందల యేండ్ల వెనక్కి ప్రయాణం చేసినట్లుగానే ఉంటుంది పాఠకుడికి. తిమ్మమ్మే తనచేత ఈ నవల రాయించిందని రచయిత చెప్పుకోవడం ద్వారా ఆయనీ కథాంశాన్ని ఎంతగా ఇష్టపడ్డాడో అర్థమవుతుంది.

డా. ఏనుగు నరసింహారెడ్డి
ఆంధ్రభూమి దినపత్రిక, 11/05/2013 నాటి ‘అక్షర పేజి’

* * *

“తిమ్మమాంబ” నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
తిమ్మమాంబ On Kinige

Related Posts:

సైన్సూ, ఫిక్షన్ కలిపి

కాలంలో ప్రయాణం ఆంగ్లంలో టైమ్‌ట్రావెల్ చిన్న టైటిల్‍తో వెలువడిన ఈ పుస్తకం కొంచెం ఊహాత్మక ప్రతిపాదనతోనూ, ఊహకు మరికొంత శాస్త్రీయ ఆధారంతోను నడిపించారు రచయిత మన్నె సత్యనారాయణ. 4-డైమెన్షనల్ కంటిన్యుమ్ సిద్ధాంతాన్ని ఈ నవలలో కొద్దిపాటి వివరణలతో నడిపించారు. శాస్త్రవిజ్ఞానం ఈనాటికి చేరిన స్థాయినీ, అది పురోగమిస్తున్న వేగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రచయిత చెపుతున్నారు. సంక్లిష్టమైన యంత్రం నుంచి ప్రజలు వాడుకునే చిన్న వస్తువుల తయారీ వరకు వృద్ధి చెందిన శాస్త్రవిజ్ఞానాన్ని తెలియజేస్తాయని చెబుతూ ఒకనాడు అసంభవం అనుకున్న సాధనాల్ని ఈనాడు శాస్త్రవిజ్ఞానం సాధించి చూపిస్తున్నదని రచయిత చెప్పుకుంటూ వచ్చారు. పైగా మనిషి చేసిన ప్రతి ఆవిష్కరణ ఊహతోనే ప్రారంభం అవుతుందని ఆ ఊహను ఆలోచనను మధించి ప్రయోగం జరిపితేనే సిద్ధాంతంగా రూపొందుతుందని చెప్పారు.
అందుకె రోజూవారీ ఆలోచనల మేలిమి రూపమే సిద్ధాంతం అన్న ఐన్‌స్టీన్ వ్యాఖ్యలను కూడా ఆయన ఉటంకించారు. సైన్సు ఫిక్షన్ చరిత్రల నేపథ్యంలో నడిచిన నవలగా చెబుతున్న కాలంలో ప్రయాణం గతంలో ఇంగ్లీషులో ఈ సబ్జెక్టుతో నవలలు వెలువడ్డాయి. ఆయా నవలలు ఆ రచయితలు ఆ భాషలు, ఆ దేశాల సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంలో రాసారు. అయితే ఈ రచయిత, తెలుగులో, తెలుగు సంస్కృతి నేపథ్యంలో రాయాలనిపించి సఫలీకృతులయ్యారు. టైమ్‌ట్రావెల్ అనేది ఫిక్షన్, ఆ నవల్లలో టైమ్ ట్రావెలర్ వెళ్ళింది కూడా కల్పనాకాలంలోకి. కానీ ఈ నవలలో టైమ్ ట్రావెలర్ తెలుగు చారిత్రక కాలంలోకి వెళతాడని రచయిత వివరించారు. అందువల్లనే ఆ నాటి తెలుగు చరిత్రని పరిశీలనగా చెప్పవచ్చని రచయిత గ్రహించారు. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంలోనికి, తరవాత నన్నయ్య, రాజరాజనరేంద్రుల కాలంలోకి టైమ్ ట్రావెలర్ వెళతాడు. చరిత్ర కావడంతో చారిత్రక వాస్తవాలకు దగ్గరగా రాయడానికి రచయిత ప్రయత్నించాడు. రాయలవారి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇద్దరు పోర్చుగీసు వారు రాసిన పుస్తకాలను కూడా రచయిత ప్రామాణికంగా తీసుకుని కాలంలో ప్రయాణం పూర్తి చేసారు. రాయల కాలంలో వ్యవసాయం, కొన్ని మౌలిక వసతుల కల్పన గురించి చెప్పడానికి రచయిత ప్రయత్నించారు. రాయల కాలంలోని నీటి వనరులు ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. అయితే వాటిని ఇప్పుడు పాతకాలం కాలవలని చెప్పడం రివాజు. సైన్సు, ఫిక్షన్, చరిత్ర అంశాలుగా నడచిన ఈ పుస్తకానికి మాజీ గవర్నర్ వి. ఎస్. రమాదేవి ముందుమాట రాసారు.

గన్ని మోహన్
(వార్త దినపత్రిక 13 మే 2012)

* * *

“కాలంలో ప్రయాణం” రాష్ట్రస్థాయి నవలల పోటీలో రూ.20,000/- బహుమతిని పొంది, ఆంధ్రభూమి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన నవల. ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి.

కాలంలో ప్రయాణం On Kinige

Related Posts: