‘శ్రీశ్రీ రాసిపారేసిన పద్యాల గుబాళింపులు మనకుండగా వాడు తాగిపారేసిన సీసాల సంగతి మనకెందుకు’ అన్నాడు కాళోజీ .కానీ కాశీపతి మాత్రం ఆ సీసాలనే తెచ్చి మనకు పుస్తకంలో అందించారు . పద్యాలకు గుబాళింపులున్నట్లే ,సీసాలకు కూడా ఉంటాయి. దేని వాసన దానిదే. మద్యం,పద్యం,శ్రీశ్రీ సాహితీసేద్యం అన్నింటినీ రచయిత మనకు అందించారు .శ్రీశ్రీ తో తనకున్న మందుజ్ఞాపకాలే రాసినా శ్రీశ్రీ కి భాషపై ఉన్న అధికారం , నిషాలో కూడా సామాజికసృహ కోల్పోనితనం ,పదాలతో ఆడుకొనే పసితనం …………ఇవన్నీ మనకు ముచ్చట కలిగిస్తాయి.
రచయిత సరదాకి మందుహాసం అనిపెట్టినా సీరియస్ విషయాలు చాలా ఉన్నాయి.కాశీపతికి శ్రీశ్రీ తోనే కాదు సామాన్య ప్రజలతో కూడా సుధీర్ఘ అనుబంధం ఉంది. అనంతపురం ప్రజల తరుపున అనేక సందర్భాల్లో గట్టిగా గొంతు విప్పిన వ్యక్తి .జర్నలిస్ట్‌గా కూడా చేయితిరిగిన వాడు కాబట్టి ,పుస్తకంలో వేగంగా చదివించే శైలి ఉంది.పాటలో ఒక్క పదం మార్చడానికి ఒక నిర్మాత విమాన ప్రయాణాన్నే రద్దు చేయించిన శ్రీశ్రీ ; మందు కంపెనీ కోసమని కాశీపతికి టెలిగ్రామ్ ఇచ్చి మద్రాసు పిలిపించిన శ్రీశ్రీ ; ఇద్దరు ఒకరే కానీ శ్రీశ్రీ ఒకడు కాదు.ఆయన అనేక రూపాల సమ్మేళనం , ఆయన మందు రూపాన్ని మరచిపోయి, కవిగా ఆయన విశ్వరూపాన్నిమాత్రమే గుర్తుంచుకోవాలి.బానిస తన సంకెళ్ళను తెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు .కానీ మందు బానిస తన సంకెళ్ళను మరింతగా బిగించుకొంటాడు – ఇది శ్రీశ్రీ చెప్పిన మాటే.
వరవరరావు , ఇనాక్ ల ముందుమాటలు ఈ పుస్తకానికి బోనస్ .కొన్ని వ్యాసాల్లో కాశీపతి ఫస్ట్‌పర్సన్ నుండి థర్డ్ పర్సన్ కు జంప్ చేశారు.ఇది మందుహాస చమత్కృతిలో ఇదొక భాగమేమో !
-జి.ఆర్.మహర్షి , ఆదివారం-ఆంధ్రజ్యోతి , 26 Oct 2014.
“‘మద్య’తరగతి ‘మందు’హాసం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
‘మద్య’తరగతి ‘మందు’హాసం on kinige