‘మృత్యు’ముఖంలో ఎన్నెన్ని హావభావాలో..! – “మరణతరంగం”పుస్తకంపై సమీక్ష

‘‘ఎంతొ ఆరాటపడుతు జీవింతు వౌర
మృతియె లేకున్న రుచి ఏది బ్రతుకులోన’’

-అని గాలిబ్ అన్నట్లు, జీవించి వుండగానే మరణం పట్ల సజావైన దృక్పథం ఏర్పడాలి. చాలామంది మృత్యుభయంతో అనుక్షణం చస్తూండడం కూడా చూస్తూంటాం. ఏ పనిచేసినా అందరిలా చేయనివాడు కూడా అందరిలాగే చచ్చిపోతాడు. పాలగుమ్మి పద్మరాజుగారి ‘వియ్యన్న తాత మరణం’ కథ ఈ సంకలనంలో వుంది. ఆ మాటకొస్తే ఆయనవే ‘బాల్యం’, ‘గాలివాన’ కథలూ వున్నాయి. ‘మరణాన్ని గౌరవించిన రచయితల్లో పాలగుమ్మి పద్మరాజుగారి తరువాత ఎవరయినా.. ’అంటారు గోపాలం. ‘మరణ తరంగం’ పేర గోపాలం గారు వివిధ భాషలనుండి అనువదించిన పదహారు కథలు ఇందులో వున్నాయి. వివిధ ప్రపంచ భాషా కథలివి. పాలగుమ్మి పద్మరాజుగారి శత జయంతి సందర్భంగా ‘కథానికాజీవి’ వేదగిరి రాంబాబు శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ పేర వీటికి గ్రంథరూపం కల్పించారు.

‘‘మనం పుట్టిన మరుక్షణం నుంచే చావుమొదలవుతుంది. ఈ సంగతి ఎవరికీ నచ్చదు. ఎవరికీ అర్థం కాదు. మనిషి బతుకు కథకు చావు ఒక అందమైన అంతం. వద్దంటే అది ఆగదు! ఎప్పుడొస్తుందో తెలియదు. కనుకనే చావంటే అదొక అర్థం గాని విషయం!మరణం మనిషిని రకరకాలుగా తాకుతుంది. బుజ్జగిస్తుంది. బాధ పెడుతుంది. బాధనుండి విముక్తివస్తుంది. కావలసిందల్లా మనం మరణం గురించి అర్థం చేసుకోవడమే!’’ అంటారు గోపాలం.

ఇందులోని పదహారు మరణ తరంగాలూ ఆ అర్థం చేసుకునే క్రమంలో ఉపకరించేవే. ‘మృత్యువంటే?’అనే రచనలో పోయినవాళ్ళకోసం దుఃఖించడం వ్యర్థం అన్న భావన వుంది. ‘‘పిన్నవారూ, పెద్దవారూ, అజ్ఞులూ, విజ్ఞులూ అందరూ మరణానికి సమానులే. తండ్రి కొడుకును కాపాడలేడు. తల్లి కూతురిని కాపాడలేదు. ఎవరూ ఎవరినీ కాపాడలేరు. అందుకని శాంతి కోరుకున్నవారు మరణంవల్ల కలిగే దుఃఖాన్ని త్యజించాలి!’’ అని బోధించాడు బుద్ధుడు. దక్షిణ అమెరికా, టర్కిష్ జానపద కథలూ ఇందులో అందించారు రచయిత. మిగిలిన జీవిత ఘటనల్లో ఎంతటి వైవిధ్యం కనబడుతుందో చావులోనూ అంత వైవిధ్యం కనబడుతుంది అన్న ‘ఉదయం’ కథలోని మాట సత్యం.

మడగాస్కర్ ప్రజల జానపద కథలో మనిషే మరణాన్ని కోరుకున్నాడనే విషయం వుంది. మీకెలాంటి మరణం కావాలో కోరుకోండి అని తొలి మానవుల జంటని దేవుడు అడిగాడట- ‘చంద్రుడి లాగానా? చెట్టులాగానా?’ అని.
చంద్రుడయితే తరిగి తరిగి ఒకనాడు మాయమవుతాడు. కానీ తిరిగి తను పుడతాడు. పెరుగుతాడు. కానీ చెట్టు విత్తులనూ, పిలకలనూ విడిచి తాను నశిస్తుంది. తన సంతతి మాత్రం సాగుతూనే వుంటుంది. సంతానం అవసరం లేదనుకుంటే చావుకూడా వుండదు. కానీ ఆ ఇద్దరు తొలి మానవులే ఎన్నాళ్ళు ఎవరికోసం బ్రతకాలి అందుకని వారు పిల్లలే కావాలని దేవుణ్ణి అడిగారట. అంచేతే మనం పోతాం, మనవారు వుంటారు అది సాగుతూంటుంది. ‘మృత్యుభోజనాలు’ కథ ఒళ్ళు జలదరింపచేస్తుంది. ఎవరైనాపోతే ఆ ఇంట వండుకోరు. పక్కవారు ఎవరైనా భోజనం పంపిస్తారు. ఈ టర్కిష్ కథలో ఆకలి ఆరాటాన్నీ, ఆర్తినీ విశదపరుస్తూ దరిద్ర స్వరూపానికి పరాకాష్టగా- పిల్లవాడు జ్వరం వచ్చిన ‘‘అన్న చచ్చిపోతే మూల బంగళావాళ్ళు భోజనం పంపిస్తారు కదూ!’’ అని తల్లిని అడుగుతాడు. ఇటాలియన్ కథ ‘యుద్ధం’, ఫ్రెంచ్‌కథ ‘ప్రియురాలి కోసం’ జపాన్ కథ ‘దేశభక్తి’ అర్జెంటీనా కథ ‘గొడ్డలివేటు’ అన్నీ మృత్యువుతో ముడివడిన కథలే.‘సహజ మరణాలకన్నా హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాల్లో ప్రాణం కోల్పోవడాలు వార్తాపత్రికల్లో ప్రముఖంగా వస్తూంటాయి. సెలబ్రిటీల చావులు, అంతిమ సంస్కారాల ఫొటోలతో సహా సంతాప సందేశాలతో సహా అచ్చవుతూంటాయి. చావు అందరికీ ఒకటే అ యినా- చనిపోయినవారి గురించిన మీడియా కవరేజ్‌లు, నివాళి వ్యాసాలతో ‘చచ్చే చావుగా వుంద’ని వాపోయేవాళ్ళూ వున్నారు. మ రణం తరువాత తన గురించి సమాజంలో, కుటుంబ సభ్యులలోనూ ప్రకంపనలూ, ప్రతిస్పందనలూ మరణించినవారికి తెలుస్తాయో లేదోకూడా తెలియదు. ఆత్రేయ అన్నట్లు-

పోయినోళ్ళందరూ మంచోళ్ళు
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగుర్తులు..

మరణ తరంగం అంతరాంతరాల్లో ఆలకించదగిన సముద్రం ఘోష. గోపాలం రేపిన ‘అల’జడి ఆహ్వానింపదగింది.

-సుధామ,03/01/2015,ఆంద్రభూమి – శనివారం – అక్షర.

మరణతరంగం” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..

మరణతరంగం on kinige

MaranaTarangam600

Related Posts:

అమెరికాలోనూ అంతే… “ముగ్గురు కొలంబస్‌లు” పుస్తకంపై సమీక్ష

అమెరికా పర్యటన చేసి వచ్చిన రచయిత్రి సోమరాజు సుశీల ఈ పుస్తకంలో తన యాత్రా విశేషాలను పాఠకులకు అందించే ప్రయత్నం చేశారు. పుస్తకంలో 19 అధ్యాయాలున్నాయి. రచన వ్యాస రూపంలో కాకుండా కథారూపంలో ఉండటంవల్ల యాత్రా కథనాలన్నీ ఆసక్తికరంగాఉన్నాయి.
విమానం ఎక్కబోయేముందు చేసుకునే ఏర్పాట్లతో పుస్తకం మొదలవుతుంది.
అమెరికా లో ఉన్న కాలంలో అక్కడి పద్ధతులనూ జన జీవితాన్నీ పరిశీలించిన రచయిత్రి, ఆయా సన్నివేశాలను పాఠకులకు కళ్లకుకట్టినట్లుగా ఉండేటట్లుగ వర్ణించారు. ఈ కథనాలకు చిత్రకారుడు వేసిన బొమ్మలు మరింత వన్నె తెచ్చాయి.
అమెరికన్ కుటుంబాలను పరిశీలించాక ‘దేశమేదయినా మానవ స్వభావం మాత్రం ఒకటే అనిపించింది’ అని ‘అల్లుడు జిందాబాద్’ శీర్షికలో తెలిపారు. అక్కడి తల్లులు కూడ పిల్లలకోసం తెగతాపత్రయపడతారని, మనవల రాకకోసం ఆత్రంగా ఎదురుచూస్తారనీ అన్నారు. సంసారాల్లో సాధ్యమైనంతవరకు సర్దుకుపోవాలని చూస్తుంటారు తప్ప, అంత తేలికగా విడాకుల జోలికి వెళ్లరని తన అభిప్రాయం వ్యక్తపరిచారు.
‘సరిగమ పదని’ శీర్షికలో ఒక సంగీత వాద్యగోష్ఠి కార్యక్రమం గురించి ప్రస్తావించారు. ప్రేక్షకులు ఎంతో శ్రద్ధగా ఆస్వాదించి, కళాకారుల పట్ల ఆదరాభిమానాలను ప్రకటించారని చెప్తూ, మన తెలుగునేల మీద మాత్రం చాలామందిలో కార్యక్రమం మధ్యలో లేచి వెళ్లిపోయే అలవాటున్నందుకు విచారం వ్యక్తంచేశారు.
తిరుగు ప్రయాణంలో బొంబాయి విమానాశ్రయంలో దిగినప్పుడు ఉద్యోగుల అలసత్వం వల్ల తిప్పలుపడ్డ సంగతి చెప్పారు. మనది స్వేచ్ఛభారతం అనే సంగతి గుర్తుచేసుకొని ‘బోలో స్వతంత్ర భారత్‌కీ జై’ అంటూ ముగించారు. అమెరికా విశేషాలు తెలుసుకోటానికి ఈ పుస్తకం పనికొస్తుంది.

 -ఎం.వెంకటేశ్వరశాస్త్రి ,25/10/2014 , ఆంధ్రభూమి-అక్షర

 

ముగ్గురు కొలంబస్‌లు”నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

ముగ్గురు కొలంబస్‌లు on kinige

 

MugguruKolumbuslu600

Related Posts:

హృదయాన్ని కదిలించిన కథలు

మొత్తం 30 కథల్ని కూర్చి ‘శాలువా‘ పేరుతో అచ్చు వేయించారు. భాష, శైలి, భావం ఈ కథల్లో పొదిగారు. కథల్ని ఉపోద్ఘాతంతో మొదలెట్టటం ఆయనకు అలవాటు. అది ఆయన ఎత్తుగడ. వస్తుపరమైన గుణవిశేషంతో పాటు శిల్పం కూడ ప్రాధాన్యం సంతరించుకుంది.
కథ రాయగానే సరికాదు. సందేశం ఉండాలి. అప్పుడే దానికి విలువ పెరుగుతుంది.
కవి, రచయిత సమాజంలోని కుళ్ళు కుతంత్రం, మూఢనమ్మకాలు, అవినీతి వంటి అంశాల మీద దృష్టి సారించి వాటి నిర్మూలనకు తమ వంతు కృషి చేయాలి. అదే చేసారు పిడుగు పాపిరెడ్డి గారు. ఒక్క మాటలో చెప్పాలంటే పిడుగుల్లాంటి కథలు పాఠకులకు అందించారు కవి. పల్లె తనాన్ని పల్లె భాషలోనే చెప్తేనే రక్తికడుతుందనడానికి ఈ కథలే తార్కాణం.

తూములూరి రాజేంద్రప్రసాద్
చిత్ర సకుటుంబ సచిత్ర మాసపత్రిక జూలై 2013

* * *

“శాలువా” కథాసంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.
శాలువా On Kinige

Related Posts: