స్పైడర్ వెబ్

డిటెక్టివ్ నవలా రచయిత మధుబాబు కలం నుంచీ జాలువారిన థ్రిల్లర్ “స్పైడర్ వెబ్“.

ఇంటర్‌పోల్ ఎస్సైన్‌మెంట్ పై స్విట్జర్లాండ్ బయల్దేరాడు షాడో. హఠాత్తుగా అతనెక్కిన విమానం హైజాక్ చేయబడింది. హైజాకర్లు విమానాన్ని దారిమళ్ళించి ఇటలీ లోని ట్యూరిన్ తీసుకువెడతారు.

ఎయిర్‌పోర్టు నుంచీ బయటకు వస్తుండగా తనని బంధించిన వారికి స్లిప్ ఇచ్చి తప్పించుకుంటాడు షాడో. సమాచారం తెలుసుకున్న ఇటలీ స్పెషల్ స్క్వాడ్ కమాండర్ మాసిలీ షాడోని పట్టుకోడాని ఓ స్పైడర్ వెబ్ అల్లుతాడు. ఇటలీ సెంట్రల్ బ్యాంక్ నుంచీ దాదాపు ఇరవై మిలియన్ డాలర్ల విలువచేసే బంగారం షాడో దొంగిలించాడని, అతన్ని పట్టిచ్చిన వాళ్ళకి పదివేల డాలర్లు బహుమతి ప్రకటించాడు.

ఇక నగరం అంతా షాడో కోసం వెదుకులాట మొదలవుతుంది. ఒక హోటల్ వద్ద ఓ బాలుడిని రక్షించే ప్రయత్నంలో షాడో పోలీసులకి దొరికిపోయాడు. తను చెయ్యని నేరం తనపై మోపి తనను ఎందుకు బంధించారో తెలుసుకోవాలనుకుంటాడు షాడో.

ఇటలీ స్పెషల్ స్క్వాడ్ ఏజెంట్లకు అసాధ్యమైన పని ఒకటి చేసిపెట్టడం కోసం షాడోని బంధించినట్లు చెబుతాడు మాసిలీ. ఇటలీ దేశానికి దూరంగా సముద్ర మధ్యంలో వుండే రోజ్లాండ్ దీవి కానొకప్పుడు ఈ దీవి ఇటలీ పరిపాలనలోనే వుండేదని, ప్రస్తుతం అది స్వతంత్రదేశం అయిందని, ప్రపంచంలో రకరకాల నేరాలుచేసి ఎవరికీ దొరకకుండా తప్పించుకొని తిరిగే నేరస్థులు ఆ దీవిలో ఆశ్రయం పొందుతూ వుంటారని చెప్పాడు మాసిలీ. కొంతకాలం క్రితం కొందరు విద్రోహులు ఇటలీ ఆటమిక్ రీసెర్చి సెంటర్ మీద దాడిచేసి అపరిమిత మేధాశక్తి సంపన్నుడయిన ప్రొఫెసర్ ఫెడరిక్‌ని కిడ్నాప్ చేశారు. ఇటలీ స్పెషల్ స్క్వాడ్ ఏజెంట్లు ఎంతో కష్టపడి అతను రోజ్లాండ్ దీవిలో వుండే పెద్దజైలులో బంధింపబడి వున్నట్లు తెలుసుకోగలిగారని, షాడో వెళ్ళి ప్రొఫెసర్ని రక్షించి తీసుకురావలని ఆదేశిస్తాడు మాసిలీ.

రోజ్లాండ్ ద్వీపంలోని జైలు సంగతి ప్రపంచంలోవున్న సీక్రెట్ సొసైటీలన్నిటికీ తెలుసు. అనుమతి లేకుండా అందులోకి వెళ్ళటం కష్టం. వెళితే ప్రాణాలతో బయటికి రావటమనే ప్రసక్తి లేనేలేదు. రోజ్లాండ్ జైలులోకి పోయి ప్రొఫెసర్ ఫెడరిక్ ని విడిపించటం కంటే, మాసిలీ కళ్ళల్లో దుమ్ముకొట్టి పారిపోవటమే మంచిదని నిర్ణయించుకున్నాడు షాడో. కాని, ఆ నిర్ణయాన్ని అమలుపరచటానికి అడ్డువచ్చింది అతని అభిమానం. చేయని నేరాన్ని తనపై రుద్దినందుకు వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పాలనుకున్నాడు.

తర్వాత ఏం జరిగింది? మాసిలీకి షాడో నేర్పిన పాఠం ఏమిటి? ప్రొఫెసర్ ఫ్రెడెరిక్‌ని షాడో రక్షించాడా లేదా? అతని కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటి సమాధానాలు ఈ ఆసక్తికరమైన నవలలో లభిస్తాయి.

* * *

స్పైడర్ వెబ్ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

స్పైడర్ వెబ్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: