సత్సంగ సంకలనం

కేకలతూరి క్రిష్ణయ్య గారు సత్సంగం గురించి, మానవసేవ గురించి, దైవం గురించి, వాక్కు గురించి, విశ్వప్రేమ గురించి, ఆయుర్వేదం గురించి, వృద్ధాశ్రమాల గురించి ఎంతో సమాచారం సేకరించి ఈ పుస్తకంలో అందించారు.

భారతీయ సంస్కృతిలో సత్సంగం చాల విలువైనది. చాలా అద్భుతమైనది. సత్యంతో సంగం కలవడమే సత్సంగం. సామాన్యులకు సైతం దైవ శక్తిని అందుబాటులోకి తెచ్చి దైవంతో అనుసంధానం చేయగల భక్తులు, జ్ఞానుల సాంగత్యం అవసరమైనది. వీరు టి.వి. కి ఆంటీనా లాంటి వారు. తనకు తానుగా ఎగరలేని ధూళి, గాలి సాంగత్యం వల్ల ఎలా పైకి ఎగురుతుందో, అలాగే సత్సంగం సామాన్యులను కూడా ఉన్నత శిఖరాలకు తీసుకువెడుతుందని రచయిత అంటారు.

మానవసేవే మాధవ సేవ అని చెబుతూ, రచయిత చెప్పిన తమిళ బస్ డ్రైవర్ వృత్తాంతం ఆకట్టుకుంటుంది.

మాట్లాడడం గురించి చెబుతూ, ” మనం మాట్లాడే మాట కృతజ్ఞతతో అభివాదం చేసినట్లుండాలి. ఎదుటివారిని నొప్పించే విధంగా అసలు మాట్లాడకూడదు. ఒంటికి గాయమైతే కొన్ని నెలల్లో తగ్గుతుంది. మనసుకు గాయమైతే జీవితాంతం పుండుగానే ఉంటుంది” అని అంటారు రచయిత.

ఒక పేదవాడు అతి కష్టం మీద కొబ్బరిబోండాల వ్యాపారం ప్రారంభిస్తాడు. ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కుకున్నాక, తన పాత రోజులను గుర్తు చేసుకుని, తన లాంటి వారి బాధలు కొంతైనా తీర్చాలనే ఉద్దేశంతో నగరంలోని ఆసుపత్రులలో రోగులకు ఉచితంగా కొబ్బరి బోండాలు పంచాడు. ఈ ఉదార స్వభావి గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

పరమాత్మ సేవ గురించి ఖురాన్‌లో చెప్పిన మార్గాల గురించి రచయిత ఇలా చెప్పారు:
1. మొదటిది ప్రార్థన: అది నిన్ను సగం దూరం తీసుకెళ్తుంది.
2. రెండవది ఉపవాసం: అది నిన్ను దేవుని సాన్నిధ్యాపు వాకిలి దాకా తీసుకెళ్తుంది.
3. మూడవది బీదవారి కష్టాలు తీర్చడం: అది నిన్ను సౌధంలోనికి తిసుకెళ్తుంది.
కాబట్టి బీదలకు, కష్టాలలో ఉన్నవారికి సాయం చేస్తే అది పరమాత్మ సేవతో సమానమని రచయిత చెబుతారు.

పెన్సిల్‌కి సృష్టికర్త ఇచ్చిన సలహా అద్భుతంగా ఉంటుంది.
1. ఎవరో ఒకరు సృష్టించనిదే నీకొక విలువ లేదు, నీవల్ల ఉపయోగం లేదు. కాబట్టి మనం కూడా ఒక ఉన్నత ఆదర్శం కోసం నిలవాలి.
2. అవసరాన్ని బట్టి నిన్ను చెక్కుతునే ఉంటారు. కాని ఆ పని నిన్ను బాధిస్తుందని తలచరు. నువ్వు పదునెక్కే కొద్దీ నీ ఉపయోగం పెరుగుతుంది.
3. పెన్సిల్ పై భాగం ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, అందులో ఉపయోగపడేది లోపలి భాగం మాత్రమే. మనలో కూడా ప్రేమ, నిశ్శబ్దత, మంచితనం అనే అంతర్గత గుణాలు చాలా విలువైనవి. పైపై మెరుగులు నిరుపయోగమైనవి.
4. పెన్సిల్ ఉపయోగిస్తున్నప్పుడు ఎన్నో తప్పులు చేయవచ్చును. కానీ వాటిని సరిజేసుకునే అవకాశం కూడా ఉంది. మనం ఎన్నో తప్పులు చేస్తాము, వాటిని దిద్దుకునే శక్తిని, సమర్ధతని మనం పెంచుకోవాలి.
5. ఎక్కడికి వెళ్ళినా నీదైన ఒక ప్రత్యేకతను నిలుపుకుంటావు. నీవు కూడా ఎక్కడికి వెళ్ళినా నీ మంచితనంతో, నీ సత్ప్రవర్తనతో నీదైన ఒక స్థానాన్ని నిలుపుకోవాలి.

వాస్తు గురించి చెబుతూ, వాస్తు శాస్త్రం గురించి తెలియజేసారు రచయిత. నివాస స్థలంలో ఇల్లు ఎలా నిర్మించుకోవాలి అని చెప్పేదే శాస్త్రం, ప్రకృతిలో పనికి వచ్చే అంశాలను, ఎనర్జీ క్షేత్రాలను మనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే శాస్త్ర ఉద్దేశం. ఈ సూత్రాలకు మతపరమైన విశ్వాసాలని జోడించడంతో వాస్తు ఒక శాస్త్రంగా కాకుండా కేవలం నమ్మకంగా మిగిలిపోయిందని ఆయన అంటారు. చాలా మంది వాస్తు ద్వారా జనాలను భయపెట్టి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారని రచయిత అంటారు. ఓ వ్యక్తి ఆర్థికంగా నష్టపోడానికి, అనారోగ్యం పాలవడానికి అనేక కారణాలుంటాయి. నిజానికి కలిసి రావడానికి, నష్టపోడానికి మానసిక సంబంధమైన అంశాలే కారణం కావచ్చు. గాలి, వెలుతురు సరిగా లేని ఇళ్ళల్లో ఒక రకమైన సఫోకేషన్ శారీరకంగా మానసికంగా ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా వారు తీసుకునే కొన్ని నిర్ణయాల మీద దాని ప్రభావం కనిపిస్తుందని రచయిత చెబుతారు.

పిల్లల నిరాదరణకి గురైన వృద్ధులకు కారుచీకటిలో కాంతిరేఖల్లా – మేమున్నాం, మీకేం పర్వాలేదు అంటూ జీవితం పై ఆశని పెంచేవి వృద్ధాశ్రమాలని రచయిత అంటారు. హైదరాబాదు నగరంలోని వృద్ధాశ్రమాల జాబితా, అవి కల్పించే సౌకర్యాల గురించి రచయిత తెలియజేసారు.

వివిధ వ్యాధులకు ఉపకరించే ఆయుర్వేద మందులను ఈ పుస్తకంలో రచయిత వివరించారు.

“విజ్ఞానం సముద్రం వంటిది. అందులో ముత్యపు రాశులు కోకొల్లలు. వాటిని తేగలిగే ప్రతిభావంతులు ఉంటే ఉండవచ్చు, కానీ నేను మాత్రం ఆ సముద్రం ఒడ్డున గులకరాళ్ళని ఏరే పసివాడిని” అని న్యూటన్ మాటలని ఉటంకిస్తూ రచనని ముగిస్తారు రచయిత.

ఉపయుక్తమైన సమాచారాన్ని సేకరించి అందించిన ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల 63/- రూపాయలు. నెలకి రూ.30/-తో అద్దెకు తీసుకుని చదువుకోవచ్చు.

సత్సంగ సంకలనం On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: