శ్రీకృష్ణ దేవరాయలు

భారతీయులకు, ముఖ్యంగా దక్షిణాది వారికి సుపరిచితుడైన మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు. కస్తూరి మురళీకృష్ణ రచించిన ఈ నవలలో రాయల వ్యక్తిత్వాన్ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేసారు.
కథా ప్రారంభంలో – భారతదేశం అవిశ్రాంతమైన శత్రుదాడులతో బలహీనపడడం గురించి ప్రస్తావిస్తూ…..ఆ కాలం భారతీయ సమాజం దిశారహితమై దిక్కుతోచకుండా బిక్కుబిక్కుమంటున్న కాలమని పేర్కొంటు శ్రీకృష్ణ దేవరాయలు సింహాసనం అధిష్టించే ముందరి పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు వివరించారు. ఇటువంటి పరిస్థితిలో మహామంత్రి తిమ్మరుసు, ఇతర ముఖ్యులు కలసి రాజ్యాధికారాన్ని శ్రీకృష్ణ దేవరాయలకు అప్పగిస్తారు.
పాలనాపగ్గాలు చేపట్టాకా, ఒక్కో శత్రువునీ జయిస్తూ, సామ బేధ దాన దండోపాయాలతో దక్షిణాపథాన్నంతా ఏకఛత్రం క్రిందకి తెచ్చాడు శ్రీకృష్ణ దేవరాయలు. ఎన్నో సంస్కరణలు చేపట్టి జనరంజకంగా పాలించాడు, విశిష్ట కట్టడాలని నిర్మించాడు. ఇదంతా అందరికీ తెలిసినదే.
పరిపాలనాదక్షుడుగా, వీరుడిగా, సాహితీప్రియుడిగా, కవిగా, గొప్ప కట్టాడాలను కట్టించిన రాజుగా మనకి తెలిసిన శ్రీకృష్ణ దేవరాయల లోని ఆధ్యాత్మికతను, ధర్మదీక్షని పరిచయం చేసారు రచయిత ఈ నవలలో.
విజయనగర రాజ్యాధికారం లభించడమంటే ధర్మరక్షణ చేసే అవకాశం లభించడమేనని శ్రీకృష్ణ దేవరాయలు భావించాడని, దైవం తనకి నిర్దేశించిన కర్తవ్యం అదేనని ఆయన నమ్మాడని రచయిత చెబుతారు. తన సామ్రాజ్యంలో ఎన్నో దేవాలయాలకు నిధులిచ్చి, వాటిని పునరుద్ధరించి, నిత్యపూజలు జరిగేలా చూసాడు. ఆలయాలు జనసామాన్యంలో ధార్మికత నెలకొల్పగలిగే కేంద్రాలని రాయలు విశ్వసించాడు.
శ్రీకృష్ణ దేవరాయలు వెంకటేశ్వరుని భక్తుడు. వీలైనన్ని సార్లు తిరుపతి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకునేవాడట. “ఏడుకొండలు ఎక్కలేము, ఇంకోసారి రాలేము” అనుకునే వారందరూ కూడా మళ్ళీ మళ్ళీ స్వామి దర్శనానికి ఎందుకు వస్తారో రచయిత చక్కగా వివరించారు. అలాగే తిరుమల గుడిలో శ్రీకృష్ణ దేవరాయలు తన ఇద్దరి భార్యలతో ఉన్న విగ్రహాలు ఎందుకు ఉన్నాయో రచయిత చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.
పాలకులకు ఉండాల్సిన లక్షణం గురించి రాయలు ఇలా అంటారు:
“ముందుగా మనం మన ప్రజలకు కలలు కనడం నేర్పాలి. జీవితాన్ని అనుభవించడం నేర్పాలి. రకరకాల భయాలతో, బాధలతో, మనవారు జీవించడం మరచిపోయారు, బ్రతుకులోని ఆనందాలను అనుభవించడం మరచిపోయారు. ఎంత సేపూ గతాన్ని తలచుకుంటూ భవిష్యత్తు గురించి భయపడుతూ వర్తమానాన్ని విస్మరిస్తున్నారు. ముందుగా ప్రజలకు ఆత్మవిశ్వాసాన్నివ్వాలి, వారికి భద్రతనివ్వాలి”
ఈనాడు ఇవి మనకి కూడా కావల్సినవి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
“దేశభాషలందు తెలుగు లెస్స” అనే పద్యం శ్రీకృష్ణ దేవరాయలు ఏ సందర్భంలో చెప్పాడో రచయిత ఆసక్తిగా చెప్పారు.
తన తదనంతరం, విజయనగర సామ్రాజ్యం ఏమై పోతుందో అని చింతిస్తున్న శ్రీకృష్ణ దేవరాయలు మానసిక స్థితిని వర్ణిస్తూ – “తన జీవితంలో ఒక దశకి చేరిన తరువాత ఇతరుల పొగడ్తలు వింటున్న వ్యక్తి మనసులో అహంకారం జనిస్తుంది, దాని వెంటే సంశయం కలుగుతుంది. ఈ పొగడ్తలకు అర్హుడినా అనే అనుమానం కలుగుతుంది, మరో వైపు “నేనింత సాధించాను” అన్న అహంభావం పెరుగుతుంది. ఈ రెండిటి నడుమ జరిగే ఘర్షణలోంచి, “ఇది పోతే” అన్న భయం జనిస్తుంది. ఆ భయాన్ని వ్యక్తి ఎలా ఎదుర్కుంటాడన్నది ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది” అని అంటారు రచయిత.
రాయలు తన పుత్రుని భవిష్యత్తు గురించి బెంగపడుతున్న యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది, ఆ సమయంలో రాయల మానసిక స్థితిని అద్భుతంగా చిత్రించారు రచయిత. ” మనిషికి ఆత్మస్థైర్యం ఇవ్వవలసిన మానవ సంబంధాలే మనిషిని బలహీనం చేయడం సృష్టిలో చమత్కారం” అంటారు.
ఆముక్తమాల్యద రచన పూర్తి కాగానే శ్రీకృష్ణ దేవరాయలు తృప్తిగా కన్నుమూయడంతో నవల పూర్తవుతుంది.
చివరిదాక ఆసక్తిగా చదివించే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
శ్రీకృష్ణదేవరాయలు On Kinige

– కొల్లూరి సోమ శంకర్

Related Posts: