మరో ‘విషవృక్షం’- “ఇదండీ మహాభారతం” పుస్తకం పై సమీక్ష

లక్షకు పైగా శ్లోకాలున్న సంస్కృత మహాభారతంలోని విశేషాంశాలను తీసుకుని, ముఖ్యమైన కథలూ, ఘటనలేవీ పొల్లుపోకుండా దాదాపు అయిదువందల పేజీలకు కుదించి, హేతువాద దృక్పథంతో ‘ఇదండీ మహాభారతం‘ గ్రంథాన్ని ఆవిష్కరించారు రంగనాయకమ్మ. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఆమె రాసిన ‘రామాయణ విషవృక్షం‘ అనేకానేక చర్చలకు కేంద్ర బిందువుగా నిలిచింది. తాజా పుస్తకానికి- ‘మొగ్గా పువ్వూలేని, కాయాపండూలేని, మోడు! మాయల, మంత్రాల, వ్యర్థాల, వైరుధ్యాల, వికృతాల, వికారాల, క్రూరత్వాల, అబద్ధాల, కట్టుకథల, పుక్కిటి పురాణాల పుట్ట!’ అనే విశేషణాలు తగిలించడాన్నిబట్టి- ఆమె ఎంత తీవ్ర పదజాలంతో, భావజాలంతో విశ్లేషించారో అర్థంచేసుకోవచ్చు. ప్రజల్ని సంస్కృతి పేరుతో బుట్టలో వేసుకునే మత గ్రంథాల్లోని నిజానిజాలను ప్రజలకు తెలిపితీరాలన్నదే తన లక్ష్యమనీ ఆ ప్రయత్నంలో భాగమే ఈ పుస్తకమనీ రచయిత్రి చెబుతున్నారు. కె.ఎం.గంగూలీ, కవిత్రయం, పురిపండా అప్పలస్వామి రాసిన గ్రంథాలను ఆధారంగా తీసుకున్నారు. భారతంలోని అనేక కథలూ, ఘటనలూ, పాత్రలూ, వాటి స్వభావాలూ, ప్రవర్తనలకు సంబంధించి పలు సందేహాలు లేవనెత్తి, ప్రశ్నలు సంధించారామె. అనుచితమైన వర్ణనల్నీ, ఆనాటి సామాజిక పరిస్థితుల్నీ తనదైన, పదునైన శైలిలో విమర్శించారు. చివరికి ఫలశృతినీ వదల్లేదు. మొత్తానికి ఈ పుస్తకం కొత్త ఆలోచనలు రేకెత్తించేదిగానే ఉంది.

- దత్తు,ఈనాడు-ఆదివారం,4-1-2015.

 

idandiMahaBharatham

“ఇదండీ మహాభారతం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది.  మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

ఇదండీ మహాభారతం on kinige

 

IdandiMahabharatam600

 

Related Posts:

‘తత్వశాస్త్రం, చిన్న పరిచయం’ పుస్తకంపై సమీక్ష

మార్క్సిస్టు దృక్పథంతో కలం పట్టిన రచయిత్రి రంగనాయకమ్మగారు. ఆమె తాజా పుస్తకం ‘తత్వశాస్త్రం, చిన్న పరిచయం‘. ఎవరికీ అర్థంకాని ఓ జటిల శాస్త్రాన్ని తేలికపాటి చిన్న పదాల్లో అతి సామాన్య ప్రజలకు ఈ పుస్తకం ద్వారా చేరువ చేశారు.
ప్రకృతినీ, సమాజాన్నీ అర్థం చేసుకోవాలనే జిజ్ఞాసతో ప్రారంభమైన శాస్త్రమిది. మార్క్స్, ఏంగెల్స్ లను ప్రభావితం చేసినవాడు హెగెల్. “అభివృద్ధి అనేది నిరంతరం ముందుకు వెళుతూ ఉంటుంది. ఏదీ స్థిరంగా ఉండదు. సమాజం మారిపోతూ ఉంటుంది. అభివృద్ధి జరిగిపోతూ ఉంటుంది”. అంటూ హెగెల్ చెప్పిన మాటలు మార్క్స్‌ను ముగ్ధుణ్ణి చేశాయి. శ్రమ దోపిడీ రహస్యాన్ని బైటకు లాగిన సిద్ధాంతం మార్క్సు సిద్ధాంతం. మార్క్స్ తన సిద్ధాంతంలో తర్క విచారణ కోసం మాత్రమే హెగెల్‌ను పేర్కొన్నాడు. క్రీస్తుపూర్వం నాటి తత్వవేత్తలు, ఆధునిక తత్వవేత్తలు, మానవ చరిత్ర, చారిత్రక భౌతికవాదం వంటి ఇందులోని 48 శీర్షికలు ఎంతో ఆసక్తితో మనల్ని చదివింపజేస్తాయి.
‘ఆడవాళ్ళు ఎంత చక్కటి భౌతికవాదులు!’ అంటారీమె. కమ్యూనిజం తర్వాత ఏమిటి? అని ప్రశ్నిస్తారు. తత్వశాస్త్రం ఉంటే మంచిదే. లేకపోతే మరీ మంచిది అంటారు. మార్క్స్ ఏంగెల్స్‌లను ముగ్ధుల్ని చేసిన ఇద్దరు తత్వవేత్తలు ఎవరో వివరిస్తారిందు లో. పుల్లయ్య, ఎల్లయ్య కాలక్షేపం తత్వాలు ఎలా ఉంటాయో కూడా ఈ పుస్తకంలో ఆమె వివరిస్తారు.
శ్రామిక వర్గ పోరాటాన్ని ఒప్పుకోని ప్రాధాన్(దారిద్ర్యం తత్వశాస్త్రం రచయిత) పై మార్క్స్ చేసిన విమర్శలు వంటి అంశాలను హాయిగా ఇందులో చదువుకోవచ్చు.

–నవ్య, 28th May 2014

 

 

 

 

 

 

 

 

తత్వశాస్త్రం, చిన్న పరిచయం”నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

తత్వశస్త్రం, చిన్న పరిచయం on kinige

Related Posts:

పాక్షిక ఆత్మకథ

పుస్తకం : ఆత్మకథాంశాల ఉత్తరాలు

రచన : రంగనాయకమ్మ

నేపథ్యం : రంగనాయకమ్మ చాలా ఏళ్ల క్రితం కొందరికీ(ముఖ్యంగా కృష్ణాబాయికి); ఆ కొందరు రంగనాయకమ్మకూ పరస్పరం రాసుకున్న ఉత్తరాల్ని కలిపి అచ్చేసిన పుస్తకం ఇది.

విషయం : ఇది పొరపాటు ఊహే అయినా, రంగనాయకమ్మను తలుచుకోగానే, ఒక శిలావిగ్రహం గుర్తొస్తుంది. ప్రతిసారీ రూల్సూ రెగ్యులేషన్సూ అంటుందా ఏమిటీ, అని. కానీ ఆమెలో కూడా అందరిలాంటి కొన్ని సరదాలు, చమత్కారాలు, ఆటపట్టింపులు ఉన్నాయని చదివినప్పుడు ఒక రిలీఫ్ ఏదో కలిగింది. గాంధీతో తొలినాళ్ల కాపురం గురించిన ఆమె మాటలు చూడండి: ‘‘చలేస్తోంది. కిటికీలు వేసెయ్యి’’ అంటే, ‘‘ఎవరికి చలి? ఏ వర్గానికి చలి?’’ అంటాడు. ‘‘స్త్రీ వర్గానికి’’ అంటే, ‘‘అయితే కొంచెం ఆలోచించాల్సిందే’’ అని వొక రెక్క వేస్తాడు. చావుగా వుంది ఇతన్తో.’’

విడిగా ఆత్మకథ రాయని రంగనాయకమ్మ జీవితాన్నీ, ఆమెతో ముడిపడివున్న(సంబంధం తెంచుకున్న) వాళ్లను గురించిన ఆమె భావనల్నీ తెలుసుకోవడానికి ఈ లేఖలు పనికొస్తాయి. ఫుట్‌నోట్స్ ఇవ్వడం వల్ల వాటి నేపథ్యాన్నీ, అదనపు సమాచారాన్నీ అందించగలిగారు. ఉదా: కొడవటిగంటి కుటుంబరావు వాళ్లింట్లో భోజనానికి కూర్చున్నప్పుడు, ‘తినడం అయ్యాక మీ పళ్లెం తీసి సింకులో పెట్టెయ్యండి,’ అని ఆయన అనడంతో నొచ్చుకున్నారట! చెప్పకపోయినా పెట్టేస్తానుకదా, అని. రచయిత్రి అన్ని పుస్తకాల్లాగే హార్డుబౌండుతో, తక్కువ ధరలో లభ్యం.

రాజిరెడ్డి సాక్షి ఫన్‌డే 22 జూన్ 2013

* * *

“ఆత్మకథాంశాల ఉత్తరాలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.
ఆత్మ కధాంశాల ఉత్తరాలు On Kinige

Related Posts:

పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం

ఈ పుస్తకం పిల్లల కోసమే మొదలు పెట్టాను. ఈ పిల్లలు, 7, 8 తరగతుల నించీ 10 వ తరగతి వరకూ వున్న పిల్లలు.

పిల్లలకు చిన్న తనం నించీ ఆటలూ పాటలూ కథలూ చాలా కావాలి. ఆ కథలు, మాయలతో మంత్రాలతో వున్నా, వాటితో పాటే పిల్లలకు సైన్సు విషయాలు కూడా అందుతూ వుండాలి. సైన్సు అంటే, మనం నివసించే ప్రకృతి గురించీ, మనం జీవించే సమాజం గురించీ, నిజమైన విషయాల్ని రుజువులతో సహా వివరించే జ్ఞానం.

ప్రకృతి విషయాల్లో, ప్రతీ సైన్సునీ నేర్చుకోనక్కరలేదు. వైద్య శాస్త్రం ప్రతీ మనిషికీ క్షుణ్ణంగా అక్కర లేదు. రోజూవారీగా పాటించ వలసిన ఆరోగ్య సూత్రలు తెలిస్తే చాలు. అనారోగ్యాలు మీద పడినప్పుడు, వాటి సంగతి వైద్యులు చూసుకుంటారు. వైద్యులకు తెలిసినంత శాస్త్రం, ప్రతీ మనిషికీ అక్కర లేదు. ఇతర ప్రకృతి శాస్త్రాల సంగతి కూడా అంతే. కానీ, మనం జీవించే సమాజం గురించి చెప్పే శాస్త్రం సంగతి అలా కాదు. మనం మనుషులం; జంతువులం కాదు. జంతువులైతే పుట్టినవి పుట్టినట్టే జీవించి మరణిస్తాయి. వాటికి ఏ శాస్త్రాలూ, ఏ జ్ఞానాలూ అక్కర లేదు. కానీ, మనుషులకు, మనుషుల సంబంధాల గురించి తెలియాలి. ఆర్ధిక శాస్త్రమే, మనుషుల సంబంధాల్నీ, వారి జీవిత విధానాల్నీ, వివరిస్తుంది. ఈ శాస్త్రమే, నిన్నటి – ఇవాల్టి – రేపటి జీవితాల్ని చూపిస్తుంది. ఇది ప్రతి మనిషికీ తెలిసివుండాలి.

విజయనగరం నించి ‘నానీ’ అనే పిల్లల మాసపత్రిక ఒకటి వస్తూ వుండేది (ఎడిటర్: ఎన్. కె. బాబు). ఆ పత్రిక కోసమే, మొదట ఈ పాఠాలు ప్రారంభించాను. అప్పుడు, ‘డబ్బు’ వరకే చెపుదామనుకున్నాను. ఈ పుస్తకంలో వున్న 8 వ పాఠం వరకే ఆ పత్రికలో వచ్చింది. తర్వాత, ఆ పత్రిక ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆగిపోయింది. పిల్లల కోసం, మిగతా పాఠాలు కూడా చెప్పాలని దీన్ని పూర్తి చేశాను.

అయితే, పిల్లల కోసం ఇంత పుస్తకమా? ఇందులో వున్న చివరి పాఠాలు పిల్లలకి అర్థమవుతాయా? అని, నాకే కొన్ని సార్లు సందేహాలు వచ్చాయి. ‘పిల్లల కోసం’ అనే దృష్టి తోనే పాఠాల్ని ఎక్కువ వివరాలతో చెప్పవలసి వచ్చింది. ఇది పిల్లల కోసం కాబట్టి, పుస్తకంలో అక్షరాల సైజు చాలా పెద్దది. చాలా చొట్ల బొమ్మలు. ప్రశ్నలూ – జవాబులూ. చివరి పాఠాల్లో పత్రికల వార్తలు కూడా. ఈ కారణాల వల్ల, పుస్తకం పెద్దది అయింది. కానీ పాఠాలన్నీ చిన్నవే. ఈ మాత్రం పాఠాలు లేకపోతే, ఈ సైన్సుని కనీసంగా అయినా తెలుసుకోవడం సాధ్యం కాదు.

పిల్లలలో అనేక స్థాయిల వాళ్ళు వుంటారు. పుస్తకాలు చదివే అలవాటు, నేర్చుకోవాలనే ఆసక్తి వున్న పిల్లలకు ఇది సమస్య కాదు. తర్కంతో సాగే విషయాలని అర్థం చేసుకోవడంలో సమస్య రాదు.

ఈ పాఠాల పేర్లూ, వాతిల్లో మాటలూ, వాటిల్లో పాత్రలూ, పిల్లల చెవుల్లో, మనసుల్లో పడితే చాలు. అసలు ఇలాంటి శాస్త్రం ఒకటి వుందని పిల్లలకి తెలిస్తే చాలు. ఒక సారి చదివితే అర్థం కాని పాఠాన్ని ఇంకోసారి చదువుకుంటారు. ఇక అదంతా వాళ్ళ ఆసక్తి. పిల్లలకు ఎక్కడైనా అవసరమైతే, పెద్ద వాళ్ళు కొంచెం సహాయం చేస్తే, అసలు సమస్యే ఉండదు.
అయితే, తెలియని ఏ శాస్త్రం నేర్చుకునేడప్పుడైనా, పెద్దలు కూడా పిల్లలతో సమానులే. పెద్దల్లో కూడా నూటికి 99 మందికి, సమాజం గురించి చెప్పే శాస్త్రం తెలీదు. దీని కోసం మార్క్స్ ‘కాపిటల్’ చదవాలి. కానీ, అది మొదట్లో అసాధ్యం. అందుకే, ‘కాపిటల్’కి ‘పరిచయం’ గతంలోనే రాశాను. దాన్ని పెద్దలు తేలిగ్గానే చదువుకోవచ్చు. అయినా, దాని కన్నా ముందు ఈ పుస్తకం, ప్రారంభ పాఠాలుగా ఉపయోగపడుతుంది. ‘కాపిటల్’ అంటే భయపడే, బద్దకించే పెద్దల కోసం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకున్నాను. పిల్లల పుస్తకాలు పెద్దలు కూడా చదవాలి; నేర్చుకోవాలి. పిల్లలకి నేర్పాలి.

రంగనాయకమ్మ.

(“పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం” పుస్తకం ముందుమాట నుంచి)

* * *

పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం On Kinige

Related Posts: