ప్రముఖ డిటెక్టివ్ రచయిత మధుబాబు రచించిన షాడో స్పై థ్రిల్లర్ “కిల్ క్విక్ ఆర్ డై“.
పాకిస్తాన్లో ఉన్న అతికొద్ది కోటీశ్వరులలో ఒకడు ముస్తఫా. అతనికి దేశవిదేశాలలో ఎన్నో వ్యాపారాలున్నాయి. అటువంటి దేశాలలో బోర్నియో కూడా ఒకటి. అక్కడి వ్యాపారాలను పర్యవేక్షించడానికి వెళ్ళిన అతని కొడుకు రుస్తుం కనిపించకుండా పోతాడు. పాకిస్తాన్ ప్రభుత్వం, స్పెషల్ బ్రాంచ్ కలుగజేసుకున్నా కూడా ఏమీ ఫలితం లేకపోవడంతో, ముస్తఫా తన బాల్యస్నేహితుడైన ఇండియన్ హోం మినిస్టర్ని సాయం కోరుతాడు. సి.ఐ.బి నియమ నిబంధననలకి వ్యతిరేకమైనా, సాయం కోరి వచ్చిన మనిషిని కాదనలేక, ఆ ఎస్సైన్మెంట్ని స్వీకరిస్తారు కులకర్ణి.
రుస్తుంని వెదికే బాధ్యత మొదట శ్రీకర్కి అప్పగిస్తారు. శ్రీకర్ అక్కడికి వెళ్ళిన తర్వాత కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో, షాడో రంగంలోకి దిగుతాడు.
టునాంగ్ సిటీ అంతా గాలిస్తాడు. రుస్తుం ఉన్నాడనుకున్న భవనాన్ని గుర్తిస్తాడు షాడో. కాని అప్పటికే ఎవరో వాచ్మన్ని చంపేసి, రుస్తుంని అక్కడినుంచి తప్పించేసారు. మర్నాడు ఆ భవనంలో ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని వెదకాలనుకుంటాడు షాడో. పోలీసులని ఏమార్చేపని శ్రీకర్ చూసుకుంటే, షాడో ఆ భవంతిలోకి ప్రవేశిస్తాడు.
ఓ చిన్న ఆధారం దొరుకుతుంది షాడోకి. తీగ లాగితే డొంకతా కదిలినట్లు, ఆ చిన్న ఆధారంతో, రుస్తుంని అపహరించిన వాళ్ళ గుట్టు రట్టు చేద్దామనుకుంటాడు షాడో. ఈ ప్రయత్నంలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటాడు.
ఇంతకీ రుస్తుంని ఎవరు, ఎందుకు అపహరించారు? షాడోతో పాటు రుస్తుం కోసం వెదుకుతున్న గ్యాంగ్ ఎవరిది? రుస్తుంకి పరిచయం ఉన్న వ్యక్తులను ఒక్కొక్కరిగా చంపుతున్నది ఎవరు? వీరందరి బారి నుంచి షాడో రుస్తుంని ఎలా కాపాడాడు?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ఈ నవల చదవాల్సిందే.
“కిల్ క్విక్ ఆర్ డై” నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
కొల్లూరి సోమ శంకర్