కృష్ణారెడ్డిగారి ఏనుగు

ఈ కథా సంకలనం కన్నడంలో వివిధ రచయితలు రాసిన కథలకు అనువాదం.

కన్నడ సాహిత్యరంగంలో సుప్రసిద్ధులైన పూర్ణచంద్ర తేజస్వి, శాంతరస, నాగమంగల కృష్ణమూర్తి, కూదవళ్ళి అశ్వత్థ నారాయణరావ్, కుం. వీరభద్రప్ప, ఆర్.టి. శరణ్, ఎస్. తమ్మాజిరావ్, కె. సత్యనారాయణ, హెచ్. రమేష్ కెదిలాయ, ఎ. ఆర్. కృష్ణశాస్త్రి, గోరూర్ రామస్వామి అయ్యంగార్, కు.వెం.పు వంటి సుప్రసిద్ధ కథకులు రచించిన ఈ కథలను తెలుగులోకి హృద్యంగా అనువదించారు శాఖమూరు రామగోపాల్ గారు.

ఈ సంకలనంలోని కథలు కాలాలీతమైనవని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈ కథలలోని పాత్రలు, పాత్రల జీవితాలు, వారి వ్యక్తిత్వాల వర్ణన గ్రామీణ ప్రాంతాలలోని సొగసులతో మమేకమై సహజత్వాన్ని సంతరించుకున్నాయని ఆయన అన్నారు.

ఈ సంకలనంలోని కొన్ని కథలను పరిచయం చేసుకుందాం.

కృష్ణారెడ్డి గారి ఏనుగు: ఇది పెద్ద కథ. మూడిగెరె పట్టణంలో రకరకాల వ్యాపారలు చేసి అన్నిరకాలుగా నష్టపోయిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి మఠం వారి నుంచి ఓ ఏనుగుని కొంటాడు. జనాలందరూ నవ్వుకుంటారు. ఇప్పటికే దెబ్బతిని ఉన్నాడు, దీంతో పూర్తిగా నాశనం అయిపోతాడని అనుకుంటారు. కానీ దీనికి భిన్నంగా జరుగుతుంది. అడవిలోని పచ్చిక, జొన్నపిండి, బెల్లం ముద్దలు, చెరకు గడలు, అరటి గెలలు, చిలకడదుంపలు…వంటి వాటితో ఏనుగుకి మంచి ఆహరం అందిస్తాడు కృష్ణారెడ్డి. ఏనుగు చెట్లను లాగి తెచ్చిన డబ్బుతో కృష్ణారెడ్డి కాస్త ఆర్ధికంగా కోలుకుంటాడు. అయితే ఈ ఏనుగువల్ల ఆ ఊర్లో చాలా మంది రకరకాల సమస్యలని ఎదుర్కుంటారు. కరెంటోళ్ళు, టెలిఫోన్ వాళ్ళు, ఫారెస్టు వాళ్ళూ ఇలా అన్ని డిపార్ట్‌మెంట్ల వాళ్ళు ఆ ఏనుగు మీద ఎన్నో అభియోగాలు మోపుతారు. దాన్ని ఎలాగైనా పంపించేయాలని అనుకుంటారు. చివరికి ఏమవుతుందనేది ఆసక్తిదాయకం.

ఒకరూపాయి: ఎప్పుడూ గంభీరంగా ఉంటూ, మఠంలో ఉండి చదువుకునే ఓ వ్యక్తి కథ ఇది. మిగతా విద్యార్థుల కంటే బసవణ్ణకి సాహిత్య జ్ఞానం, ప్రాపంచిక జ్ఞానం అధికం కావడం వలన అతనికి ఆ ఊర్లో ఎంతో గొప్ప పేరొస్తుంది. ఎన్నో సమావేశాలలో పాల్గొని ప్రసంగాలిస్తూంటాడు బసవణ్ణ. ఓ రోజు తనది కాని సొత్తుకి ఆశపడి సొంతం చేసుకుంటాడు బసవణ్ణ. కానీ అతని మనసు అతన్ని ఊరుకోనీయదు. చివరికి ఆ డబ్బు తీసింది తానేనని నిజం ఒప్పుకున్నా ఎవరూ నమ్మరు. తల తీసేసినట్లయిపోతుందతనికి.

వ్యభిచారం: ఓ సేట్‌జీ జనాలనీ దోచీ, సరుకులని అధిక ధరలకి అమ్మిన డబ్బునంతా పెద్ద నోట్ల రూపంలో దాచుకుంటాడు. ఇంతలో ప్రభుత్వం వారు నల్లధనాన్ని అరికట్టే నిమిత్తం పెద్ద నోట్ల డినామినేషన్‌ని రద్దు చేస్తుంది. వాటిని చిన్న నోట్లుగా మార్చుకునేందుకు కొంత గడువిస్తుంది. ఓ లాయర్ సాయంతో తన డబ్బుని చిన్న చిన్న మొత్తాలుగా మార్చుకోవాలనుకుంటాడు. లాయర్ ఓ వ్యభిచారి చేతికి నోట్ల కట్టలిచ్చి, ఆమెని బ్యాంకుకి పంపిస్తాడు. ఒళ్ళమ్ముకుంటే అంత డబ్బు వస్తుందా అని అక్కడి అధికారులు ఆశ్చర్యపోయినా, చిన్న నోట్లు ఇస్తారు. తీరా ఆమె ఆ డబ్బుని సేట్‌కి ఇవ్వకుండా పారిపోయి తన సొంతూరికి ప్రయాణమైపోతుంది. ఆ వ్యభిచార గృహాన్ని నడుపుతున్నామెని అడిగితే, “మీ వల్లే ఆమె తప్పించుకుపోయింద”ని అంటూ, “వ్యాపారంలో వ్యభిచారం చేసి సంపాదించింది నిజమైన వ్యభిచారికే చేరింది…” అని అంటుంది.

వరాహపురాణం: ఈ కథ పందుల పెంపకం చేపట్టే ఎరుకల వారి గురించి రాసినది. మూలకథని 1982లో రాసినా, అటువంటి పరిస్థితులు నేటికీ మన గ్రామ సీమలలో కనపడుతునే ఉంటాయి.

కాంచన రథం: భీమాపూర్‌లో రావ్ సాహెబ్ ఓ జమీందారు లాంటి వాడు. విఠలుడికి భక్తుడు. అతని ఇంట్లో ఓ బంగారు రథం ఉండేది. పర్వదినాలలో దాన్ని ఊరంతా తిప్పి ఊరేగించేవారు. అయితే ఆ కుటుంబం కాలక్రమంలో చితికిపోతుంది, పెద్ద కొడుకు దేశం గాని దేశంలో ఖైదు చేయబడతాడు, రెండో కొడుకు పుట్టుకతోనే పోలియోసోకి వికలాంగుడవుతాడు మూడో కొడుకు పుట్టుగుడ్డి. కాలక్రమంలో ఆస్తులు హరించుకుపోయి, రావ్ సాహెబ్ పేదరికంలోకి జారుకుంటాడు. తన దురవస్థకి కారణం చెబుతాడు.

ఫలితం: రాజకీయ చదరంగంలో నెగ్గేందుకు పోటీదార్లు వేసే ఎత్తులని వర్ణిస్తుందీ కథ.

పేగుబంధం: ఒకరంటే ఒకరికి అవాజ్యమైన ప్రేమానుబంధం ఉన్న తండ్రీకొడుకుల కథ ఇది. మహమ్మద్ పేదవాడు, రోజూవారీ సంపాదన సరిపోక కొడుకు ఉస్మాన్‌ని కలకత్తా నాటక సమాజంలో నాటకాలు వేయడానికి పంపుతాడు. మొదట్లో బాగా కష్టపడి మంచిపేరు తెచ్చుకుంటాడు ఉస్మాన్. కానీ తన తండ్రిని మర్చిపోతాడు. కొన్నాళ్ళకి మహమ్మద్ కొడుకుని చూడాలనుకుని నానా కష్టాలు పడి, కలకత్తా చేరితే, అదే రోజు ఉస్మాన్ ఢిల్లీ వెళ్లిపోతాడు. రోజులు గడిచే కొద్దీ, ప్రియురాలి మోజులో పడి నాటకాలని పాడు చేసుకుని, మద్యానికి బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు ఉస్మాన్. చివరికి తండ్రిని చూడాలని బయల్దేరుతాడు. మహమ్మద్ కూడా అవసానదశలో ఉండి కొడుకు కోసం ఎదురుచూస్తుంటాడు. చదవురల గుండెల్ని కలచివేస్తుందీ కథ.

యాతన: రాగ్యా అనే కుర్రాణ్ణి చూస్తే జనాలు చచ్చిపోతారనే ఓ మూఢ నమ్మకం ప్రబలుతుంది ఓ ఊరిలో. దురదృష్ట జాతకుడని అందరూ అతడిని ఆడిపోసుకుంటూంటారు. సొంతూరు వదిలి మరో ఊరు వెళ్ళినా, తన ఊరి వాళ్ళు అక్కడ ఎదురై రాగ్యా గురించి అక్కడి వాళ్ళకి వివరించి, అక్కడ్నించి కూడా పంపేసేవారు. చివరికి పాపమ్మ అనే యువతి సాయంతో తన కష్టాలకు దూరంగా పోతాడు రాగ్యా.

వదులుకోటం: ఆచార వ్యవహారాలు నశిస్తున్న ఈ రోజులలో ధార్మిక జీవనం గడిపే ఉపాధ్యారు గారికి ఎదురైన సంకట స్థితి గురించి, ఆయన దేన్ని వదులుకున్నాడో చెబుతుందీ కథ. కాలక్రమంగా ధార్మిక జీవనంలో వస్తున్న మార్పులకు అద్దం పడుతుందీ కథ.

ఆముదం త్రాగిన తాసీల్దారు: పనిదొంగైన ఓ తాసీల్దారుని ఓ బ్రిటీషు అధికారి ఏ విధంగా దారికి తెచ్చాడో ఈ కథ చెబుతుంది. హాస్యంగా సాగుతుందీ కథ.

15 కథలున్న ఈ పుస్తకంలోని కథలు చివరిదాక చదివిస్తాయి. ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల 90/- రూపాయలు. నెలకి రూ. 30/- అద్దెతో ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

కృష్ణారెడ్డి గారి ఏనుగు On Kinige

కొల్లూరి సోమశంకర్

Related Posts:

వొడువని ముచ్చట

ఈ పుస్తకానికి సేత తెలంగాణా సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్, వ్రాత కొంపల్లి వెంకట్ గౌడ్.

తెలంగాణా చరిత్రలో ఒక కాన్సెప్ట్ కోసం పూర్తి జీవితాన్ని పణంగా పెట్టి పనిజేసిన జయశంకర్  సార్ అనుభవాలు రికార్డ్ చేసి అందించారు వెంకట్ గౌడ్.

పుస్తకం ఎట్లుండాలంటె… అని చెబుతూ, “నేను రాస్తే ఎట్లుంటది అంటే ప్రతి అక్షరం చెక్కినట్లు వుంటది. రాసే ప్రతీ పదం చదివేవాల్లను ఆలోజింపజేయాలె” అని అంటారు సార్.

జయశంకర్ గారు విద్యార్థిగా, ఉద్యోగిగా, టీచరుగా, పదవిలో ఉన్నా లేకున్నా తెలంగాణ సమస్యతోనే జీవితం పెన వేసుకున్న స్వచ్ఛంద కార్యకర్త. ఆయనకు ఏ రాజకీయ పార్టీలతో గాని, వేదికలతో గానీ, వాటిల్లో సభ్యత్వం గానీ లేవు. తెలంగాణా గురించి ఎవరు పనిచేసినా వారితో మమేకమై పని చేసారు. తను తెలంగాణా సిద్ధాంత కర్తను కానని, మొదట ఇంగ్లీషు మీడియాలో తెలంగాణా ఐడియలాగ్ అని రాయడం మొదలు పెట్టారని, కాలక్రమంలో దాన్నే తెలుగు మీడియా ‘సిద్ధాంతకర్త’గా అనువదించి ప్రాచుర్యం కల్పించిందని ఆయన వివరించారు.

ఇప్పుడు నడుస్తున్న ఉద్యమం ఎలా రివైవ్ అయిందో ఈ పుస్తకంలో తెలియజేసారు సార్.

‘తెలంగాణాలో ఏం జరుగుతోంది’ అనే పుస్తకానికి వచ్చిన ప్రాచుర్యం ఏ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదని అంటారాయన.

అమెరికాలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం అనే సంస్థ ఎలా ఏర్పడిందో సార్ వివరంగా చెప్పారు. దాని కోసం జయశంకర్ గారు అమెరికాలో విస్తృతంగా ప్రయాణించి ఎన్నో ఉపన్యాసాలిచ్చారు.

కెసీఆర్ తో తానెందుకు ఇంప్రెస్ అయ్యారో జయశంకర్ గారు చెబుతూ, కెసీఆర్ కాన్సెప్టులలో లోతుగా వెళ్ళి, విశ్లేషించి క్రిటికల్‌గా చర్చించేవారని అన్నారు. విషయ అవగాహన ఉండి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ప్రజల భాషలో నుడికారంలో తీసుకుపోయేటువంటి వ్యక్తి కెసీఆర్ అని సార్ భావించారు.

తెలంగాణవాదులని పరస్పరం కలవమని లక్ష్యం కోసం కలిసి పని చేయమని, అప్పుడే ఉద్యమం స్ట్రెన్తెన్ అవుతుందని జయశంకర్ చెప్పేవారు.

తనను ఎవరైనా విమర్శించినా, ప్రతి విమర్శ చేయనని చెబుతూ, “నాకు చేతనైంది చేస్తనయ్యా, తప్పైతే తప్పు, ఒప్పైతే ఒప్పు. …కాలం నిర్ణయిస్తది… ఎవరి పాత్ర ఏంది” అని అంటారు.

ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు మూడు భాషలు తెలిసుండం తెలంగాణా కాంటెక్ట్స్‌లో చాల అవసరమని, తనకున్న అడ్వాంటేజ్ అదేనని సార్ అంటారు.

కళారూపాలు ఉద్యమంపై చూపిన ప్రభావం గురించి చెబుతూ, సాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా కల్చరల్ డైమెన్షన్ రావడానికి, తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవనానికి కళారూపాలు ఎంతో దోహదం చేసాయని చెప్పారు.

తెలంగాణను తప్పకుండా జూస్తనని నమ్మిన వ్యక్తి జయశంకర్ గారు. తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి కోసం అన్నీ సాధ్యమవుతాయని ఆయన నమ్మారు.

బి.సి.లలో ఐక్యత లేదని, అదే తెలంగాణ ప్రాంతంలో సామాజిక న్యాయానికి ప్రతిబంధకం అని ఆయన భావించారు. రాష్త్రం ఏర్పడితే సామాజిక న్యాయం సంభవం అవుతుందని చెబుతూ, ఇక్కడి బలహీన వర్గాలలో చైతన్యస్థాయి పెరిగిందని, ఆ చైతన్యమే రాబోయే రాష్ట్రాన్ని కాపాడుతుందని ఆయన భావించారు.

కాకతీయ యూనివర్సిటీలో పనిచేసిన మూడేండ్లలో తను చేపట్టిన మార్పుల గురించి చెప్పారు సార్ ఈ పుస్తకంలో. ‘నేను చేసేపనిలో ఓపెన్‌నెస్ వుంటది, గుసగుసలు ఉండవు’ అంటారాయన.

నిజమైన బలహీన వర్గాలంటే ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా నెగ్లెక్ట్ అయినవాళ్ళు తప్ప, ముస్లిమ్సా, దళితులా, బిసిలా అని గాదు…. నెగ్లెక్టెడ్ సెక్షన్స్…అని అభిప్రాయ పడ్డారు జయశంకర్ గారు.

కల్చరల్ మూవ్‌మెంట్, పొలిటికల్ మూవ్‌మెంట్ రెండూ కలిసి సాగాలని, అవి రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయని సార్ భావిస్తారు. సామాజిక న్యాయం దృష్టితో చూస్తే ఇది అత్యవసరమని ఆయన అభిప్రాయం.

పిల్లల ఆత్మహత్యల గురించి వ్యాఖ్యానిస్తూ “ఈ జనరేషన్ యూత్‌లో చాల ప్రస్టేషన్స్ వున్నయ్. అవగాహన లోపం ఉన్నది. ఎక్స్‌పెక్టేషన్స్ వున్నయ్. ఇవన్నీ నాకు గూడ సరిగా అర్థం గావడంలేదు, పిల్లలు ఎందుకిట్ల జేస్తున్నరని. సెల్ఫ్ ఇంబ్యాలెన్, ఇది చాల విచిత్రమైన పరిణామం” అని అన్నారు.

డిసెంబర్ 9 ప్రకటన రావడానికి కెసీఆర్ దీక్ష ట్రిగ్గర్‍లా పనిచేసిందని, లాబీయిస్ట్‌ల కుట్రల వల్ల కేంద్రం వెనక్కి తగ్గిందని చెప్పారు. లాబీయింగ్ గురించి చెబుతూ, మద్రాసు నుంచి విడిపోడానికి లాబీయిస్టులు ఎంత శక్తివంతంగా పనిచేసారో చెప్పి అంతే శక్తితో ప్రస్తుతం పనిచేస్తున్నారని అన్నారు. ఇప్పుడు నడుస్తున్న లాబీయింగ్ లోపల కులాలున్నయ్, ప్రాంతాలున్నయ్, డబ్బుసంచులున్నయ్ అని చెబుతూ, లాబీలో ఉండే వారి కాంబినేషన్ మారచ్చు, కానీ లాబీలవేనని చెప్పారు.

లాండ్ రిఫార్మ్స్ అనేది ప్రత్యేక రాష్ట్రం ఉంటే వెంటనే జరిగిపోయేవని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం వలన ఆనాటి ముఖ్యమంత్రి ప్రవేశబెట్టిన సంస్కరణలు ఆగిపోయాయని చెబుతారు.

తెలంగాణ రచయితల గురించి చెబుతూ…వారిని వాగ్గేయకారులిగా అభివర్ణించారు, కాకపోతే ఈ వాగ్గేయకారులు దేవుని గురించి కాకుండా మనుషుల వెతల గురించి రాసారని అన్నారు.

అధ్యాపక వర్గంలో తెలంగాణ గురించి మంచి అవగాహన ఉందని, కానీ ప్రత్యక్షంగా ఉద్యమంలో దిగి పనిచేయడానికి పరిమితులున్నాయని సార్ భావించారు.

మన్‌‍మోహన్‌సింగ్ భారత ప్రథాని కాకముందు ఆయనతో తనకున్న సంబంధాలని వివరించారు జయశంకర్.

తమది దిగువ మధ్యతరగతి కుటుంబమని చెబుతూ, చిన్నతనంలో తన విద్యాభ్యాసం సాగిన తీరుని వివరించారు. తన లైఫ్ యాంబిషన్ ఎకనామిక్స్‌లో లెక్చరర్ కావడం అని చెబుతూ, దాని సాధన కోసం ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో వివరించారు.

తన జీవిత ప్రస్థానంలో భాగంగా ఏ ఊర్లో అయితే పుట్టారో, అదే ఊర్లో స్కూల్ టీచరుగా పనిచెసి, అదే ఊళ్ళో వైస్ ఛాన్సలర్‌గా పదవీ విరమణ చేసారు జయశంకర్.

దేశం మొత్తం మీద క్షీణిస్తున్న విలువల గురించి ఆందోళన చెందుతూ, కెరీర్, కెరీరిజమ్ పెరిగిపోయాయ్ని, సంపాదన ప్రధాన ధ్యేయమైపోయిందని అన్నారు. అధ్యయనం చేయడం తగ్గిపోతోందని, అధ్యయనం అంటే పుస్తకం చదవడమే కాదు. లైఫంతా అధ్యయనమేనని అన్నారు.

ఇప్పటి వరకు ఏ రచనలో రాని అనుభవాలను, జ్ఞాపకాలను రచయితతో పంచుకున్నారు సార్. అవి ఆయన భాషలోనే వస్తున్న పుస్తకం ఇది. ఇంకా ఎన్నో విషయాలు స్వయంగా జయశంకర్ గారు చెప్పినవి ఈ పుస్తకంలో ఉన్నాయి.

ఇది జయశంకర్ గారి చివరి పుస్తకం. చారిత్రక, సాంస్కృతిక నేపధ్యంలో అతి ముఖ్యమైన పుస్తకం. ఆయన మనసు విప్పి ఎన్నో విషయాలు చెప్పారు ఈ పుస్తకంలో. ఓ రకంగా ఇది ఆయన ఆత్మకథ అని భావించవచ్చు.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభ్యమవుతుంది. వెల 90/- రూపాయలు. నెలకి 30/- రూపాయల అద్దెతో కూడా చదువుకోవచ్చు.

వొడువని ముచ్చట On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

హైదరాబాద్ వచ్చిన షాడో

తన పేరు మీద దోపిడీలు చేస్తున్న ఓ ముఠా పని పట్టడానికి తన మిత్రులతో కలసి హైదరాబాద్‌కి వచ్చి షాడో చేసిన ఉత్కంఠభరితమైన సాహసాలు ఈ రోమాంచక నవలలో చదవండి.

షాడో ఇన్ హైదరాబాద్ On Kinige

Related Posts:

ఉత్సవకానుక

ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రాసిన కథల సంకలనం “ఉత్సవకానుక”. తన కథలకు ప్రేరణ సమాజం, సమాజంలోని వ్యక్తులు, వారి ప్రవర్తన అని రచయిత అంటారు. మూర్తిగారు అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేసినా, తనకి నచ్చిన ప్రక్రియ మాత్రం కథేనని ఆయనంటారు.

ఈ సంకలనంలోని కొన్ని కథలను పరిచయం చేసుకుందాం.

ఉత్సవకానుక: తాను ప్రాణంగా ప్రేమించే శాస్త్రీయ సంగీతాన్ని విని తరించడానికి దీక్షితులు అనే అనే ఓ పేద వ్యక్తి దాదాపుగా 160 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓ ఆరాధనా ఉత్సవానికి హాజరవుతాడు. రాత్రి బస కోసం, నిర్వాహకులను బిడియపడుతూ అడుగుతాడు. ఉన్నన్ని రోజులు పిల్లలు పాడినా, పెద్దలు పాడిన ఎంతో శ్రద్ధగా విని తన్మయుడవుతాడు. ఉత్సవం ముగింపు కొచ్చేసరికి అందరూ ఎంతో కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తుంటే, ఎటువంటి ఆడంబరాలకు పోకుండా ఓ చిన్న కవర్‌ని హుండీలో వేసి మౌనంగా నిష్ర్కమిస్తాడు దీక్షితులు. అదే ఉత్సవ కానుక.

అమ్మాయి పెళ్ళి: తన కూతురికి అమెరికా సంబంధమే చేసి నలుగురిలో గొప్ప అనిపించుకోవాలనే తపన ఓ తల్లిది. మధ్యతరగతి వారైనా, ఎలాగొలా ధనవంతుల సంబంధం చేసి కూతుర్ని విదేశాలకి పంపితే, ఆ తర్వాత తను కూడా విదేశాలకి వెళ్ళచ్చనే ఆశ అనంతలక్ష్మిది. మ్యారేజి బ్యూరో వారి దరఖాస్తు నింపిస్తుంది, మూడువేలు చదివించుకుంటుంది. వాళ్ళు చెప్పిన ఫోటో స్టూడియోలోనే అమ్మాయి ఫోటోలు తీయిస్తుంది. రెండేళ్ళు గడచినా ఒక్క సంబంధమూ రాలేదు. ఆ తరువాత వచ్చిన ఒకటి రెండు సంబంధాలు పెళ్ళిచూపుల వరకు రాకుండానే, వీగిపోయాయి. ఈ లోపల కూతురు తనతో పాటే పని చేసే లెక్చరర్‌ని పెళ్ళి చేసుకుంటానని చెబుతుంది. ఈడూజోడూ, కులం, గోత్రం అన్నీ సరిపోవడంతో తండ్రి ఒప్పేసుకుంటాడు. కూతురి పెళ్ళి గురించి తాను కన్న కలలన్నీ నీటి బుడగల్లా పేలిపోగా, అనంతలక్ష్మి తలపట్టుకుని కూర్చుట్టుంది.

తెరవు: ఓ పెద్దాయన మంగ అనే చిన్న పిల్లని తన ఇంట్లో ఉంచుకుని పని చేయిస్తున్నాడనే కారణంతో బాలకార్మికుల నిషేధం గురించి మాట్లాడి మంగకి ‘స్వేచ్ఛ’ కల్పిస్తుంది వసుంధర. మంగ జీవితం నాశనం కాకుండా కాపాడానని ఆమె భావిస్తుంది. కానీ అసలు విషయం వేరు. పేద పిల్లయిన మంగకి శుభ్రమైన బట్టలివ్వడం, మూడు పూటలా భోజనం పెట్టడం, చదువు నేర్పడం వంటివి చేసారా పెద్దాయన. వాళ్ళ కుటుంబానికి రావల్సిన డబ్బేదో ఉంటే దాన్ని కూడా ఇప్పించారాయన. ఇవన్నీ ఆయన చనిపోయాక, వసుంధరకి తెలుస్తాయి. అప్పట్నించి మంగ బాధ్యత తను తీసుకుంటుంది.

పాత బంగారు లోకం: ఆనందరావు, అమృతలది అన్యోన్య దాంపత్యం. చిన్ననాటి నుంచి ఉన్న ఊర్లోనే ఉండడంతో, అమృతకి విసుగ్గా ఉంటుంది. భర్తకి వేరే ఊరిలో ఉద్యోగం వస్తే బాగుండనుకుంటుంది. తమ ఇంట్లో ఉన్న పాత సామాన్లను వదిలించుకుని, కొత్త ఊర్లో కొత్త వస్తువలతో హాయిగా ఉండచ్చని అనుకుంటుంది. ఆమె కోరుకున్నట్లే భర్త కొత్త ఉద్యోగంలో చేరుతాడు, కాని ఇక్కడే వచ్చిందో చిక్కు. అతనిని ఉన్న ఊర్లోనే నియమిస్తుంది కొత్త కంపెనీ !!

ఊరట: ఓ కుటుంబంలోని ముగ్గురు తోబుట్టువులలో ఆఖరిది గాయత్రి. ఆమెకి పెళ్ళీడు వచ్చినా, ఆర్ధిక సమస్యల వలన ఇంకా పెళ్ళికాదు. అక్కలిద్దరి పెళ్ళి చేసేసరికే తండ్రి అప్పుల పాలవుతాడు. తల్లి మరణించడంతో తండ్రి అవసరాలన్నీ తనే చూస్తుంటుంది గాయత్రి. తనకీ పెళ్ళయి వెళ్ళిపోతే తండ్రి పరిస్థితి ఏమిటని బాధ పడుతుంటుంది. చివరికో సంబంధం కుదురుతుంది. పెళ్ళికొడుకు రూపసి కాకపోయినా, సంస్కారవంతుడు కావడంతో ఊరట చెందుతుంది గాయత్రి.

చిలకాకుపచ్చ రంగు జరీ చీర: వ్యాపారం కోసం సంస్థలు జనాలని ఏ విధంగా మోసం చేస్తున్నాయో ఈ కథ చెబుతుంది. తనకిష్టమైన చిలకాకుపచ్చ రంగు జరీ చీర కొనడానికి అనంతలక్ష్మి ఎన్నో తిప్పలు పడుతుంది. తన పాత చీరలు కొన్ని, అయిదు డిస్కౌంటు కూపన్లు పట్టుకుని షాపుకి వెడుతుంది. ఆమెకి కావల్సిన చీర సుమారుగా ఐదు వేల రూపాయలలో ఉంటుంది. ఆమె పట్టుకువెళ్ళిన చీరలకి, కూపన్లకి ఐదు వందల రూపాయల విలువ కడతాడు సేల్స్‌మాన్. చివరికి వేర్వేరు రకాల చీరలు చూసి, తనకి కావల్సిన చీరని రెండువేల ఏడొందల రూపాయలు పెట్టి కొనుక్కుంటుంది. మర్నాడు పొద్దున్నే వాళ్ళమ్మ ఊర్నుంచి వస్తూ అనంతలక్ష్మికి పుట్టిన రోజు కానుకగా చిలకాకుపచ్చ రంగు జరీ చీర తెస్తుంది. ఆవిడ దాన్ని మగ్గాల నుంచి నేరుగా కొని డిస్కౌంటు ఇస్తున్న కొత్త షాపులో రెండువేల రూపాయలకే కొందని తెలిసి అనంతలక్ష్మి గతుక్కుమంటుంది.

వృత్తిధర్మం: వృత్తులన్నీ వ్యాపారరీతిలో నడుస్తున్న ఈ రోజులలో తన వృత్తి అయిన పౌరోహిత్యాన్ని ఎంతో నిజాయితీగా నిర్వహిస్తూ వచ్చిన కొద్దిపాటీ పైకంతోనే రోజులు నెట్టుకొట్టుస్తూంటాడు గణపతిశాస్త్రి. ఓ పేదింటి పిల్ల వివాహం అతి తక్కువ ఖర్చుతో చేయించి, ఆ కుటుంబానికి సాయం చేస్తాడాయన. “పసుపు తాడైనా, పసిడి పుస్తైనా అవి మనుషులని, మనసులనీ ముడివేసే బంధాలే” అని ఆయన విశ్వాసం. కథ చివర్లో ఆయన కష్టాలు తీరే మార్గం దొరుకుతుంది.

అంతరాలు: ఇది ఇద్దరు తమ్ముళ్ళ కథ. తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకి కూడా వాటా ఉందని తెలిసి లక్షల ఆస్తిలో వాటాకి బదులుగా, చాలా తక్కువ మొత్తం అక్కకి వచ్చేలా చేద్దామని ఒక తమ్ముడు ఆలోచిస్తే; తను పేదవాడైనా, రోజుకూలీ అయినా, అక్క రాకరాక ఇంటికి వస్తే చీరపెట్టడానికి అప్పు చేస్తాడు మరో తమ్ముడు. వీరిద్దరి మధ్య అంతరాన్ని చూపుతుందీ కథ.

సంసారంలో హింసానాదం: ఈ కథ మధ్యతరగతి సంసారాల్లోని ఓ పెద్ద గండం గురించి చెబుతుంది. అదేంటంటే….అతిధులుగా వచ్చిన చుట్టాలు ఎన్ని రోజులైనా తిరుగు ప్రయాణం మాటెత్తకపోడం. అసలే అంతంత మాత్రంగా ఉండే ఆర్థిక పరిస్థితులలో గుట్టుగా నడిచే సంసారాలు…ఇలాంటి రా’బంధువు’ల వలన వీధినపడుతూంటుంది. “రెండే రాత్రుళ్ళుంటాం…… శివరాత్రి నుంచి సంకురాత్రి వరకు….” అనే పాతకాలం సామెత గుర్తొస్తుంది ఈ కథ చదివాక.

గోరింట పండింది: “కొత్త పెళ్ళికొడుకు బుగ్గ గోరింటతో పండేదెప్పుడు?” అనే ప్రశ్నకి సమాధానం ఈ కథలో దొరుకుతుంది. గోరింట తను పండడమే కాకుండా ఓ జీవితాన్నీ పండిస్తుందీ కథలో. అద్భుతమైన కథ ఇది.

సాఫీగా హాయిగా సాగే ఓ జలప్రవాహంలా సాగిపోయే 15 కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. మూర్తిగారి కథలలో “వాస్తవికత, భావుకత గణనీయంగా ఉంటాయని” డా. సి. నారాయణ రెడ్డి గారు వ్యక్తం చేసిన అభిప్రాయం నూటికి నూరు పాళ్ళు సరైనదనేని ఈ కథలు చదివితే అనిపిస్తుంది. రూ. 50/- ఖరీదున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. నెలకు రూ. 30/- అద్దెతో కూడా చదువుకోవచ్చు.

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

Velupillai now in Tenglish !!

 

telugu lipi cadavaṭaṃ rāni telugu vāriki oka suvarṇāvakāśaṃ. telugulō atyaṃta goppa kathallōvigā pērgāṃcina vēlupiḷlai kathalu ippuḍu teglish lipilō kūḍā kinigepai labhyaṃ. vivarālaku cūḍaṃḍi

Details are @ http://kinige.com/kbook.php?id=310 

For those Telugu souls who cannot read Telugu script, here is a great
opportunity to enjoy one of the finest Telugu short stories!
Now Velupillai kathalu from C. Ramachandra Rao are available in
Tenglish script on Kinige .

 

తెలుగు లిపి చదవటం రాని తెలుగు వారికి ఒక సువర్ణావకాశం. తెలుగులో అత్యంత గొప్ప కథల్లోవిగా పేర్గాంచిన వేలుపిళ్లై కథలు ఇప్పుడు తెగ్లిష్ లిపిలో కూడా కినిగెపై లభ్యం. వివరాలకు చూడండి 

Visit now http://kinige.com/kbook.php?id=310 to buy / gift this eBook @ 50Rs only.

VĒLUPIḶLAI On Kinige

Related Posts:

సూపర్ ఫాన్ ఆఫ్ మధుబాబు – 2 : 20శాతం తగ్గింపు 12 మధుబాబు ఈపుస్తకాలపై!

ఈ తగ్గింపు హార్డ్ కోర్ మధుబాబు అభిమానుల కోసం. 12 మధుబాబు ఈపుస్తకాలు కొనండి 20శాతం తగ్గింపు పొందండి! ఈ దిగువ పుస్తకాలు ఆ పన్నెండు.
1 ఆపరేషన్ కాబూల్
2 కిల్లర్ ఫ్రం సిఐబి
3 ఆపరేషన్ ఆరిజోనా
4 రన్ ఫర్ ది బోర్డర్
5 రివేంజ్ రివేంజ్
6 లోన్ ఉల్ఫ్
7 ఫ్లైయింగ్ ఫాల్కన్
8 డాక్టర్ జీరో
9 జూనియర్ ఏజెంట్ శ్రీకర్
10 ప్రొఫెసర్ షాడో
11 మేరా నాం రజూలా
12 ది గర్ల్ ఫ్రం సిఐబి

ఇతర తగ్గింపులు

Super fan of Madhu Babu
Super fan of Madhu Babu – 2 On Kinige

Related Posts:

సత్సంగ సంకలనం

కేకలతూరి క్రిష్ణయ్య గారు సత్సంగం గురించి, మానవసేవ గురించి, దైవం గురించి, వాక్కు గురించి, విశ్వప్రేమ గురించి, ఆయుర్వేదం గురించి, వృద్ధాశ్రమాల గురించి ఎంతో సమాచారం సేకరించి ఈ పుస్తకంలో అందించారు.

భారతీయ సంస్కృతిలో సత్సంగం చాల విలువైనది. చాలా అద్భుతమైనది. సత్యంతో సంగం కలవడమే సత్సంగం. సామాన్యులకు సైతం దైవ శక్తిని అందుబాటులోకి తెచ్చి దైవంతో అనుసంధానం చేయగల భక్తులు, జ్ఞానుల సాంగత్యం అవసరమైనది. వీరు టి.వి. కి ఆంటీనా లాంటి వారు. తనకు తానుగా ఎగరలేని ధూళి, గాలి సాంగత్యం వల్ల ఎలా పైకి ఎగురుతుందో, అలాగే సత్సంగం సామాన్యులను కూడా ఉన్నత శిఖరాలకు తీసుకువెడుతుందని రచయిత అంటారు.

మానవసేవే మాధవ సేవ అని చెబుతూ, రచయిత చెప్పిన తమిళ బస్ డ్రైవర్ వృత్తాంతం ఆకట్టుకుంటుంది.

మాట్లాడడం గురించి చెబుతూ, ” మనం మాట్లాడే మాట కృతజ్ఞతతో అభివాదం చేసినట్లుండాలి. ఎదుటివారిని నొప్పించే విధంగా అసలు మాట్లాడకూడదు. ఒంటికి గాయమైతే కొన్ని నెలల్లో తగ్గుతుంది. మనసుకు గాయమైతే జీవితాంతం పుండుగానే ఉంటుంది” అని అంటారు రచయిత.

ఒక పేదవాడు అతి కష్టం మీద కొబ్బరిబోండాల వ్యాపారం ప్రారంభిస్తాడు. ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కుకున్నాక, తన పాత రోజులను గుర్తు చేసుకుని, తన లాంటి వారి బాధలు కొంతైనా తీర్చాలనే ఉద్దేశంతో నగరంలోని ఆసుపత్రులలో రోగులకు ఉచితంగా కొబ్బరి బోండాలు పంచాడు. ఈ ఉదార స్వభావి గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

పరమాత్మ సేవ గురించి ఖురాన్‌లో చెప్పిన మార్గాల గురించి రచయిత ఇలా చెప్పారు:
1. మొదటిది ప్రార్థన: అది నిన్ను సగం దూరం తీసుకెళ్తుంది.
2. రెండవది ఉపవాసం: అది నిన్ను దేవుని సాన్నిధ్యాపు వాకిలి దాకా తీసుకెళ్తుంది.
3. మూడవది బీదవారి కష్టాలు తీర్చడం: అది నిన్ను సౌధంలోనికి తిసుకెళ్తుంది.
కాబట్టి బీదలకు, కష్టాలలో ఉన్నవారికి సాయం చేస్తే అది పరమాత్మ సేవతో సమానమని రచయిత చెబుతారు.

పెన్సిల్‌కి సృష్టికర్త ఇచ్చిన సలహా అద్భుతంగా ఉంటుంది.
1. ఎవరో ఒకరు సృష్టించనిదే నీకొక విలువ లేదు, నీవల్ల ఉపయోగం లేదు. కాబట్టి మనం కూడా ఒక ఉన్నత ఆదర్శం కోసం నిలవాలి.
2. అవసరాన్ని బట్టి నిన్ను చెక్కుతునే ఉంటారు. కాని ఆ పని నిన్ను బాధిస్తుందని తలచరు. నువ్వు పదునెక్కే కొద్దీ నీ ఉపయోగం పెరుగుతుంది.
3. పెన్సిల్ పై భాగం ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, అందులో ఉపయోగపడేది లోపలి భాగం మాత్రమే. మనలో కూడా ప్రేమ, నిశ్శబ్దత, మంచితనం అనే అంతర్గత గుణాలు చాలా విలువైనవి. పైపై మెరుగులు నిరుపయోగమైనవి.
4. పెన్సిల్ ఉపయోగిస్తున్నప్పుడు ఎన్నో తప్పులు చేయవచ్చును. కానీ వాటిని సరిజేసుకునే అవకాశం కూడా ఉంది. మనం ఎన్నో తప్పులు చేస్తాము, వాటిని దిద్దుకునే శక్తిని, సమర్ధతని మనం పెంచుకోవాలి.
5. ఎక్కడికి వెళ్ళినా నీదైన ఒక ప్రత్యేకతను నిలుపుకుంటావు. నీవు కూడా ఎక్కడికి వెళ్ళినా నీ మంచితనంతో, నీ సత్ప్రవర్తనతో నీదైన ఒక స్థానాన్ని నిలుపుకోవాలి.

వాస్తు గురించి చెబుతూ, వాస్తు శాస్త్రం గురించి తెలియజేసారు రచయిత. నివాస స్థలంలో ఇల్లు ఎలా నిర్మించుకోవాలి అని చెప్పేదే శాస్త్రం, ప్రకృతిలో పనికి వచ్చే అంశాలను, ఎనర్జీ క్షేత్రాలను మనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే శాస్త్ర ఉద్దేశం. ఈ సూత్రాలకు మతపరమైన విశ్వాసాలని జోడించడంతో వాస్తు ఒక శాస్త్రంగా కాకుండా కేవలం నమ్మకంగా మిగిలిపోయిందని ఆయన అంటారు. చాలా మంది వాస్తు ద్వారా జనాలను భయపెట్టి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారని రచయిత అంటారు. ఓ వ్యక్తి ఆర్థికంగా నష్టపోడానికి, అనారోగ్యం పాలవడానికి అనేక కారణాలుంటాయి. నిజానికి కలిసి రావడానికి, నష్టపోడానికి మానసిక సంబంధమైన అంశాలే కారణం కావచ్చు. గాలి, వెలుతురు సరిగా లేని ఇళ్ళల్లో ఒక రకమైన సఫోకేషన్ శారీరకంగా మానసికంగా ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా వారు తీసుకునే కొన్ని నిర్ణయాల మీద దాని ప్రభావం కనిపిస్తుందని రచయిత చెబుతారు.

పిల్లల నిరాదరణకి గురైన వృద్ధులకు కారుచీకటిలో కాంతిరేఖల్లా – మేమున్నాం, మీకేం పర్వాలేదు అంటూ జీవితం పై ఆశని పెంచేవి వృద్ధాశ్రమాలని రచయిత అంటారు. హైదరాబాదు నగరంలోని వృద్ధాశ్రమాల జాబితా, అవి కల్పించే సౌకర్యాల గురించి రచయిత తెలియజేసారు.

వివిధ వ్యాధులకు ఉపకరించే ఆయుర్వేద మందులను ఈ పుస్తకంలో రచయిత వివరించారు.

“విజ్ఞానం సముద్రం వంటిది. అందులో ముత్యపు రాశులు కోకొల్లలు. వాటిని తేగలిగే ప్రతిభావంతులు ఉంటే ఉండవచ్చు, కానీ నేను మాత్రం ఆ సముద్రం ఒడ్డున గులకరాళ్ళని ఏరే పసివాడిని” అని న్యూటన్ మాటలని ఉటంకిస్తూ రచనని ముగిస్తారు రచయిత.

ఉపయుక్తమైన సమాచారాన్ని సేకరించి అందించిన ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల 63/- రూపాయలు. నెలకి రూ.30/-తో అద్దెకు తీసుకుని చదువుకోవచ్చు.

సత్సంగ సంకలనం On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

మూడో అందం

గోటేటి లలితాశేఖర్ రాసిన కథల సంకలనం ఇది. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి, కుటుంబ అవసరాల రీత్యా గుంటూరులో స్థిరపడ్డారు రచయిత్రి. లలిత గారు మనిషి మనసూ, అతని వ్యక్తిత్వం, జీవన నిర్వహణకి కావల్సిన దృక్పథం వంటి అంశాలను ప్రథానంగా చేసుకుని కథలు అల్లుతారు.

ఈ సంకలనంలోని కొన్ని కథల గురించి తెలుసుకుందాం.

మూడో అందం: బాహ్యమైన రూపురేఖలే అందానికి కొలమానమైన ఈ రోజులలో ఇతరులకు సాయం చేయడంలోను, సాటివారి కన్నీరు తుడవడంలోను, జీవన సారాంశాన్ని తెలియజేసే అన్నింటిలోను – అలా అందించే వారందరిలో కనిపించేదే నిజమైన అందమని రచయిత్రి అంటారు. శారీరక సౌందర్యం కన్నా మానసిక సౌందర్యం గొప్పదని చెబుతునే, మూడో అందమనే మరో సౌందర్యం గురించి ఈ కథలో చెబుతారు.

పారిజాతం – పందికొక్కు: ఓ పేద మాస్టారి కూతురికి పెళ్ళవుతుంది. వీలైనంత కట్నం ఇచ్చారయన. అయినా అల్లుడికి అది సరిపోక, భార్యని హింసిస్తూంటాడు. మాస్టారు గారింట్లో అద్దెకు దిగుతాడు రాజు. అతను పారిజాతం విత్తనాలను తెచ్చి ఖాళీ స్థలంలో పాతుతాడు. అయితే ఓ పందికొక్కు విత్తనాలని కెలికేసి, మొక్కలను ఎదగనీయకుండా చేస్తూంటుంది. రాజు ఎవేవో ప్రయత్నాలు చేసి మొక్కలని కాపాడలనుకుంటాడు. రాజు ప్రయత్నాల రూపంలో, మాస్టారి కూతురిని పారిజాతంతోను, అల్లుడిని పందికొక్కుతోనూ పోలుస్తూ సమస్యకి పరిష్కారం సూచిస్తారు రచయిత్రి.

నేర్పు: జీవితాన్ని ప్రశాంతంగా గడపాలంటే వేదాంత పరిజ్ఞానం, సాహిత్య అవగాహన ఉంటే సరిపోదని, నేర్చుకున్న దానిని అర్థం చేసుకుని స్వభావంలో ఇముడ్చుకోడం ద్వారానే సాధ్యమవుతుందని ఈ కథ చెబుతుంది. కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడమే జీవితంలో ప్రశాంతతకి మార్గమని ఈ కథ చెబుతుంది.

మార్గదర్శి: ఒక ముసలతను తుఫాను రాత్రి వర్షంలో తడుస్తూ రోడ్డు మీద నిలబడి లాంతరు పట్టుకుని ఆ దారిలో వెళ్ళేవాళ్ళకు అక్కడ పొంగిన వాగు వల్ల ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, వారిని వెనక్కి పంపుతుంటాడు. మనుషుల మీద నమ్మకాన్ని పెంచి, మానవత్వాన్ని కాపాడేవారింకా ఉన్నారనేందుకు నిదర్శనం ఈ కథ.

ప్రేమ వైద్యం: ప్రేమరాహిత్యాన్ని ఎవరూ కోరుకోరు. రక్తహీనతలానే ప్రేమహీనత కూడా ఓ జబ్బని అంటారు రచయిత్రి. మనిషిని మనిషిగా గుర్తించి స్పందించడమే ప్రేమంటారు రచయిత్రి. మనిషి సుఖశాంతులకి, వ్యక్తిత్వ వికాసానికి ప్రేమ అత్యంత ఆవశ్యకం అని ఈ కథ చెబుతుంది.

అహం: మితంగా మాట్లాడుతూ, ఎక్కువగా వింటూ, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ, నలుగురికి సాయం చేస్తూంటాడు కృష్ణమూర్తి. మానసికంగా కుళ్ళిపోతున్న నేటి సమాజానికి – మనుషుల్లోని సహృదయత, స్వచ్ఛత ఎంత అవసరమో కృష్ణమూర్తి పాత్ర ద్వార చెబుతారు రచయిత్రి.

చెత్తకుండీ: రకరకాల భావాలతోనూ, అసూయాద్వేషాలతోనూ, పగ ప్రతీకారాలతోనూ నిండిపోయిన మనుషుల మనసులు చెత్తకుండీలతో సమానమని రచయిత్రి చెబుతారు. చెత్తకుండీ నిండిపోయినప్పుడల్లా ఎలా శుభ్రం చేసుకుంటామో, మనసులని కూడా అలాగే కల్మషం లేకుండా ఉంచుకోవాలని ఈ కథ చెబుతుంది.

ఆమె నీకు తెలుసు: భార్యపట్ల ఆధిపత్య ధోరణి కూడదని, సహధర్మచారిణితో ఆత్మీయభావనతో మసలుకుంటూ జీవన ప్రయాణాన్ని కొనసాగించాలని ఓ తల్లి తన కొడుకుకి నేర్పుతుంది. ఆ కొడుకుని భర్తగా పొందిన అమ్మాయి భ్రమలు తొలగిపోతాయి. ఈ సందేశాన్ని సమాజంలో అందరూ పాటించగలిగితే, ఇళ్ళు నందనవనాలవుతాయి.

మాయ: వేదాంత సారమైన అమనస్కస్థితిని, నిశ్చలత్వాన్ని సాధించాలనుకున్న వ్యక్తి వాటి అసలైన అర్థాన్ని గ్రహించలేక, తను చిరాకు పడతాడు, తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతాడు. చివరికి “అసలు మనసుంటేనే సుఖం” అని తెలుసుకుని గుండెల నిండుగా ఊపిరిపీల్చుకుంటాడు.

పిట్టకథ: ఇది చాల చిన్న కథ, నిడివిలో చిన్నదైనా పెద్ద సందేశాన్నందించే కథ. దుర్లభమైన వాటిని పొందగోరి తనకి ఆశ్రయం ఇచ్చిన కొండని వీడుతుందో పిట్ట. తన ప్రయత్నంలో అపజయం పొంది, తిరిగి కొండ మీదకే చేరుతుందా పిట్ట. ఎంతో అద్భుతమైన నీతిని నేర్చుకుంటాదా పిట్ట.

మిగిలినదెంత: డబ్బే సర్వస్వమని భావించే వ్యక్తి తన బంధాలన్నింటినీ డబ్బుతోనే తూస్తాడు. తల్లిదండ్రులని, బంధువులని ఆదరించడు. అవసాన దశలో సత్యం బోధపడుతుంది. కానీ అప్పటికే అంతా అయిపోతుంది. ఇలాంటి వ్యక్తుల జీవితంలో మిగిలినదెంత? అని రచయిత్రి ప్రశ్నిస్తారు.

మొత్తం 17 కథలున్న ఈ సంకలనాన్ని చినుకు ప్రచురణలు ఫిబ్రవరి 2010లో ప్రచురించారు. ఈ కథా సంపుటి డిజిటల్ రూపంలో కినిగేలో లభిస్తుంది. వెల రూ.81/- నెలకి రూ.30/- అద్దెతో కూడా ఈ పుస్తకాన్ని మీ కంప్యూటర్లో చదువుకోవచ్చు.

మూడో అందం On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

వారాంతపు ఆఫర్ – 50 శాతం తగ్గింపు – మో నిషాదం

ఒక కవి అస్తమించిన ఒక తార ఉదయించును గగనాన,
సుకవి నివసించు సుజనుల నాలుకలపై!!

 

వారాంతపు ఆఫర్ – 50 శాతం తగ్గింపు – మో నిషాదం On Kinige

 

"… ఈ నిషాదంలో ఇంచుమించు 71 కవితలున్నాయి. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ క్రమం మొదలై రెండు దశాబ్దాలు ముగిసాయి. రెండో దశాబ్దంలో తెలుగు సమాజ సంక్షోభం మొత్తం ఈ సంపుటిలో ఉంది. ఒక దశాబ్ది కవిత్వాన్ని నిషాదం గా సంపుటీకరించాడు. ఇది విషాదంలా కూడా వినపడుతుంది. అయితే "పురందర దాసు ముందు / పొగులుతున్న భీమ్‌సేన్ జోషి" అని కొంచెం కీ లాంటి క్లూ ఇచ్చినప్పుడు మాత్రం సంగీతంలోని నిషాదం అంటున్నాడని అనుకోవాలి. గానకళకు పునాది సప్త స్వరాలు. అందులో నిషాదం సప్తమ స్వరం. ఏనుగు ఘీంకారమే నిషాదంగా జనించిందని గాన కళాబోధిని వివరిస్తోంది. కవిత్వ కళాబోధిని మనకెటూ లేదు కనుక సంగీత శాస్త్ర పరిభాషా పదాన్ని కవిత్వానికి అనవయించుకోవటం కొత్తే. సప్త స్వరాలలో రిషభ, గాంధార, మధ్యమ, దైవత, నిషాదాలకు రెండేసి బేదాలుంటాయి. వీటిని వికృతి స్వరాలంటారని కా.క.బో అంటోంది. షడ్జమ, పంచమ స్వరాలకు వికృతి భేదం లేదు కనుక అవి ప్రకృతి స్వరాలు. కవి ఏమంటున్నాడు? నేను వికృతి స్వరంలో పాడుతున్నాను ఈ సమాజ వికృతాన్ని, దుష్కృతాన్ని, దష్మృత్యాన్ని, దురాగతాన్ని, దుర్మార్గాన్ని అని. ….."

Hurry,

Limited time offer – Visit now http://kinige.com/koffer.php?id=24

Related Posts:

మియర్ మేల్

మగవారి కోసం తెలుగు కవితలు అనే ఉపశీర్షికతో ఉన్న ఈ కవితాసంకలనాన్ని రచించినది అరుణ్ సాగర్. ప్రముఖ జర్నలిస్ట్ అయిన ఈయన గతంలో “మేల్ కొలుపు” అనే కవితాసంకలనాన్ని వెలువరించారు.

అరుణ్ సాగర్ కవిత్వంలో వస్తురూపాలు కలగలసి పోతాయని, నిజానికి సాగర్ కవిత్వంలో కనిపించేది వస్తు వైవిధ్యమో లేక, రూప వైవిధ్యమో కాదని అది అనుభవ సందర్భ వైవిధ్యమని అంటారు ఈ పుస్తకానికి ముందు మాట రాసిన సీతారాం.

దాపరికాలు….దాగుడుమూతలు..నక్క వినయాలు…..బేవార్స్ మాటలు మచ్చుకైనా కనవడవీ సంకలనంలో అని అంటారు ప్రసాదమూర్తి.

ఈ పుస్తకంలోని కొన్ని కవితలను చూద్దాం.

భ్రమరమోహం: ఏదో సౌందర్యం కోసం వెదుకుతున్నాడు కవి ఈ కవితలో:
“ఏమరుపాటున రాలిపడి/ ఏ సౌందర్యం కోసమో/కళ్లు అరచేతుల్లో అద్దుకుని/శిశిరాకాశం కింద/అనుమానాస్పదంగా సంచరిద్దాం”

హోమ్‍కమింగ్: చాలా రోజులకు ఇంటికి తిరిగొచ్చే వారి భావానుభూతులను కవి చక్కగా వర్ణించారు. తమ కోసం ప్రకృతి ఎలా ఎదురుచూస్తుంటుందో వివరించారు:
“చిన్నప్పటి ఫోటోని /గుండెకు తగిలించుకున్న మట్టి గోడ/నా కోసం వానలో తడిసి/పరిమళాలు పోయింది/వంగిన చూరు నుంచి” -ఎంత ఆహ్లాదకరమైన భావన. తాను అక్కడందరికి పరిచయమేనని చెపుతూ
“అందుకే కదా/ నేను వచ్చానో లేనో/టేకు చెట్టు/పూల గుచ్ఛంతో నవ్వింది/ ఓ పాట పింఛం విప్పింది” అని అంటారు.

ది డోర్స్: తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నంలో తనలోకి తాను రావాలనుకుంటాడో వ్యక్తి. గుండె కవాటాలను తెరచుకోవాలనుకుంటాడు.
“కుటుంబం నుంచి/కార్యాలయం నుంచి/రక్తపాశాల నుంచి/ఆడవాళ్ళ నుంచి / అడుక్కుతినేవాళ్ళ నుంచి / మొబైల్ ఫోన్ నుంచి /గడియారం లోంచి/ ఏటిఎం మిషన్ లోంచి/గోడలు దూకి దూసుకువస్తున్నాను”

నీలె గగన్ కె తలె: పాటల్ని ప్రేమించే ఓ భావుకుడి కవిత ఇది. నా గడచిన రోజుల్ని ఎవరైనా వెనక్కి తెస్తే బాగుండు అనుకుంటాడు.

షాన్: తన జీవితానికి ఘనసమయం గురించి చెబుతున్నాడు ఇందులో.
“నా ఖజానా తెరిస్తే /స్నేహితులు/తన్హా సఫర్ /ఆకాశం కింద ఎన్నో రుతువులు/పలురుచులు /విసవిసా దాటిన దశలు…..
“జీవితపు ఘనసమయం/నేనకసాన్నంటిన!”

సాలభంజిక: ఇది ఇలియానా గురించి రాసిన కవిత
“మగధ నుంచి /నేరుగా దిగుమతి చేసుకున్న/గాంధార శిల్పం/కళింగ తీరపు/ లావణ్య రేఖావిలాసం”

టి. ఆర్. పి: డెడ్‌లైన్లే లైఫ్‌లైన్లని చెబుతారు ఈ కవితలో.
“ప్రతీరోజూ ఒక పరీక్ష/ప్రతీరోజూ ఒక ఫలితం / ప్రతివిజయం ఇంధనం/ ప్రతి స్వప్నం రేపటి కోసం/”
“టుమారో నెవర్ డైస్/మనకు కావాలి/అంతులేనన్ని టుమారోస్”

24 సెవెన్: ఈ కవితలో ఫ్రేముల గురించి చెబుతారు.
“నీ చుట్టూ నా చుట్టూ ఫ్రేముల్/సెకనుకు ఇరవైఅయిదు వేగంతో”
“ఫ్రేములు ప్రేమలు/అద్దం పట్టిన అన్నం మెతుకులు”

లాగాఫ్: ఈ కవితని సాటి పాత్రికేయులకి అంకితమిచ్చారు.
“మోడీగార్డ్ అద్దాల గోడ/కలం వీరుడా/సృజనశీలుడా/ఆట మొదలైంది/ష్ నిశ్శబ్దం/…….” ఇదో పత్రికాఫీసుని స్ఫురింపజేస్తుంది.

మరణవాంగ్మూలం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నేపధ్యంలో క్షణక్షణం చెదిరిపోతున్న మునిగిపోతున్న మానవుని జాడలు వెతుకున్నారు కవి ఈ కవితలో. ప్రతీదీ తొలగించబడుతుంది రెవెన్యూ రికార్డులలోంచి అని బాధపడతారు.
“పాయం బొజ్జిగాడు/లాస్ట్ ఆఫ్ ది కోయాస్/పెరిగి పెద్దయి/అలెక్స్ హేలీ అవుతాడా/ఆనకట్ట వెనుక అశ్రుజలథిలో/సీతమ్మ ముక్కుపుడక వెతుకుతాడా/లేక /అంతర్ధానపు అంచుల వేలాడి/రామాపితికస్ వలె/ఆంత్రోపాలజీ పాఠమవుతాడా”

జేగురు రంగు జ్ఞాపకం: ఈ కవితలో తన పాత స్నేహితులను, సామ్యవాద భావజాలపు అనుచరులను తలచుకుంటారు.
“ఒక రెట్రోవేదన మదిలో కదిలినప్పుడు/నా కార్పోరేట్ చింతల కొలిమిలోంచి/ఒక నిప్పు రవ్వ వేరుబడి -/ నిద్రించిన చైతన్యపు అంచులు ముట్టించినప్పుడూ/కామ్రేడ్స్!/మిమ్మల్నే తలచుకుంటాను”

కులగ్యులా: ఈ కవితలో కులపిచ్చి ఉన్న వాళ్ళని ఆక్షేపిస్తారు కవి.

సెంట్ ఆఫ్ ఎ ఉమన్: అరుణ్ సాగర్ కవితలు మగవాద కవితలని, స్త్రీవాద వ్యతిరేక కవితలని శంకించేవారు తప్పక చదవాల్సిన కవిత ఇది.

నెత్తుటి రుణం: పెట్రోలియం వనరుల కోసం ఇతర దేశాలపై అగ్రరాజ్యం చేస్తున్న దాష్టీకాన్ని వివరిస్తుంది ఈ కవిత.
“రాలిపడ్డ కుత్తుకలలో/కుతకుత ఉడుకుతున్న ప్రశ్నలు/నూనెకి నెత్తుటికి మధ్య రగులుతున్న రసాయన/ చర్యలు”
“ఎన్ని గాలన్ల నెత్తురు పోస్తే మీ కార్లు పరిగెడతాయి?/ఎన్నెన్ని మాంసఖండాలని పిండితే మీ ఆయిల్ దాహం తీరుతుంది?”

కవి పట్ల ప్రీ-ఫిక్స్‌డ్ నోషన్స్ లేకపోతే ఈ కవితలను హాయిగా ఆస్వాదించవచ్చు.

ఆండ్రోమెడా ప్రచురణలు వారు ప్రచురించిన ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.50/- రూ.30/- నెలసరి అద్దెతో దీన్ని మీ కంప్యూటర్లో చదువుకోవచ్చు.

మియర్ మేల్- పోయెమ్స్ ఫర్ మెన్ ఇన్ తెలుగు On Kinige

Related Posts: