కుండీలో మర్రిచెట్టు

విన్నకోట రవిశంకర్ రాసిన ఈ కవితాసంకలనంలో 29 కవితలున్నాయి. “మానవత్వపు సారాంశాలైన జీవితానుభవాలతో స్పందించే కవితలు ఈ పుస్తకం నిండా వున్నాయని, జీవితానుభవమూ, హృదయానుభూతీ – ఈ రెండు ధృవాల్నీ కలిపి కవిత్వ విద్యుచ్చక్తిని సృష్టించాడు కవీ, విద్యుత్ ఇంజనీరూ ఐన రవిశంకర్” అని ముందుమాటలో ఇస్మాయిల్ గారు చెప్పిన మాటలు ఎంతో నిజం అనిపిస్తుంది ఈ కవితలు చదివితే.

ఇందులోని కొన్ని కవితలను పరిచయం చేసుకుందాం.

హోళీ: వసంతోత్సవం పండుగ సందర్భంగా రంగులతో ఆడుకుంటూ తనలోని భేషజాలని వదిలించుకుని, మనిషి తనని తాను చేరుకోడాన్ని; ఆకులు రాల్చిన చెట్టు మళ్ళీ చిగురించి పూలు పూచడంతో పోల్చారు ఈ కవితలో.

ఉదయాలు: చిన్న చిన్న పదాలలో ఎంతో చక్కని భావల్ని నింపిన కవిత ఇది. ఆశనిరాశల మధ్య జరిగే దోబూచులాటని ఈ కవిత వర్ణిస్తుంది. కల అందమైన భ్రమ కాగా, జీవితం కఠినమైన వాస్తవం అని ఈ కవిత చెబుతుంది.

కుండీలో మర్రిచెట్టు: విశాలంగా, ఊడలు దాల్చి పెరిగే మర్రిచెట్టుని, కుండీలో పట్టేడట్టుగా బోన్సయ్‌గా మార్చేసారని బాధ పడుతూ, నిండైన దాని జీవితాన్ని ఎవరో అపహరించారని వాపోతారు కవి. మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడని, అది ఎదుటివారికే ప్రయోజనకరమని వారిని నమ్మిస్తాడని అనే అర్థం గోచరిస్తుంది ఈ కవితలో.

స్త్రీ పాత్ర: తనున్నచోట తన చుట్టూ ఆర్ద్రత ప్రవేశపెడుతుంది స్త్రీ. మహిళలు లేని పరిసరాలని ఊహించడం కష్టం. “హఠాత్తుగా అసంగతంగా మారిన/అక్కడి వాతావరణానికి/ఆమె అర్థం కల్పిస్తుంది” ఎంతో లోతైన అర్థం ఉందీ కవితలో.

నిద్రానుభవం: రాత్రుళ్ళు నిద్ర పట్టకుండా బాధపడేవారికి, అతి తేలికగా నిద్ర పట్టేసే వాళ్ళకి మధ్య తేడాని ఈ కవిత చూపుతుంది. అతి తేలికైన పదాలతో అలవోకగా సాగిన కవిత ఇది.

రామప్ప సరస్సు: తమకి దూరమైన మిత్రుడి స్మృతిలో ఈ కవిత రాసారు రవిశంకర్. ఎంత అందమైన, క్రూరమైన సరస్సో అని బాధ పడతారు.

జ్ఞాపకం: తరచూ విస్మరించే సన్నిహితులను తలచుకుంటూ రాసిన కవిత ఇది. అమ్మని ఉద్దేశించి రాసినా, దీన్ని మనం విస్మరించే వ్యక్తులకు అన్వయించుకోవచ్చు. బంధాలను పునర్దర్శించేందుకు ఉపకరిస్తుంది ఈ కవిత.

ట్రాన్సిషన్: ఈ కవిత మానవ జీవితానికి అద్దం పడుతుంది. జీవితమంటేనే కొన్నింటిన్ పోగొట్టుకోడం, మరికొన్నింటిని పొందడం. కొన్ని బంధాలను తెంచుకోడం, కొన్నింటిని అల్లుకోడం. మనిషి జీవితమంటా ట్రాన్సిషన్ అని చెప్పడానికి ప్రయత్నిస్తుందీ కవిత.

గాయం: మానవత్వాన్ని మార్పిడి చేసి, అమర్చుకున్న అలసత్వానికి విరుగుడు లేదంటారు కవి. వైద్యవృత్తిలోని లోపాలను అంతర్లీనంగా ప్రశ్నిస్తుంది ఈ కవిత.

భోపాల్: యూనియన్ కార్బైడ్ ఫాక్టరీ ప్రమాదం ఈ కవితకి నేపధ్యం. తన బిడ్డని రక్షించుకోలేని ఓ తల్లి ఆవేదనని ఈ కవిత చిత్రించింది. ఇది చదివాక మనసు మొద్దుబారిపోతుంది.

శివకాశి: ఇతరుల జీవితాలలో పండగ వెలుగులు నింపేందుంకు, తమ బ్రతుకులని మసి చేసుకునే బాల కార్మికులపై రాసిన కవిత ఇది. ” అతని జీవితంలో/అల్లరిలేదు; ఆటల్లేవు;/తప్పటడుగుల్లేవు;/ తడబడే మాటల్లేవు/” చిన్న చిన్న పదాలలో అక్కడి దృశ్యాన్ని కళ్ళముందుంచారు కవి.

గ్లాస్‌నోస్త్: ఒక్కప్పటి సోవియట్ యూనియన్ సంస్కరణల గురించి రాసిన కవిత ఇది. రష్యా గురించి ప్రజలు ఊహించుకున్న ఘనతంతా నిజం కాదని కవి అంటారు.
“ఇప్పుడు తెర తీసేశారు/ ఇక యే దాపరికమూ లేదు! /ఈ రహస్యం/ ఇంత వికృతంగా ఉంటుందని/ నేననుకోలేదు./ నేనిన్నాళ్ళూ కొలిచిన వేలుపు/ అసలు రూపం ఇదని /నేనూహించను కూడా లేదు” అని అంటారు.

మోళీ: ఇళ్ళలో ఆడవాళ్లపై జరిగే గృహహింసని ప్రస్తావిస్తుంది ఈ కవిత. కాపురం మగాడికి మోళీ ఆటలాంటిదని, అది అద్భుతంగా సాగుతోందని జనాలని నమ్మించడానికి కుటుంబ హింసని ఆయుధంగా వాడుకుంటారని అంటారు కవి.

దూరం: ఈ కవిత స్నేహితుల మధ్య దూరాన్ని ప్రస్తావిస్తుంది. కాలక్రమంలో గాఢమైన స్నేహమైనా బీటలు వారుతుందని, స్నేహితులు పునఃపరిచయం చేసుకోవాల్సిరావచ్చని చెబుతుందీ కవిత. అయినా పాత జ్ఞాపకాలు వాడిపోవని అంటుంది.

చలనచిత్రం: అతి వేగంగా సాగిపోయే జీవితాన్ని కాప్చర్ చేయడం సాధ్యమేనా? జీవితపు కనిపించని ప్రవాహపు కదలికలో ఉన్న అందాన్ని, దేనితో కేప్చర్ చెయ్యమంటావని కవి ప్రశ్నిస్తారు.

ఇంకా ఎన్నో చక్కని కవితలున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ. 30/- మార్మికమైన అనుభూతులను ఆస్వాదించడానికి ఈ పుస్తకాన్ని సొంతం చేసుకోండి.

కుండీలో మర్రిచెట్టు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

అలరించే అరాచక కవిత్వం

అలరించే అరాచక కవిత్వం అనే శీర్షికతో ఇండియా టుడే పత్రికలో (27 సెప్టెంబరు 2011 సంచిక) వచ్చిన ఈ వ్యాసం అరుణ్ సాగర్ రాసిన ‘మియర్ మేల్’ అనే కవితాసంపుటిపై సమీక్ష. రామా చంద్రమౌళి గారు ఈ పుస్తకాన్ని సమీక్షించారు.

కవిత్వమంటే కవి పాఠకునికి రాసిన రహస్య లేఖని వినూత్న నిర్వచనం ఉందని సమీక్షకులు పేర్కొన్నారు. అరుణ్ సాగర్ దృష్టి కొత్తదని, జీవితాన్ని అవలోకిస్తున్న కోణం కొత్తదని, అందువల్ల జీవితం అతనికి క్రొంగొత్త మిత్రులతో, వినూత్న కొలతలతో విచిత్రమైన నూతన రూపురేఖలతో దర్శనమిస్తుందని అంటారు.

కవి వాడిన కొత్త పదబంధాలు, పదచిత్రాలు కవితావాక్యాలని రసవంతం చేసాయని చంద్రమౌళి గారు అంటారు.

పూర్తి సమీక్షని ఈ దిగువ బొమ్మలో

చదవచ్చు.

ఆండ్రోమెడా ప్రచురణలు వారు ప్రచురించిన ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.50/- రూ. 30/- నెలసరి అద్దెతో దీన్ని మీ కంప్యూటర్లో చదువుకోవచ్చు.

మియర్ మేల్- పోయెమ్స్ ఫర్ మెన్ ఇన్ తెలుగు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

తెలుగు బాల ఆట పాటల పుస్తకాలు–75/- తక్కువకు

ఈ పుస్తకాలు రచయిత డాక్టర్ యం హరికిషన్ గారు అకుంఠిత దీక్షా పట్టుదల, పరిశోధనలతో వెలువరించినవి. తెలుగు బాలబాలికలు ఇవి చదివితే బాల సాహిత్యం పరిచయం, భాషా వృద్ది, విజ్ఞానం, వినోదం, ఆనందం పొందుతారు. నేటి తరం తెలుగు జాతికి తప్పక కావాల్సిన పుస్తకాలు ఇవి. నేడే స్వంతం చేసుకోండి, మీ పిల్లలకు పరిచయం చేయండి – ఈ సృజనశీల సాహితీ సముదాయాన్ని. 

Visit Kinige and buy these 15 books now and save 75/- Rupee!

తెలుగు బాల ఆట పాటల పుస్తకాలు On Kinige

Related Posts:

16.67 శాతం తగ్గింపు – ఉక్రేనియన్ జానపద గాథలు 1 – 4

అద్భుత లోకం గురించీ, ఆ లోకంలోని వీరుల గురించీ చెప్పే కమనీయ జానపద గాథలు ఒక తరాన్నించి మరో తరానికి ఏనాటినుంచో అందుతునే ఉన్నాయి. లోకుల యుక్తి, చమత్కారం, హాస్యం తొణికిసలాడే గాథలు ఇవి. చాలా కాలం అవి మౌఖికంగానే ఉండిపోయాయి. శ్రోతలకి వాటిని వినిపించేవారు. అందుకనే వాటికి గాథలని పేరు వచ్చింది.

ఉక్రేనియన్ జానపద గాథలు అపారంగా ఉన్నాయి. పాతకాలం నాటి వీరుల్ని, సంఘటనల్నీ ఈ గాథల్లో అడుగు అడుగునా మనం చూస్తాం. సామాన్య ప్రజలలో ధైర్యం ఉన్న మనుషులూ, ఉల్లాసం కలిగించే సాహసకృత్యాలు, చలాకీగా ఉండే జంతువులూ, పక్షులు పాఠకులకి సంతోషం కలిగిస్తాయి.

ప్రకృతి గురించీ, పెంపుడు జంతువుల గురించీ ప్రాథమిక జ్ఞానాన్ని జానపద గాథలు పిల్లలకి అందిస్తాయి.

మంచి పుస్తకం వారు ప్రచురించిన ఈ నాలుగు పుస్తకాలు కొనండి 16.67%తగ్గింపు పొందండి.

ఉక్రేనియన్ జానపద గాథలు 1 – 4 On Kinige

Related Posts:

  • No Related Posts

సరిహద్దు

సరిహద్దు అనే ఈ పుస్తకంలోని కథలు గొర్తి సాయి బ్రహ్మానందం రాసారు. పుట్టింది ఆంధ్రదేశంలోనైనా, వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. రాజ్యాలేలే రాజైనా , రాళ్ళెత్తే కూలీ అయినా ప్రతీ మనిషికి కథ ఉంటుందని, కథగా చెప్పితీరాలన్న సంఘటనలు ఎదురైనప్పుడు వాటిని కథలుగా మలచడం తనకిష్టమని రచయిత అంటారు.

సరిహద్దు On Kinige

ఈ సంకలనంలోని కొన్ని కథలను పరిచయం చేసుకుందాం.

అతను: అమెరికా వచ్చిన ప్రతీ అమ్మాయి చేసే మొదటి పని ఉద్యోగం వెతుక్కోడం. అలాంటిది డాక్టరు చదివిన ఉత్పల, ఉద్యోగం చేయకుండా అమెరికాలో ఎందుకు ఖాళీగా ఉంది? కూతురిని సైతం వదిలేసి, ఎందుకు ఇండియాకి తిరుగు ప్రయాణం కట్టింది? ఆమె భర్త ఉద్యోగం చేయొద్దని అనడంలో అసలు కారణం ఏమిటి? భార్య మీద ప్రేమా? పురుషాహంకారమా? ఉత్పల తీసుకున్న నిర్ణయం సరైనదేనా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే, ఈ కథ చదవాల్సిందే.

ఒంటరి విహంగం: చుట్టపు చూపుగా కొడుకు హరి ఇంటికి వచ్చిన రాజారావు ప్రతీదానికి ఫార్మాలిటీస్ పాటించే ఆ దేశంలో ఇమడలేకపోతాడు. తండ్రి బిడ్డకి థాంక్యూ చెప్పడం, అమ్మానాన్నలు కొడుకులకి సారీ చెప్పడం వంటివి రాజారావుకి కృతకంగా అనిపిస్తే, హరి వాటిని సమర్ధిస్తాడు. “ఏ అలవాటైనా మొదట అమ్మానాన్నలతోనే మొదలవుతుంది. మన ఇంట్లో వాళ్ళ దగ్గరే లేని సభ్యత సంస్కారాలు ఇతరుల దగ్గెరలా వస్తాయి?” అంటాడు. తన బాస్ భార్య చనిపోయి, దుఃఖంలో ఉంటే, మరో పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చిన హరి, అదే పని తన తండ్రి చేస్తే ఎందుకు హర్షించలేకపోతాడు? మానవ స్వభావాలని ప్రశ్నిస్తుందీ కథ.

సైన్యం: తన భార్యని శారీరకంగా మానసికంగా హింసిస్తూ, ఆమె ఎదుటే పరాయి ఆడవాళ్ళతో కులుకుతూండే రామిరెడ్డిని ఎవరు హత్య చేసారు? ఆ రాత్రి అతనితో గడపడానికి వచ్చిన పరాయి స్త్రీయా?లేక విసిగి వేసారిపోయిన అతని భార్యా? లేక ఒప్పుకున్న పనిని పూర్తి చేయనందుకు అతని యజమాని చంపాడా? ఆసక్తికరంగా సాగుతుందీ కథ.

వానప్రస్థం: జీవితంలో ఆనందానికి రహస్యం ఏమిటో ఈ కథలో తెలుస్తుంది. ఒకరినుంచి ఆశించకపోవడమే ఆ రహస్యం అని ఈ కథ చెబుతుంది. ఎక్స్‌పెక్టేషన్ అనేది నిన్నూ, నీ చుట్టూ ఉన్నవాళ్ళని కాన్సర్‍‌లా కనిపించకుండా దహించేస్తుందని చెబుతుందీ కథ. తల్లిదండ్రులు పిల్లలు తమని గౌరవించాలని ఆశించకుండా, ప్రేమించాలని కోరుకోవాలని ఈ కథ చెబుతుంది.

సరిహద్దు: మెక్సికో సరిహద్దు దాటి చట్టవిరుద్ధంగా అమెరికాలో ప్రవేశించిన హేవియర్ అనే ఓ వ్యక్తి కథ ఇది. స్వదేశంలో ఇంటి దగ్గర చిన్నచిన్న పనులైనా చేసి ఎరుగని వ్యక్తి అమెరికాలో జానిటర్‌గా పనిచేస్తాడు. అమెరికన్లు తలచుకుంటే ఇల్లీగల్‌గా దేశంలో ఉంటున్న వారిని ఏరేయడం పెద్ద కష్టం కాదు, కానీ మరెందుకు అలా చేయడం లేదు? దాని వెనుక ఉన్న చీకటి కోణం ఏమిటి? ఈ అమెరికా అన్నది ఓ మాయాజాలమని, వయసులో ఉన్న కుర్రాడు అందమైన అమ్మాయి మోహంలో పడ్డట్టు అందరూ ఈ దేశపు మాయలో పడిపోతారంటాడు హేవియర్. మనసు భారమైపోతుందీ కథ చదివాకా.

అంటే ఏమిటి? : ఈ కథ తన తల్లిదండ్రులతో అమెరికాలో ఉంటున్న చైతుకు వచ్చిన సందేహాల గురించి చెబుతుంది. అమెరికాలోని వ్యక్తుల వ్యవహారశైలి పిల్లల మనసులపై ఏ విధమైన ముద్ర వేస్తుంది? పిల్లల కొచ్చే సందేహాలు వారినెలా భయభ్రాంతులను చేస్తాయి? తల్లిదండ్రలు ఎలా ప్రవర్తించాలి? ఈ కథ ఆలోచింపజేస్తుంది.

స్వేచ్ఛ: పెద్ద చదువులు చదవడం కోసం భర్త నుంచి విడిపోవాలనుకున్న కూతురికి ఓ తల్లి రాసిన ఉత్తరం ఇది. మనిషికి స్వేచ్ఛ అవసరమే కానీ, ఆ స్వేచ్ఛని జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోడానికి ఆలంబనగా వాడుకోవాలని ఆ అమ్మ చెబుతుంది. నీకిష్టమైన పని చేసుకోడంలో ఆనందం ఉండచ్చు, కానీ ఆ పని చేయడం వలన కలిగే పరిణామాలు, అది ఇతరుల జీవితాలపై చూపే ప్రభావం వంటి వాటి గురించి కూడా ఆలోచించాలని అంటుందావిడ.

నేను అహల్యని కాను: ఓ నాటక సమాజం కథ ఇది. ఈ కళారూపాలకి ఓ మాయ ఉంది, ఆవగింజంత తెలిసినా ఆకాశమంత తెలుసున్న ఫీలింగ్ కలగజేస్తాయి. ప్రతీ కళాకారుడు ఆ మాయలోనే బ్రతుకుతాడంటుందీ కథ. నాటక సమాజంలోని వ్యక్తుల మధ్య ఉండే పొరపొచ్చాలు, అహంభావాలు, కీర్తికండూతి…మొదలైన వాటిని ప్రస్తావిస్తూ, కథానాయకుడిగా పేరొందిన నటుడి దుష్ప్రవర్తనని నాయిక ఎలా ఎండగట్టిందో చెబుతుందీ కథ.

ఊర్మిళరేఖ: ప్రతిబంధకం వియోగంగా మారి, త్యాగంగా రూపంతరం చెందడం గురించి ఈ కథ చెబుతుంది. సంపాదన కోసం దూరదేశం వెళ్ళిన ఓ వ్యక్తి భార్య మనోగతాన్ని, రామాయణంలోని ఊర్మిళ పాత్రతో పోలుస్తూ రాసిన కథ ఇది.

అతిథి వ్యయోభవ: అమెరికాలోని తెలుగు సంఘాల సమావేశాలకి హాజరయ్యే కొందరు ప్రముఖుల నడవడికలని, ప్రవర్తనని వ్యంగ్యంగా చూపుతుందీ కథ.

జీవనది: ఒకప్పుడు తను ప్రోత్సహించిన రచయిత జీవితాన్ని తనకి తెలియకుండానే నాశనం చేసిన ఓ సాహితీ అభిమాని కథ ఇది. రచయితల గురించి, సాహిత్యం గురించి, ఘోస్ట్ రైటర్ల గురించి ప్రస్తావిస్తుంది ఈ కథ.

నూటికొక్కడు: దైవదర్శనం నుండి, రైలు రిజర్వేషన్ మొదలుకొని…. ఏ చిన్నపని కావలాన్నా చేతులు తడపక తప్పని పరిస్థితిని ప్రస్తావిస్తుందీ కథ. వేలాదిగా ఉన్న అవినీతిపరుల మధ్య కొందరైనా నిజాయితీపరులుంటారని చెబుతుంది ఈ కథ.

బుజ్జి కుక్కపిల్ల: డాలీకి కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. ఓ చిన్న కుక్కపిల్లని కొనివ్వమని అమ్మానాన్నలని పోరుతూ ఉంటుంది. చివరికి ఓ రోజు తండ్రి ఓ కుక్కపిల్లని కొనుక్కుని వస్తే, తనకి కుక్కపిల్ల వద్దంటూ, తీసుకెళ్ళి కొన్నవాళ్ళకే ఇచ్చేయమని అంటుంది. డాలీ ఎందుకలా మారిపోయిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.

అహం: తోటి మనిషికి సాయం చేయడం మంచిదే, కానీ పెద్ద మొత్తంలో డబ్బు సాయం చేసేడప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో. చేసిన సాయాన్ని గురించి పదిమందిలో చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం ఆ వ్యక్తిని తులనాడకుండా ఉంటే చాలు. ఓ చిన్న ఈగో, అహంకారం ముందు ఇరవై ఏళ్ళ స్నేహం ఓడిపోయిన వైనాన్ని చెబుతూ, డబ్బు చాలా చెడ్డదని, అది మనుషుల మధ్య ప్రేమని, స్నేహాలని ఒక్కోసారి తినేస్తుందని ఈ కథ చెబుతుంది.

అబద్ధంలో నిజం: ప్రతీరోజూ అబద్ధాలాడుతూ ఒకరినొకరు నమ్మించుకున్నట్లు భ్రమిస్తున్న భార్యభర్తల కథ ఇది. వారిద్దరికీ అమ్మ నిజం – అత్త అబద్ధం. దృశ్యాలవే, కానీ అబద్ధాలూ నిజాలు తారుమారవుతుంటాయి. వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిన కథ ఇది.

వీరాభిమాని: రామారావు సంజీవి అనే నటుడికి వీరాభిమాని. సంజీవి ఓ తెలుగు సంఘం ఆహ్వానంపై కెనడా వస్తున్నాడంటే బోలెడు డబ్బుపోసి టికెట్ కొంటాడు. తీరా సభలో సంజీవి ప్రవర్తనకి విరక్తి చెంది అతనిపై అభిమానానికి వీడ్కోలు పలుకుతాడు. ఇంత జరిగాక, సినిమా నటుల పట్ల వల్లమానిన అభిమానాన్ని రామారావు వదులుకున్నట్లేనా? కథ చదివితే తెలుస్తుంది.

వలస జీవితం: ఇరవై ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్న అను తన కొడుకు ఓ అమెరికన్ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాననడం జీర్ణించుకోలేకపోతుంది. స్నేహితురాలితో తన బాధని చెప్పుకుంటే, పిల్లల జీవితాలని వాళ్ళనే నిర్ణయించుకోనిస్తే మంచిదని, తల్లిదండ్రులు కేవలం అడిగితే సలహా ఇచ్చే మార్గదర్శకులవంటి వారని ఆమె చెబుతుంది. మనిషి ప్రవర్తన అలవాట్లు అన్నీ మన చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని అను గ్రహిస్తుంది.

మొత్తం 25 కథలున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ. 90/- రూ. 30/- నెలసరి అద్దెతో కూడా ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

సరిహద్దు On Kinige

కొల్లూరి సోమశంకర్

Related Posts:

నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు

ఆకాశవాణిలో వివిధ హోదాలలో ….. ఆర్టిస్ట్‌గా, ప్రయోక్తగా, నిర్మాతగా పని చేసిన శారదా శ్రీనివాసన్‌ గారు సుధీర్ఘమైన కెరీర్‌లోని అనుభవాలను, జ్ఞాపకాలను అందించారీ పుస్తకంలో.

అప్పటికే ప్రసిద్ధులైన తొలితరం పెద్దలు సర్వశ్రీ స్థానం, కృష్ణశాస్త్రి, గోపీచంద్, బుచ్చిబాబు, దాశరథి, రజని, మునిమాణిక్యం, నాయని, భాస్కరభట్ల, కేశవపంతుల నరసింహ శాస్త్రి మున్నగువారితో కలిసి పనిచేసిన శారదగారు అలనాటి రేడియో తీరుతెన్నులను ఈ పుస్తకంలో పాఠకుల ముందుంచారు.

ఎంచుకున్న పనిని అంకితభావంతో చేయడం, సంస్థ పట్ల నిబద్ధత కలిగి ఉండడం, ఇతర సిబ్బంది చేసే కార్యక్రమాలలోనూ మనస్ఫూర్తిగా పాలుపంచుకుని అవి విజయవంతం అయ్యేలా చేయడం శారదగారి స్వభావం.

పెద్దల నుంచీ, పిన్నల నుంచీ సైతం నేర్చుకునే తత్వం ఆవిడ కెరీర్‌కి సోపానాలు కల్పించింది. వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి, చక్కని స్వరం, సంభాషణలు పలికే తీరు మొదలైనవన్నీ ఆవిడ ఆకాశవాణిలో రాణించడానికి దోహదం చేసాయి. పెద్దల పట్ల గౌరవం, కళాకారుల పట్ల శ్రద్ధ, సాటి సిబ్బంది పట్ల సహానుభూతి ఆవిడని అందరికీ ఇష్టురాలిని చేసాయి.

ఫామిలీ ప్లానింగ్, గ్రామసీమలు, కార్మికుల కార్యక్రమం, స్త్రీల కార్యక్రమం….. ఇలా రేడియోలో ఏ కార్యక్రమమైనా ఆవిడ పాత్ర లేదా ప్రమేయం లేకుండా లేవు. చిన్నా పెద్దా కలిపి కొన్ని వేల నాటకాలు వేసారావిడ.

“ఏ వేషం వేయమన్నా ఇది నాకు రాదని, నాకు తగదని, నేను చెయ్యలేనని ఎప్పుడూ చెప్పలేదు. అది నా డ్యూటీ అని కాకుండా ఏదైనా చేసి ఔననిపించుకోవాలి. ఓడిపోయానని కాకుండా, చదవలేక పాడు చేసానని అనిపించుకోకుండా, చదివి, బాగా చదివానని అనిపించుకోవాలన్న పట్టుదల ఉండేది” అంటారు శారద గారు. ఉన్నత స్థానాలకి ఎదగాలనుకునేవారికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణమిది.

గడిచిన 50 సంవత్సరాల కాలంలో నలుదిక్కులా కాంతులు వెదజల్లిన సంగీత/సాహిత్య రంగాలలోని దీపస్తంభాల వంటి మహామహుల గురించి శారద గారు గొప్పగా చెప్పారు. వారంతా ప్రాతఃస్మరణీయులు.

రేడియో నాటకం గురించి చెబుతూ, రేడియో నాటకం శ్రోతల ఊహలకి పదును పెడుతుందని అంటారు. దృశ్యంలోని రూపాన్ని చూపరి పెంచలేడు, తగ్గించలేడు; అదే శబ్దాన్ని శ్రవ్యమాధ్యమంలో వాడితే, ఊహలకి ఎల్లలుండవని ఆవిడ అంటారు. చిత్రం వర్ణనైతే, శబ్దం దృశ్యమవుతుంది.

రేడియోలో పాత్ర స్వభావాన్ని తెలియజేయడానికి కంఠమాధుర్యం ముఖ్యమని చెబుతూ, సంగీతానికే కాదు….మాటలకీ ఉంటాయి శ్రుతిలయలు – వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించాలని అంటారు.

“ఒక ఆర్టిస్టు మంచి ఆర్టిస్టుగా ఎదగాలంటే నిరంతరం జీవితాన్ని చదువుతునే ఉండాలి. అదే ఆర్టిస్టుని నిలబెడుతుంది. పది కాలాలు బతికేలా చేస్తుంది.” అని అంటారావిడ.

రేడియో అందించిన సేవల గురించి చెబుతూ, వ్యవసాయాభివృద్ధి, కుటుంబనియంత్రణ, అంటరానితనం, మూఢాచారాలు, పొదుపు, పరిశుభ్రత…మొదలైన అంశాల గురించి రేడియో ప్రసారం చేసినట్లు మరెవ్వరూ చేయలేదని చెప్పారు.

రేడియో కార్యక్రమాలపై ఇప్పుడొస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, కార్యక్రమాలను శ్రద్ధగా వినాలని సూచిస్తారు. ఏ ప్రోగ్రామైనా విన్నప్పుడు ‘బాగుందని’ ఓ ఉత్తరం ముక్క రాయాలి లేదా ఓ ఫోన్ చేసి చెప్పాలని సూచిస్తారు. బాగా ఉన్నదానిని మనం మనస్పూర్తిగా ఒప్పుకోవాలి, ఎక్కడో చిన్న లోపం ఉందని, మొత్తం ప్రోగ్రామ్‌నే తీసి పాడేయకూడదని అంటారు.

ప్రజలకు సమాచారం అందించడం, వినోద విజ్ఞానాలతో పాటు, సామాజిక అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు రూపొందించి, వైవిధ్యభరితంగా ప్రసారం చేయడం రేడియో కర్తవ్యమని, ఆ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, రేడియో తన పూర్వవైభవాన్ని సాఢించాలని ఆవిడ కోరుకుంటారు.

దైవదత్తమైన ప్రతిభని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని, శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు శారదా శ్రీనివాసన్.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ. 112/- . నెలకి రూ. 30/- అద్దెతో కూడా చదువుకోవచ్చు.

నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

  • No Related Posts

వేలుపిళ్ళై

ఈ కథలను రాసింది సి. రామచంద్రరావుగారు. ఇంగ్లీషు, తెలుగు, తమిళ పాత్రల చుట్టూ అల్లిన ఈ కథలన్నీ రచయిత తనకు తెలిసిన, పరిచితమైన జీవితంలో నుంచి ఏరుకుని, పరిశీలించి, భావనచేసి రాసినవే.

ఈ సంకలనంలోని కొన్ని కథలను పరిచయం చేసుకుందాం.

వేలుపిళ్ళై: వేలుపిళ్లై ఓ టీ ఎస్టేటులో కూలీగా పనిచేస్తూ వుండేవాడు. ఒకసారి ఎస్టేటు కండక్టరుతో మాటా మాటా వచ్చి పని మానేస్తాడు. కొండలకింద వున్న పొల్లాచీ సంతలో లక్ష్మీవారాలు అమ్ముడైపోగా మిగిలిన ఉల్లిపాయ, చింతపండు, కాయగూరలూ కొని ప్రోస్పెక్టు ఎస్టేటు కూలీలకి అవ్మేువాడు. కొన్నాళ్ళకి వేలుపిళ్లై పెద్దబజార్లో అంగడి ప్రారంభించాడు. కలిసొస్తుంది. వేలుపిళ్లైకి సిరి అబ్బడంతో తనపేరు చిరస్థాయి చేసుకోవాలని కోరిక పుట్టింది. పేరు శాశ్వతంగా నిలిచే దానం ఏదైనా చెయ్యడానికి నిర్ణయం చేసుకుని ఎస్టేటు కూలీలతో సంప్రదించాడు. వినాయకుని గుడి కావాలని అడిగారు కూలీలు. ‘సరే’ అన్నాడు వేలుపిళ్లై. భార్య వద్దంటుంది. ఆమె మాటలని లెక్క చేయకుండా, పని మొదలుపెడతాడు వేలుపిళ్ళై. ముందుగా గోపురం సిద్ధమైపోతుంది. ఒక రాతి పలక మీద వేలుపిళ్ళై ధర్మం అని రాయించుకుని మురిసిపోతాడు. అయితే వినాయకుడి విగ్రహాన్ని చేయించడానికి అతనికి కుదరదు. చివరికి ఓ గుడిలోంచి విగ్రహాన్ని దొంగిలించి తెస్తాడు. ఆ ప్రయత్నంలో పారిపోతుండగా సెందామరైతో పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో చాటు మాటు వ్యవహారాలు సాగిస్తాడు. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి, నాటకం ఆడి భార్యనగలని తాకట్టు పెట్టి, డబ్బు తెచ్చుకుంటాడు. తనని మోసం చేసి డబ్బు తీసుకున్నాడన్న సంగతి తెలిసి భార్య అతడిని విడిచి వెళ్ళిపోతుంది. సెందామరైని తీసుకొచ్చి ఇంట్లోనే కాపురం పెడతాడు. ఆమె వచ్చాక అతనికి మరింత కలిసొస్తుంది. ఆమె వలన తన జీవితం మారిపోయిందనే ప్రగాఢ విశ్వాసం అతనిలో కలుగుతుంది. ఆమె మీద ఎన్ని అపనిందలు వచ్చినా పట్టించుకోడు. ఆమె చనిపోతే, అన్నపానీయాలు మాని వినాయకుడి గుడి దగ్గర కూర్చుంటాడు. మనుషుల్లోని కీర్తికండూతిని, తామనుకున్న పనిని పూర్తి చేసేందుకు ఎంతటి పనికైనా వెనుకాడకపోవడాన్ని తమకి భరోసా కల్పించిన వారి పట్ల అమితమైన అనురాగాన్నిపెంచుకోడాన్ని ఈ కథ చిత్రిస్తుంది.

నల్లతోలు: కొందరు తెల్లవారు చదువుకున్న భారతీయులని తమతో సమానంగా చూసేవారు. అటువంటి కుటుంబమే మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ స్టూవర్ట్‌. వారితో సంబంధాలు కలుపుకుని తానూ సైతం ఆంగ్లేయుడిలానే ప్రవర్తిస్తుంటాడు పేట్ అనబడే ప్రతాపరావు. ఒకసారి వారిచ్చే పార్టీకి వెడతాడు పేట్. అక్కడ బ్రిటీషు యువకులు చాలా మంది ఉంటారు. తాగి వాగడం మొదలుపెడతారు. తమ మధ్య ఈ నల్లతోలు గాడెందుకు అని పేట్ నుద్దేశించి వ్యాఖ్యానిస్తాడు డంకన్ హార్వీ అనే కుర్రాడు. కొంత వాగ్వాదం తర్వాత, పేట్‌రావ్‌‌ని పట్టుకుని ఈడ్చడం ప్రారంభించాడు డంకన్‌హార్వీ. పేట్‌రావ్‌ కొంత గింజుకుంటాడు. నలుగురూ సాయంపట్టి అతన్ని గది బయటికి నెట్టి తలుపు మూసేస్తారు. ఈ విషయం విని మిస్టర్‌ స్టూపర్ట్‌ కోపోద్రిక్తుదవుతాడు. “బ్రిటిష్‌యువకులంతా మృగాల్లాగా ప్రవర్తించారు” అంటాడు. “నా అతిథిని అవమానపరచడానికి డంకన్‌కి ఏం అధికారం వుంది!” అని గర్జిస్తాడు. “అంతా వెళ్ళి పేట్‌కి క్షమాపణ చెప్పుకోండి” అంటాడు. ఇంతలో అతడి భార్య అక్కడికి వస్తుంది. తమ కూతురిని చేసుకోబోయేది డంకన్ అని గుర్తు చేస్తుంది. మౌనంగా ఉండిపోతాడు. నిస్సహాయంగా ఇల్లు చేరుతాడు పేట్.

ఏనుగుల రాయి: ప్రోస్పెక్ట్ టీ ఎస్టేటు, కండక్టరుగా పనిచేస్తున్నాడు తంగముత్తు. కొత్తగా వేునేజర్‌లా వచ్చిన సిమ్మన్సు పదిరోజులైనా కాకుండానే, ఎస్టేటంతా తెగ తిరిగేశాడు. వచ్చే ఏడాది టీ నాటబోయే స్థలం కోసం ఇప్పటినుంచీ వెతుకుతున్నాడు. ఓ స్థలం చూసి, దాని గురించి వాకబు చేస్తే, అది టీ నాటడానికి మంచి స్థలం అని పదేళ్ళ క్రితవేు అప్పటి మేనేజరు నిర్ణయించి నర్సరీ ఏర్పాటు చేసాడని, కానీ అక్కడ మొక్కల్ని ఏనుగులు బ్రతకనీయవని తెలుస్తుంది. ఆ క్రమంలో అతనికి ఏనుగుల రాయి గురించి తెలుస్తుంది. ఏనుగుల రాయికి, టీ మొక్కలకి ఉన్న సంబంధం ఏమిటి? ఏనుగులు ఎందుకు ఆ మొక్కలపై పగబట్టాయో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.

టెన్నిస్ టూర్నమెంట్: పేదవాడైనా, టెన్నిస్ బాగా ఆడగల గిరిని చూసి ఆకర్షితురాలవుతుంది ధనవంతుల కుటుంబానికి చెందిన కమల. తండ్ర అభీష్టానికి వ్యతిరేకంగా గిరిని పెళ్ళాడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. మొదట్లో ఇద్దరూ సరదాగా ఉంటూ కలసి టెన్నిస్ ఆడుకునే వారు. అయితే రాను రాను గిరికి టెన్నిస్ పట్ల వ్యామోహం అధికమై, ఇంటిని, భార్యని నిర్లక్ష్యం చేయడం మొదలుపెడతాడు. తానేదో గొప్ప ఆటగాడినని, తాను గట్టిగా ప్రయత్నిస్తే డేవిస్ కప్ కైనా ఆడగలనని అనుకుంటాడు గిరి. కానీ అతని ఆట అంతంత మాత్రమేనని అతని మిత్రుడయిన కథకుడికి తెలుసు. కొన్నేళ్ళ తర్వాత మిత్రులిద్దరూ కలుసుకున్నప్పుడు ఉద్యోగం మానేసి ఆట మీద దృష్టి పెట్టానని గిరి చెబుతాడు. కుటుంబమెలా గడుస్తుందని కథకుడు అడిగితే, కమల వాళ్ళ నాన్న కలిసిపోయారని, ఆయన డబ్బుతో వ్యాపరం చేయనున్నానని చెబుతాడు గిరి. కమల కరుడు గట్టిన ద్వేషాన్ని సైతం మర్చిపోయి తండ్రి పంచన ఎందుకు చేరిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.

ఉద్యోగం: ఈ కథ జగన్నాధం అనే ఓ న్యాయమూర్తి కథ, వెంకట రమణ అనే ఓ పేదింటి న్యాయవాది కథ. ఈ కుర్రప్లీడరు కేసులు వాదించే తీరుని గమనించి,అతని పట్ల ఆకర్షితుడవుతాడు జగన్నాధం. జగన్నాధం ఉద్దేశంలో లాయరుగా ప్రావీణ్యం సంపాదించడానికి కావలసినవి అభిరుచి, కాలం. వెంకటరమణ కూడా కాలక్రవేుణా ‘లా’ సూత్రాలకి చిలవలూ, పలవలూ కల్పించి వ్యాఖ్యానం చెయ్యడం, ప్రతి వాదనకీ పది కేసులు ఉద్ఘోషించి బలపరచడం నేర్చుకుంటాడని, కాలం కాని మరొకటి కాని నేర్పలేని ఏదో ప్రజ్ఞ వెంకటరమణలో వుందని, అది అతన్ని వృత్తిలో చివరంటా తీసుకుపోతుందని ఆయన భావిస్తారు. వీరి పరిచయం పెరిగి వెంకటరమణ జగన్నాధం ఇంటికి వచ్చిపోయేంత చనువు ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే జగన్నాధం గారి కూతురు నిర్మల్, వెంకట్ ఒకరినొకరు ఇష్టపడతారు, పెళ్ళాడుతారు. కాలక్రమంలో వెంకట రమణ ప్రాక్టీసు తగ్గుతుంది, న్యాయవాది వృత్తి విరమించుకుని ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకుంటాడు. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.

గాళిదేవరు: ఇది ఓ కాఫీతోటల కంపెనీ మానేజరు, సిబ్బంది కథ. కంపెనీ వృద్ధి చెందుతూంటుందీ, కానీ అభివృద్ధికి పాటుపడుతున్న కార్మికులు మాత్రం ఎన్నో కష్టాలు పడుతుంటారు. చిన్న ఉద్యోగుల కష్టాలు వివరించి, ముఖ్యంగా వాళ్ళ యిళ్ళయినా బాగుచేసి నూతన వసతులు కల్పించమని కంపెనీని కోరేడు మానేజర్ సోమయ్య. ఎలక్ట్రిసిటీ కూడా యిస్తే బాగుంటుందని రాయబోయి, ఆగిపోతాడు. అలా చేస్తే వేునేజిమెంటుకీ, తక్కిన చిల్లర ఉద్యోగులకీ వుండే వ్యత్యాసం సన్నగిల్లిపోతుందేమోనని భయం వేసింది. ఎలక్ట్రిసిటీ ప్రసక్తి ఎత్తకుండా ఉత్తరం ముగించాడు సోమయ్య. మానేజ్‌మెంట్ ఒప్పుకుని, కార్మికుల ఇళ్ళు బాగు చేయించడానికి, బాత్ రూమ్‍లు కట్టించడానికి అనుమతినిస్తుంది. ఈ విషయమై మాట్లాడి ఒప్పందం చేసుకునేందుకు బెంగుళూర్ వెళ్ళి, కిల్లిక్‌సన్‌ అండ్‌ కంపెనీకి వెడతాడు. అక్కడి ఆఫీసర్ చిన్నప్ప వీరి ఎస్టేట్ వివరాలు విని గాళిదేవరు ఉన్న ఎస్టేట్ అని తెలుసుకుని తానే స్వయంగా అక్కడికి వస్తాడు. గాళిదేవరు ఎవరు? అయన మహత్యమేమిటి? ఆ ఎస్టేట్‌కి ఒకప్పటి యజమాని అయిన వేుంగిల్స్‌ గాళిదేవరు ఆగ్రహానికి ఎలా గురయ్యాడు? ఎందుకు ఎస్టేట్‌ని అమ్మేసుకుని స్వదేశం వెళ్లిపోయాడు? మానవ మనస్తత్వాలని, ప్రాకృతిక శక్తుల పట్ల మనుషుల భయాన్ని, తోటివారి బలహీనతలపై ప్రాక్టికల్ జోకులు వేసి ఆనందించే స్వభావాన్ని ఈ కథ చిత్రిస్తుంది. కాఫీ తోట వర్ణన అద్భుతంగా ఉంటుందీ కథలో.

ఫ్యాన్సీడ్రెస్‌పార్టీ: లలితా మురళీలది అన్యోన్య దాంపత్యం. మురళీ టీ తోటలో మానేజర్‌గా పనిచేస్తూంటాడు. మురళి ఆఫీసుకు వెళ్ళిపోతే, లలితకి ఏమీ తోచదు. టీ తోటల్లో జీవితం ఎంతో ఒంటరిగా వుంటుంది. ఇక్కడ చాలా భాగం కూలీలే. కొద్దిమంది గుమాస్తాలూ, ఫ్యాక్టరీ సిబ్బంది కూడా వుంటారు. వేునేజ్‌మెంట్‌ హోదాలో వున్నవాళ్ళు వీరితో కలవడం ఎలానూ పడదు. ఉన్న మానేజ్‌మెంట్ ఉద్యోగులందరూ కలిసేదీ ఏ మూడు నెలలకి ఒకసారో అవుతుంది. ఈ సారి అందరూ కలిసినప్పుడూ, ఏవో రొటీన్ కార్యక్రమాలు కాకుండా కొత్త, భిన్నమైన కార్యక్రమాలు రూపొందించాలని అనుకుని ఫాన్సీ డ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది లలిత. అందరూ తాము వేసుకోబోయే డ్రెస్ గురించి గోప్యంగా ఉంచాలి, కనుక తాను వేసుకోదలచిన జపాన్ డ్రెస్ గురించి భర్తకి చెప్పదు లలిత. ఒక రోజు అనుకోకుండా ఆ డ్రెస్‌ని చూస్తాడు మురళి, అది అతనికి నచ్చదు, దాన్ని వేసుకోవద్దంటాడు. భార్యభర్తలలో అభిప్రాయబేధాలొస్తాయి. ఇద్దరూ ఒకరిమీద ఒకరు అలుగుతారు. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఒక ఫాన్సీ డ్రెస్ లలిత మురళీల మధ్య దూరం కల్పిస్తే, మరో ఫాన్సీ డ్రెస్ వారిద్దరిని కలుపుతుంది. టీ ఎస్టేట్‌లో పనిచేసే ఉద్యోగుల జీవితాలను దగ్గరగా చూపిస్తుందీ కథ.

క్లబ్ నైట్: ఒకప్పుడు బాగా రాసే రచయిత హఠాత్తుగా రాయడం మానేస్తాడు. టీ ఎస్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి పనుల ఒత్తిడి వలన రాయడం లేదని పాత మిత్రుడు భావిస్తాడు, కానీ ఆ రచయిత అసలు వివరం ఇలా వివరిస్తాడు “ఎవరో ఎక్కడో మెచ్చుకుంటున్నారని నెలలూ, ఏళ్ళూ తరవాత వినికిడిగా తెలిస్తే ఏం తృప్తిగా వుంటుంది? రాసింది నీ చుట్టూ వున్న వాళ్ళని కదిలించడం చూడగలిగితేనే కదా ఇంకా రాయాలనే వుత్సాహాం పుట్టేది!” అంటాడు. మిత్రుడు అంగీకరించడు. మళ్ళీ రాయాలని పట్టుపడతాడు. మళ్ళీ రాయడం తన వల్ల కాదని, “గడించిన పేరుని భద్రంగా రక్షించుకుంటూ రాయడం మానెయ్యాలా, చిత్తశుద్ధితో రాసి ఆకట్టుకున్న వాళ్ళ అభిమానాన్ని పోగొట్టుకునే ప్రమాదాన్ని ఎదుర్కోవాలా?” అంటాడు. చివరికి అతను మళ్ళీ రాసాడో లేదో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.
పచ్చటి టీ, కాఫీ తోటలలో చూడడానికి అందంగా ఉండే బయట కొండలూ, స్వచ్ఛమైన గాలి అన్నీ ఉంటాయి. వీటితో పాటు పెద్దా చిన్నా తారతమ్యాలూ, స్పర్థలూ కావేషాలూ, నటనలూ, ఆశ్రిత పక్షపాతాలూ, అన్ని చోట్లా వున్నట్లే ఇక్కడకూడా అదే మోతాదులో తాండవిస్తూ వుంటాయని ఈ కథ చెబుతుంది.

చివరిదాక ఆసక్తిగా చదివించే కథలున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ. 50/- . నెలకి రూ. 30/- అద్దెతో కూడా చదువుకోవచ్చు.

వేలుపిళ్లై On Kinige

కొల్లూరి సోమశంకర్

Related Posts:

కెటికె కినిగె టెస్ట్ కిట్–తెలుగు యూనీకోడ్ ఖతుల పరిక్షా సహాయకారి విడదలయింది.

 

తెలుగు విశ్వసంకేత ఖతులను పరిక్షించటానికి సహాయకారిగా కినిగె టెస్ట్ కిట్ రూపొందించాము.

దాని వివరాలు ఇకక్డ మా ఆంగ్ల బ్లాగులో చూడండి. http://enblog.kinige.com/?p=400

Related Posts:

బాపు బొమ్మల కొలువు

బాపు బొమ్మల కొలువు అనే ఈ పుస్తకాన్ని రూపొందించింది ముఖీ మీడియా వారు. మన సంగీత, సాహిత్య, లలిత కళల పట్ల అవగాహనని, సంస్కృతి మీద గౌరవాన్ని పెంపొందించేందుకు దోహదపడిన ఎందరో ప్రముఖుల, పెద్దల ఋణం కొంతైనా తీర్చుకోవాలనే సత్సంకల్పంతో ముఖీ మీడియా పనిచేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా వారు బాపు బొమ్మల ప్రదర్శనని ఏర్పాటు చేయడమే కాకుండా, వాటిని అందంగా పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు. వారికి అభినందనలు.

ఈ పుస్తకంలో బాపు గారి బొమ్మలతో పాటు ఆయన గురించి ముళ్ళపూడి వెంకటరమణ, ఆరుద్ర, కొడవటిగంటి కుటుంబరావు, నండూరి పార్థసారథి, బి.వి. ఎస్. రామారావు వంటి ఎందరో ప్రముఖులు రాసిన వ్యాసాలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వర రావు, డా. సి. నారాయణ రెడ్డి, చిరంజీవి వంటి వారు బాపు గారిని అద్దంలో చూపించారు. బాపుగారి స్క్రిప్ట్ బుక్ చూస్తూ కాలం గడిపానని విజయశాంతి గారు అంటారు.

సాధారణంగా రమణగారు రాస్తారని, బాపు గారు గీస్తారని ప్రతీతి. కానీ ఈ పుస్తకం ద్వారా బాపుగారు రాస్తారని కూడా మనకి తెలుస్తుంది “నా గాడ్‌ఫాదర్…..గురించి కాస్త, నా బొమ్మల కథ మరి కాస్త…” అనే శీర్షికతో 9 పేజీలలో వివరంగా మినీ ఆత్మకథ రాసారు బాపు గారు.

ఈ పుస్తకంలో ప్రముఖ నవలల, పుస్తకాలకు బాపు గారు వేసిన ముఖచిత్రాలు ఉన్నాయి. ఉదాహరణకి, ఆరుద్ర గారి కూనలమ్మ పదాలు, వాసిరెడ్డి సీతాదేవి గారి సావేరి, గోపీచంద్ గారి గతించని గతం, సలీం గారి కాలుతున్న పూలతోట, పరిమళా సోమేశ్వర్ గారి గాజుపెంకులు, శ్రీపాద సుబ్రహ్మణ్యంగారి కథా సంపుటి వడ్లగింజలు, వంశీ మా పసలపూడి కథలు వంటివి. ఇప్పటి తరం పాఠకులు తమకి తెలియని పాత కాలం నాటి మంచి పుస్తకాల వివరాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకంలో బాపు గారు వేసిన బొమ్మలను చూస్తే తెలుస్తాయి.

ప్రముఖ దర్శకుడు వంశీ కథలకి బాపు గారు వేసిన బొమ్మలు హాలీవుడ్ నాణ్యత గల సినిమా చూస్తున్నట్లనిపిస్తుంది. భానుమతి రామకృష్ణ గారి అత్తగారూ, ఆవు నెం.23 బొమ్మ రమ్యంగా ఉంది. అలాగే పౌరాణిక గాథలకి బాపు గారు వేసిన బొమ్మలను చూస్తుంటే పాఠకులు కూడా దేవతల్లా అనిమేషులై పోతారు. రంగులలో ఉన్న బొమ్మలు ఎంతగా ఆకట్టుకుంటాయో, నలుపుతెలుపులలో ఉన్న బొమ్మలు సైతం అంతే ఆకర్షిస్తాయి.

కొన్ని బొమ్మలను చూస్తుంటే కథానుసారంగా బొమ్మ గీసారా లేక, బొమ్మకి వర్తించేలా కథ రాసారా అనే సందేహం తలెత్తక మానదు. ఒకానొక కాలంలో రచయిత్రులు, రచయితలు తమ రచనలకు బాపుగారితో బొమ్మలు గీయించమని సంపాదకులను కోరుకునేవారుట!

ఈ పుస్తకంలో కొందరు ప్రముఖుల చిత్రాలు ఉన్నాయి. మాలతీ చందూర్ గారి బొమ్మ చూస్తుంటే, వారి ఫోటోనే చూస్తున్నట్లుంటుంది.

బాపు బొమ్మలని తెలుగువారికి పరిచయం చేయడమంటే, ముంజేతి కంకణం చూసుకోడానికి అద్దం ఉపయోగించడమే అని మాకు తెలుసు. కానీ ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుందన్న సువార్తని అందరితో పంచుకోడం కోసమే ఈ చిన్న ప్రయత్నం.

బాపు బొమ్మల కొలువు On Kinige

చావా కిరణ్, సోమ శంకర్

Related Posts:

  • No Related Posts

సరికొత్త తెలుగు యూనికోడ్ ఖతి

కినిగె ద్వారా ఒక వజ్రం అనే పేరుతో కొత్త తెలుగు ఖతి వెలువడింది అని తెలియచేయటానికి మేము సంతోషిస్తున్నాం.

ఈ ఖతి లో అక్షరాలు వజ్రాల ఆకృతిలో కనిపిస్తాయి. అందుకనే ఈ ఖతికి వజ్రం అని పేరుపెట్టడం జరిగింది.

వజ్రం ఖతి గురించి

వజ్రం ఖతి కినిగె డిజిటల్ టెక్నాలజీస్ ప్రై. లిమిటెడ్ వారి ద్వారా తయారుచేయబడింది.

ఈ ఖతి లో అక్షరాలు పెద్ద ఆకారంలో శీర్షికలకు వాడటానికి అనువుగా ఉంటాయి.  ఇది మీకు చాలా ఉపయోగ పడుతుంది.

లైసెన్స్

ఈ ఖతి SIL OFL లైసెన్స్ తో వెలువడింది. ఈ లైసెన్స్ యొక్క ప్రతిని మీరు ఖతి దింపుకోలు లో పొందగలరు.
http://scripts.sil.org/ వద్ద కూడా మీరీ లైసెన్స్ ను పొందవచ్చు.
(http://scripts.sil.org/cms/scripts/render_download.php?&format=file&media_id=OFL_plaintext&filename=OFL.txt)


మేమీ ఖతిని ఎలా రూపొందించాం?

లోహిత్ తెలుగు ఖతితో మొదలుపెట్టి, దాని ఆధారంగా వజ్రం ఖతిని రూపొందించాం. రెండు బిందువుల మధ్య గల చాపములను(వక్ర రేఖలను) సరళరేఖలుగా మార్చడం ద్వారా ఈ ఖతి రూపొందినది.

సమస్యలను, లోటులను, సూచనలను ఎక్కడ తెలుపాలి?

మీకు వజ్రం ఖతిలో ఏమయినా సమస్య తలెత్తినా, మీరు మాకు ఏదయినా సలహా లేదా సూచన అందించ దలచినా support at kinige.com కు ఒక వేగు రాయండి.

వజ్రం ఖతి అని వేగు విషయంలో చేర్చండి.

ఖతిని ఎక్కడ నుండి దింపుకోలు చేస్కోవాలి?

వజ్రం ఖతి యొక్క తాజా ప్రతిని http://kinige.com/fonts/vajram వద్ద నుండి దింపుకోలు చేస్కోవచ్చు.

ఎలా స్థాపించాలి?

vajram.zip ను అన్జిప్ చేసి vajram.ttf దస్త్రాన్ని తీస్కోండి.

  • విండోస్ ఎక్స్పీ, విస్టాల్లో  vajram.ttf ను c:\windows\fonts సంచయంలోకి చేర్చండి.
  • విండోస్ 7 లో , vajram.ttf దస్త్రాన్ని డబల్ క్లిక్ చేసి ఎడమ పైన ఉన్న మీటను నొక్కి స్థాపించవచ్చు.
  • లినక్స్ ఉబుంటూలో : vajram.ttf దస్త్రాన్ని డబల్ క్లిక్ చేసి కుడి పక్క కింద Install Font అని ఉన్న మీటను నొక్కి స్థాపించవచ్చు.(fontviewer application).

 


Related Posts: