భారత స్వాతంత్ర్యోద్యమం ఆంధ్రప్రదేశ్ ముస్లింలు – హైదరాబాద్ మిర్రర్ – సమీక్ష

ప్రముఖ పరిశోధకుడు, చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన “భారత స్వాతంత్ర్యోద్యమం ఆంధ్రప్రదేశ్ ముస్లింలు” అనే పుస్తకాన్ని హైదరాబాద్ మిర్రర్ దినపత్రిక 24 అక్టోబర్ 2011 నాటి సంచికలో ‘అక్షర మిర్రర్’ శీర్షికలో సమీక్షించింది.

ఈ సమీక్షలో నశీర్ అహమ్మద్ ఎంతో శ్రమకూర్చి ఈ పుస్తకానికి అవసరమైన సమాచారన్ని సేకరించారని, తెలుగు పాఠకులకి అందుబాటులో లేని చారిత్రక వివరాలను అందజేసారని పేర్కొన్నారు.

ఈ గ్రంథం మొదటి భాగంలో భారత స్వాతంత్ర్యోద్యమంలోని 1757 ప్లాసీ యుద్ధం నుంచీ మొదలుపెట్టి 1956 నాటి ఆంద్రప్రదేశ్ అవతరణ వరకు జరిగిన ప్రధాన ఘట్టాలను వివరించగా, రెండవ భాగంలో యాభై మంది సమరవీరుల జీవితచరిత్రని వివరించారు. మూడవ భాగంలో విముక్తి పోరాటానికి కొనసాగింపు జరిగిన ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నవారి వివరాలు, నాల్గవ భాగంలో కొంతమంది స్వాతంత్ర్య సమరయోధుల సంక్షిప్త వివరాలను పొందుపరిచారు.

సయ్యద్ నశీర్ అహమ్మద్ రచనలు మతవిద్వేషాన్ని రేకిత్తించవని, జాతీయ సమైక్యత – సమగ్రత, సామరస్యం పెంపొందించేలా ఆయన కలం సాగుతుందని ఈ సమీక్ష పేర్కొంది.

పూర్తి సమీక్షని ఈ పై చిత్రంలో చదవండి

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

భారత స్వాతంత్ర్యోద్యమం ఆంద్రప్రదేశ్ ముస్లింలు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

ఎన్నెమ్మ కథలు

ఎన్నెమ్మ కథలు అనేవి నిడదవోలు మాలతి గారు తన బ్లాగులో ’ఊసుపోక’ అనే శీర్షికతో రాసుకున్న టపాల సంకలనం. పత్రికలలో ప్రచురించాలి అంటే అది కథో, వ్యాసమో, కవితో, ఫీచరో అయి ఉండాలి. ఇలాంటి వర్గీకరణ చట్రాలలో ఇమడవు ఈ ఎన్నెమ్మ కథలు.

ఈ ఎన్నెమ్మ కథలకి పునాది లోతైన పరిశీలనని, ఆవరణ విశాలమైన జీవితానుభవం అని ముందుమాట రాసిన ఎస్. నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు.

ఇక్ష్వాకుల కాలం నాటి గడియారం” అనే టపాలో తన పాతకాలం నాటి గడియారం మంచులో కూరుకుపోవడం, మూడు నెలల తర్వాత బయటపడడం, అయినా చక్కగా పనిచేస్తుండడం గురించి చెప్పారు.

మిరపకాయ బజ్జీలు” అనే టపాలో బజ్జీలు చేయడం కోసం శ్రేష్టమైన మిరపకాయలను ఎంచుకోడానికి ప్రయత్నించడం గురించి రాసారు. అమెరికాలో లభించే వివిధ రకాల మిరపకాయల పేర్లు, వాటిలో కారం తీవ్రతని (హీట్ ఇండెక్స్) చెప్పడం ఆసక్తిగా ఉంటుంది.

నసాంకేతికం” అనే వ్యాసంలో తాను తొలినాళ్ళలో కంప్యూటర్ నేర్చుకోడానికి చేసిన ప్రయత్నాల గురించి చెబుతారు మాలతి గారు.

వినదగు నెవ్వరు చెప్పిన” అనే వ్యాసంలో సేల్స్‌మన్ల వాక్చాతుర్యం గురించి, వ్యాపర ప్రకటనల ప్రలోభాల గురించి సరదాగా చెప్పారు. చివర్లో ’వినదగు నెవ్వరు చెప్పిన…..’ అనే మాటని వినకూడదని అంటారు.

ఏ పేరెట్టి పిల్చినా” అనే వ్యాసంలో తన పేరు పలకడంలో అమెరికన్లు ఎదుర్కునే ఇబ్బందులు, వాటిని సరిచేయడానికి తను పడిన బాధలను హాస్యంగా వివరిస్తారు. ’మాలతి’ పేరుతో ఉన్న ఇతర ప్రసిద్ధ మహిళలను “తనే’ అనుకుని ఎందరో పొగడడం గురించి చెబుతారు.

దీపాలార్పు దినం” అనే వ్యాసంలో విద్యుత్ వాడకం గురించి, అమెరికాలో రీ-సైకిలింగ్ వ్యాపారం గురించి ప్రస్తావిస్తారు. విద్యుత్‌‍ని వృధా చేసుకోకూదని సూచిస్తారు.

అప్పులు ఆస్తులు” అనే వ్యాసంలో జనాలు ఋణవలయంలో ఎలా చిక్కుకుపోతారో తెలిపారు. వ్యాసం సరదాగా సాగినా, అందులో అంతర్లీనంగా హెచ్చరికలూ ఉన్నాయి.

అచ్చంగా నేనే అచ్చేసుకున్న చిన్ని నా పొత్తం” అనే వ్యాసంలో పుస్తకాలను ప్రచురించుకోడంలో తనకెదురైన ఇబ్బందులను ప్రస్తావించారు. అవి అందరు రచయిత్రులు, రచయితలకి ఎదురయ్యేవే.

పుస్తకం కొనడవా? ఎక్కడా విన్లేదు, చోద్యం” అనే వ్యాసం వ్యంగ్యంగా రాసినా, అందులో అంతర్లీనంగా తెలుగు పుస్తక ప్రియుల, రచయితల బాధ ఉంది.

చెత్త భ్రమణం” అనే వ్యాసంలో రీ-సైకిలింగ్ గురించి హాస్యంగా రాసారు.

తుమ్మెదా ఒకసారి…” అనే వ్యాసం చదివాక, నవ్వలేక కడుపు పట్టుకోడం ఖాయం.

గల్పిక ముదిరి కథ అయిందట!” అనే టపాలో కథలెలా రాయాలో చెప్పారు. ’ఏది కథానిక, ఏది గల్పిక, ఏది స్కెచ్?’ అనే వివరాలు తెలిపారు.

బామ్మ అంటే బాపు బొమ్మ అని అర్థంట!” అనే వ్యాసంలో మాటలకి అర్థాలే కాదు, ఆకారాలు ఉంటాయని చెప్పారు.

సంతంటే సంతోసమయ్య మాకు!” అనే వ్యాసంలో షాపింగ్ అంటే తమకి సోషల్ ఈవెంటని చెబుతారు.

ఇంకా ఎన్నో చెణుకులు, చురకలు, చమక్కులు ఉన్న వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

ఈ ఎన్నెమ్మ కథలు పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. నేడే మీ కాపీని సొంతం చేసుకోండి.

ఎన్నెమ్మ కథలు On Kinige

సోమ శంకర్ కొల్లూరి.

Related Posts:

‘భగవంతం కోసం’ కథపై రామమోహన్ రాయ్ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘భగవంతం కోసం’ కథపై రామమోహన్ రాయ్ గారి అభిప్రాయం చదవండి.

* * *

“ఇంటలెక్చువల్స్‌గా చెప్పుకోదగిన తెలుగు కథా రచయితలు తక్కువ. అంతర్జాతీయ స్థాయిలో ఇవి మా తెలుగు కథలని మనం అందించగలిగినవీ తక్కువ. శ్రీ ‘త్రిపుర’ ను giant among the intellectual writers అని గట్టిగా చెప్పవచ్చు. ‘భగవంతం కోసం’ కథానిక ఇతివృత్తమూ, శిల్పమూ చక్కగా సమ్మిశ్రితమైన కళాఖండం.

శ్రీ ‘త్రిపుర’ యీ కథానికలో మనస్సు లోలోతులకు అట్టడుగున వున్న ఆణి ముత్యాల్ని, అసందర్భపుటా లోచనల్ని, ఒంటరితనపు భయంకరత్వాన్ని, మనిషి ఎవరికీ ఏమీ కాని ఏకాంతంలోని నిశ్శబ్దాన్ని పట్టుకున్నారు. మనస్తత్వ చిత్రణలో తెలుగులో ఇంతవరకూ వచ్చిన కథానికల్లో ‘భగవంతం కోసం’ ‘ది బెస్ట్ స్టోరీ’ అని నా నమ్మకం. ‘భగవంతం కోసం’ కథను నిశితంగా పరిశీలించి చూస్తే ఎన్నెన్ని అద్భుతాలు!

బలిసిన ఊరకుక్కలాంటి బస్సు, లెప్పర్ గాంగ్ పాటలు పాడుతూ చేపలని పట్టె వలలాగ పోవటమూ, రూపం పొందిన న్యుమోనియాలాంటి యిల్లు, గోడలమీద సర్రియలిస్టిక్ మచ్చలు, ఆశాకిరణంలా అరటి చెట్టు – ధైర్యంగా , అమాయకంగా, పిచ్చిది, గాజు పెంకులు రుద్దినట్లున్న మేనేజర్ ముఖం. గొంగళి పురుగులు కనిపిస్తే చాలు – చేత్తోనే అలా నలిపే బుజ్జిగాడు, హోటల్ వెనక రౌరవం, బరువైన రెప్పల కింద రెండు బలిసిన కుక్కలు, కళ్ళుమూస్తే పెద్ద గబ్బిలాల రెక్కలు, ప్రపంచపు అరటి పండుని వొలిచి చేతులో పెడ్తున్న అనుభూతి, ఆకాశంలో నక్షత్రపు జల్లు – ఎన్నెన్ని పదచిత్రాలు! వీటితో పాటు మనస్సును కోసేస్తూ మెత్తగా దూసుకుపోయే భావనాపటిమా మన అస్థిగతమై ‘కడదాకా’ మనతో వచ్చేస్తాయి.

భగవంతం పేరు వినగానే పిలకలు, కిఱ్ఱు చెప్పులు, చెవులకి కుండలాలూ, అరవేసిన అంగవస్త్రాలూ కన్పించటం – ఉన్నిథన్ పేరులో కొబ్బరితోటలు, మెల్లగా బేక్ వాటర్స్‌లో బరువుగా పోయే పడవలు – నల్లటి వంకుల జుత్తుల మెరుపులు, లవంగాలు, ఏలకులు, కోప్రా సుగంధాలు మనస్సులో మెదలటం, మనస్సులో మెదిలే అస్పష్ట భావ సంచలనానికి గొప్ప రూప చిత్రాలు. హోటల్లో చుట్టూవున్న మనుష్యుల మాటల్లో అర్థరహితమైన, అర్థవంతమైన అసందర్భపు ప్రేలాపనలు చుట్టు ముట్టేసి గుండెకు గాలం వేసి లాగేస్తాయి.

కథలో వచ్చిన కాఫీ – కాఫీ కాదు – మొదట అది “ఉత్తవేడిగా ఉన్న గోధుమరంగు” – ఆ తర్వాత అది “ఉత్తవేడి రంగు గోధుమ ఊహ”- ఇంత సర్రియలిస్టిక్‌గా వచ్చిన కథానిక మరేదీ తెలుగులో! సెమికోలన్ ఎక్స్‌క్లమేషన్ మార్కులూ విడదీసి రమ్మనటం, హెమింగ్‌వే వాక్యం లాగ నీట్‌గా- బ్రిస్క్‌గా- వోవర్‌టోన్స్ యేమీ లేకుండా వెళ్ళాడనటం ‘త్రిపుర’ గారి శిల్ప నైపుణ్యానికి గొప్ప నిదర్శనాలు.

“చెత్తని మెక్కి కప్పల్ని తిన్న పాముల్లా పోయే జనాన్ని చూస్తే అసహ్యం- ఈ పుట్టే అసహ్యం అంటే ఎంతో ఇష్టం” ఈ మాటల్ని బట్టి ‘త్రిపుర’ cynic అనీ, frustrated అనీ అనుకొనే ప్రమాదముంది. కాని మనిషిని ద్వేషిస్తూ ప్రేమించే గుణం – పిల్లల్ని బుగ్గలు సాగదీసి ఏడ్పించి ముద్దు పెట్టుకునే తత్వం ‘త్రిపుర’ కథల్లో వుంది.

మంచి కథకు, కవిత్వానికీ భేదముంటుందనుకోవటం భ్రమ. ‘త్రిపుర’ గారి కథానికలు అజంతా, బైరాగి, పఠాభి వంటి ఉత్తమ కవుల కవితల్ని చదువుతున్న అనుభూతి కలిగిస్తాయి. ‘త్రిపుర’ ఊహ నైశిత్యం తళత్తళల బాకులా గుండెల్లో గునపం పోటై గుచ్చుకుంటుంది. “తట్టుకోగల చావ వుంటే” త్రిపుర గారి భావనా పరిధిలోకి ప్రవేశించండి. సుందర సురూప ప్రపంచాన్ని కాక మామూలు రచయిత లెవ్వరూ కలలోనైనా కానని చీకటి కోణాలను, మనిషిలోని వెధవాయత్వాన్ని, అశక్తతనూ యేమైనా అతన్ని వీడని మానవత్వాన్ని దర్శించండి. ‘త్రిపుర’ కథలు చదివాక మనిషింటే కథాసాహిత్యమంటే పిచ్చి ఇష్టం కలుగుతుంది.”

రామమోహన్ రాయ్

త్రిపుర కథలు On Kinige

Related Posts:

డా. రాళ్ళబండికి నాయని స్మారకపురస్కార ప్రదానం రేపు

హైదరాబాద్, అక్టోబర్ 27 : సుప్రసిద్ధకవి, కళాప్రపూర్ణ నాయని సుబ్బారావు స్మారక పురస్కారాన్ని సుప్రసిద్ధ అవధాని, కవి డాక్టర్ రాళ్ళబండి కవితాప్రసాద్‌కు శుక్రవారం (29వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ప్రదానం చేయనున్నారు.

నాయని సుబ్బారావు ట్రస్ట్, మానస ఆర్ట్ థియేటర్స్ సంయుక్తాధ్వర్యంలో నిరన్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రధానకార్యదర్శి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహిస్తారని, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య నాయని కృష్ణకుమారి అవార్డును ప్రదానం చేస్తారు.

జూబ్లీహిల్స్‌లోని రోడ్‌నెంబర్ 5లో(ఇందిరానగర్ అప్స్) విదూషి, ఫ్లాట్‌నెంబర్ 68, రోడ్‌నెంబర్ 7/ఎ, ఉమెన్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటిలో జరిగే ఈ కార్యక్రమానికి సాహిత్యాభిమానులందరూ ఆహ్వానితులేనని మానసకార్యదర్శి రఘుశ్రీ తెలిపారు

 

Source = Andhrajyothy https://www.andhrajyothy.com/latestNewsShow.asp?qry=2011/oct/27/latest/27new52 

 

Rallabandi gaari Books are now available on Kinige @ http://kinige.com/kbrowse.php?via=author&id=120

సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ! On Kinige

అగ్నిహంస On Kinige

అవధాన విద్య – ఆరంభ వికాసాలు On Kinige

Related Posts:

  • No Related Posts

“ఆప్తవాక్యం” – ‘ఆసరా’ కథాసంపుటి గురించి….

వారణాసి నాగలక్ష్మి గారి కథా సంపుటి “ఆసరా”కి ముందుమాటగా ప్రముఖ అనువాదకురాలు శాంతసుందరి గారు ఇలా రాసారు.

* * *

వారణాసి నాగలక్ష్మితో నాకు పరిచయమై నాలుగేళ్ళయింది. అప్పట్లో కథా రచయిత్రిగా పరిచయమైన నాగలక్ష్మి మొదటి పుస్తకం ‘ఆలంబన’ నన్ను బాగా ఆకట్టుకుంది.’భూమిక’ సంస్థ చేపట్టిన హిందీ అనువాదాల కోసం ఆ పుస్తకం మొత్తం చదివాను.

ఆ తరువాత ఆమె కవితలూ, పాటలూ,గేయాలూ రాస్తుందనీ, ఇంకా చిత్రాలు కూడా వేస్తుందనీ తెలిసింది. ఇంత చిన్నవయసులో అంత బహుముఖమైన ప్రజ్ఞని సాధించటం చూసి చాలా సంతోషం వేసింది. ఇవన్నీ ఆమెలోని కళాకారిణిని నాకు పరిచయం చేశాయి. అటు చదువులో కూడా అద్భుతమైన విజయాలు సాధించిందని తెలిసి అబ్బురపడ్డాను. ఎవరైనా తల్చుకోవాలేగాని, దేన్నైనా సాధించేందుకు ఎంతటి ప్రయత్నమైనా చెయ్యగలరు అనటానికి నాగలక్ష్మి ఒక ఉదాహరణ. ఇంత ప్రతిభ ఉండి కూడా నాగలక్ష్మిలోని గాంభీర్యం, అదే సమయంలో సరళంగా అందరితో కలిసిపోయే స్వభావం మా ఇద్దరి మధ్యా ఆత్మీయమైన స్నేహానికి దారి తీసింది.

నాగలక్ష్మి కథలన్నీ పత్రికల్లోనూ, వెబ్ పత్రికల్లోనూ ఎంతోమంది చదివే ఉంటారు. ఇతర ప్రక్రియల్లో కలం సారించినప్పటికీ, ఆమెకి బాగా గుర్తింపు తెచ్చినవి కథలేనని నా అభిప్రాయం. కథల్లో నేపథ్యం తెలుగువారి జీవితాలే, కానీ ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్న రచయిత్రి కావటం వల్ల, ఆమె కథల కాన్వాసు పెద్దదిగా కనిపిస్తుంది. సైన్స్ విద్యార్థిని కాబట్టి దానికి సంబంధించిన ప్రస్తావన కూడా, కథావస్తువునుబట్టి కనిపిస్తుంది- ఈ కోవకి చెందిన కథలే.

కవయిత్రీ, పాటల రచయిత్రీ నాగలక్ష్మి వచనంలో కూడా ఆ లక్షణాలు సందర్భానుగుణంగా కనిపిస్తూ ఉంటాయి. నాగలక్ష్మి రచనా శైలిలోని విశిష్టత చెప్పాలంటే, కథ చెప్పే విధానం స్పష్టంగా, సామాన్య పాఠకుడికి కూడా సులభంగా అర్థమయ్యేలా చెప్పగలదు. పాఠకుడు కథ చదవటం మొదలు పెట్టాడంటే మధ్యలో ఆపే ప్రసక్తే లేదు. అందువల్లనేమో నాగలక్ష్మి కథలకి ఎక్కువగా పోటీల్లో బహుమతులు లభిస్తూ ఉంటాయి. కథావస్తువులో వైవిధ్యం, కథ చెప్పటంలో నైపుణ్యం, మంచి భాషా శైలీ నాగలక్ష్మి కథల్లోని ప్రత్యేకత.

నాగలక్ష్మి నన్ను తన కథల పుస్తకానికి ముందుమాట రాయమన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను కథా రచయిత్రినీ, విమర్శకురాలినీ కాను, కేవలం అనువాదకురాలిని. కానీ ఎంతో ఆప్యాయంగా, మా స్నేహాన్ని కారణంగా అనుకుని ఈ నాలుగు మాటలూ, నాకు తోచినవి రాశాను. స్నేహితుల కోరికని ఎవరైనా తోసిపుచ్చగలరా మరి?

ఆర్. శాంత సుందరి

* * *

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మీ కాపీని నేడే సొంతం చేసుకోండి.

ఆసరా On Kinige

Related Posts:

దైవం వైపు

ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన వ్యాసాల సంకలనం ఇది. వివిధ ఆధ్యాత్మిక పత్రికలలో మల్లాది వ్రాసిన వ్యాసాలని ఇందులో పొందుపరిచారు.

భగవంతుడిని చేరడానికి భక్తి, జ్ఞాన, కర్మ, ధ్యాన మార్గాలున్నాయని, అయితే భక్తి మార్గం తప్ప మిగతావి సామాన్య సాధకులకి కష్టతరమని మల్లాది అంటారు. భక్తి వల్ల మనకంటే అధికుడు, గొప్పవాడు ఇంకొకడున్నాడని అంగీకరిస్తామని, అందువల్ల మన అహం తగ్గుతుందని రచయిత అంటారు. భక్తి మార్గం ప్రాశస్త్యాన్ని వివరించే పద్మపురాణంలోని ఓ శ్లోకాన్ని ఉటంకించారు.

భయానికి, భక్తి ఉన్న తేడాని హెన్రీ ఎమర్సన్ మాటల్లో వివరించారు మల్లాది.

ప్రార్థన చక్కటి ఔషధమని పాశ్చాత్య దేశాలలో పరిశోధనాత్మకంగా నిరూపితమవుతున్న వైనాన్ని వివరించారు రచయిత. ప్రార్థన ఏ విధంగా పని చేస్తుందో తెలిపారు రచయిత. ప్రార్థన మనసులో పేరుకున్న కల్మషాన్ని కడిగేసి, తద్వార జీవనవిధానాన్ని క్రమశిక్షణలో ఉంచి, హృదయంలోని దైవంతో అనుసంధానం చేసే అవకాశం కల్పిస్తుంది. ప్రార్థన ఎందుకో చేయాలో మరో వ్యాసంలో వివరించారు.

దేవుడనేవాడున్నాడా అని వెతికేవారికి, దేవుడిని ఎలా, ఎక్కడ అన్వేషించాలొ చెబుతారు మల్లాది.

మౌనం ప్రాధాన్యతని వివరిస్తూ, ఏకాగ్రతకి నిశ్చలతకి ఉపకరిస్తుందని అంటారు. ఏ ఆలోచనలు లేని మౌనమే నిజమైన మౌనమని; ఆధ్యాత్మిక సాధకులు మౌనాన్ని ఎంతగా అభ్యసిస్తే, అంత అభివృద్ధిని పొందగలరని మల్లాది అంటారు. మౌనంలోని రకాలను వివరించారు.

అపరిగ్రహం గురించి చెబుతూ, ఇతరుల చేత ఉచితంగా సేవలు పొందకూడదని, అపరిగ్రహం ఋణానుబంధాన్ని రూపుమాపుతుందని చెబుతారు.

పశ్చాత్తాపం పరమ పావనం అంటూ, పశ్చాత్తాపానికి అవసరమైన మూడు నియమాలని వివరించారు. పశ్చాత్తాపం పదానికి ఆంగ్లంలో రిపెంటెన్స్, కన్ఫెషన్ అనే రెండు పదాలున్నాయని చెబుతూ, ఆ రెండిటికీ ఉన్న తేడాని చెప్పారు మల్లాది.

ఆధ్యాత్మిక సమయపాలన ప్రాముఖ్యతని వివరిస్తూ, సాధన కోసం సమయం ఎలా ఏర్పరుచుకోవాలో, సాధారణమైన వ్యవహారిక పనులను ఎలా ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలో, తద్వారా ఆధ్యాత్మిక పనులకు సమయం చిక్కుతుందని చెబుతారు.

చేతి అయిదు వేళ్ళు చేసే ప్రార్థన గురించి అద్భుతంగా చెప్పారు రచయిత.

నిజమైన ప్రేమంటే పరమాత్ముడిపై కలిగే ప్రేమ మాత్రమేనని, అది కూడా పరమాత్మ కృప ఉంటేనే సాధ్యమవుతుందని అంటారు మల్లాది.

ఆధ్యాత్మిక సాధకుల ప్రగతికి సూచికలుగా 12 అంశాలను పేర్కొన్నారు రచయిత.

తీర్థయాత్రలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆయా క్షేత్రాలలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలనే అంశాలను ఆసక్తికరంగా వివరించారు మల్లాది.

ఓ వ్యాసంలో ఆధ్యాత్మిక కేన్సర్ లక్షణాలను వివరించారు. సాధకులు ఆ రోగం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రతీ మనిషికి ఇతరులకి సహాయం చేయడంలో ఓ సరిహద్దు ఉంటుంది. ఈ సరిహద్దుని ఎంతగా విస్తరించుకుంటే, అంతగా ఆధ్యాత్మిక పురోగతి సాధించగలుగుతారని అంటారు రచయిత.

పుణ్యం ఎందుకు భయంకరమో సోదాహరణంగా వివరించారు రచయిత ఓ వ్యాసంలో.

మనల్ని లౌకికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతులని చేసే 12 సుసంస్కారాల గురించి చెప్పారు రచయిత.

విగ్రహారాధన గురించి చెబుతూ, తెల్లకాగితానికి విలువ ఉండదని, అదే ప్రభుత్వ కరెన్సీ ప్రెస్‌లో ముద్రించబడి బయటకి వస్తే, దానికి విలువ ఉంటుందని అంటారు. సాధారణ రాయికి ఏ విలువ ఉండదు, అదే రాతిని శిల్పంగా చెక్కినా లేదా గుళ్ళో ఉంచినా దైవంగా భావించి మొక్కుతాం, పూజిస్తామని అంటారు. ఏ విగ్రహాలైనా, అన్ని విగ్రహాల వెనుక ఉండేది ఏకాత్మ అయిన ఆ పరమాత్మేనని అంటారు. ఈ వ్యాసంలో రచయిత చెప్పిన ఉదాహరణలు ఆకట్టుకుంటాయి.

దేవుడి ఆదేశం అనే వ్యాసం చాలా ఆసక్తిగా ఉంటుంది. దాంట్లో ఉదాహరణగా చెప్పిన కథ ఎంతో బాగుంటుంది. దేవుడు మనతో మాట్లాడే మాటలు మనకి వినబడకుండా ఏవి అడ్డుకుంటాయో చెబుతారు రచయిత.

దానం కూడా తపస్సు లాంటిదేనని చెబుతూ, ధ్యానం చేసుకునే సమయం లేని వారు దానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చని రచయిత అంటారు. దానం విషయంలో వివేకవంతంగా వ్యవహరించాలని చెబుతూ – మన దగ్గర ఎంత ఉంటే అంతే దానం చేయాలని, మన దగ్గర లేనిది ఇవ్వాలని భగవంతుడు కూడా అనుకోడని రచయిత అంటారు.

నిష్కామకర్మ ద్వారా ఆధ్యాత్మిక జీవితం గడిపేవారి కార్యక్రమాలకు దైవసహాయం ఎలా లభిస్తుందో ఉదాహరణల ద్వారా చెప్పారు మల్లాది.

ఆహార నియమాల గురించి రాసిన వ్యాసంలో తగిన శ్లోకాలతో, వివరణలతో, సాధకులు ఏ తినాలో, ఎలా తినాలో వివరించారు.

అన్నదానం ప్రాముఖ్యతని “పట్టెడన్నం పెట్టండి” అనే వ్యాసంలో సోదాహరణంగా చెప్పారు రచయిత.

ఆధ్యాత్మిక సాధనకి అసలు ఆటంకం “అహమే”నని చెబుతూ, ప్రతీ పనిని తానే సంకల్పించి తానే చేస్తున్నానని అనుకోడమే ’అహం’ అని అంటారు రచయిత. అహాన్ని తగ్గించే కొన్ని చిట్కాలను చెబుతారు మల్లాది ఈ వ్యాసంలో.

ఇతరులపై జోక్స్ వేయడమంటే అది సాత్వికమైన కసి అని చెబుతూ, ఆధ్యాత్మిక సాధకులు తమపై తాము జోకులు వేసుకోవాలని సూచిస్తారు. ఇందుకోసం భగవాన్ రమణ మహర్షి జీవితంలోని ఘట్టాలను వివరిస్తారు.

“సెల్‌ఫోన్ వర్సెస్ భగవద్గీత” అనే ఓ చిన్న వ్యాసం అద్భుతంగా ఉంటుంది.

ఆధ్యాత్మిక గురువులని ఎంచుకునేడప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారు మల్లాది ఓ వ్యాసంలో.

ఆధ్యాత్మిక సాధకులనే కాకుండా సామాన్య పాఠకులని సైతం ఆకట్టుకుంటాయి ఈ వ్యాసాలు. మల్లాది చెప్పిన ఉదాహరణలు, పిట్టకథలు ఈ వ్యాసాలకి నిండుదనం తెచ్చాయి.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. నేడే మీ కాపీని సొంతం చేసుకోండి.

దైవం వైపు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

మీ కినిగె ఖాతా వాడుకరి పేరు లేదా సంకేతపదాన్ని మర్చిపోతే ఏం చెయ్యాలి?

మీరు మీ కినిగెఖాతా వాడుకరి పేరు లేదా సంకేతపదాన్ని మరిచిపోయారా?

కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్క వేగు ద్వారా మీ సంకేతపాదాన్ని మీరే నిర్దేశించవచ్చు మరియు మీ వాడుకరి పేరుని తిరిగి చూడవచ్చు.

ఔను, ఇది చాలా సులభం. కావల్సిందల్లా మీరు కినిగెలో ఖాతా రూపొందించేప్పుడు వాడిన వేగు చిరునామా, అంతే.

సంకేతపదాన్ని పునర్నిర్దేశించడం లేదా వాడుకరి పేరును కనుగొనటం ఎలానో ఇక్కడ చూద్దాం:

సోపానం 1 : కినిగె.కాం ముఖ పేజీలో కుడి పక్క పైన Login అనే లంకె గలదు. ఆ లంకెను వత్తండి

 

 

సోపానం 2 : తరువాత వచ్చే లాగిన్ తెర లో  Forgot Password or Username అన్న లంకెను వత్తండి.

 

సోపానం 3 : తరువాత మీరు కొన్ని గడులు ఉన్న ఒక పేజీని చూస్తారు. ఇక్కడ ఇచ్చిన మొదటి గడిలో మీ వేగు చిరునామా, రెండవ గడిలో పక్కన బొమ్మలో చూపిన అక్షరాలను ప్రవేశపెట్టి

 

Submit అని ఉన్నా మీటను నొక్కండి.

సోపానం 4 : ఇందాక మీరు ప్రవేశ పెట్టిన వేగు చిరునామా కు  support at kinige.com నుండి Reset your Kinige account Password అనే ఒక వేగు వస్తుంది.

ఈ వేగులో ఇచ్చిన లంకెను దర్శించి మీ సంకేతపదాన్ని పునర్నిర్దేశించవచ్చు.

సోపానం 5 : ఈ పేజీలో నే మీ వాడుకరి పేరు ఇంకా సంకేతపదాన్ని ప్రవేశ పెట్టేందుకు గడులు ఉంటాయి. ఒకవేళ మీరు మీ వాడుకరి పేరును మరిచిపోయుంటే ఇక్కడ అది చూడవచ్చు. మనం వాడుకరి పేరును మార్చలేము. అలానే ఒక సరికొత్త సంకేతపదాన్ని నిర్దేశించవచ్చు.

 

మీరు మీ సంకేత పదాన్ని నిర్దేశించాక కింద చూపిన విధంగా నిర్ధారణ పేజీ వస్తుంది.

 

ఇక మీరు కొత్తగా నిర్దేశించిన సంకేతపదంతో కినిగె లోకి ప్రవేశించవచ్చు.

Related Posts:

  • No Related Posts

ఇంతకు ముందు కొనుగోలు చేసిన పుస్తకాన్ని తిరిగి దింపుకోవటం

ఇదివరికే కినిగె లో కొన్న పుస్తకాలను కానీ, అద్దెకు తీస్కున్నా పుస్తకాలనుకానీ(అద్దె సమయానికి లోబడి)  మరోసారి దిగుమతి చేసుకోవచ్చు. ఇది చెయ్యడం చాలా సులువు కూడా.

 

సోపానం 2 : ఏ పుస్తకాన్ని తిరిగి దింపుకోవాలనుకున్నారో(మీరు ఇదివరకే కొన్న పుస్తకం), ఆ పుస్తక పేజీకి వెళ్ళండి.

 

సోపానం 3 : కుడి పక్కన గల లంకెల్లో Download purchased book అనే ఒక లంకె ఉంటుంది, దానిపై క్లిక్ చెయ్యండి.

 

సోపానం 4 : URLLink.ascm అను ఒక దస్త్రం మీ కంప్యూటర్ లోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ దస్త్రాన్ని అడొబె డిజిటల్ ఎడిషన్స్ లో తెరవండి.

నోట్ : మీరు మీ ఖాతా ద్వారా కినిగె లో కొన్న/అద్దెకు తీస్కున్నా పుస్తకాలన్నీ My Books అను లంకె గల పేజీలో ఉన్నాయి. అంచేత మీ కంప్యూటర్ ఒకవేళ ఫార్మాట్ చేయబడినా లేదా నిర్వహణా వ్యవస్థను పునఃస్థాపించినా తిరిగి పుస్తకాలను మీరు దింపుకోవచ్చనమాట.

 

మీరు కినిగె పుస్తకాలు చదవడానికి కొత్త అయితే ఈ లంకె చూడగలరు.

Related Posts:

‘హోటల్లో’ కథపై అబ్బూరి గోపాలకృష్ణ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘హోటల్లో’ కథపై అబ్బూరి గోపాలకృష్ణ గారి అభిప్రాయం చదవండి.

* * *

” ‘హోటల్లో’ అన్న యీ రచన నిజానికి కథ గాని కథ. కదలకుండా కదిలించే కథ.

చాలా మామూలుగా – మనం నిత్యం జీవితంలో చూసే దృశ్యాలనే అతి మామూలుగా చూపించడం ఈ కథలోని ప్రత్యేకత.

ఈ కథలో కనిపించే హోటల్లో ఎన్ని బల్లలున్నాయో వక్కయొక్క బల్ల దగ్గర ఎంతమంది భోక్తలున్నారో, వాళ్ళ తీరని ఆకలి – అంటే ఎంత తిన్నా తీరని ఆకలి. సర్వర్లూ, ప్లేట్ల గ్లాసుల గలగలలూ, ఇవే చూపిస్తున్నాడు రచయిత.

సాహిత్యం, రాజకీయాలు, పాలనా యంత్రాంగంలోని అవినీతి అన్నీ వినబడతాయి – హోటల్లో కూర్చున్న మనుషుల నోళ్ళల్లో నలుగుతూన్న పలహారాల మూలుగుల్లో-

అన్నీ దృశ్యాలే – కొండని దగ్గర్నుంచి మరీ దగ్గర్నుంచి చూస్తే కొండలో కొంత భాగమే చూడగలం. కొండ ఆకారాన్ని అంచనా కట్టాలంటే బాగా దూరంగా పోవాలి. రచయిత మనల్ని హోటలుకు మరీ దగ్గరగా – ఉహూఁ హోటల్లోకే సరాసరి పాఠకుల్ని తీసుకెళ్ళాడు. సీటు లేని ప్లేటు లేని అగంతకులం మనం.

రష్యన్ మహా చలన చిత్రకారులు పుడోవ్కిన్, ఐసెన్ స్టీన్ తమ చిత్రాలలో వాడిన ‘మాన్తాజ్’ (Montage) టెక్నిక్ ఈ కథ చదువుతూంటే గుర్తుకొస్తుంది.

పరస్పర విరుద్ధాలయిన రెండు దృశ్యాలను వొకదాని తరవాత వొకటిగా చూపించడమో, వొక దృశ్యం మీద మరొక దృశ్యాన్ని ఆరోపించడమో చేసి – చూపిన దృశ్యాలకు విరుద్ధమయిన భావాన్ని కలిగించడం ఈ టెక్నిక్ లోని ప్రత్యేకత.

ఈ కథలో కనిపించే అలాంటి భావం యేదో నేను చెప్పను.

కాని కథకుడు చెప్పేశాడు వొకచోట. దాన్ని వెతికి పట్టుకోవలసిన బాధ్యత పాఠకులదే. అందుకు పాండిత్యమూ, సహృదయతా ససేమిరా పనికిరావు. మానవత్వం కావాలి అదొక్కటే దీపం ఈ కథలో ప్రయాణించడానికి”.

అబ్బూరి గోపాలకృష్ణ

త్రిపుర కథలు On Kinige

Related Posts:

బూదరాజు రాధాకృష్ణ గారి పరిచయం

బూదరాజు రాధాకృష్ణ ప్రకాశం జిల్లా వేటపాలెంలో 1932 మే 3 న జన్మించారు. తల్లిదండ్రులు సువర్చలా నరసింహారావులు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు, విశాఖపట్నం నుంచి 1953లో బి.ఎ. (ఆనర్సు), 1954లో ఎం. ఎ డిగ్రీలు 1965లో డాక్టరేటు పొందారు.

వి. ఆర్. & వై. ఎస్. ఆర్ కళాశాల, చీరాలలో తెలుగు అధ్యాపకులుగా (1953-68) పనిచేశారు. తెలుగు అకాడెమీ హైదరాబాదులో రిసర్చ్ ఆఫీసర్‌గా (1968-73), డిప్యూటీ డైరక్టర్‌గా (1973-88) ఉన్నారు. హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం విజిటింగ్ ప్రొఫెసరుగా (1988-90), ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపాలుగా (1990-99) పనిచేసారు. #2006 జూన్ 4 న చనిపోయారు.

స్వీయ రచనలు:

అశ్రుధారలు (పద్యరచన)(1950), వ్యవహారిక భాషావికాసం (1972, ’81, ’92, ’99), ఈనాడు భాషాస్వరూపం (1981), భాష-శైలి నియమావళి (1985), సాహితీవ్యాసాలు (1990, ’95), భాషా శాస్త్ర వ్యాసాలు (1990, ’95), జర్నలిజం: అవగాహన – ఆచరణ (1995), జర్నలిజం – పరిచయం (1996, 2000), పురాతన నామకోశం (1996, 2003, ’06), మాటల మూటలు (1998), తెలుగు జాతీయాలు (1999, 2001), మాటల వాడుక – వాడుక మాటలు – అనుభవాలు -న్యాయాలు (1999, 2001), మంచి జర్నలిస్టు కావాలంటే (2000), మాటలూ మార్పులూ (2001), తెలుగు భాషా స్వరూపం (పదబంధ కోశంతో) (2001), విన్నంత -కన్నంత (2001), అనువాద పాఠాలు (2003), తెలుగు సంగతులు (2003), కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు (2004), పుణ్యభూమి (2004), తెలుగులో సమస్యాపూరణలు (కూర్పు)(2005), పద్యసాహిత్యం: సంఘచరిత్ర (1900-1950, 2005), ఈనాడు వ్యవహార కోశం (1990), ఆధునిక వ్యవహార కోశం (2000, ’03,’05, 2008), మహా కవి శ్రీ శ్రీ (1999), పరవస్తు చిన్నయసూరి (2002), శాసన శబ్దకోశం (?), A Monograph on Chinnaya Suri (1995), A Monograph on Mahakavi Sri Sri (1996), Occasional Papers in language and literature (1998).

కినిగెలో లభించే వీరి పుస్తకాలు ఆధునిక వ్యవహార కోశం, తెలుగులో సమస్యాపూరణలు, పద్యసాహిత్యం: సంఘచరిత్ర

తెలుగులో సమస్యాపూరణలు On Kinige

పద్యసాహిత్యం: సంఘచరిత్ర 1900 – 1950 On Kinige

ఆధునిక వ్యవహార కోశం On Kinige

Related Posts:

  • No Related Posts