‘వంతెనలు’ కథపై వి. మోహనప్రసాద్ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘వంతెనలు’ కథపై వి. మోహనప్రసాద్ గారి అభిప్రాయం చదవండి.

* * *

ఆర్. వి. టి. కె. రావ్ గారూ,

మీ కథ ‘వంతెనలు’ నాకెందుకు నచ్చిందంటే ఇది తెలుగు కథ కాదు కావున. ఏదో ఇటాలియన్ కాసిల్ పురాతన సాలె గూళ్ళ శూన్య అస్థిపంజరాల్లోకి తీసికెళ్ళింది కావున. వారణాసిలో వున్నప్పుడు గులాబీలు మంచు జడికి తడిసినపుడు నా రైన్ కోట్‌లో నేనూ ఒక ఉత్తరం కుక్కుకుని డబ్బాలో పడేయటానికి వెళ్తూన్న ఆ రాత్రులు గుర్తుకుతెచ్చింది గావున.

కవి కాని వాడు, జీవితంలో కవి కాని వాడు కథ రాయకూడదు. ఒకానొక వాతావరణాన్ని సృష్టించడానికే. సి. విటమిన్ మాత్రల గార్బినాల్ టాబ్లెట్ల ఖుర్కీ పదున్ల కవర్ ఎప్పుడో పోయిన పిస్టల్ గురి తప్పని cogito, ergo sum ల అనాచ్ఛాదిత ఆత్మ పోరాటపు affaire de coer ని చిత్రించారు. ఆ చీకటి, ఉంటుందనుకొన్న లేని వెన్నెల, మంచు, జడివాన, వెదుళ్ళ వంతెన, జవహర్ వంతెన కావల ఈవల, గోనె సంచుల కాపరాలు, చీకట్లో మెరుపు, ఇలాంటి వాతావరణాన్ని ఆవరణని మనసులో కొద్దిమందే-బుచ్చిబాబు చండీదాస్. కొలకలూరి. స్మైల్, బీనాదేవి నగ్నముని చిత్రించగలరు. మీరు కథ చెపుతున్నప్పుడు చెవులకు కళ్లుంటాయి. కళ్లకి చెవులుంటాయి. కృష్ణ బలదేవ్ వైద్ ఒకడు అలా చెప్తాడు.

అవును. మీరు కైన్, రాజు ఏబెల్. అందుకనే మీర్రాసిన ఆ ఉత్తరం – రాజుని తిడ్తూ – విమల ప్రభాదేవి బంగళాలో ఉండిపోయింది. ‘Am I my brother’s keeper?’ తిట్టుకుని రాసిన ఆ ఉత్తరం ఆ ‘రాజు’ కిపుడేమవుతూందో పది సంవత్సరాల తర్వాత మీ భవిష్యద్వాణి ఎపుడో చెప్పింది.

“I did not know then what was burning my brother and into what dreams he was pouring his life” అన్నారు మీరే మీ ‘segments’ లో.
‘వంతెనలు’ కథలో ఘటన, సంఘటనల కంటే సంఘర్షణ ముఖ్యం. భావ పర్యవసన్నత ముఖ్యం. ప్రేరణ జీవితంలోంచి వచ్చిందే. భ్రమ ఎలానో వాస్తవికత కూడా కెలిడియోస్కోప్ లాంటిదే. history లోంచి వచ్చిన storyకి మీరిచ్చిన ట్రీట్‌మెంట్ మెటానిమిక్ ట్రీట్‌మెంట్. మీ కథంతా ఒక expression of character. ఇందుకు సాక్ష్యమా!

“setting may be the expression of human will. It may, if it is a natural setting, be a projection of the will. Between man and nature there are obvious correlatives” (Rene Vellek & Austin warren)

అదండీ కథ!

మహారాజు కుమార్ బహదూర్, విమల ప్రభాదేవి బ్లూమూన్ బంగళా పోరికో ముందు డాంటీ ఇన్ఫ్‌ర్నో ముందు ‘Ia sciate ogni speranza voich’ entrate’ రాసినట్లుగా (ఇందులో కాలిడిన వాళ్ళు చచ్చారే!) ఉంది మీ ఆశ.

జాహ్నవి ముందే, సీజర్ ముందే విమ్మీని en deshabille (నగ్నంగా) చూపిస్తే బావుండేది. అపుడే మీకున్న కసి, అసహనం, (అయిష్టం) చచ్చిపోలేదు గాని జీవితంలో మిగిలింది ఏమీ లేదు. chere hezila femme (చూడు హృదయపు లోతుల్లో మునిగిన అమ్మాయిని) అందేది.

‘విరబోసుకున్న జుత్తు భుజాల మీంచి నల్లటి జలపాతం లాగా మెరుస్తూ వెర్రిగా పడుతూన్న’ జుట్టుని కొప్పట్టుకుని లాగి చిక్కటి చీకటి వానలోకి లాగి పారేస్తే వంతెన లుండవు గార్డినాల్ టాబ్లెట్లు, విస్కీ సీసాలు, ఖుర్కీలు, పిస్టల్స్ ఉండవు. లక్షల చేసే అందం, 20 ఏళ్ళ కిందట ఊరికే వచ్చిన అందం, రెండుసార్లోడిపోయిన మూడోసారి గెల్చిన రాజకీయ శక్తి, 17 సంవత్సరాల జాహ్నవికున్న – మీకు సంశయమైన సోల్, మీరే గొప్పయి విమ్మీ తల్లి కూడా కాని రంజన్ ఏమీ ఉండవు. ఇదంతా ఒట్టి నిరర్ధకమైన ఆత్మ పోరాటం. మీ అంతట మీరనవసరంగా మీలోకి ఖుర్కీ పొడుచుకున్నారు. నిష్కారణమైన offaire d’ honneur. అందమైన వాళ్ళని వికృతంగా చంపాలి. పోన్లెండి ఆ బ్లూమూన్‌లో విమ్మీ, మహారాజు కుమార్‌లు చేతుల్లో విస్కీ గ్లాసుల్తో నిదానంగా వాళ్లని వాళ్ళే మెత్తగా పొడుచుకు చస్తున్నారు.

Aristocracy సాలెగూళ్లోకి ఇరుక్కు పోయిన యే రచయితయినా సుఖవ్యాధుల్తో తీసుకు చచ్చిపోయిన బాదెలేర్ లానే “అద్దం ఎదురుగా నిలబడి నిన్ను నేనే పోల్చుకుని ఇది నువ్వు అని సందేహం లేకుండా చెప్పలేని” స్థితిలోకి, “చీకటికీ వెల్తురుకి మధ్యన వంతెన ఉంటుందో లేదో” ననే సందేహ స్థితిలోకీ వచ్చి వంతెన కింద చీకట్లో ప్రవహిస్తున్న చిక్కటి నెత్తురు ప్రవాహాన్ని చూస్తూ నిల్చుంటాడు.

34 ఏళ్ళ క్రితం ఒరిస్సా కొండల్లో నాన్న తన ప్రియురాలు పద్మాలయని చంపింది మీ చేత సొర బీడీ కాల్పించినందుకు; విమ్మీ తన 8దో ఏట సాధువు చేత చురక వేయించుకున్నదీ తను సిగరెట్ కాల్చినందుకు. ఈ కథని తెలుగు పాఠకులు అర్థం చేసుకుంటారా?

‘వంతెనలు’ కథ వ్యక్తిగత సామాజిక నేర భావాల మధ్య ఊగులాడుతూంటుంది. అది కూలిపోయే వంతెన, కింద నెత్తురు వాగు, నీడల్లో ధ్వజమెత్తిన ‘రాజు’ లాంటి వీరులదా రక్తం.

వి. మోహనప్రసాద్

త్రిపుర కథలు On Kinige

Related Posts:

కినిగె గురించి ఈనాడులో

సుప్రసిద్ధ దినపత్రిక ఈనాడులో వెలువడే ఈ-తరం అనే ప్రత్యేక పేజిలో చిటికెలో అనే శీర్షిక క్రింద 17 నవంబరు 2011 నాడు కినిగె గురించి ప్రచురితమైంది. పుస్తక ప్రియులంతా చూడాల్సిన సైట్‌గా పేర్కొన్నారు.

వివరాలకు ఈ లింక్ చూడండి లేదా ఈ దిగువ చిత్రాన్ని చూడండి.

Related Posts:

చరిత్ర పరిశోధనల్లో ఘనాపాటి

ప్రముఖ రచయిత, చారిత్రక పరిశోధకుడు అయిన సయ్యద్ నశీర్ అహమ్మద్ గురించి 20 నవంబర్, 2011 నాటి ఆంధ్రభూమి దినపత్రిక లోని “కవులూ.. రచయితలూ” శీర్షికలో సుప్రసిద్ధ విశ్లేషకులు విహారి పరిచయం చేసారు.

పరిశోధన ఒక అసిధారావ్రతమని, అందునా చారిత్రక పరిశోధన మరీ వ్యయప్రయాసలకోర్చినదని విహారి పేర్కొన్నారు. సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన పుస్తకాలను, చేసిన పరిశోధనల గురించి ఈ వ్యాసంలో విశ్లేషించారు రచయిత.

ఈ వ్యాసం పూర్తి పాఠాన్ని ఈ దిగువ చిత్రంలో చదవగలరు.


సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన పుస్తకాలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తున్నాయి.

ఈ పుస్తకాలపై తగ్గింపు కూడా ఉంది. వివరాలకు ఈ లింక్ చూడండి.

సయ్యద్ నశీర్ అహమ్మద్ ఈ పుస్తకాలు 25 శాతం తగ్గింపు ధరకు On Kinige

Related Posts:

“కథాపయనంలో కొత్త పుంతలు…” ‘ఆసరా’ కథాసంపుటి గురించి…

వారణాసి నాగలక్ష్మి గారి కథా సంపుటి “ఆసరా”కి ముందుమాటగా కౌముది వెబ్‌జైన్ సంపాదకులు కిరణ్ ప్రభ గారు ఇలా రాసారు.

* * *

సమస్యలని సమస్యలుగా కాక నిత్యజీవితంలో ఎదురయ్యే సంఘటనలుగా మలచి పాఠకులకి చూపిస్తే వాటిల్లో తమని తాము చూసుకోగలుగుతారు. ఇంక తర్వాత రచయిత ఏమి చెప్పినా పాఠకుడికి ఆత్మీయంగానే అనిపిస్తుంది. అలాంటి పాఠకుడు చివరంటా కథారచయితతో కలిసి ప్రయాణిస్తాడు. ఆ ప్రయాణపు చివరి మజిలీ (కథ ముగింపు) కూడా ఊరేగింపులూ, ఉద్యమాలూ, నినాదాలూ కాకుండా సున్నితంగా హృదయాన్ని తట్టి వదిలే దృశ్యమైతే రచయిత పాఠకుడికి చిరకాల మిత్రుడిగా మిగిలిపోతాడు. ఈ టెక్నిక్ ని అద్భుతంగా ఒడిసిపట్టుకుని తీవ్రమైన సమస్యలని సైతం సున్నితమైన కథా వస్తువులుగా మలచగల రచయిత్రి శ్రీమతి వారణాసి నాగలక్ష్మి గారు.

నాగలక్ష్మిగారు లలిత గీత రచయిత్రిగా ఏడెనిమిదేళ్ళ కిందట ఫోన్ ద్వారా పరిచయమయ్యారు. ఆమెకి ప్రతి పోటీలోను బహుమతులు గెలుచుకోవడం అలవాటని మాకప్పుడు తెలీదు!(ఈ సంపుటిలోని కథలలో బహుమతుల వివరాలని చూశాక మీరూ అంగీకరిస్తారీ యథార్థాన్ని!) నిజానికి మా పరిచయం కూడా ఆమెకి బహుమతి తెచ్చిపెట్టిన సందర్భమే. లలిత గీత రచనా పోటీల్లో బహుమతి వచ్చిందని తెలియచేయడానికి ఫోన్ చేసి మాట్లాడాం… ఆ తరువాత మేము నిర్వహించిన కథారచనా పోటీల్లో కూడా వరుసగా బహుమతులు అందుకున్నారు. మా పోటీలకి న్యాయనిర్ణేతలు మారినా విజేతల జాబితాలో మాత్రం నాగలక్ష్మిగారి పేరు ఉండాల్సిందే….! అది వారి రచనలకున్న విలువ, నాణ్యత, గుర్తింపు. తద్వారా నాగలక్ష్మి గారి మిగతా రచనలూ, ప్రచురితమైన పుస్తకాలూ చదివే అవకాశం లభించింది.

ఆమె లలిత గీతాల్లో, చిత్రలేఖనాల్లో కనిపించే లాలిత్యమే కథా రచనల్లో కూడా కనిపిస్తుంది. ఏ కథా కూడా ఊసుబోక వ్రాసినట్లు, కేవలం ఊహాలోకంలోంచి ఊడిపడినట్లు అనిపించదు. ఏదో సందేశం ఇచ్చితీరాలి అన్న దృక్పథం కంటే జీవితాన్ని జీవితంగా చూపిస్తూ మధ్యలో ఎదురయ్యే ఇబ్బందులకీ, సమస్యలకీ పరిష్కారం ఇదేనేమో ఆలోచించండి అని మనసు పొరల్ని స్పృశించి వదిలేస్తారు. రెండు మూడు దశాబ్దాల కిందటి కుటుంబ సంబంధ బాంధవ్యాలని గుర్తుచేసే కథలు కొన్నీ (ఒక ప్రేమలేఖ, ప్రేమతో పెద్దత్త, వినిపించని రాగాలు… మొదలైనవి), మారని కాలం, వేగవంతమైన జీవన విధానాలు, నాలుగు వీధుల కూడలిలో నిలబడ్డ సందేహాస్పద యౌవనాలు… వీటిని ప్రతిబింబించే కథలు ఇంకొన్నీ (ఆసరా, సంధ్యారాగం… మొదలైనవి), వర్తమాన సమాజిక కోణాలకి నిలువుటద్దంలాంటి కథలు మరికొన్నీ (ప్రగతి ఫలాలు, ఇది కల కాదు, రేపటి ప్రశ్న… మొదలైనవి).

కొన్ని కథల ముగింపు చదివిన ప్రతిసారీ కళ్ళు చెమరుస్తాయి. పెద్ద, పెద్ద ఉపన్యాసాలు ఉండవు. సంక్లిష్టమైన కథా శిల్ప భేషజాలు కనిపించవు. ఒక్క వాక్యం చాలదూ అనిపిస్తారు. ‘మేఘన’ కథ ముగింపులో నాన్నమ్మ గారింటి వద్ద ఆంక్షల మధ్య గడిపిన చిన్నారి “ఏమైందంటే… నాన్నమ్మ నన్ను తిట్టలేదు… కొట్టలేదు… ఎత్తుకోలేదు కూడా…” అంటుంది. “ఎత్తుకోలేదు కూడా…” అన్న రెండు పదాల్లో పసిపాప మనస్తత్వాన్ని పూర్తిగా దర్శింపచేశారు. ‘వినిపించని రాగాలు’ కథ చివరలో “రాత్రంతా వీచిన పెరటి గాలి నా మనసు నిండా ప్రాణ వాయువు నింపింది. ఉతికి ఆరేసిన వస్త్రంలా నా హృదయం ప్రక్షాళితమైంది. కారు ముందుకి కదులుతుంటే నా మనసు వాళ్ళ మధ్యే ఆగిపోయింది” అంటారు. ఇందులో కూడా చివరి వాక్యంతో పాఠకుల హృదయాల మీద ఎంతో బలమైన ముద్ర వేస్తారు. అలాగే ‘ఒక ప్రేమలేఖ’ ముగింపు కూడా. ఈ ‘ఒక ప్రేమలేఖ’ కథ చదివి ఎంతో ఇష్టపడి ‘స్వప్న’ పత్రిక నుంచి అనుమతి పొంది వెంటనే ‘కౌముది’ లో కూడా ప్రచురించడం జరిగింది. అలాగే ఏ కథలోనైనా పాత్రలతో, తన భాషలో కాక, ఆయా వ్యక్తిత్వాలకి తగినట్లు మాట్లాడించడంలో కూడా నాగలక్ష్మిగారు కథా రచయిత్రిగా మంచి నేర్పు ప్రదర్శించారు. ఈసంపుటంలో మిగతా కథలకంటే భిన్నంగా నిలిచేవి శ్యామా గోపాళం(హాస్యకథ), మానవ ప్రయాణం (కవితాత్మక అధివాస్తవిక చిత్రణ). ఇవి కూడా నాగలక్ష్మిగారి కలానికున్న విభిన్నతకి దర్పణాలు.

ముందుకి నడవండి.. కథా వీధిలోకి అడుగుపెట్టండి… కథలే మిమ్మల్ని నడిపిస్తాయి.

నాగలక్ష్మిగారి కలం నుంచీ ఇలాగే సజీవమైన కథలు నిరంతరం వెలువడాలని మనసారా ఆశిస్తూ…

కిరణ్ ప్రభ

* * *

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మీ కాపీని నేడే సొంతం చేసుకోండి.

ఆసరా On Kinige

Related Posts:

‘కనిపించని ద్వారం’ కథపై ఆర్. ఎస్. సుదర్శనం అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘కనిపించని ద్వారం’ కథపై ఆర్. ఎస్. సుదర్శనం గారి అభిప్రాయం చదవండి.

* * *

జీవితంలో కనిపించని అర్థమే ‘కనిపించని ద్వారం’ కథ. నారాయణ జీవితాన్ని గూర్చి వేసిన ప్రశ్న “ఎందుకు?” దానికి సమాధానం ‘కెరటాల హోరులో అపస్వరాల అలజడిలో, లోన, లోలోన నిశ్శబ్దం’ అది ఒక రకం సమాధానమే కాని, నారాయణలాంటి వాళ్ళు కోరే ‘అర్ధవంత’మైన సమాధానం కాదు. అందుకే రెండవసారి ప్రశ్నిస్తాడు: “ఎందుకు!” – అప్పుడే విరిగి బద్దలయిన కెరటం, రాయి చుట్టూ. సుడి తిరిగింది రాయి చుట్టూ, ఆహ్వానిస్తూ, తెల్లటి కుచ్చిళ్ళు రాయి చుట్టూ పరిచి, తల్లి మారాము చేసే పిల్లవాణ్ణి ఒడిలోకి ఆహ్వానించినట్లు. కాని నారాయణ గడుగ్గాయి. మళ్ళీ మూడోసారి “ఎందుకూ?” అని అరిచాడు.- ‘శబ్దం గొంతుకలోంచి, యూస్టేషియన్ నాళాల్లోంచి, చెవుల్లోకి, మూయబడిన చెవుల్లోకి వెళ్ళి ప్రతిధ్వనులు వెతుక్కుంది’. కోపంగా ‘తంతాను… పో అని ఎడమకాలు ఎత్తి, విసురుగా ముందుకు విసిరి…. గెంతేడు నవ్వే కెరటపు హోరులోకి’ అది నారాయణ అంతం.

గోపీచంద్ వ్రాసిన ‘అసమర్దుని జీవయాత్ర’లో సీతారామారావు అంతం యిటువంటిదే! ‘ఎందుకు?’ అనే ప్రశ్న నేర్పినందుకు నాన్న గారికి అంకితం యీ నవల అన్నాడు గోపీచంద్. ఈ కథలో నారాయణ మీద తండ్రి ప్రభావం చాలా వుంది. తండ్రి మీద ద్వేషమా? అని ప్రశ్నించుకుంటాడు తండ్రి మరణం తర్వాత వారసుడుగా యింటికి తిరిగి వచ్చిన యేకాకి నారాయణ. ద్వేషం కాదు, తండ్రి వ్యక్తిత్వానికి – ఆయన తీపి మాటలు, పాప్యులారిటీ, హ్యూమర్, వైటాలిటీకి – తన వ్యక్తిత్వం, అడుగడుగునా ‘ద్రోహం’గా నడిచిన తన జీవితం, ఒక ‘రియాక్షన్’ కాబోలు అనుకుంటాడు! ఆ సమాధానం రుచించదు. సిగార్ పెట్టెలో సెల్లోఫెన్ కవర్ ఉన్న సిగార్ తన జాగాలో తాను ఉన్నది. సెల్లోఫేన్ కవర్ లేని సిగార్ అడ్డంగా ఉన్నది, మొదటి సిగార్ తన తండ్రి వ్యక్తిత్వం, జీవితం, రెండోది తనది! సమాజంలో యిమిడిన జీవితం ఆయనది, యిముడని జీవితం తనదీ! హృదయగతంగా తండ్రికి తనకూ గల ఈ తాదాత్మ్యం తెలిసిరాగానే వెక్కి వెక్కి ఏడుస్తాడు. అప్పుడే అతనిలో ‘యేదో’ తెగింది, దాక్షిణ్యం లేకుండా తెగింది. ఏమిటీ తెగింది? జీవితం తోటి బంధం. తండ్రి మరణం నారాయణ జీవితాన్ని అర్థశూన్యం చేసి, నిస్పృహలోకి తోసివేసింది. ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకుంటాడు. అద్దంలో చూచుకుంటే తన కళ్ళలో నిస్పృహ. ‘మంచం లేని ఖాళీ జాగా’ అంటే తండ్రి మృతి ఏర్పరచిన ఖాళీ జాగా, నారాయణ అన్వేషణలో కీలకమైనదిగా గుర్తించాలి. గత జీవితాన్ని ఎంత తిరగవేసినా, ఆ ఖాళీ జాగా పూరించే స్థితి లేకపోవడమే నారాయణ ఆత్మ హత్యకు, కథ ముగింపుకి కారణమవుతున్నది.

గోపీచంద్ ఒక నవలలో విడమర్చిన యితివృత్తాన్ని త్రిపుర ఒక కథలో కుదించారు. నారాయణ అసమర్థుడు కాడు. జీవితంలో సమర్థుడే. కాని తండ్రి తోటి అనుబంధమే అతని జీవితాన్ని నడిపించడం వల్ల, తండ్రి మృతి కలిగించిన అస్తిత్వసంక్షోభం (Existential crisis) అధిగమించరానిదై ఆత్మహత్యకు దారితీసింది. నారాయణకు జీవితంలో మరో వ్యక్తితో ( ప్రేయసి, స్నేహితుడు) ప్రేమానుబంధం ఏర్పడి నట్లయితే ఈ సంక్షోభాన్ని అధిగమించే ‘ద్వారం’ లభించివుండేది. కాని అటువంటి అనుబంధం యేర్పడని విధానంలో,(ద్రోహం చెయ్యడంలో తెలివినీ ఆధిక్యతనూ నిరూపించుకోవడమే లక్ష్యంగా) అతని జీవితం నడవడం వల్ల ఈ సంక్షోభం వచ్చినప్పుడు అతణ్ణి రక్షించే సాధనం లేక పోయింది. అతనికి ‘ద్వారం’ కనిపించలేదు. ఆ ద్వారం ప్రేమ. జీవితానికి అర్థాన్ని హేతువాదం కాదు, ప్రేమే యివ్వగలదు!

ఆర్. ఎస్. సుదర్శనం

త్రిపుర కథలు On Kinige

Related Posts:

పునరాగమనం

ఇది శ్రీపాద స్వాతి రాసిన మొదటి నవల.
ఈ నవలలో ప్రధాన పాత్ర వసంతలక్ష్మి. ఆమె భర్త పేరు డాక్టర్ శ్రీ. కూతురు సుమ ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చదివి లండన్‌‍లో ఉద్యోగం చేస్తోంది. కొడుకు సుమంత్ ముంబైలో సినిమా నటుడిగా స్థిరపడ్డాడు.
భర్త పుట్టిన రోజు సందర్భంగా వాళ్ళింట్లో ఓ పార్టీ జరుగుతుంది. ఫంక్షన్ ముగిసాక, అలసిపోయానంటూ శ్రీ కాసేపు పడుకుంటాడు. అయితే అతను నిద్రలోనే కన్నుమూస్తాడు. ఈ హఠాత్పరిణామం వసంతలక్ష్మి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆమె ఈ షాక్‌నుంచి తేరుకోలేకపోతుంది.
ఆమెకి దూరంగా ఉండే కొడుకు, కూతురు ఆమె మనోవేదనను పట్టించుకోరు, తేలికగా తీసుకుంటారు. వసంత స్నేహితులు ఆమెని ఓదార్చి ఇదివరకటిలా ఉత్సాహంగా జీవించేలా చెయ్యాలనుకొంటారు. కానీ వసంత తన స్నేహితులని కలుసుకోడానికి ఇష్టపడదు. కొన్నాళ్ళ తర్వాత, “ఎంతటి విపత్తునైనా చిరునవ్వుతో అనుభవించాలి” అనే తన భర్త మాటలని గుర్తు చేసుకుంటుంది. భర్త భౌతికంగా లేకపోయినా, అనుక్షణం తనలోనే ఉన్నాడని, తను సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుని, ఏదన్నా ఉద్యోగం చేద్దామనుకుంటుంది. ఒక పత్రికాఫీసులో ఆమెకు ఉద్యోగం దొరుకుతుంది.
ఆ పత్రికలో చేరాక తనలో ఓ సృజనాత్మక రచయిత్రి ఉన్నదని ఆమె గ్రహిస్తుంది. తనలోని సృజనాత్మకతను వెలికితెచ్చి నవలలు రాయడం మొదలుపెట్టి, మంచి పేరు తెచ్చుకుంటుంది. సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారుతుంది. ఈ క్రమంలో ఆమెకు దగ్గరవ్వాలని కొందరు మగవాళ్ళు ప్రయత్నిస్తారు, లొంగదని గ్రహించాక, ఆమె మీద పుకార్లు పుట్టిస్తారు. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా, ఆమె తన రచనావ్యాసాంగాన్ని కొనసాగిస్తుంది. ఆమెకు చాలా అవార్డులొస్తాయి. మీడియా వాళ్ళు ఆమె వెంటపడతారు. ఇంటర్వ్యూలలో ఆమె వ్యక్తిగత జీవితాన్ని గూర్చి ప్రశ్నిస్తారు.
“నవలల్లో రాసినదంతా మీ వ్యక్తిగత జీవితమే అంటారు. నిజమేనా?”అని ఆమెని అడుగుతారు. ఆమె పిల్లల గురించి చెప్పమంటారు. మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదని అడుగుతారు. ఇలా అడుగుతున్న వాళ్ళందరికీ వసంత తాను డాక్టర్ చైతన్యని పెళ్ళి చేసుకున్నానని, ఆ విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని నిర్భయంగా సమాధానం చెబుతుంది.
ఈ రకంగా ఆమె, ముగిసిపోయిందనుకొన్న తన జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తుంది. ఇదే ఆమె పునరాగమనం.
చదివించే గుణం కలిగిన శైలి, సన్నివేశాల కల్పన, సంభాషణల ద్వారా పాత్రలని పాఠకుల ముందుంచడం వలన నవలని ఆసక్తిగా నడిపారు రచయిత్ర్రి.
కౌముది వెబ్ పత్రికలో సీరియల్గా ప్రచురితమైన ఈ నవల ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

పునరాగమనం On Kinige

Related Posts:

షాడో ఇన్ జపాన్

షాడో గత జీవితానికి చెందిన కథ ఇది.
షాడోని భారతదేశం నుంచి అవతలికి తీసుకువెడితే అతని జీవితం కుదుటపడుతుందనీ, అనవసరమైన అల్లర్లలో అతను తల దూర్చడం తగ్గిపోతుందనీ భావించి అతన్నిజపాన్ తీసుకువెడతారు రిటైర్డ్ జడ్జి ఛటర్జీ గారు, ఆయన కూతురు మల్లిక.
ఛటర్జీగారి మేనల్లుడు సతీష్ టోక్యో నగరానికి యాభై మైళ్ళ దూరంలో ఉన్న సూచీ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో షాడో గంగారాంలకు వుద్యోగాలు యిప్పించాడు. పాత పద్దతులను, అలవాట్లను పునరావృతం చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకొని పనిలో చేరాడు షాడో.
కానీ అక్కడ జరిగే అరాచకాలను ఎదుర్కోకుండా ఉండలేడు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ మానేజర్ని ఎదిరించినందుకు శిక్షగా అడవికి దగ్గరగా ఉండే, జనసంచారం ఏ మాత్రం ఉండని ఓ పంపింగ్ హౌస్ వద్ద షాడోకి, గంగారాంకి డ్యూటీ పడుతుంది. అడవిలోంచి తననెవరో పిలుస్తున్నట్లుగా వినబడి షాడో ఆ గొంతును వెదుక్కుంటూ వెడతాడు. గొరిల్లాల బారిన పడతాడు. ఓ వృద్ధుడైన కుంగ్‌ఫూ గురువు దర్శనమిచ్చి ఓ అద్భుతమైన పోరాట ప్రక్రియ ద్వారా గొరిల్లాలను తరిమేస్తాడు. షాడో తిరిగి పంపింగ్ హౌస్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ డ్యూటీ చేస్తుండగా, ఓ మహిళ రక్షించమంటూ వచ్చి వేడుకుంటుంది. నింజా రౌడీలు ఆమెను తరుముతూంటారు. ఆమెని రక్షించే క్రమంలో షాడో ఓ నింజా రౌడీని చంపుతాడు. పోలీసులు వెంటబడుతుంటే… పారిపోయి కొరియా దేశంలోకి ప్రవేశిస్తారు షాడో, గంగారాంలు.
వారు కొరియాలోకి ఎందుకు వెళ్ళాల్సివచ్చింది? అక్కడేం సాహసాలు చేసారు? షాడోకి సాయపడిన ఆ వృద్ధ కుంగ్ ఫూ గురువు ఎవ్వరు?
ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే.
షాడో అభిమానులకు అత్యంత ప్రీతిపాత్రమైన నవల ఇది. తప్పకుండా చదవాల్సిన ఈ షాడో ఇన్ జపాన్ నవల ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

షాడో ఇన్ జపాన్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

  • No Related Posts

తమిళ కవిత్రయంలో ఇద్దరు తెలుగువారేనా?

తమిళంలో ఒక సామెత ఉంది. “భారతం చదివితే తెలుగులో చదవాలి. రామాయణం చదివితే తమిళంలో చదవాలి” అని. తెలుగు భారతం తమిళ ప్రజల లోపలికి కూడా ఎలా పోయిందో తెలుసుకోడానికి ఇది మచ్చు తునక. తెలుగు భారతం అంటే కవిత్రయం వ్రాసిందే. తెలుగులో కవిత్రయం ఉన్నట్లే, తమిళంలోనూ ఒక కవిత్రయం ఉంది. వీరు ముగ్గురూ కంబర్, ఒట్తకూత్తర్, పుగళేంది. వీరు ముగ్గురూ మన కవిత్రయంలాగా ఒకే గ్రంథాన్ని వ్రాసినవారు కాదు. పైగా దాదాపు ఒకే కాలానికి చెందిన వారు. కంబర్ రామాయణం వ్రాసాడు. ఈ రామాయణంపైన తమిళంలో అనేక విమర్శనాత్మక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఈ విమర్శలలో కంబర్ తెలుగువాడు అనే వాదన కూడా ఉంది. తమిళనాడు కోయంబత్తూరు ప్రాంతాల్లోని లక్ష్మీ మిల్స్ మేనేజింగ్ డైరక్టర్ జి.కె. సుందరం గారు ‘కంబర్ మండలి’ అనే పేరుతో కంబరామాయణం ప్రచారం కోసం ఒక సంఘాన్నే నెలకొల్పాడు. ఆ సంఘం తరఫున ఒక పుస్తకాన్ని వెలువరించాడు. అందులో కంబర్ తెలుగువాడని, కమ్మవారి కులంలో పుట్టినవాడని ఉంటుంది. కంబర్ రామాయణం వ్రాయదలచుకున్నప్పుడు అప్పటి చోళరాజు శివభక్తుడైనందువలన రామాయణ రచనకు ఒప్పుకోలేదని, అందువల్ల ఆయన వరంగల్లుకు వలస పోయి, కాకతీయుల ఆస్థానంలో ఉండి, అక్కడే రామాయణాన్ని రచించాడని ఇంకొక వాదం ఉంది. కాకతీయుల కాలంలోనే తెలుగులో వచ్చిన రంగనాధ రామాయణం, తమిళంలో వచ్చిన కంబ రామాయణం ఒకదానిపై ఒకటి ప్రభావం చూపాయనే వాదన ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఒకానొక సందర్భంలో పత్రికాముఖంగానే కంబర్ తెలుగువాడని ప్రకటించిన సంగతిని ‘ఈనాడు’ ప్రచురించింది కూడా.
తమిళనాడులో ఒట్టకూత్తు అనే ఒక వీధినాటకం జరుగుతుంది. దీన్ని వడ్డెరలు ప్రదర్శిస్తూంటారు. ఇది ముఖ్యంగా పెరంబలూరు జిల్లా శెట్టకుళం గ్రామంలో పంగుణిఉత్తిరం అనే పండగ రోజున ప్రదర్శిస్తూంటారు. దిండిగల్ జిల్లాలో ఒక తాలూకా కేంద్రం పేరు ‘ ఒట్టన్‌సత్రం’. తమిళంలో సరళం ద్విత్వంగా రాదు. తమిళులు ద్విత్వసరళాన్ని పలుకలేదు. కాబట్టి, ఒట్టకూత్తర్ కూడా తెలుగువాడే అని, ఒడ్డెర కులానికి చెందినవాడని కూడా ఒక వాదన ఉంది. కూత్తు అంటే వీధిభాగవతం. ఒట్టకూత్తు అంటే ఒడ్డెర్ల వీధి భాగవతం అని పేరు.
అవునా, నిజమేనా!?
నడుస్తున్న చరిత్ర, నవంబరు 2011 సంచిక నుంచి.

ఈ సంచిక కినిగె లో లభ్యమవుతుంది.

నడుస్తున్న చరిత్ర నవంబరు 2011 On Kinige

Related Posts:

‘రాబందుల రెక్కలచప్పుడు’ కథపై వడ్డెర చండీదాస్ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘రాబందుల రెక్కలచప్పుడు’ కథపై వడ్డెర చండీదాస్ గారి అభిప్రాయం చదవండి.

* * *

ఈ “రాబందుల రెక్కల చప్పుడు” తీరూ
ధోరణీ నా కిష్టం. మంచి ‘నడక’ వుంది. ప్రతిదీ
కథగా భావించే లెక్కన యిది కథేమో గానీ
నా లెక్కన కాదు. మిది యే లెక్క, అని
అడిగితే, వాదించటం నాకు రాదు. (నాకు విశ్లేషణ,
వివరణ చాతకాదు) దీన్ని కథ అనే పక్షంలో,
మంచికథ. వో ‘స్థితి’ చిత్రణకు కథ అని నేను
భావించను. కథకానిది, యెంతో బావున్నా బావుంటుందే
గానీ, కథ కాదు.”

వడ్డెర చండీదాస్

త్రిపుర కథలు On Kinige

Related Posts:

‘జర్కన్’ కథపై నిఖిలేశ్వర్ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘జర్కన్’ కథపై నిఖిలేశ్వర్ గారి అభిప్రాయం చదవండి.

* * *

“ఎర్రభిక్కు ‘త్రిపుర’

చేతిలో మోస్తున్న రాయి ‘జర్కన్’

దాదాపు పదహారుసంవత్సరాల క్రితమే ‘భారతి’లో వచ్చిన ‘త్రిపుర’ కథలు చదువుతుంటే ఒక విచిత్రమైన అనుభవం కలిగేది. ఆ త్రిపురనే ఇంగ్లీషు బోధిస్తున్న ఆర్. వి. టి. కె. రావుగా విశాఖ నుంచి వెళ్ళి అంత దూరం త్రిపుర రాజధాని అగర్తలాలో నివశిస్తున్నాడని తెలిసి మరీ ఆసక్తి కలిగించింది నాకు ఆ రోజుల్లో. 1987లో ఆయన ‘చీకటి గదులు’ ఆ తరువాత తళుక్కున మెరిసి గుండెపై నుంచి గీసుకుపోయిన ఆయన కథానిక ‘జర్కన్’ నన్ను మరింత త్రిపుర కథలకు దగ్గర చేసింది.

అరుదైన మనోతత్వ వేత్తగా – నిరాసక్తుడుగా త్రిపుర ఈనాటికీ తనను తాను వెతుక్కుంటూనే వున్నాడు. ప్రతి కథలో ఆయన ఫస్ట్ పర్సన్ సింగులర్‌గా జీవించాడు, ఆయన అన్వేషణ మెట్లు మెట్లుగా ఒక్కొక్క కథలో ప్రగాఢమైన, మరింత లోతుగా ఆలోచించమని చెబుతూనే ఒక విషాదంలోకి నెట్టివేసి నెమ్మదిగా అభినిష్క్రమణ సాగిస్తుంది.
బౌద్ధ – జైన అనాసక్తతత్వం లోంచి పుట్టి, ఈ ప్రపంచంలో ‘అహింస’తో సాధ్యం కానప్పుడు ‘హింస’తోనైనా విప్లవాభిముఖంగా కొనసాగాలని త్రిపుర ధ్వనిప్రాయంగా తమను వ్యక్తీకరించుకున్నాడు. అందుకే ఆయనను నేను ‘రెడ్ భిక్కు’ అని పిలిచే వాణ్ణి! క్రమంగా ఆ ఎరుపు ‘సఫర్’గా సాగుతూ ‘కనిపించని ద్వారం’ వెనకాల వుండి పోయింది – అది వేరే సంగతి!!

ఈ కథలో ‘భాస్కర్’ రూపంలో కథకుడు ఒకచోట ఇలా అంటాడు- “విలువల ప్రమేయం లేదు నాకు. స్థిరంగా నిలబడి, నలుగురి మధ్యా వుండి, మనుష్యులతో వస్తువులతో సంబంధాలు – మమతలు పెంచుకొంటున్న వాళ్ళకు విలువలు” కాని ఈ దేశంలో జీవిస్తున్న రచయిత ఈ మట్టి మనుషుల నికృష్ట జీవితాలు చూసి ‘వీరాస్వామి’ పాత్రలో ఒక నూతన విలువ అంటే ఒక మహత్తరమైన ఆశయం కోసం త్యాగం తప్పదనే నిజాన్ని అంగీకరించక తప్పదు. అందుకే త్రిపుర మరో చోట అంటారు-

“తనను తాను తెలుసుకోవాలి. తనకేది కావాలో తెలుసుకోవాలి. తెలుసుకోవచ్చని తెలుసుకోవాలి. తనలోంచి తాను వేరుబడి తనను వేరే చూసుకోవడం నేర్చుకోవాలి. ఆ క్షణంలో అతను ఏమిటి చేయాలో అతని గమ్యం ఏమిటో అతనికి తెలుస్తుంది.”

విలువైన వజ్రపు రాళ్ళ మధ్య ‘జర్కన్’ అనేది విలువైన రాయి. సాన పెట్టబడక ముందు మామూలు రాయి. కాని, ‘అనుభవం’ ఆచరణతో మరొక్కసారి కోసం, ప్రయోజనం కోసం జీవిస్తున్నామనే స్పృహ, స్వార్థపూరితుడైన మనిషిని సానబెడుతుంది. ఒక్క ‘జర్కన్’ రాయిగా మారుస్తుంది.

త్రిపురగారు ‘ఇంపల్స్’ (Impulse)తో రాస్తారు. బౌద్ధ భిక్కులా దేశమంతా తిరిగి, అనుభవాల్ని కథల్లో అమర్చి తిరిగి దూరమై పోతారు. కథా కథన శైలిలో ‘చలం’కు చాలా దగ్గర వాడిలా కనబడతారు. ఇంగ్లీషు నుడికారం తెలుగుగా మారి చివరగా ఆయన అనుభవమనే రక్తంలోంచి చురుకైన భాష పుట్టుకొచ్చింది. ‘ఆలోచన’ నుంచి ‘తెలుసుకోడానికి’ గెంతగలిగితేనే చేరగలమని త్రిపుర అంటున్నారు ఈ కథలో- కాని ఆ అఖాతాన్ని దాటడానికి సరియైన పంథా అనుభవమనే వంతెన వేసుకోక తప్పదనే వాస్తవాన్ని త్రిపుర నిరాకరించరనే అనుకుంటాను.”

నిఖిలేశ్వర్

త్రిపుర కథలు On Kinige

Related Posts: