ది ఎండ్

ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ది ఎండ్. దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి జాడ్యంపై రాసిన నవల ఇది.

ప్రభుత్వ విభాగమైన ‘జలమండలి’లో పని చేసే దేవముని అనే అవినీతి అధికారి కథ ఇది. చిన్నతనంలో అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుని, అటువంటి కష్టాలు తన సంతానానికి లేకుండా చేయాలనే లక్ష్యంతో పై సంపాదనకి అలవాటు పడి, ఉద్యోగం ఊడగొట్టుకోడమే కాకుండా చివరికి జైలు శిక్ష కూడ అనుభవిస్తాడు దేవముని. చివరికి పశ్చాత్తాపం కలిగి మంచి మార్గంలో జీవితం గడపడానికే నిశ్చయించుకుంటాడు.

లంచగొండితనం మనిషంత పాతది అని స్పష్టం చేస్తూ, లంచం అంటే ఏమిటో నిర్వచించారు రచయిత. లంచంలోని రకాలను వివరిస్తారు. లంచగొండితనాన్ని నిరోధించడానికి రూపొందించిన వివిధ చట్టాల గురించి అవగాహన కల్పిస్తారు. లంచగొండితనాన్ని కొలిచే బరోమీటరు గురించి, ఏయే దేశాలు ఆ స్కేలులో ముందు వెనుక వరుసలలో ఉన్నాయో చెబుతారు. లంచగొండితనానికి మూలం “నీడ్ అండ్ గ్రీడ్” అని అంటారు మల్లాది. లంచగొండితనం అనే దుష్ట సంస్కృతి మన దేశంలోని ప్రభుత్వ కార్యాలయాలలో జీవనదిలా అవిశ్రామంగా సాగిపోవడానికి గల కారణాలను వివరిస్తారు రచయిత ఈ నవలలో.

ప్రజలలో అధిక శాతం మంది పేదలవడం – లంచగొండితనం మరింత పెచ్చుమీరడానికి ఎలా దోహదం చేస్తుందో తేటతెల్లం చేసారు రచయిత. లంచగొండితనం ఉన్న దేశాలలో ఆర్ధికాభివృద్ధి రేటు ఎందుకు తక్కువగా ఉంటుందో, పెట్టుబడిదారులు ఎందుకు ముందుకురారో తెలిపారు. చాలా మంది తమ కులాన్ని అడ్డం పెట్టుకుని పోరాడడానికి కారణం కూడా లంచగొండితనమేనని అంటారు రచయిత. కార్పోరేట్ ఆసుపత్రులలో జరిగే దోపిడి గురించి ఈ నవలలో వివరించారు మల్లాది. అదీ కూడా ఓ రకంగా లంచగొండితనమే!

అవినీతి నిరోధక శాఖాధికారులు లంచగొండులను ప్రత్యక్షంగా పట్టుకునే రెడ్ హ్యాండెడ్ పద్దతి గురించి చక్కగా వివరించారు రచయిత. అవినీతి కేసుల్లో విచారణ ఎంత లోపభూయిష్టంగా ఉంటుందో ఈ వాక్యాలు చదివితే అర్థమవుతుంది.

“బోనులో ఎలకపడే చప్పుడు పెద్దగా వినిపిస్తుంది. కానీ, దాని దగ్గరికి వెళ్ళి చూస్తే బోను ఖాళీగా కనబడుతుంది”.

జైలుకి తరలించబడిన ఖైదీల గురించి, ఖైదీలలోని రకాల గురించి రచయిత ఇచ్చిన సమాచారం ఉపయుక్తంగా ఉంది. కొత్త విషయాలు తెలుసుకున్నమన్న భావన కలుగుతుంది.
అన్ని రకాలుగా నష్టపోయినా, కొత్త జీవితం గడిపేందుకు దేవముని కుటుంబం చేసిన ప్రయత్నాలు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి.

అసలు కథకి కొసరుగా మల్లాది చెప్పే కొన్ని అంశాలు చాల ఆకట్టుకుంటాయి. కేరళలోని గురువాయూర్‌లోని కృష్ణుడి గుడి గురించి, అక్కడికి దగ్గర్లోని పున్నత్తూరు కోట గురించి చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. అలాగే దేశంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు విడివిడిగా ఆలయాలున్నది కేరళలోనే అని తెలుసుకుని ఆశ్చర్యపోతాం. ప్రపంచ వ్యాప్తంగా లభ్యమయ్యే చాకెట్ల గురించిన వివరాలు, చాక్లెట్ల గురించి ఎంతో ఆసక్తికరమైన కొటేషన్లను అందించారు రచయిత ఈ పుస్తకంలో.

పాఠకులకి ఉల్లాసాన్ని కలిస్తుందీ నవల.

ది ఎండ్ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

ది ఎండ్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

కెండో వారియర్

సుప్రసిద్ధ డిటెక్టివ్ నవలా రచయిత మధుబాబు రచించిన షాడో స్పై ఎడ్వెంచర్ “కెండో వారియర్“.

బందిపోటు దొంగతనాలకు రోజులు చెల్లిపోయాయని షాడో చెప్పిన మాటలు విని పోలీసులకి లొంగిపోతాడు గజదొంగ బగ్రూసింగ్. గోరఖ్‌పూర్ జైలులో శిక్షని అనుభవిస్తుంటాడు.

ఉన్నట్లుండి అతను ఓ రోజు జైల్లోంచి తప్పించుకుని పోవడంతో కథ మొదలవుతుంది. సాయం చేస్తున్నట్లు నమ్మించి ఓ షావుకారు మళ్ళీ పోలీసులకు పట్టిద్దామని చూస్తాడు. చుట్టుముట్టిన పోలీసుల బారి నుంచి షాడో సాయంతో తప్పించుకుని షాడో ఇంటికి చేరుతాడు బగ్రూసింగ్. జైల్లోంచి పారిపోయివచ్చిన కారణం చెబుతాడు. షింటాయ్ తెగల వారు తన కూతురు పుత్‍లీని ఎత్తుకుపోయారని తెలిసిందని, వాళ్ళ అంతు చూసేందుకే జైల్లోంచి తప్పించుకున్నానని చెబుతాడు.

షింటాయ్ తెగ వాళ్ళని బగ్రూసింగ్ ఎదిరించలేడని, వాళ్ళని ఎదుర్కుని పుత్‍లీని తాను రక్షించి తీసుకువస్తానని చెబుతాడు షాడో.

షింటాయ్ తెగల స్థావరాన్ని అన్వేషిస్తూ బర్మాలో అడుగుపెడతాడు షాడో. అక్కడ అనుకోని పరిస్థితులలో ఒక యువతిని రక్షించడం కోసం తాన్‌మియా అనే వ్యక్తిని చంపాల్సివస్తుంది. అక్కడి నుంచి షాడోకి సమస్యలు మొదలవుతాయి. అక్రమంగా సరిహద్దు దాటి వచ్చినందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు, హత్య చేసినందుకు స్థానిక పోలీసులు షాడోని వెంటాడుతూంటారు.

ఈ నేపధ్యంలో షింటాయ్ తెగల స్థావరం కనుక్కోడానికి షాడో ఏమేమి ఇబ్బందులు పడ్డాడు? షానీ గ్రామంలో షాడో పోట్లగిత్తలతో ఎందుకు పోరాడవలసి వచ్చింది? షింటాయ్ తెగల నాయకుడు టోటిమా ఎత్తుకెళ్ళిన పుత్‌లీ ఎక్కడుంది? ఆమెని షాడో ఎలా రక్షించాడు? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు ఈ రోమాంచక నవలలో దొరుకుతాయి.

చివరిదాకా ఆసక్తిగా చదివించే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

కెండో వారియర్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

యాభై మధుబాబు ఈ పుస్తకాలు

తెలుగు వారికి ప్రియమైన షాడో పాత్ర సృష్టికర్త మధుబాబు సృజించిన 50 పుస్తకాలు మీకు సగర్వంగా కినిగె ఇప్పుడు సమర్పిస్తుంది. మధుబాబు పుస్తకాల కోసం మీ అన్వేషణ ఇహ చాలించి తనివితీరా ఆస్వాదించండి.

ఈ యాభై పుస్తకాలు ఒకేసారి కొనడం కోసం మీకు సౌలభ్యంగా ఈ ఆఫర్. ఒక క్లిక్కుతో యాభై మధుబాబు పుస్తకాలు స్వంతం చేసుకోండి. అంతే కాకుండా 20శాతం తగ్గింపు కూడా పొందండి!

యాభై మధుబాబు ఈ పుస్తకాలు On Kinige

ఈ ఆఫర్లోని యాభై మధుబాబు పుస్తకాల వివరాలు

1. విప్లవం వర్థిల్లాలి
2. బ్లడీ బోర్డర్
3. చైనీస్ బ్యూటీ
4. కళ్యాణ తిలకం
5. కంకాళలోయ
6. కాలికాలయం
7. మచ్చల గుర్రం
8. చతుర్నేత్రుడు
9. శంకర్ దాదా
10. భైరాగి
11. టాప్ సీక్రెట్
12. ఆపరేషన్ కాబూల్
13. కిల్లర్ ఫ్రం సిఐబి
14. డాక్టర్ జీరో
15. ఆపరేషన్ ఆరిజోనా
16. ప్రొఫెసర్ షాడో
17. జూనియర్ ఏజెంట్ శ్రీకర్
18. రన్ ఫర్ ద బోర్డర్
19. రివేంజ్ రివేంజ్
20. ఫ్లయింగ్ ఫాల్కన్
21. లోన్ ఉల్ఫ్
22. ది గర్ల్ ఫ్రం సిఐబి
23. మేరా నామ్ రజూలా
24. షాడో ఇన్ హైదరాబాద్
25. షాడో వస్తున్నాడు జాగ్రత్త
26. షాడో ఇన్ బోర్నియో
27. డాక్టర్ షాడో
28. టెంపుల్ ఆఫ్ డెత్
29. బద్మాష్
30. సైంటిస్ట్ మిస్ మాధురి
31. షాడో ది అవెంజర్
32. అసైన్‌మెంట్ లవ్ బర్డ్
33. డియర్ షాడో
34. ఆపరేషన్ డబుల్ క్రాస్
35. నంబర్ 28
36. షాడో ఇన్ జపాన్
37. ఇన్స్పెక్టర్ షాడో
38. వన్స్ ఎగైన్ షాడో
39. గన్స్ ఇన్ ద నైట్
40. చైనీస్ పజిల్
41. సిఐడీ షాడో
42. కౌంటర్ ఫీట్ కిల్లర్
43. డైన్ స్ట్రీట్ మిస్టరీ
44. కమాండర్ షాడో
45. బ్లడ్ హౌండ్
46. నెవర్ లవ్ ఏ స్పై
47. ట్రబుల్ మేకర్స్
48. వెన్నెల మడుగు
49. కెండో వారియర్స్
50. కిల్ క్విక్ ఆర్ డై

Related Posts:

తమిళ రాజకీయాలు 01

భారతదేశ రాజకీయాలలో తమిళనాడుకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటాయి. గవర్నర్‌కీ, ముఖ్యమంత్రికీ మధ్య విభేదాలు లేదంటే ముఖ్యమంత్రికీ, ప్రతిపక్షనేతకీ మధ్య విరోధాలు; అధికారపార్టీలో కుమ్ములాటలు లేదంటే ప్రతిపక్ష పార్టీల ఉద్యమాలు…..ఇలా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలెప్పుడూ ఆసక్తిగా ఉంటాయి.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, తమిళనాడు రాజకీయాలకు ఈ ప్రత్యేకత కాస్త ఎక్కువగా ఉండడంతో, ప్రముఖ రచయిత ఎం. బి. ఎస్. ప్రసాద్ వీటిని విశ్లేషించడానికి పూనుకున్నారు.

తమిళ రాజకీయాలు (మొదటి భాగం)” అనే పుస్తకంలోని వ్యాసాలు గతంలో గ్రేట్ ఆంధ్రా డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌లో ప్రచురితమయ్యాయి. వాటిని సంకలనంగా చేసి ఈ-బుక్‌గా వెలువరించారు రచయిత.

దాదాపు వంద సంవత్సరాల రాజకీయ చరిత్రను వ్యక్తుల పరంగా, ఆసక్తికరంగా చెప్పారు రచయిత ఈ మొదటి భాగంలో. అన్నాదురై, కరుణానిధి, ఎమ్జీయార్, రాజాజీ, కామరాజ్ నాడార్‌ల మూలాల గురించి, వారి రాజకీయాల గురించి విపులంగా చెప్పారు రచయిత.

‘కరుణానిధి అంటే సంస్కృతమా!? అయ్యో,అనవసరంగా పేరు మార్చుకున్నాను’ ! ” అనే వ్యాసంలో కరుణానిధి 73 ఏళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని తరచి చూస్తే, తమిళ రాజకీయాలన్నీ తెలిసిపోతాయి. ఈ వ్యాసంలో కరుణానిధి జననం, విద్యాభ్యాసం, అసలు పేరు, దాన్ని కరుణానిధి అని మార్చుకున్న విధానం, ఆయన మాతృభాష గురించి, విహాహం గురించి, సంతానం గురించి రచయిత సవివరంగా రాసారు. జీవితంలో పైకి రావాలంటే అవతలి వాడిని దబాయించి బతకాల్సిందేనని కరుణానిధికి తెలిసిన తీరుని తెలిపారు.

ద్రవిడ పార్టీలకు ఆద్యుడు – ఓ వైరుధ్యాల పుట్ట ! ” అనే వ్యాసంలో పెరియార్ గురించి చెబుతారు రచయిత. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు జరిపిన కార్యక్రమాల గురించి, కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చాక మొదలుపెట్టిన ఆత్మగౌరవ ఉద్యమం గురించి తెలిపారు. హిందీ భాషకి వ్యతిరేకంగా జరిపిన పోరాటానికీ, ఆర్మగౌరవ ఉద్యమానికి తెలివిగా ముడివేసిన తీరుని వివరిస్తారు రచయిత. ఈ ఉద్యమం కరుణానిధిని ఎలా ఆకర్షించిందో చెబుతారు.

బ్రాహ్మణవ్యతిరేక ఉద్యమం” అనే వ్యాసంలో దశాబ్దాల కాలంపాటు తమిళ రాజకీయాలను ప్రభావితం చేసిన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం గురించి తెలియజేసారు రచయిత. పెరియార్ ఉద్యమంలో చేరిన మేధావులలో ఒకరైన అణ్ణాదురై గురించి ఈ వ్యాసంలో చెబుతారు రచయిత. అణ్ణాదురై జననం, చదువు, కుటుంబం గురించి క్లుప్తంగా వివరించారు. ఆయన వివాహం గురించి, రాజకీయ ప్రవేశం గురించి వివరించారు. అన్నా నిబద్ధతని, జాతీయవాదాన్ని, ఉదారవాదాన్ని ఆయన ప్రత్యర్థులు సైతం గౌరవించేవారని తెలిపారు. అన్నాదురైని ఆదర్శంగా తీసుకున్న కరుణానిధి రాజకీయంగా ఎదగడానికి స్థాపించిన పత్రికల గురించి ఈ వ్యాసంలో రాసారు రచయిత.

19 సంవత్సరాల వయసులో కరుణానిధి ప్రేమలో పడడం, ఆ ప్రేమ విఫలమైన వైనాన్ని వివరించారు “తన ప్రేమకథను నాటకంగా మలచిన కరుణానిధి” అనే వ్యాసంలో. ఆ నాటకాన్ని కరుణానిధి ఉపయోగించుకున్న తీరుని వివరిస్తారు రచయిత. కరుణానిధి తన సొంతూరు వదిలి మద్రాసుకి చేరడం వెనుక కారణాలను తెలియజేసారు. కరుణానిధి సినిమా ప్రస్తానానికి నాంది పలికిన నాటకాలు, అందుకు దోహదపడిన వ్యక్తులను ఈ వ్యాసంలో పరిచయం చేసారు రచయిత. తదుపరి కాలంలో కరుణానిధి సినిమాలలో పనిచేయడం, సినిమాలను ద్రావిడ ఉద్యమానికి వాడుకున్న తీరుని చక్కగా తెలియజేసారీ వ్యాసంలో.

ఎన్టీయార్‌ను ఆంధ్రా ఎమ్జీయార్‌ అనవచ్చా?” అనే వ్యాసంలో ఎం.జి.ఆర్ సినీ ప్రస్తానం గురించి, కరుణానిధితో అతనికున్న రాజకీయ వైరం గురించి, ఎన్నికల్లో పోరాడడం గురించి వివరిస్తారు. అతని ప్రస్తావన లేని తమిళ రాజకీయాలు అసంపూర్ణమే అని అంటారు రచయిత. ఎమ్జీయార్ కుటుంబం గురించి, అతని బాల్యం, యవ్వనం గురించి, అతని నాటక, సినీ రంగ ప్రవేశం గురించి ఈ వ్యాసంలో తెలిపారు రచయిత. ఎన్టీయార్‌కీ, ఎమ్జీయార్‌కీ ఉన్న పోలికలు, వైరుధ్యాలని ప్రస్తావించారు. ప్రముఖ నేపధ్య గాయకుడు బాల సుబ్రహ్మణ్యానికి తొలినాళ్ళలో ఎమ్జీయార్ చేసిన ఓ మేలుని రచయిత చక్కగా తెలిపారు.

రాజాజీ-ప్రకాశం-సత్యమూర్తి- కామరాజ్‌ రాజకీయ చతురంగం” అనే వ్యాసంలో కరుణానిధి రాజకీయరంగ ప్రవేశానికి పూర్వం తమిళ రాజకీయాలను ప్రభావితం చేసిన చక్రవర్తుల రాజగోపాలాచారి, టంగుటూరి ప్రకాశం పంతులు, సత్యమూర్తి, కామరాజ్ నాడార్‌ల రాజకీయ జీవతాన్ని ప్రస్తావించారు. తమిళ రాజకీయ చదరంగంలో ఈ నలుగురి ఎత్తులు, పైఎత్తులను తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవాలి.

ఆద్యంతం ఆసక్తిగా సాగిపోయే వ్యాసాల సంకలనం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి

తమిళ రాజకీయాలు 01 On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

ఒక ‘పనివాడి’ ఆత్మకథ

శ్రీ కేకలతూరి క్రిష్ణయ్య రచించిన జీవన కెరటాలు అనే పుస్తకంపై 10 ఫిబ్రవరి 2011 నాటి ఆంధ్ర్యజ్యోతి దినపత్రిక నవ్య పేజీలో “ఒక ‘పనివాడి’ ఆత్మకథ” అనే శీర్షికతో సమీక్ష వెలువడింది.

ఆత్మకథ ఎక్కువగా రచయితలు, మేధావులు, నాయకులు, కళాకారులు రాసుకుంటుంటారని, ‘పనివాళ్లు’ ఆ పని చేయడం అరుదని సమీక్షకులు అభిప్రాయం వ్యక్తం చేసారు. విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణంలో పనిచేసే ఒక వ్యక్తి వృత్తిఅనుభవాలు ఎంత ఆసక్తికరంగా ఉండచ్చో కేకలతూరి క్రిష్ణయ్య ఆత్మకథ ‘జీవన పోరాటాలు’ చదివితే అర్థమవుతుందని సమీక్షకులు అన్నారు.

క్రిష్ణయ్య 72 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా పాకాల మండలం శంఖంపల్లె గ్రామంలో పుట్టారు. హైస్కూలుతోనే చదువు ఆపేసినా అనుభవంతో ఇంజనీరై దేశవిదేశాల్లో 50 సంవత్సరాలకు పైగా వివిధ ప్రాజెక్టుల్లో పని చేశారు. ఆయన ఆత్మకథలోని కొన్ని భాగాలు సమీక్షలో క్లుప్తంగా ప్రస్తావించారు.

అవసరానికి మించి ఆలోచించి, సమస్యను పెద్దది చేసుకుని భయపడటం వంటి లక్షణాలు వ్యక్తి అభివృద్ధికి ఏ విధంగా ఆటంకంగా నిలుస్తాయో రచయిత ఉదాహరణ ద్వారా చెప్పిన ఘటన ఆసక్తిగా ఉంటుంది.

తాను చేసే వృత్తికి సంబంధించిన పనిలో ఎప్పుడు ఎవరు తన సహాయం కోరినా తప్పక సహాయపడాలని నిర్ణయించుకున్న క్రిష్ణయ్య నేపాల్ ఎందుకు వెళ్ళాల్సివచ్చిందో చెబుతారు.

ఒక పని చేసేడప్పుడు వృత్తి నిపుణులు ఎంత జాగ్రత్తగా ఉండాలో, శారీరకంగా ఎందుకు ఫిట్‌గా ఉండాలో మరో వృత్తాంతం ద్వారా చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.

జీవన కెరటాలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

జీవన కెరటాలు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

‘కథ 2010’పై సాక్షి దినపత్రిక సమీక్ష

ఇరవయ్ ఒకటో ‘కథ’ అనే శీర్షికతో ది. 20 ఫిబ్రవరి 2012 నాటి సాక్షి దినపత్రికలో ‘కథ 2010’ సంకలనం పై సమీక్ష వెలువడింది.
‘కథ’ వార్షిక సంకలనాల వరుసలో ‘కథ 2010’ ఇరవయ్ ఒకటవది. ఇందులో పద మూడు కథలు ఉన్నాయి.

‘కథ’ సంకలనాలలో కనిపించే కథలూ, వాటి కథకులనూ పరిశీలిస్తే సంకలనకర్తల ప్రాధాన్యం అర్థమవుతుందని సమీక్షకులు వి. ఆర్. పేర్కొన్నారు. కొత్తదనం, ప్రయోగం సంపాదకుల దృష్టిలో అత్యవసరమని భావించారు.
ఎనభయ్యవ దశకం వరకు తెలుగు కథలు చదవగానే అవి బాగున్నాయో, లేదో రచయితలకే కాదు, సాధారణ పాఠకులకీ వెంటనే తెలిసేదని. ఇప్పటి కథలను చదివి జీర్ణించుకోవడానికి సాధారణ పాఠ కులతో పాటు రచయితలూ, విమర్శకులకు కూడా కొంత శోధన, ఓపిక అవసరమవుతోందని సమీక్షకులు అభిప్రాయపడ్డారు. ‘కథ’ సంకలనాలలో రకరకాల ప్రయోగాలు, ధోరణులు , అందుకు ప్రయత్నాలు కనిపిస్తాయని వి. ఆర్. అన్నారు. కొత్తదనాన్ని ఆహ్వానించడం అవసరమేనంటూ, అటువంటి ప్రయోగాలు ఎంతవరకు ఫలప్రదమైనాయో, వాటి ఫలితాలు ఎలా ఉంటున్నాయో చూడడమూ కూడా అవసరమే సమీక్షకులు భావించారు.

పూర్తి సమీక్షని ఈ లింక్‌లో చదవచ్చు.

కథ 2010 డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. పూర్తి వివరాలకై ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

కథ 2010 On Kinige

అలాగే, ‘కథ’ పాత సంకలనాలు కూడా డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

వెన్నెల మడుగు

సుప్రసిద్ధ రచయిత మధుబాబు కలం నుంచి జాలువారిన అద్భుత జానపద నవల “వెన్నెల మడుగు“.

రాజులు, రాణులు, మాంత్రికులు, యక్షిణులు, పిశాచాలు, అడవులు, ఆటవికులు, లోయలు, కొండలు, నదులు, సెలయేళ్లు, పక్షులు, చెట్లుచేమలు…. ఒక అద్భుత జానపద ప్రపంచంలోకి పాఠకులని తీసుకువెడతారు మధుబాబు.

ప్రవాళ దేశాన్ని కీర్తిసేనుడు జనరంజకంగా పాలిస్తూంటాడు. ప్రజలని కన్నతండ్రిలా చూసుకునేవాడు. జనమంతా హాయిగా ఉన్నారు. అయితే వ్యక్తిగతంగా కీర్తిసేనుడికి ఒకే లోటు.. సంతానం లేకపోవడమే.

ప్రవాళ దేశాన్ని ఆక్రమించాలని ఎందరో శత్రురాజులు కాచుకుని ఉన్నారు. సైనికబలంతో, కీర్తిసేనుడిని జయించలేక పాంచాల రాజు వీరవర్మ కుట్ర చేస్తాడు. ఫలితంగా కీర్తిసేనుడు ఓ వరం సాధించడానికి దుర్గమమైన అడవిలో అడుగుపెడతాడు. ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుని, అమ్మవారి వరం పొంది రాజధానికి తిరిగివస్తుండగా, అనుకోకుండా ఓ యక్షిణి శాపానికి గురవుతాడు. మార్గమధ్యంలో ఓ ముని ఆశ్రమంలో విశ్రాంతికై ఆగినప్పుడు రాజు మనసులోని బాధని గమనించి, ఆ శాపానికి విరుగుడు సూచిస్తాడు ముని.

కీర్తిసేనుడికి ఓ కొడుకు పుడతాడు. ఆ శిశువుని యక్షిణి ఎత్తుకుపోతుండగా ఓ మాంత్రికుడు కాపాడి ఓ మహిళ సంరక్షణలో ఉంచుతాడు. ఆమె శిశువుకి విజయుడు అని పేరు పెట్టి పెంచుతుంది. విజయుడు పెరిగి పెద్దవాడవుతాడు. ఓ మణి సహాయంతో అతనికి చెట్లు చేమలతో సంభాషించగలిగే శక్తి వస్తుంది. ఓ చెట్టు అతనికి జన్మ రహాస్యాన్ని తెలియజేస్తుంది. ఎన్నో ఆటంకాలను తట్టుకుని, ప్రమాదాలను ఎదుర్కుని, అమితమైన సాహసాలు చేసి విజయుడు తన తల్లిదండ్రులను కలుసుకుంటాడు. పెళ్ళి చేసుకుని పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పరిపాలిస్తాడు.

తుదకంటా ఆసక్తిగా సాగిపోయే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి

వెన్నెల మడుగు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

జుమ్మా

వేంపల్లి షరీఫ్ రాసిన ఈ కథల సంపుటిలో పన్నెండు కథలున్నాయి. భారతీయ సమాజంలో భాగమైన గ్రామీణ పేద ముస్లిం కుటుంబాల జీవితాలను ఈ కథలు చిత్రించాయి.
ఈ సంకలనంలోని కొన్ని కథల గురించి తెలుసుకుందాం.

పర్దా: ఈ కథలో ప్రధాన పాత్రధారి జేజి. అంటే నాయనమ్మ. కథకుడి నాయనమ్మ. ఇంటి పర్దాకి, ఆవిడకి ఎంతో సంబంధం ఉంటుంది. బీదకుటుంబీకుడైన కథకుడి తండ్రికి తన కూతురికి పెళ్ళి చేసేంత ఆర్ధిక స్తోమత ఉండదు. కనీసం సంప్రదాయబద్ధంగా ఉన్నట్లు కనపడినా తన కూతురికి ఏదో ఒక సంబంధం రాకపోదనే ఆశ అతనిది. అతని తల్లి పల్లెటూరి నుంచి వస్తుంది. అక్కడెంతో స్వేచ్ఛగా జీవితం గడిపిన ఆమెకి కొడుకు ఇంట్లో జరుగుబాటు కష్టం అవుతుంది. సంప్రదాయం పేరుతో, నాగరికత సాకుతో తనని కట్టిపడేయాలనుకోడం ఆమెకి నచ్చదు. కోడలి సూటిపోటి మాటలు, కొడుకు నిరాదరణ భరించలేక తిరిగి పల్లెటూరికే వెళ్లిపోతుంది. తమ గురించి నలుగురు ఏమనుకుంటారో అనే మధ్య, దిగువ తరగతి కుటుంబాలకుండే భయాన్ని ఈ కథ బాగా వ్యక్తం చేసింది.

జుమ్మా: ఇది ఓ అమ్మ కథ. ఓ కొడుకు కథ. ప్రార్థన అంటే, ముఖ్యంగా శుక్రవారం నమాజు అంతే తల్లికి ప్రాణం. దేన్నయినా సహిస్తుంది గానీ, శుక్రవారం నమాజుకి వెళ్ళకపోతే ఊరుకోదు. కొడుకు పెద్దవాడై హైదరాబాద్ నగరంలో ఉద్యోగానికొస్తాడు. తల్లిని నగరానికి రప్పించి, ఇక్కడ అన్నీ చూపించి మక్కా మసీదుకు తీసుకువెడతాడు.”ఇలాంటి చోట నమాజు చదివితే పుణ్యం నాయనా” అని ఆమె కొడుకుకి మళ్ళీ గుర్తు చేస్తుంది. సరేనంటాడు. కానీ బ్రతుకుపోరులో పడ్డాకా, ఎన్నో శుక్రవారాలు గడచిపోతాయి. ఒక దుర్ఘటన జరుగుతుంది. తల్లికి ఆ విషయం తెలిసాక, కొడుకుని మసీదుకే వెళ్ళద్దంటుంది. కడుపు తీపి ముందు దేవుడు చేదయ్యాడా? ప్రార్థన కానిదైందా అని కథకుడు బాధపడుతూ దేవుడిని స్మరిస్తాడు.

ఆకుపచ్చ ముగ్గు: పేరులోనే ఇతివృత్తం సూచన కలిగి ఉన్న కథ ఇది. చందమామ కనపడక, రంజాన్ ఏ రోజో తెలియక కథకుడు ఆలోచనల్లో ఉండగా కథ ప్రారంభమవుతుంది. ఇంతలో వాళ్ళ అక్క వచ్చి గోరింటాకు పెడుతుంది. తనకి గోరింటాకు పెట్టుకోడం ఇష్టం లేకపోయినా, అక్క మీది ప్రేమతో పెట్టించుకుంటాడు. అక్కకి పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టినా, గోరింటాకుని వదలకపోవడంతో “అక్కా, నీకు గోరింటాకు పెట్టడమంటే ఎందుకింత ఖాసే..” అని అడుగుతాడు. దాని అక్క చెప్పిన సమాధానంతో కథకుడు నివ్వెరబోతాడు. అక్క గొప్ప తత్వవేత్తలా కనపడుతుందా క్షణంలో.

దస్తగిరి చెట్టు: కథకుడికి ఓ కోరిక ఉంటుంది. వేసవి సెలవల్లో తన అమ్మమ్మ వాళ్ల ఊరెళ్ళాలని. చిన్న కోరికే, కానీ తీరేది కాదు. ఎంత అడిగినా తల్లి పంపించడానికి ఒప్పుకోదు. గొడవ చేస్తే, కొడుతుంది, కంట్లో కారం పెడుతుంది. కానీ ఊరు పంపడానికి ఒప్పుకోదు. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెడితే అక్కడ హాయిగా గడపచ్చు, మనసులోని కోరికలు తీర్చే దస్తగిరి చెట్టుకింద దోస్తులతో కాలక్షేపం చేయచ్చు అనే కోరిక కథకుడిది. తన తల్లి కుటుంబం బీదదని, వాళ్ళకే తిండికి గడవడం లేదని, మరో మనిషి వెళ్ళి అక్కడ ఉంటే ఆ భారం మోయడం కష్టమని కథకుడి తల్లి ఆవేదన. కొడుక్కి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది. కథకుడు అమ్మమ్మ వాళ్ళకి, తమకి బోలెడు డబ్బు రావాలని దేవుడిని, దస్తగిరి చెట్టుని ప్రార్ధిస్తుండగా కథ ముగుస్తుంది. చదువరుల కళ్ళు చెమరుస్తాయి ఈ కథ చదువుతుంటే.

రజాక్‌మియా సేద్యం: ఓ ముస్లిం రైతు మానసిక సంఘర్షణకి అద్దం పట్టిన కథ ఇది. ఎలాగోలా తన పంటని కాపాడుకోవాలి అనే బెంగ ఒక వైపు, ఇంట్లో నూకలు నిండుకున్నాయనే దిగులు మరో వైపు రజాక్‌మియాని కృంగదీసేస్తుంటాయి. అతని పేదరికాన్ని అవసరాన్నిఅవకాశంగా తీసుకుని, అతని కొద్దిపాటి భూమిని కాజేయాలనుకుంటాడు ఓ రెడ్డి. కామందుల దాష్టీకం, బీద రైతుల నిస్సహాయతని ఈ కథ కళ్ళకు కట్టినట్లు వ్యక్తం చేస్తుంది. అలాగే, రోజూ కూలీ కోసం ఎంత దూరమైనా వెళ్ళి, సరైన ప్రయాణపు వసతులు లేక ప్రమాదాలు కొనితెచ్చుకునే బీదవారి జీవితాలను కళ్ళకు కడుతుంది.

అయ్యవారి చదువు: ఓ పేదవాడు చదువుకోడానికి ఎంత కష్టపడ్డాడో, చిన్నప్పుడు అలా ఎప్పుడూ చదువుతునే ఎందుకుండేవాడో చెబుతుంటే మనసు ద్రవించిపోతుంది. దీనిని ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్ధికి కథలా చెబుతాడు. చదువు విలువ చాటి చెప్పే కథ ఇది.

జీపొచ్చింది: ఓ పేద రైతు కథ ఇది. పొలం బాగా పండాలని బోరు వేస్తాడు, కానీ నీరు చాలా లోతుకు వెడితే గానీ పడలేదు. ఆ నీళ్ళు పైకి తేవడానికి మోటారు కావాలి, మోటారు నడవడానికి కరెంటు కావాలి….. అప్పు చేసి మోటారు అద్దెకి తెచ్చుకుంటాడు, తన గేదెని అమ్మేసి మోటారుకి కరెంటు కనెక్షన్ ఇప్పించుకుంటాడు వెంకట్రెడ్డి. కానీ విధి వక్రిస్తుంది. బోరుఎండిపోతుంది. నీటి చుక్క పైకి రాదు. ఇదిలా ఉంటే కరెంటు బిల్ కట్టలేదంటూ కరెంటు ఆఫీసు వాళ్ళు మోటార్ల స్టార్టర్లు తీసుకుపోడానికి వస్తారు, వద్దని బతిమాలుతూ వాళ్ళ కాళ్ళమీద పడతాడు వెంకట్రెడ్డి. వాళ్ళు గట్టిగా విదిలించుకుని పోతారు. ఆ విదిలింపుకి రెడ్డి ప్రాణం పోతుంది. మనసు ఆర్ద్రమైపోతుందీ కథ చదివాక. హృదయం మొద్దుబారిపోతుంది.

పలక పండగ: చదువుకోవాలనే ఆశ ఉన్న ఓ కుర్రాడి కథ ఇది. పిల్లాడికి అక్షర జ్ఞానం కలిగితే, ఫీజు డబ్బులిస్తానంటుంది తల్లి. వాళ్ళ నుండి డబ్బులు రాబట్టాలంటే కుర్రాడికి చదువు వచ్చినట్లు నిరూపించాలి మాస్టారు. అందుకని ఓ పండగ సందర్భంగా అందర్ని పలకల మీద అక్షరాలు రాసుకురమ్మని చెబుతాడు. ఈ కుర్రాడికి పలక దొరకదు. వాళ్ళమ్మ ఎక్కడెక్కడో అడిగి చూసి, చివరికి తుక్కు సామాన్ల కొట్లో ఓ తుప్పు పట్టిన రేకు పలకని సంపాదించి కొడుక్కి ఇస్తుంది. దాని మీద ఎంత రాసిన అక్షరాలు పడవని తెలుసుకున్న కొడుకు దాన్ని విసిరేస్తే, అది తాకి తల్లికి గాయమవుతుంది. కోపంతో కొడుకుని ఉతికి ఆరేస్తుంది. ఏడుస్తూ పడుకుంటాడు. వాడికో చక్కని కల వస్తుంది.

చాపరాయి: అరకు దగ్గర చాపరాయి అనే పర్యాటక ప్రదేశంలో ప్రాకృతికంగా ఏర్పడిన శిలలపై పేర్లు చెక్కి వాటి సహజ అందాన్ని పాడు చేస్తున్నారని కథకుడు బాధ పడతాడు. అక్కడ ప్రేమికుల పేర్లు రాసే ఓ పెయింటర్‍ని కలిసి అతను చేసే పని తప్పని చెబుతాడు. బదులుగా ఆ పెయింటర్ కథకుడు చేస్తున్న తప్పు గురించి చెబుతాడు. దేన్నైనా ఒకరి దృష్టికోణం నుంచే చూడకూడదని, అవతలివారి కోణం కూడా ఒక్కోసారి సరైనదే అవుతుందని ఈ కథ చెబుతుంది.

ఇంకా కొన్ని చక్కని కథలున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినెగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

జుమ్మా On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

మిసిమి ఫిబ్రవరి 2012 సంచిక సంపాదకీయం

చరిత్రలో ఎన్నో సిద్ధాంతాలు – వాదాలు మానవజాతి పురోగమనానికి దోహదం చేశాయి. కొన్ని తిరోగమనానికీ సహకరించాయి. అయితే ఏదీ శాశ్వత పరిష్కారం చూపలేదు. చర్చకు, ఆచరణ సాధ్యానికి మధ్య ఎంతో అగాధం వుంటుంది. వాదాలన్నీ ఏకరువు పెట్టే సందర్భం కాకపోయినా, మానవీయ సంబంధాలను ఎక్కువగా ప్రభావితం చేసిన స్త్రీ వాద మూలాలెక్కడ అని చూడబోతే, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలే వెలుగులోకి వచ్చాయి. అలాగే తెలుగులో స్త్రీ వాద రచనల తీరుతెన్నులు స్పృశించి వివరించారు త్రివేణి.

భారతీయ నాటకం ఎలా వుందో – ఎలా వుండేదో – ఎలా వుండాలో ఎంతో సాంకేతికంగా విపులీకరించి లోతుపాతలను తెలియజేశారు తెలుగు నాటకానికి ఊపిరులూదుతున్న చాట్ల శ్రీరాములు.

ఈ నాటి క్లిష్టపరిస్థితులలో ‘మేధావి’ ఏం చేయాలి? ఏమి చేయగలడు? ఎందుకు ఇంత దీనావస్థలో మిగిలిపోతున్నాడు? ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఈ చర్చకు తెర తీసినవారు వేదాంతం లక్ష్మీప్రసాదరావు.

మనకు కలంకారీ అంటే పెడన – బందరు. కానీ శ్రీకాళహస్తి కలంకారీ కళ ప్రత్యేకతను, ఆధునికీకరించిన తీరును వివరించాము ఈ సంచికలో.

దగ్గర బంధువులో, మిత్రులో తమ సన్నిహితులను కోల్పోతే – మనకు ఓదార్చేందుకు మాటలే దొరకవు. ఈ ఓదార్పు ఉత్తరం చదవండి.

ఈనాటి అభివృద్ధి పేరుతో జరిగే విధ్వంసానికి మూలాలెక్కడ? మనిషికి ఇంత హింసాప్రవృత్తి ఎందుకు పెరిగి పోతున్నది? ఎన్నో కారణాలు. కాని సృజనాత్మకత అనే వ్యాపకం పెంపొందించుకోగలిగితే కొంత వరకైనా హింసను అడ్డుకోవచ్చేమో?

‘రూపాయిల లెక్కలు చూసుకునే వ్యాపారస్తుల చేతుల్లోంచి సినిమాను విడిపించాలి. మన అభ్యుదయ ఆలోచనలకు ఆశ్రయమిచ్చే సంపన్నుల అండతో ఇదే సినిమాను ప్రచార సాధనంగా ఉపయోగించాలి. జనాభ్యుదయానికి, సంఘశ్రేయస్సుకు, దేశ సంస్కరణకు సినిమాను సాధనంగా వాడుకోవాలి’ అని రామబ్రహ్మం ఎంతో స్పష్టమైన అభిప్రాయంతో సినీరంగంలో అడుగుపెట్టి గాంధి ఆశయాలకు ప్రచారం కల్పించారు. అటువంటి వైతాళికుని పరిచయం చదవండి.

ఆలపాటి రవీంద్రనాథ్ 16వ వర్థంతికి మా శ్రద్ధాంజలి.

సంపాదకులు

* * *

మిసిమి మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. తాజా సంచిక కొరకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

మిసిమి ఫిబ్రవరి 2012 On Kinige

Related Posts:

విలక్షణమైన గొప్ప కథకుడు సి. రామచంద్రరావు

ఏ దేశమేగినా ఎందుకాలిడినా రాణించగల రమ్యగాథలు అంటూ వేలుపిళ్లై కథలు గురించి 21 డిసెంబరు 2011 నవ్య వార పత్రికలో సమీక్షించారు సుధామ.

రాసింది తక్కువైనా, వాసిగల రచనతో పాఠకులను హృదయదఘ్నంగా ప్రభావితం చేసిన కథకులలో సి. రామచంద్ర రావు ఒకరని సుధామ అన్నారు.

ఈ కథలలో ఇంగ్లీషు, తమిళ పాత్రలు తెలుగు పాత్రలతో ఎక్కువ సహచరిస్తూ, ఆ పాత్రల మాటుచాటుల నుంచి అద్భుత జీవన అంతరంగ తరంగాలను ఎగసి పడేలా చేస్తాయని సమీక్షకులు పేర్కొన్నారు.

“అద్భుత ‘జీవనసారం’ గల పాత్రలనూ, గొప్ప పఠనానుభూతినీ పాఠకులకిచ్చి, ఇప్పటికీ తలచుకునే కథా విన్నాణం చూపిన రామచంద్రరావుగారు తెలుగు కథా ప్రపంచంలో విలక్షణమైన గొప్ప కథకులు! ‘వేలుపిళ్లై’ నిలిచిపోయే కథా సంపుటి” అని వ్యాఖ్యానించారు సుధామ.

పూర్తి సమీక్షకై ఈ లింక్ నొక్కండి.

వేలుపిళ్లై కథాసంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి

వేలుపిళ్లై On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: