ఇంజనీరింగ్ విద్యలో ఒక పాఠ్యాంశముంటుంది, ‘ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్’ అని. ఒక వస్తువును సమగ్ర అవగహన కోసం నిర్థిష్టమైన బహుకోణాల్లో శాస్త్రీయంగా దర్శించడం. బహిర్ అంతర్ వివరాలను నిస్పష్టంగా గ్రహించగల్గడం… యిక, ఆ వస్తువు / యంత్రభాగం / నిర్మాణం రూపకల్పన, అభివృద్ధి, ఉద్ధరణ దిశలో అడుగులు వేయడం… ఇదీ ఈ ‘పరాయోళ్ళు’ రచయిత వృత్తిరీత్యా ఒక ఇంజనీర్ కావడం వల్ల ‘సమాజం’ అనే వ్యవస్థను బహుముఖమైన కోణాల్లో దర్శిస్తూ పౌరబాధ్యతతో, వ్యథతో, ఆశావహమైన కాంక్షతో అనుశీలించారు. భ్రష్టుపట్టిపోతున్న సమాజం, పూర్తిగా నేలమట్టస్థాయికి పతనమైపోయిన నైతిక విలువలు, అదుపూ ఆజ్ఞాలేని అవినీతి, నిస్సిగ్గు దోపిడి, రాజకీయ అరాచకం, సున్నిత హృదయాలను దుఃఖమయం చేసే అతిసేచ్ఛ… ఇవన్నీ ఈ పుస్తకంలోని దాదాపు అన్ని కథల్లోనూ కథావస్తువులుగా పాఠకునికి కనబడ్తూ లోతుగా ఆలోచింపజేస్తాయి. ఒక వ్యవస్థలోని లోటుపాట్లనూ, లోపాలనూ ఎత్తిచూపడమంటే వాటిని మరమ్మత్తు చేయదగిన కీలకాంశాలుగా తెలియజేస్తూ స్పృహింపజేయడమేకదా… అన్న కోణంలో గనుక ఈ పుస్తకంలోని ప్రతి కథను పాఠకుడు స్వీకరించగల్గితే ‘పరాయోళ్ళు‘ కథాసంపుటి వర్తమాన ఆధునిక సమాజంలోని వివిధ రంగాల్లో దృశ్యాదృత్యంగా ఉన్న రుగ్మతలన్నింటినీ పాఠకుల ముందు పరిష్కారార్థం ప్రతిపాదించింది. వీటిలో ఒక్కటి కూడా ప్రేమకథ, వ్యంగ్య, హస్య, ఉబుసుపోక, కాలక్షేప, చమత్కార కథ లేదు. ప్రతి కథా ఏ హృదయమున్న భారత పౌరున్నయినా సంక్షుభితున్ని చేస్తున్న సామాజిక జాఢ్యాల గురించే విప్పి చెబుతుంది. ఆలోచింపజేస్తుంది. పౌరబాధ్యతను గుర్తుచేసి తనవంతు కర్తవ్యాన్ని స్ఫురింపజేస్తూ ప్రతి కథా సామాజిక కోణంలో ప్రయోజనకరమైన ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
ఉమామహేశ్వర్ అవగాహన కల్గిన ఇప్పటి యువతరానికి ప్రతినిధి. వృత్తిరీత్యా ఇంజనీరై ఉండి బోధనావృత్తినుండి సాఫ్ట్వేర్ పరిశ్రమలోకి చేరి మేడిపండువంటి రంగాల్లోని డొల్లతనాన్నీ, అంతర్గత పర్యావరణాన్నీ గుప్తంగా దాగిఉన్న ప్రపంచీకరణ వికృత విధ్వంసాన్నీ అతిదగ్గరగా వీక్షిస్తున్న వాడు. అందుచేతనే కొన్ని కథల్లో అత్యంత హానికరమైన, కాకిబంగారంలా కనిపించే సందర్భాల మూలల్లోకి చేరి జీవితాలను విప్పి చూపించగలిగాడు. ఇవేవీ ఊహించి, కల్పించి, అలంకరించి చెప్పిన కథలు కావు. అందుకే ఈ కథలు సరళంగా, స్వచ్ఛంగా నిరలంకారంగా గొప్పగా ఉన్నాయి. సమాజ సౌందర్యానికి టెక్కు లెక్కువ ఉండనట్టే ఈకథలకు కృత్తిమ ప్రక్కవాయిద్యాలు లేవు. సూర్యకిరణాల్లో సూటిగా ఉన్నాయి.
1991 నుండి గరళజలంవలె విస్తరించడం మొదలైన ‘ప్రపంచీకరణ’ స్థానీయరంగాల్లోకి ప్రవేశించి కనబడకుండా ఎలా వ్యాపించి కళ్ళముందే చూస్తూండగా చూస్తుండగానే ఎలా మూలాలను ధ్వంసం చేస్తుందో రచయిత ‘ది ధూల్ పేట ఇండస్ట్రీస్(ప్రై) లిమిటెడ్’ కథలో ఎంతో సంయమనంతో వివరించాడు. మల్లేష్ యాదవ్ ఒక బడుగుదేశానికి ప్రతీకగా, సుబ్బిరాజు అగ్రదేశానికి ప్రతీకగా గ్రహించి చదువుకుంటూపోతే కుట్రపూరిత వ్యాపార వికృత రూపురేఖలు కళ్ళముందు ప్రత్యక్షమౌతాయి. అట్లాగే ‘నిశ్శబ్ద విప్లవం’లో ఐ.టి. పరిశ్రమల్లోని బోలుతనాన్నీ, కార్పొరేట్ సంస్కృతి మాయలో వ్యక్తులు వంకర్లుపోతూ అపసోపాలుపడే సూడో ప్రవర్తనలు, తన జీవవంతమైన మూలాలను మరిచి ప్రదర్శించే వికార పోకడలు, అసలు మనిషికి జీవదాతమైన ఆహారాన్నందించే వ్యవసాయ రంగంపట్ల చులకనభావం… యివన్నీ కృష్టమోహన్, సంజన్న పాత్రలద్వారా
ఒక ఆశావహమైన భావిని దృశ్యమానం చేశాడు రచయిత. ‘మాయరోగం’ కథలో కూడా ప్రశాంతమైన చిన్న పట్టణాల్లో ఆర్.ఎమ్.పి.ల ద్వారా స్థానిక వైద్యసదుపాయాలను ఎలా కార్పొరేట్ ఆస్పత్రులు ఆక్టోపస్లా విస్తరిస్తూ ధ్వంసం చేస్తున్నాయో వృద్యంగా చెప్పబడింది. ‘వాటర్’, ‘బ్లాక్ హోల్’, ‘రూపాంతరం’ కథలు మనుషుల్లో ఆలోచనలు, మాటలు, చేతలూ పూర్తిగా వేర్వేరనీ, లోలోపల అంతా ఆదర్శవంతంగా వల్లిస్తూ… చేతలదాకా రాగానే అవకాశవాద తత్వంలో లంచాల రూపంలో, దోపిడీ తత్వంతో ఎగబడి దండుకోవడమేననీ శక్తివంతంగా చెప్పబడింది.
రచయితగా ఉమామహేశ్వర్ కు ఈ సమాజం ఇలా ఉంటే బాగుంటుంది అని ‘స్వప్న సదృశ’మైన కొన్ని ఊహలున్నాయి. ‘మన అవసరం’ అన్న కథలో సూర్యప్రకాశ్ పాత్రద్వారా ఆ ఆరోగ్యవంతమైన ఆకాంక్షను బలంగా చెప్పారు. అదేవిధంగా ‘ఆనందకుటీరం’ కథలో వృద్ధులు కొందరు తమ ప్రశాంత జీవనం కోసం ఏర్పాటు చేసుకున్న ఆశ్రమం అనుకున్నట్లుగానే శాంతివంతంగా ఉన్నా దాన్నింకా అర్థవంతం, ఆదర్శవంతం చేసేందుకు అనాథ బాలల ఆలనపాలనను కూడా స్వీకరించడం ద్వారా ఓ పరిపూర్ణతను సాధించవచ్చునని వినూత్న సూచనను చేశారు. బాగుంది.
దీంట్లోని కథలన్నీ యిదివరకు ప్రముఖ తెలుగు వెలువడ్డయే. సీరియస్ కథా పాఠకులకు తెలిసినవే. రచయిత పాఠకులకు ఆరోగ్యవంతమైన ఆలోచనలను శాస్త్రీయంగా అందివ్వడంలో కృతకృత్యుడయ్యాడు. శైలి సరళంగా, పఠనీయంగా ఉంది. మంచి కథల సంపుటి ఇది. ఉమామహేశ్వర్ అభినందనీయుడు.
– రామా చంద్రమౌళి
(పాలపిట్ట , జూలై 2012 సంచిక నుంచి)
* * *
పరాయోళ్ళు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె నుండి “పరాయోళ్ళు” ప్రింటు పుస్తకం తగ్గింపు ధరకు తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.