వోడ్కా విత్ వర్మ

ప్రముఖ సినీ విమర్శకుడు, గీత రచయిత సిరాశ్రీ సుప్రసిద్ధ సినీదర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై రాసిన పుస్తకం “వోడ్కా విత్ వర్మ“.
స్కూలు కుర్రవాడిగా ఉన్నప్పుడు వర్మ సినిమా వాల్ పోస్టర్ చూసి మతిపోయిన ఓ కుర్రాడు, వర్మతో కలసి వోడ్కా టేబుల్ వద్ద కూర్చునే స్థాయికి చేరి అదే వర్మ గురించి ఒక పుస్తకం రాసాడు. ఆ కుర్రవాడే సిరాశ్రీ. ఆ పుస్తకమే వోడ్కా విత్ వర్మ.
రామ్‌గోపాల్ వర్మ అంటే సాధారణ ప్రజలలో, సినీజీవులలో, సన్నిహితులలో రకరకాల అభిప్రాయాలున్నాయి. కొందరికి రామ్‌గోపాల్ వర్మ ఓ వ్యసనం, మరికొందరి అసహ్యం. సైకో, అతివాది, సినీతీవ్రవాది…ఇలా రకరకాల విశేషణాలు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో నిజానిజాలు కనుగొనేందుకు, రామ్‌గోపాల్ వర్మ అంతరంగంలోకి, మనసులోకి తొంగి చూసేందుకు రచయిత ప్రయత్నించారు.
వర్మలో – రీల్ వర్మ, మీడియా వర్మ, రియల్ వర్మ అనే మూడు పార్శ్వాలున్నాయని రచయిత అంటారు. వర్మ తన గురించి తాను ఏమనుకుంటాడో చెప్పలేకపోయినా, వర్మ ఏమి అనుకుంటాడో రచయిత ఊహించారు. వర్మ గురించి ఇతరులు ఏమనుకుంటారో చెప్పారు.
తనని సార్ అని కాకుండా రాము అని వర్మ ఎందుకు పిలిపించుకోవాలనుకున్నారు? వర్మ రాముడు కాదు గోపాలుడు అని రచయితకి ఎందుకు అనిపించింది? సర్కస్‌లో రింగ్ మాస్టర్‌లా మీడియా అనే సింహం జూలు పట్టుకుని రామ్‌గోపాల్ వర్మ ఎలా ఆడగలిగారు? అమితాబ్ బచ్చన్‌ని వర్మ తిట్టాడా, పొగిడాడా? భారతీయులకి పిచ్చగా నచ్చేసి, హాలీవుడ్‌లో మాత్రం టాప్ హండ్రెడ్ సినిమాల జాబితాలోకి చేరలేకపోయిన సినిమా ఏది? శివ సినిమాలో సైకిల్ చైన్ పట్టుకున్న చెయ్యి నాగర్జునది కాదా? ఓ సుప్రసిద్ధ రచయితకీ, వర్మకీ ఉన్న ఉమ్మడి లక్షణం ఏమిటి? వర్మలోని టెక్నీషియన్ని అహంభావి మింగేస్తున్నాడని ఎవరన్నారు? అందరూ అనుకునేలా రామూలో తిరుగుబాటు ధోరణి లేదని ఎవరన్నారు? వర్మని ఆయన మేనమామ నత్తతో ఎందుకు పోల్చారు? వర్మ గురించి ఆయన మాజీ భార్య, కూతురు ఏమనుకుంటున్నారు? ఒకప్పటి రాము మార్క్ ఇప్పుడు కనిపించడం లేదని వర్మ మేనమామ ఎందుకన్నారు? తన జీవితంలో అత్యంత ముఖ్యులైన తల్లిదండ్రుల గురించి, భార్యాబిడ్డల గురించి వర్మ అభిప్రాయం ఏమిటి? ….. ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబులు ఈ పుస్తకంలో దొరుకుతాయి. ఇవే కాకుండా సినీప్రముఖులు రామ్‌గోపాల్ వర్మ మీద వెల్లడించిన అభిప్రాయాలు, కొన్ని అరుదైన ఫోటోలు ఉన్నాయి.
రామ్‌గోపాల్ వర్మపై రాసిన ఈ పుస్తకం ఆయన జీవిత చరిత్ర కాదూ, ఆయన ఆత్మకథా కాదు. రామ్‌గోపాల్ వర్మని అర్థం చేసుకోడానికి ఓ ప్రయత్నం లాంటిది. సినీదర్శకుడిగా, వ్యక్తిగా రామ్‌గోపాల్ వర్మ నచ్చినా నచ్చకపోయినా, వర్మ గురించి రాసిన ఈ పుస్తకం మాత్రం పాఠకులని చివరిదాక ఆసక్తిగా చదివిస్తుండనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

* * *

“వోడ్కా విత్ వర్మ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేసిన్ ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి.
వోడ్కా విత్ వర్మ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

సజీవన చిత్రణ (జీవన శిల్పం సమీక్ష)

రచయిత్రి కన్నెగంటి అనసూయ జీవన శిల్పం బాగా పట్టుకున్నారు. అందుకే ఆవిడ కథానికల్లో శిల్పం, శైలి అంటూ ప్రాకులాడక మానవ జీవన సంవేదనలకు ఆలోచనాత్మకమైన అక్షరాకృతి నివ్వడమే ప్రధానంగా రచన చేసారు. జీవితాన్ని జీవించడం తప్ప నటించడం సరికాదని ప్రగాఢంగా విశ్వసించిన కలం తనది. కథలు కథలకోసమే కాదు సాటివారి జీవన వ్యధలు సాధ్యమైనంత మేరకు తీర్చగలిగే సేవా దృక్పథానికి ప్రోది కావాలన్న సంకల్పం గల రచయిత్రి కనుకనే మానవ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి తన రచనలే కాక మాటలూ, చేతలూ కూడా సాటివారి సహకారంతో తదనుగుణంగా నిర్వర్తిస్తున్న సేవాపరాయణ అనసూయ. అమ్మగారి స్ఫూర్తితోనే కమ్మని కథలు రాయడం అలవడిందంటారు.

ఇరవై కథల ఈ సంకలనంలోని కథలన్నీ అనురాగాలకు, ఆర్ద్రతలకు, మానవీయతకూ అద్దం పట్టేవిగా ఉన్నాయి.

‘బియ్యపు రవ్వ ఉప్మా’ అనే కథలో అమ్మ ఆప్యాయతకే కాదు, మాతృభూమి మమకారానికీ ‘ఉపమ’గా వృద్ధాప్యపు రాజారావు జ్ఞాపకాల మనుగడను మనోజ్ఞంగా చిత్రించారు. మనసుకు మనసు పరంబగునప్పుడు కంటికి నీరు ఆదేశంబగునని చాటుతూ రాసిన చిన్న కథే అయినా ‘ఏ సంధి’ అంతరంగపు సందులోకి చొరబడకుండా వుండదు. పినతల్లే తల్లిగా పసివాడి వసివాడని విశ్వాసాన్ని కథనం చేసిన తీరు బాగుంది.

మోసం, వంచన అనే వాటికి ‘జెండర్’ అంటూ ఏమీ లేదు. మోసం చేయడానికైనా, మోసపోవడానికైనా. రచయిత్రి తాను స్ర్తి అయివుండీ కొందరు సంఘంలో స్ర్తిలే ఎలాంటి వంచనలు చేస్తుంటారో ‘రెండొందలు’ కథలో చిత్రించారు. అంతేకాదు మహిళా సంఘాలు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌ల వంటివి కూడా అలాంటి వారిని వెనకేసుకు రాకూడదని ధ్వనింపచేసారు.

‘పడమటి సంధ్యారాగం’ అనే కథ పేరు ఆ కథకి ఎలా నప్పిందో తెలియదుగానీ, సాహిత్యాభిలాష ఉన్న ఓ పంజాబీ సైకియాట్రిస్ట్ రైల్వే స్టేషన్‌లో పిచ్చిదానిగా పుస్తకాల మూటతో నలుగురితో చీత్కరింపబడుతూ కనబడే విషాద సంఘటనను కథగా చిత్రించారు. కానీ ఆవిడ అలా మారడానికి గల కారణం కథలో ఎక్కడా చిత్రించబడలేదు. అంత విద్యాధికురాలు పిచ్చిదవడానికి గల హేతువు వివరించకుండా చెప్పడంవల్ల ఆ పాత్రమీద సానుభూతికి సాంద్రత గాఢత సమకూడినట్టు తోచదు.

వయోజన విద్య గూర్చిన అక్షర దీక్షా చైతన్యాన్ని ‘చైతన్యం’ వంటి కథలో చూపించి ప్రభుత్వ పథకాలని త్రోసిరాజనక ప్రజాప్రయోజన అంశాలు అందరూ అందిపుచ్చుకుని ప్రచులితం కావించవలసినవేనని అనిపించారు.

‘‘ఒక్క చిరునవ్వుతో సగం రోగాన్ని డాక్టరు నయం చెయ్యగలడు. మిగతా సగం రోగానికే డాక్టరు మందిచ్చేది. ఆ ఒక్క చిరునవ్వు ఆ రోగిలో ఎంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందో అంతే నమ్మకాన్ని డాక్టరుపట్ల పెంచుతుంది’’
‘‘మాటలూ భావాలూ ఏమీ లేని మొక్క కూడా ఒక చోట పీకి ఇంకోచోట వేస్తే మట్టీనీరూ రెండూ ఉన్నా, సరిగ్గా నిలబడడానికి వారం పైనే పడుతుంది. తర్వాత ఏ ఆటంకం లేకుండా అది ఎదుగుతూనే ఉంటుంది. ఇక మనుష్యుల సంగతి వేర్వేరు చోట్ల పెరిగొచ్చిన ఇరువురు వ్యక్తుల అభిప్రాయాలు కలవటానికి, ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి వారం, నెల లేదా సంవత్సరం పట్టవచ్చు. అచ్చంగా మట్టిలో బతకడానికి ప్రయత్నించే మొక్కలు. కాకపోతే ఈలోపు కాస్త ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలగాలి అంతే!’’
రెండు విభిన్న పాత్రల ద్వారా ఈ సందేశాలను సంకలించిన కథ ‘చిరునవ్వు’. అదృష్టం మనతోనే మనని వెన్నంటి ఉంటుందట. మనం కష్టపడితే అదృష్టమూ కష్టపడుతుందట. మనం నిద్రపోతే అదీ నిద్రపోతుందట అన్న అంశంతో చిత్రించిన కథ ప్రోత్సాహం.

అనసూయ కథల నిండా ఇలా జీవన సారస్యాన్ని వివరించే మంచి పంక్తులు సంభాషణలుగా, వ్యాఖ్యానాలుగా ఔచిత్యంతో తొణికిసలాడుతుంటాయి. అందుకే జీవన శిల్పం అంటే ఉదాత్త ఆశయాల విలవల శిల్పీకరణమే అనిపింపచేస్తారు. చదివించే మంచి శైలి అలవాటే ఈ యలమాటి పుట్టింటి పడతికి. కన్నెగంటి అనసూయగారి వెన్నవంటి మృదుభావాల మానవీయ కథానికల సంపుటి ‘జీవన శిల్పం’.

అల్లంరాజు
ఆంధ్రభూమి దినపత్రిక, 28/10/2012

* * *

“జీవన శిల్పం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

జీవన శిల్పం On Kinige

Related Posts:

ప్రత్యక్ష సంఘటనలకు అక్షర రూపం (అడ్డా పుస్తక సమీక్ష)

ఈ పుస్తకంలో ఏ కథానిక చదివినా రచయిత్రి తానెగిరిన, కళ్ళెదుట చూసిన సంఘటనలకు అక్షర రూపమిచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. సమాజం, వ్యవస్థ – గాడి తప్పుతోందనే ఆవేదన, మనుషులు అత్యాశలకి పోయి నిండు జీవితాలని బలి పెట్టుకుంటున్నారనే ఘోష పుట పుటలోనూ కనిపిస్తాయి. వాస్తవిక ఆలోచనలకు ప్రతిరూపం “ప్రేమ శిఖరాల మీద” కథ అయితే, స్త్రీకి ఉండే చట్టాన్ని దుర్వినియోగం చేసుకుని భర్తని, అత్తగారిని జైలుపాలు చేసే కథ “జాతర”. సామాజిక దృక్కోణం, అవినీతి, అన్యాయం, కునారిల్లుతున్న అనుబంధాలు, వంచన, అవహేళన….. ఇలాంటి వాటికి వ్యతిరేకమైన భావన ఈ రచయిత్రి ప్రతీ కథానికలోనూ కనిపిస్తుంది.
ఇన్ని ఉండబట్టే వేదాంత తత్వం ఆమెలో “బతుకు ఒక కలైతే….?” అనే కథని రాయించిందని ఇట్టే తెలిసిపోతుంది.
మనిషి ప్రాపంచిక సుఖాల కోసం అత్యాశాలకు పోతూ, స్వార్థంతో ద్వేషాన్ని పెంచుకుని, తమ గోతిని తామే తవ్వుకుంటారనే వాస్తవాన్ని కల ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించారు రచయిత్రి. అంతే కాదు – కల గన్న పాత్ర మేల్కొని, తమ తప్పు తెలుసుకుని, జీవితాన్ని మార్చుకోవాలనుకోవడం రచయిత్రి మనోభావాలని, భావోద్వేగాన్ని పాఠకులు గ్రహిస్తారు. రోడ్డు మీద పోతూ, మనకి కలిగే అనుభవాలని, సంఘటనల్ని గుర్తు చేస్తూ, వాటికి ఆశావహ దృక్పథంతో చెప్పే ముగింపు ప్రతి కథానికలోనూ మనల్ని ఆలోజింపచేస్తాయి.

కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ (చిత్ర మాసపత్రిక, అక్టోబరు 2012 సంచిక నుంచి)

* * *

“అడ్డా” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేసిన్ ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

అడ్డా On Kinige

Related Posts: