మే 2013 ఐదవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

మే 2013 ఐదవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1. డబ్బు మైనస్ డబ్బు – యండమూరి వీరేంద్రనాథ్
2. రామ్@శృతి.కామ్ – అద్దంకి అనంత్‌రామ్
3. భవాని – మధుబాబు
4. త్రిపుర కథలు – త్రిపుర
5. వోడ్కా విత్ వర్మ – సిరాశ్రీ
6. మిథునం – శ్రీరమణ
7. రెండోసారి కూడా నిన్నే ప్రేమిస్తా – సూర్యదేవర రామ్ మోహన రావు
8. నవ్విపోదురుగాక… – కాట్రగడ్డ మురారి
9. ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – బొందలపాటి
10. తపన – కాశీభట్ల వేణుగోపాల్

Related Posts:

మే 2013 నాల్గవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

మే 2013 నాల్గవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1. రెడ్ షాడో – మధుబాబు
2. డబ్బు మైనస్ డబ్బు – యండమూరి వీరేంద్రనాథ్
3. రామ్@శృతి.కామ్ – అద్దంకి అనంత్‌రామ్
4. వోడ్కా విత్ వర్మ – సిరాశ్రీ
5. మిస్టర్ మిరియం – మల్లాది వెంకట కృష్ణమూర్తి
6. తమిళ కథలు – ఆణిముత్యాలు -గౌరీ కృపానందన్
7.కథావార్షిక 2012 – కథావార్షిక
8. అస్తమించని రవి – ఖాదర్ మొహియుద్దీన్
9. యుద్ధకళ – బి. ఎల్. సరస్వతి కుమార్
10. తపన – కాశీభట్ల వేణుగోపాల్

Related Posts:

  • No Related Posts

రాలిన కథా కుసుమం

తన రచనలలో మార్మికతకు పెద్దపీట వేసి, కేవలం 15 కథలతోనే చదువరులను అభిమానులుగా మార్చుకున్న త్రిపుర 24 మే 2013 న దివంగతులయ్యారు.

సెప్టెంబరు 2, 1928 నాడు జన్మించిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు (ఆర్.వి. టి. కె. రావు) ఉరఫ్ త్రిపుర, తన మొదటి కథ 31-5-1963 నాటి ఆంధ్రపత్రికలో ప్రచురించారు. 2012-13 నాటికి త్రిపుర సాహితీసృజనకి యాభై సంవత్సరాలు పూర్తవుతాయి.

త్రిపుర కథల విలక్షణత అయన ఎత్తుగడలో ఉంటుంది, మొదటే అర్థం కాలేదని పుస్తకం పక్కన పడేస్తే మాత్రం కొన్ని అద్భుతమైన కథలని కోల్పోయిన వారవుతారు. మొదట అర్థం కానట్టు అనిపించినా, చదివే కొద్దీ కొత్త భావాలేవో అనుభవంలోకి వస్తున్నట్లు, మళ్ళీ మళ్లీ చదవాలనుకుంటారు పాఠకులు. కథలు సంక్లిష్టంగా అనిపిస్తాయి, వాటి పరిథి పెద్దది – ఫ్లోరిడా, వారణాశి, కేరళ, రంగూన్, థాయిలాండ్, సరిహద్దు ప్రాంతాలు – ఎన్నో చుట్టి వస్తాయి యీ కథలు. జెన్ బౌద్ధం మొదలు నక్సలిజం దాకా అనేక శ్రేణుల్లో తత్త్వచింతన ఈ కథల్లో ఉంది. చదివేకొద్దీ, మరింతగా చదివించే గుణం ఉన్న కథలివి. ఈ కథల్లో సర్రియలిజం, ట్రాన్స్‌పరెంట్ చీకటీ ఉండి అంతర్ముఖీనమైపోయే ఒక కన్ఫెషనల్ ఎలిమెంట్ కనపడుతుందని సుధామ అంటారు.

త్రిపుర కథలే కాకుండా కవితలూ అద్భుతంగా ఉంటాయి. తన 47వ పుట్టిన రోజు సందర్భంగా ” సెగ్మెంట్స్” అనే ఆత్మకథాత్మక దీర్ఘకవితని రాసారు. దీన్ని మరో ప్రముఖ కవి వేగుంట మోహన్ ప్రసాద్ త్రిపుర స్వశకలాలు పేరుతో తెలుగులోకి అనువదించారు. ఫ్రాంజ్ కాఫ్కాకి వీరాభిమాని అయిన త్రిపుర ఆయన ప్రేరణతో, “త్రిపుర కాఫ్కా కవితలు” రాసారు. కాఫ్కా రచనల్లోని నిగూఢత్వం ఈ కవితల్లోనూ గోచరిస్తుంది. ఈ పుస్తకాన్ని “సాహితీమిత్రులు” ప్రచురించారు. 1980 – 1988 మధ్యలో త్రిపుర రాసిన 16 కవితలని “కవిత్వం ప్రచురణలు” వారు “బాధలూ -సందర్భాలూ” అనే శీర్షికతో నవంబరు 1990లో ప్రచురించారు.

“త్రిపుర కథలు, కవితలు, సంభాషణలు, మౌనం ఇవి వేరు వేరు కావు. అవన్నీ కలిసి అల్లే దారులు ఎంతో విస్తారము, సాధారణమైన అనుభవాల కంటె లోతు, అపరిచితమైన సృజనావరణానికి దిక్సూచికల వంటివి” అని అంటారు కనకప్రసాద్.

చక్కని సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి ఈ త్రిపుర రచనలు.

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో తనవంతు పాత్ర పోషించి, కథనరంగం నుంచి నిష్క్రమించిన త్రిపురకి హృదయపూర్వక నివాళి అర్పిస్తోంది కినిగె.

Related Posts:

చారిత్రక యానాం కథలు

ఇవి యానాం కథలు. వంతెన అవతల 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి తారాజువ్వలు ఆకాశంలో వెలుగులు జిమ్ముతుంటే వంతెన ఇవతల చీకట్లో మూగగా నిలబడిపోయిన ఫ్రెంచి వలసలోని తెలుగు ప్రజలు… నోరొచ్చి ఇన్నాళ్ళకు చెప్పుకున్న కతలు. సాహిత్యం కూడా చరిత్ర ఖజానానే అనుకుంటే… దాట్ల దేవదానం రాజు ‘యానాం కథలు’ చారిత్రక గనేనని చెప్పాలి. చరిత్ర రచనలో చిక్కటి భావుకత్వం కలగలిస్తేనే ఇలాంటి కథలు తయారవుతాయనిపిస్తుంది.

ఫ్రెంచి వలసల్లో బతుకు సాపేక్షంగా బ్రిటిష్ వలసలకన్నా మెరుగేననేది ఈ సంపుటిలోని 18 కథలు చదివాక అర్థమయ్యే విషయం. దోపిడీ లేదని కాదు గానీ, స్థానిక సంస్కృతులు, సంస్కారంపై చిన్నచూపు లేదని కాదు గానీ, యానాం జనజీవనంలోని వైవిధ్యాన్ని మాత్రం చెదరగొట్టలేదు ఫ్రెంచి దొరలు. ప్రపంచంలోనే గొప్ప పౌర సమాజానికి ప్రతినిధులమన్న అభిజాత్యం వారి పాలనలోనూ, వ్యవహార, వ్యక్తీకరణల్లోనూ కనిపిస్తుంది. మనసుపడిన యువకుడితో గడిపేందుకు తన భార్యను అనుమతించిన పాల్ షెల్జ్‌లో (కథోర్‌జియ్) కనిపించేది ఈ అభిజాత్యమే. ప్రేమించిన కామాక్షి కోసం యానాంలోనే ఉండిపోవాలని రొబేర్ నిర్ణయించుకోవడం (లా’మూర్’) అలాంటి వ్యక్తీకరణే. తోటి బ్రిటిష్, డచ్ అధికారుల సాంగత్యంతో పొగరుగా వ్యవహరించిన ఒకరిద్దరు పౌర అధికారులు మినహాయిస్తే, చాలావరకు యానాంతో ఏదో ఒక సంబంధంలోకి వచ్చినవారే.

ఈ మినహాయింపు యానాంలోని బ్రాహ్మణ కులానికీ వర్తిస్తుంది. ఫ్రెంచి పాలన పట్ల పట్టింపుతోనూ, వంతెన అవతలి బ్రిటిష్ వలస పాలనలోని ఎదుర్లంకలో రెక్క విప్పిన ఆధునికత, జాతీయోద్యమం పట్ల మమేకతతోనూ ఉన్న కులమది. దొర బంగ్లాపై జెండా ఎగరేసిన బాపన్న, జంధ్యం తెంపిన దొరపై తిరుగుబాటు లేవదీసిన వెంకటయ్య (తీర్పు వెనుక), ఆధునిక విద్యలు నేర్చుకుని బతుకును మెరుగుపరుచుకున్న రామశాస్త్రి (మండువా లోగిలి)… ఈ ప్రభావాలకు ప్రతినిధులే.

తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఈ కథలకు గొప్ప ప్రాసంగికత ఉండడం మరో ప్రత్యేకత. తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉండడం తప్పా అనేది ప్రాంతీయవాదుల ప్రశ్న. కానీ, అలా జరిగితే రెండు కాదు, మూడు ప్రాదేశిక సరిహద్దుల్లో తెలుగు ప్రజలు జీవించాల్సి ఉంటుంది. ఎందుకంటే, గత అరవై ఏళ్ళుగా యానాం విడిగానే ఉంది. అలా ఉండడం ద్వారానే సాంస్కృతికంగా, సామాజికంగా, చారిత్రకంగా తమ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను కాపాడుకోగలమని మెజారిటీ యానాం ప్రజలు భావిస్తున్నారు. నాలుగు కూడళ్ళ మధ్య నిలబడి ఈనాడు తెలంగాణ కోరుతున్నదీ ఇదే కదా!

వి. అరవింద్
ఆదివారం అనుబంధం, ఆంధ్రజ్యోతి దినపత్రిక, 24 మార్చి 2013

* * *

“యానాం కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ చూడండి.

యానాం కథలు On Kinige

Related Posts:

మాస్టర్ స్టోరీటెల్లర్ -వల్లంపాటి వెంకటసుబ్బయ్య

ప్రముఖ రచయిత, విమర్శకుడు, అనువాదకుడు అయిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథలపై సాక్షి దినపత్రికలో “ఒక కథావిమర్శకుడి తొలి అడుగుజాడలు” అనే శీర్షికతో వెలువడిన సమీక్ష ఇది.

* * *

కథలు ఎలా రాయాలో కథాశిల్పం అంటే ఏమిటో అని పుస్తకాలు రాసిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథలు ఎలా ఉంటాయి అనే కుతూహలం పాఠకులకు రావడం సహజం. వాటిని చదవాలని ఆశపడటమూ సహజం. అయితే మంచి తేయాకు ఏదో ఆ తేయాకు నుంచి మంచి డికాక్షన్ వస్తుందో రాదో పరీక్షించి చెప్పే నిపుణుడికి తేయాకు పండించడం తెలియకపోవచ్చు. బహుశా వల్లంపాటి ఈ ఎరుకతోనే కథలు రాయడం మానేశారా? లేదా సృజనలో నిమగ్నమైతే తానొక్కడే లబ్ధి పొందుతాడు… సృజన కోసం ప్రయత్నించేవాళ్లకు సహాయకారి కాగలిగితే అనేకమందికి ఉపయోగపడతాడు అనే సూత్రం కనిపెట్టడం వల్ల కథాసృజనను వదిలిపెట్టి కథావిమర్శను స్వీకరించారా?

ఏమైనాగాని ఆయన చనిపోయిన రెండుమూడేళ్లకు ఆయన కథలన్నీ ‘వల్లంపాటి కథలు’గా రూపుదాల్చడం చాలామంది పాఠకులకు సంతోషం కలిగించే విషయం. అసలు వల్లంపాటి ఇన్ని కథలు రాశారా అని ఆశ్చర్యపోయే నేటి తరం రచయితలు కూడా ఉన్నారు. 1958లో కథలు రాయడం ఆరంభించిన వల్లంపాటి 1970ల వరకూ కథలు రాసినట్టున్నారు. ఆ తర్వాత రాయలేదు. ఈ కథలన్నింటిని పరిశీలిస్తే వీటిలో కూడా ఆ రోజుల్లోని కథల ధోరణి, పేదరికం, మధ్యతరగతి విలువలు, రచయిత తననుతానే రచయితగా ప్రధానపాత్రగా ప్రవేశపెట్టి రాయడం వంటివి కనిపిస్తాయి. రాసిన ప్రతి కథా ఏదో ఒక సమస్యను చూపడానికి ఏదో ఒక విలువను ప్రతిపాదించడానికి ఏదో ఒక పతనాన్ని సూచించడానికి ప్రయత్నించడం అర్థమవుతుంది. అదే సమయంలో దృక్పథం అంటూ ఏమీ లేకుండా కలం నుంచి జారిన కథలు కూడా లేకపోలేదు. అందుకే వీటిని వల్లంపాటి ప్రామాణికమైన రచనలుగా ఎంచకుండా తొలి అడుగుజాడలుగానే చూడాలి. అందుకనే ఏమో తాను జీవించి ఉండగా, వీటి అవసరం ఉందా లేదా అనే సంశయంతో వల్లంపాటి వీటిని పుస్తకంగా తెచ్చి ఉండరు.

కాని- కథాపాఠకులు, మరీ ముఖ్యంగా కథారచయితలు ఈ కథలను తప్పక చదవాలి. ఒకకాలపు జీవితం గురించి తెలుసుకోవడానికి కథాపాఠకులు, ఒక రచయిత/విమర్శకుడు కథారచనను సాధన చేసిన పద్ధతిని ఆ పద్ధతిలో అతడి జయాపజయాలను అర్థం చేసుకోవడానికి కథా రచయితలు ఈ పుస్తకాన్ని చదవాలి.

వల్లంపాటి ఈ సంకలనంలో కచ్చితంగా కొన్ని కథలతో గాఢమైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. ‘రానున్న శిశిరం’ వంటి కథల్లో తన చేయి తిరిగిన రచనాశైలితో ఆశ్చర్యం గొలుపుతారు. కథకు అవసరంలేని వృధావర్ణనలు, వృధా సంఘటనలు కథలో ఉండరాదు అని నమ్మిన వల్లంపాటి తన కథలన్నింటిలోనూ ఆ సూత్రాన్నే పాటించారనిపిస్తుంది. స్ట్రయిట్‌గా పాయింట్‌లోకి దిగడం చూడవచ్చు.

అయితే ఇవి ఇప్పుడు ఔట్ డేటెడా?
మధ్యతరగతి ఉన్నంతకాలం మధ్యతరగతి గురించి రాసిన ఏ కథా ఔట్‌డేటెడ్ కాదు. కాకపోతే కాసింత మేకప్ మార్చుకొని మళ్లీ మళ్లీ కనిపిస్తుంటుందంతే. ఆ సంగతి అటునుంచితే- ప్రతి రచయితా చేసిన కృషి రికార్డు కావాల్సిందే. ఆ మేరకు వల్లంపాటి కథలకు సంబంధించి ఈ సంపుటి ఒక నాణ్యమైన రికార్డు. రాయలసీమ భాషకు, జీవితానికి దర్పణం లాంటి నవలను రాయాలన్న కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వల్లంపాటి తన కోరికను తీర్చుకోలేకపోవడం ఒక లోటైతే అలాంటి ఎన్నో కలలు కనే సాహిత్యకారులకు స్ఫూర్తిగా వారిని ప్రోత్సహించే శక్తిగా ఉండి వారి కలలు సాకారం కావడానికి ప్రయత్నించిన ఆయన ప్రెజెన్స్ లేకపోవడం చాలా పెద్ద లోటు. పుస్తకం ప్రింటింగ్, క్వాలిటీ చాలా బాగున్నాయి.

కె.సువర్చల

“వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథలు” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.
వల్లంపాటి కథలు On Kinige

Related Posts:

తొలి ఆంధ్రమహాసభకు వందేళ్ళు!

ప్రజాసాహితి మే 2013 సంచిక సంపాదకీయం – తొలి ఆంధ్రమహాసభకు వందేళ్ళు!

Praja Sahiti May 2013 Editorial

Related Posts:

మే 2013 మూడవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

మే 2013 మూడవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1. మిస్టర్ మిరియం
2. ఆత్మ కధాంశాల ఉత్తరాలు
3. రామ్@శృతి.కామ్
4. “ది బెస్ట్” ఆఫ్ యండమూరి వీరేంద్రనాథ్
5. ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ
6. నవ్విపోదురుగాక…
7. నేనూ – చీకటి
8. మిథునం
9. వోడ్కా విత్ వర్మ
10. 1948: హైదరాబాద్ పతనం

Related Posts:

చైతన్యపు చీకటి

పుస్తకం: నికషం
జానర్: చైతన్య స్రవంతి/నవల
రచయిత: కాశీభట్ల వేణుగోపాల్
కథాంశం: పాతనగరం చీకటివీధి అనాధ ‘బొల్లిమచ్చల’ పెయింటర్ అలెక్స్ రామసూరికీ, ‘మెలాయిడ్ లుకేమియా’ బారినపడ్డ ప్రియమ్మాయికీ మధ్యగల సహజాసహజ బాంధవ్యపు దుఃఖం కేంద్రంగా… అవసరార్థ స్నేహాన్నీ, స్నేహపు అవసరాన్నీ, ఏమీలేనితనాన్నీ, అన్నీవున్నసమయాన్నీ ఒక దగ్గర కుట్టిన తీవ్రమైన జీవితోన్మాదపు నగ్నచిత్రమిది.
శైలి: అగ్నిపర్వతపు లావా ఒక రూపంలోకి ఒదగనట్టే, గుండెలోతుల్లోంచి భావావేశం ఎగజిమ్మినప్పుడు ఒక నిర్దిష్టాకృతిని ఆశించడం అత్యాశ! కాశీభట్ల కలం అక్షరాల్ని అలా ‘కక్కుకుంటూ’ వెళ్లిపోతుంది. అట్టడుగు పొరల్లో మనిషి పొందే పెనుగులాటను అబ్‌స్ట్రాక్ట్‌గా, కవితాత్మకంగా చిత్రిస్తూ సాగిపోతుంది.

రాజి (సాక్షి ఫన్‌డే)

* * *

“నికషం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ చూడండి.
నికషం On Kinige

Related Posts:

మాస్టర్ స్టోరీ టెల్లర్ – దేవరకొండ బాలగంగాధర తిలక్

దేవరకొండ బాలగంగాధర తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న జన్మించారు.
తిలక్ అనగానే గుర్తొచ్చేది… అమృతం కురిసిన రాత్రి. తిలక్ పేరు తలచుకోగానే ‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్న వాక్యం స్ఫురించకతప్పదు. తిలక్ కవిగానే కాదు, కథకుడిగా కూడా తనదైన ముద్ర వేసారు.
తిలక్ మద్రాస్ లయోలా కాలేజిలోనూ, విశాఖ ఎ.వి.ఎన్. కాలేజిలోనూ ఇంటర్ చదువుతూ, అనారోగ్య కారణాల వల్ల ఆపేసారు. తణుకులో విజ్ఞాన పరిషత్ స్థాపించారు. తర్వాతి కాలంలో దానినే ‘సాహితీ సరోవరం’గా మార్చారు. తిలక్ కవితలు, కథలే కాదు, నాటకాలు కూడా రాసారు. బృందావన కళా సమితి అనే సంస్థని స్థాపించి నాటకాలు వేయించారు.
మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియను ఉపయోగించుకున్నారు. రోజూవారీ జీవితంలో మనకు తారసపడే అభాగ్యులను, మోసగాళ్లను ఆయన పాత్రలుగా తీసుకుని అసలు రూపాలతో మన ముందు నిలబెట్టారు.
తిలక్ తన మొదటి కథని 11 వ ఏట రాసారు. ‘మాధురి’ పత్రికలో ప్రచురితమైన ఆ కథ ఇప్పటికీ అలభ్యం. ఆయన 16 ఏళ్ళకే రాసిన పద్యాలు, గేయాలు ‘ప్రభాతము – సంధ్య’ పేరుతో 1938లో తొలి సంపుటిగా వచ్చింది.
గోరువంకలు, కఠినోపనిషత్తు, అమృతం కురిసిన రాత్రి ఇతర కవితా సంకలనాలు. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ‘ అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.
తిలక్ కథలు, సుందరీ-సుబ్బారావు, ఊరి చివరి యిల్లు తిలక్ కథా సంకలనాలు. సుశీల పెళ్లి, సుప్త శిల, సాలె పురుగు తిలక్ రాసిన నాటకాలు. 1956-66 మధ్య కాలం తిలక్ రచయిత శిఖరారోహణ చేసిన కాలం. అద్భుతమైన సాహిత్యాన్ని పాఠకులకు అందిస్తూ 1966 జూలై 1 న చిన్న వయసులోనే తిలక్ కీర్తి శేషులయ్యారు.

* * *

ఆనాటి సమాజాన్ని తన కథల్లో ఎలా వ్యక్తీకరించారో చెప్పడానికి ఆయన కథల్లోని ఈ క్రింది వాక్యాలు చాలు.

ఆశాకిరణం కథ నుంచి:

నలభై ఏళ్ళు పైబడిన తాను, తన సభ్యతకీ, స్వభావానికీ విరుద్ధమైన పనులన్నీ బతకడంకోసం చేశాడు. కాని దాని ఫలితంగా మరింత అవమానాన్ని, దుఃఖాన్ని కొనితెచ్చుకున్నాడు. ఇంకా తనిలాగ ఎన్నేళ్ళు ఆకలితో బతకగలడు? తన కుటుంబానికి ఏం దారి చూపించగలడు? భయంకరమైన నిస్సహాయత అతన్ని చుట్టుకుంది. అతనికి చీకట్లోకి జారిపోతున్నట్లు చీకటి నీళ్ళలో పీకలోతు మునిగిపోతూన్నట్టు ఉంది. నీరసంవల్ల అతని కాళ్ళూ చేతులూ లాగుతున్నాయి. అతనికలాగ గోడ నానుకుని ఆలోచించే వోపిక కూడా లేకపోయింది.
అలా మగతగా నిస్త్రాణగా వున్న అతనికి ‘నాన్నా’ అన్న పిలుపుతో మెలకువ వచ్చింది. కళ్ళుతెరచి చూశాడు. అతని పెద్దకొడుకు పదేళ్ళవాడు ‘అమ్మరమ్మంటోంది’ అన్నాడు.
“ఏం?”
“తింటానికి.”

* * *

పలితకేశం కథ నుంచి:

అతనికి చిరాకు కలిగింది. ఆశ్చర్యం కలిగింది. భయంవేసింది. ఇంతవరకూ ఉన్న మనస్స్వాస్థ్యం చెడిపోయినట్టయింది. ఎక్కడిదీ తెల్లవెంట్రుక? ఎప్పుడు ఎలా వచ్చింది? అభేద్యమనుకొన్న యీ కోటగోడకి పగులు ఎలా ఏర్పడింది. ప్రసాదరావు మొహంలో రంగులు మారాయి. అతనికి చీకట్లో వొంటరిగా నడుస్తూంటే ఎవరో శత్రువులు చుట్టుముట్టి నట్లనిపించింది. అతను సరదాగా మంచుమీద స్కేటింగ్ చేస్తుంటే చటుక్కున అంచు విరిగి అగాధమైన లోయలోకి జారిపోతున్నట్టు అనిపించింది తన నిస్సహాయత తనకి తెలియవచ్చింది. ఈ తెల్ల వెంట్రుక యిక నల్లబడదు. ఈ ఒక్క తెల్లవెంట్రుక ఆసరాతో తక్కిన వెంట్రుకలు కూడా తెల్లబడిపోతాయి. అతను ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నాడు. పరిష్కరించాడు. కాని యిది తన చేతిలోలేదు. ఏదో బలవత్తరమైన శక్తి అతన్ని ఆక్రమిస్తోంది. ఓడిస్తోంది. శ్రీమంతుడైన ప్రసాదరావు. హేతువాది అయిన ప్రసాదరావు, ఆప్టిమిస్టు అయిన ప్రసాదరావు. గౌరవమూ ప్రతిష్టాగల ప్రసాదరావు. సిసలైన వ్యక్తిత్వం కల ప్రసాదరావు తెల్లబోయి కంగారుపడి అద్దంముందు వెర్రిగా నిలుచునిపోయాడు.

* * *

సముద్రపు అంచులు కథ నుంచి:

వీరయ్య మౌనంగా అంచనా వేస్తున్నాడు. ఆకలీ – రేపటిని గూర్చిన భయమూ లేకుండా గౌరవంగా బతకాలని కోరని వారుండరు. కాని ఆ పేదరికం పొలిమేర దాటడం కష్టం అని వీరయ్యకి తెలియదు. ఆ పొలిమేర దగ్గర నీచత్వమూ నిరాశా రోగమూ లాంటి పెద్ద పెద్ద అగడ్తలుంటాయి. పై అంతస్తులోనికి ఎగరడానికి చేసే ప్రయత్నం అతి కష్టమైనదీ అపాయకరమైనదీకూడా. కాని వీరయ్య ధనం దేనికైనా మూలం అని గుర్తించాడు. కేవలం తన కష్టంవల్లనే తప్ప మరోమార్గం సంపాదనకి లేదనీ తెలుసుకున్నాడు. ఆ వచ్చిన ధనం తన్ని అంటిపెట్టుకుని ఉండాలి. కాని యీ చంచల పదార్థం ఉన్న చోటికే వెళ్లే దుర్గుణం కలిగి ఉందనీ అతనికి తెలియదు. ఏమైనా దారిపొడుగునా జయించుకుపోవాలనే పట్టుదల అతనిలో వుంది. అందుకోసమే తక్కిన తన వాళ్ళల్లో ఉన్న అలసటనీ అవినీతినీ తనలోంచి తుడిచిపెట్టి నియమబద్దంగా బతకాలనుకున్నాడు. అందుకోసమే నరసమ్మ నెత్తురులేని వలపుకి దూరంగా తొలగాడు.
పడవ సముద్రంలో వూగింది. రెండుకుండలలో గంజీ కూడూపెట్టి పడవలో ఉంచారు. తెరచాప గాలికి వయ్యారంగా ఆడింది. ఎండముదిరిన వేడికిరణాలు చల్లని సముద్రాన్ని తాకుతున్నాయి. “నాను కూడువొండి ఎదురు చూపులు చూత్తూంటాను.” అంది చంద్రి.

* * *

నవ్వు కథ నుంచి:

“అతను పక్కనుంటేనే మూర్తికి వొళ్ళంతా తేలికపడినట్టు, ఉదయపు నీరెండవంటి ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది. మూర్తికి సమస్యలు చాలా వున్నాయి. కాని సమస్యలన్నీ రామచంద్రరావు ఎదురుగా వున్నంతసేపూ మంచు విడిపోయినట్లు మాయమైపోతాయి.
కాని, మూర్తికి ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతూంటుంది. ఎందుకు ఇతని వదనాన ఒక విషాదరేఖగానీ, విసుగుగానీ కనిపించవు? ఏ జీవిత రహస్యం ఇతనికి తెలుసును? సుఖంలోని ఆనందంలోని ఏ కీలకాన్ని యితను వశపరచుకున్నాడు?”

* * *

పై వాక్యాలు చదువుతుంటే మాస్టర్ స్టోరీ టెల్లర్స్‌లో తిలక్ ఒకరనేందుకు ఏ మాత్రం సంశయించనక్కర్లేదని మనకి అర్థమవుతుంది. కినిగెలో తిలక్ రచనల కోసం ఈ లింక్‌ని అనుసరించండి.

Related Posts:

  • No Related Posts

మే 2013 రెండవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

మే 2013 రెండవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1. మిస్టర్ మిరియం
2. రామ్@శృతి.కామ్
3. ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ
4. వోడ్కా విత్ వర్మ
5. 1948: హైదరాబాద్ పతనం
6. నవ్విపోదురుగాక…
7. ఆత్మ కధాంశాల ఉత్తరాలు
8. శబ్బాష్‌రా శంకరా!
9. డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు
10. ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ

Related Posts: