అనామకుడు – ‘రమణీయం’ పుస్తక పరిచయం

రమణీయం On Kinige

కొన్ని రచనలు వడియాలు పెట్టినట్టుంటాయి.
కొన్ని జంతికలు పోసినట్టుంటాయి.
కొన్ని మాత్రం ముగ్గులు వేసినట్టుంటాయి.
పై రెండూ తింటే కరుసైపోయినట్టే-
ఇవాళ వేసే ముగ్గులు చూస్తూండగా రేపులోపు చెదురుతాయి; చెరుగుతాయి.లేకపోతే కొత్త ముగ్గులు రావు గదా. అంచేత ముగ్గులు చెదరడం, చెరగడం సహజం అవసరం. అదే జీవితం!
ఇంతకీ ముగ్గుల రంగేమిటి?
వైటా? బ్రౌనా? రెండు కలిస్తేనే రూపం కదా. దాంపత్య తాంబూల రాగం అదే గదా!
“నిన్న” కన్న బిడ్డ “ఇవాళ”.
“ఇవాళ”లు – రేపటికి పేరెంట్సూ, ఎల్లుండికి తాతలూ అవ్వలూను. ఏడాదికి ఆరు ఋతువులున్నట్టే ఆలుమగల దాంపత్య కాలచక్రంలోనూ వుంటాయి.
పెళ్ళి, సంతోషం, సంసారం, సంగరం, సంతానం, సంతృప్తి అనే మజిలీల మీదుగా – కామం పెరిగి, విరిగి, తరిగి నిష్కామభరితమైన స్నేహంగా, ప్రేమగా పరివర్తనం చెంది పంపడమే దాంపత్య జీవన ఋతుచక్రం. దాలిగుంట మీద పాలదాకలో పాలు నిదానంగా కాగి, మరిగి, పొంగి పొంగి, కుంగి స్థిరపడి ఎర్రడాలు మీగడ తేలడం దాంపత్య సౌభాగ్యం.
ఏమిటలా చదవడం ఆపి, కళ్లు తేలేస్తున్నారు?
సరదానంద వాక్యాలు గంభీరానంద సన్యాసానంద ప్రసంగ పాఠాల్లా కనబడుచున్నాయా? ఏం లేదు. ప్రేమలో పడడం, పెళ్లాడడం, కామించడం, రెచ్చిపోవడం, అలిసి పోవడం, క్రమంగా కోరికలు వెలిసి పోవడం – కొండొకచో కలుపు గడ్డి కల్పవృక్షంలా కనబడడం, తేలిగ్గా నాలిక్కరుచుకోవడం, నవ్వుకోవడం – ఇదీ వరస! ఇదే తాత్పర్యం!!
సీతారాముళ్లనే బావమరదళ్ల – ధరిమిలా ఆలూమగళ్ల – ఆ పైన తల్లీతండ్రుళ్ల – ఆ పిమ్మట అవ్వాతాతళ్ల కథలివి. వీళ్ళందరూ కలిపి ఇద్దరే!
చిన్ని చిన్న ఉబలాటాల ఆరాటాల పోరాటాల చెలగాటాల పరీమళాల (నీ జుట్టు నిశి – నీ ముఖం శశి; కళ్ళు చూస్తే మొగ్గలు – తిరిస్తే పువ్వులు) ఘుమ ఘుమలతో నోరూరించే – తింటే ‘వ-హల్‌వా’ అనిపించే ఆలుమగల ముత్యాల ముగ్గులు. విశేషం ఏమిటంటే సుద్ద ముగ్గుల్లా ఈ ముగ్గులు చెదరవు. చెరగవు.
ఇవి హృదయాకాశంలో అ-క్షరాలు. ఆరంభంలో ఆలుమగల కసి ముద్దులు. ఆనక అమ్మానాన్నల పసి ముద్దులు. ఆ తరువాత అవ్వాతాతల బోసి నవ్వుల ముగ్గులు. ఇవి రాసిన అనామకుడికీ, రాయించిన అనామికకూ శతమానంభవతి!
-ముళ్ళపూడి వెంకటరమణ

ఉచిత ప్రివ్యు కొరకు ఇక్కడ నొక్కండి.

దాంపత్య జీవితం లోని మాధుర్యాన్ని చదివి ఆనందించాలనుకుంటున్నారా ఐతే ఇక్కడ నొక్కండి.

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>