ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ది ఎండ్. దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి జాడ్యంపై రాసిన నవల ఇది.
ప్రభుత్వ విభాగమైన ‘జలమండలి’లో పని చేసే దేవముని అనే అవినీతి అధికారి కథ ఇది. చిన్నతనంలో అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుని, అటువంటి కష్టాలు తన సంతానానికి లేకుండా చేయాలనే లక్ష్యంతో పై సంపాదనకి అలవాటు పడి, ఉద్యోగం ఊడగొట్టుకోడమే కాకుండా చివరికి జైలు శిక్ష కూడ అనుభవిస్తాడు దేవముని. చివరికి పశ్చాత్తాపం కలిగి మంచి మార్గంలో జీవితం గడపడానికే నిశ్చయించుకుంటాడు.
లంచగొండితనం మనిషంత పాతది అని స్పష్టం చేస్తూ, లంచం అంటే ఏమిటో నిర్వచించారు రచయిత. లంచంలోని రకాలను వివరిస్తారు. లంచగొండితనాన్ని నిరోధించడానికి రూపొందించిన వివిధ చట్టాల గురించి అవగాహన కల్పిస్తారు. లంచగొండితనాన్ని కొలిచే బరోమీటరు గురించి, ఏయే దేశాలు ఆ స్కేలులో ముందు వెనుక వరుసలలో ఉన్నాయో చెబుతారు. లంచగొండితనానికి మూలం “నీడ్ అండ్ గ్రీడ్” అని అంటారు మల్లాది. లంచగొండితనం అనే దుష్ట సంస్కృతి మన దేశంలోని ప్రభుత్వ కార్యాలయాలలో జీవనదిలా అవిశ్రామంగా సాగిపోవడానికి గల కారణాలను వివరిస్తారు రచయిత ఈ నవలలో.
ప్రజలలో అధిక శాతం మంది పేదలవడం – లంచగొండితనం మరింత పెచ్చుమీరడానికి ఎలా దోహదం చేస్తుందో తేటతెల్లం చేసారు రచయిత. లంచగొండితనం ఉన్న దేశాలలో ఆర్ధికాభివృద్ధి రేటు ఎందుకు తక్కువగా ఉంటుందో, పెట్టుబడిదారులు ఎందుకు ముందుకురారో తెలిపారు. చాలా మంది తమ కులాన్ని అడ్డం పెట్టుకుని పోరాడడానికి కారణం కూడా లంచగొండితనమేనని అంటారు రచయిత. కార్పోరేట్ ఆసుపత్రులలో జరిగే దోపిడి గురించి ఈ నవలలో వివరించారు మల్లాది. అదీ కూడా ఓ రకంగా లంచగొండితనమే!
అవినీతి నిరోధక శాఖాధికారులు లంచగొండులను ప్రత్యక్షంగా పట్టుకునే రెడ్ హ్యాండెడ్ పద్దతి గురించి చక్కగా వివరించారు రచయిత. అవినీతి కేసుల్లో విచారణ ఎంత లోపభూయిష్టంగా ఉంటుందో ఈ వాక్యాలు చదివితే అర్థమవుతుంది.
“బోనులో ఎలకపడే చప్పుడు పెద్దగా వినిపిస్తుంది. కానీ, దాని దగ్గరికి వెళ్ళి చూస్తే బోను ఖాళీగా కనబడుతుంది”.
జైలుకి తరలించబడిన ఖైదీల గురించి, ఖైదీలలోని రకాల గురించి రచయిత ఇచ్చిన సమాచారం ఉపయుక్తంగా ఉంది. కొత్త విషయాలు తెలుసుకున్నమన్న భావన కలుగుతుంది.
అన్ని రకాలుగా నష్టపోయినా, కొత్త జీవితం గడిపేందుకు దేవముని కుటుంబం చేసిన ప్రయత్నాలు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి.
అసలు కథకి కొసరుగా మల్లాది చెప్పే కొన్ని అంశాలు చాల ఆకట్టుకుంటాయి. కేరళలోని గురువాయూర్లోని కృష్ణుడి గుడి గురించి, అక్కడికి దగ్గర్లోని పున్నత్తూరు కోట గురించి చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. అలాగే దేశంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు విడివిడిగా ఆలయాలున్నది కేరళలోనే అని తెలుసుకుని ఆశ్చర్యపోతాం. ప్రపంచ వ్యాప్తంగా లభ్యమయ్యే చాకెట్ల గురించిన వివరాలు, చాక్లెట్ల గురించి ఎంతో ఆసక్తికరమైన కొటేషన్లను అందించారు రచయిత ఈ పుస్తకంలో.
పాఠకులకి ఉల్లాసాన్ని కలిస్తుందీ నవల.
ది ఎండ్ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.
కొల్లూరి సోమ శంకర్