“సాకేత రామాయణం” పై కవిరాజశేఖర చిటిప్రోలు కృష్ణమూర్తి అభిప్రాయం

“శ్రీ గజానన్ తామన్ గారికి
కవివరా! నమస్కారం.
మీ సాకేతరామాయణం పఠించి పరికించి సంతోషించాను. కర్త గజానన్, అనువక్త గజానన్. సమీక్షకులు లక్ష్మణులు. ఎంత శుభయోగం!
పాత్రల పలుకులతో కథను పాఠకుల కళ్ళకు కట్టించిన ప్రణాళిక ప్రశంసనీయం అపూర్వం.
సంతాన భాగ్యం లేని కౌసల్య పరితప్తహృదయం అద్భుతంగా అనిష్కృతమయింది. “ఎంత సనాతన మీ ఆకాశం ఎన్నితారకల నీ ననునిత్యం” – ఈమాటలలో ఎంత అర్థం గర్భితమై ఉన్నదో!
లక్ష్మణుడు అన్యాయం పట్ల ప్రదర్శించిన అసహనంలో ఆగ్రహంలో ప్రత్యేకత ఉంది. ‘మత్తమతంగజమై విధి నన్ను చిమ్మనీ రాఘవ! సంకెల దగిలించి దాని బింక మణచనా’ ఈ క్రోధావేశం ఎవరిమీదనో కాక విధిమీద గావడం విశేషం.
సీత తాను భూజాతనని చెప్పిన తీరు మనోజ్ఞం- ‘నిను సహవాసిగ పొంద నెంచియే నేలపొరలలో వేచితి యుగములు’.
శూర్పణఖ రావణుణ్ణి రెచ్చగొట్టిన చిన్నమాటలోని నైశితీచిత్రం గమనార్హం.
‘జనుల దృష్టి ఆ తాపసి పూజ్యుడు
జనుల దృష్టిలో నీవొకపూజ్యము’

మొదటి పాదంలో జనుల దృష్టి ఆ తాపసి – ఇక్కడ దృష్టి నాతాపసి- అంటే సప్తమి స్పష్టంగా ఉండేదేమో!
‘నిలిచినది నా మ్రోల—నిబిడనీలినుగా అనంతము’- అనుకొన్న శబరి పలుకుతో రాముడి అనంతత్వం స్ఫురితమయింది.
హనుమంతుడికి సీత ‘గ్రహణసమయాన దిగులొందు దిక్సతి వలె’, ‘అస్తమయవేళ సందిగ్ధ క్షితిజమువలె’ -తోచిందా? ఎంత రుచికరమైన ఊహ!
వానరులు తమ అసాధారణ పరాక్రమ ప్రాగల్భాలను అలవోకగా అసామాన్య ప్రజ్ఞా విశేషంతో ప్రకటించారు.
“ ఆ దరి వెలసిన లంకానగరిని
ఈ దరి కీడ్చుట మన కగు సాధ్యము.”
ఇట్లా కావ్యమంతటా భావశబలత ఉంది. ఉక్తి వైచిత్రి ఉంది.
మీ అనువాదం సరళసుందరం. రసజ్ఞుల నలరిస్తున్నది.
ఆ మహారాష్ట్రకవి గజానన్ దిగంబర్ మాడ్గోల్కర్ ఎప్పటివారు? మీరు మహారాష్ట్ర భాషలోనూ పండితులేమో!
పారశీకం నేర్చుకొనడంవలన దువ్వూరి రామిరెడ్డి గారి పానశాల ఉమార్ ఖయ్యాం రుబాయత్‌ల అనువాదాలలో ప్రసిద్ధమయింది.
మీరు పద్యాలూ చక్కగా వ్రాయగలరనుకొంటాను. అందరూ చదివి ఆనందించ దగిన మంచి కావ్యం సాకేతరామాయణం.”

* * *

శ్రీ గజానన్ తమన్ రచించిన “సాకేత రామాయణం”డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

సాకేత రామాయణం On Kinige

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>