బలిపీఠం (eBook) – Ranganayakamma

సంస్కరణాయుతమైన ఇతివృత్తాన్ని ఎన్నుకొని ”బలిపీఠం” పేరిట వ్రాసిన ఈ నవల, 5-9-1962 నించీ 2-4-1963 వరకూ ‘ఆంధ్రప్రభ’ వార పత్రికలో సీరియల్‌గా వచ్చింది. ఇప్పటి వరకు 13 సార్లు పునర్ముద్రితమైంది.

ఈ నవలలో ముఖ్య విషయాలు – సంఘ సంస్కరణా, కులాంతర – మతాంతర వివాహాలూ.

వరద వెల్లువగా కొట్టుకుపోతున్న సంఘానికి ఎదురు నిలిచి, దాని లోని అవకతవకలను ఎత్తి చూపి, పవిత్రంగా – ధర్మబద్ధంగా – సంస్కార పూరితంగా బ్రతకాలనీ, సంఘాన్ని బ్రతికించాలనీ, తాపత్రయపడే వారు కష్ట నష్టాలపాలు గాక మానరు. కారణం, వారిలో పెరిగిన ఔన్నత్యం, చుట్టూ సంఘంలో ఇంకా పెరిగి వుండదు. వారిలో ఉద్భవించిన ధర్మాధర్మ పరిజ్ఞానం, సంఘంలో ఇంకా ఉద్భవించి వుండదు. వారిలో రేకెత్తిన సంస్కార భావం, సంఘంలో రేకెత్తి వుండదు. వారు సంఘం కన్నా చాలా ఎత్తుకు పెరిగి వుంటారు. మొట్టమొదట వారిని అందుకోలేని సంఘం, అపార్థాలతో, అప హాస్యాలతో వారిని కించపరచ ప్రయత్నిస్తుంది. అంత మాత్రాన నిజమైన సంస్కారు లెన్నడూ వెనుకంజ వెయ్యరు. బలీయమైన వారి వ్యక్తిత్వం, కొండ వంటి సంఘాన్ని ఎదిరిస్తుంది. జయిస్తుంది. నిలుస్తుంది.

‘బలిపీఠం’లో వున్న అరుణా, భాస్కర్‌ల వంటి వ్యక్తులు, జీవితంలో కొంత మందైనా తటస్థపడుతూ వుంటారు. పాత కొత్తల మేలు కలయికను లోతుగా అవగాహన చేసుకోలేక, సంకుచితమైన భావాలకు అంకితమైపోయిన అరుణ, ఎంతైనా అభాగ్యురాలు! స్వార్థ చింతన లేక, త్యాగ బుద్ధితో జీవితాన్నే పందెం పెట్టిన భాస్కర్‌కు, చివరికి తాను ఓడిపోలేదన్న సత్యం చాలు, ఆత్మ శాంతికి.

కులాల కలయికలను నిరసించటం గానీ, ముందడుగులు వేసే వారిని నిరుత్సాహ పరచటం గానీ, ఈ నవల ఉద్దేశ్యం కాదు. అన్ని విధాలా తమను తాము అదుపులో పెట్టుకోగలిగిన శక్తివంతులే, సామాన్యులను మించిన సంస్కారులు అవుతారు. తీవ్రమైన సాంఫిుక విప్లవానికి, సంస్కార హృదయాలే అత్యవసరమైనవి.

బలిపీఠం నవలకి 1965లో, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. అప్పుడు రచయిత్ర్రికి బహుమతుల సంస్కృతి గురించి ఏమీ తెలియక దాని మీద వ్యతిరేకత లేక, ఆ బహుమతిని తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో, ఎటువంటి అవార్డునైనా స్వీకరించడం మానుకున్నారు.

—-

కొడవటిగంటి కుటుంబరావు బలిపీఠం నవలని వీరేశలింగంగారి రాజశేఖర చరిత్రము, ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారి మాలపల్లి నవలలతో పోల్చి, తెలుగు నవలా సాహిత్యంలో ఇదొక మైలురాయని అన్నారు.

—–

ఈ నవల ఆధారంగా బలిపీఠం (1975) సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించబడినది.

——

Related Posts:

One thought on “బలిపీఠం (eBook) – Ranganayakamma

  1. ఇటీవలి కాలంలొ నేను చదివిన అద్భుతమైన నవలలొ ఇది ఒకటి ! ఈ నవల సారాంశం గురించి నేను చేప్పేది ఏమీలేదు కినిగే వారు అద్భుతంగా చెప్పారు , ఈ నవల చదువుతుంటే ఒక పట్టాన ఆపబుద్ది కాదు , సమాజంలొ బతకడానికి కులానికన్నా విలువలు కావాలని కొన్ని పాత్రల ద్వారా చాలా బాగా చెప్పారు . ముఖ్యంగా నేటి సమాజంలొ అందరూ చదవవలసిన పుస్తకం.

    నాకు దీని మీద నా బ్లాగులొ సమీక్ష రాద్దాం అనుకున్నాను కాని అంతకన్నా గొప్పగా వికి లొ ఈ నవలగురించి చాలా చక్కగా రాశారు ఇక నేను రాయడం విరమించుకున్నాను.
    ఆ లంకె కింద ఇస్తున్నాను చూడండి.

    http://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B1%80%E0%B0%A0%E0%B0%82_%28%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B2%29

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>