సాంఘిక మానవీయ సంబంధాలు మెరుగు పడాలంటే విద్యాలయాలలో సాంఘిక మానవీయ శాస్త్రాల అధ్యయనాల ప్రాధాన్యత పెరగాలి.
* * *
మనుషుల్లో సాంఘిక మానవీయ దృక్పధాలు కొరవడుతూ, అతి స్వార్థ దృక్పధాలు పెంపొందుతుండటం అందరమూ చూస్తోన్న, అందరికి అనుభవంలోకి వస్తోన్న విషయమే. అటు కుటుంబంలో, ఇటు సంఘంలో విచ్చలవిడి ధోరణులు పెంపొందడం కూడా అందరమూ గమనిస్తోన్న విషయమే.
ఒకప్పటి కుటుంబ వ్యవస్థలు స్వేచ్ఛ తక్కువుండడం వలన పిల్లలు అభివృద్ధి కాకుండా పోతున్నారని, ఆత్మ విశ్వాసాలు కోల్పోతున్నారని అందరము అంగీకరించేవారమే. ఇప్పుడు అతి స్వేచ్ఛల వలన పిల్లలు ప్రక్కతోవలు పడుతున్నారని, చెడిపోతున్నారని కూడా అంగీకరిస్తున్నాం.
ఈనాటి కుటుంబ స్వేచ్ఛ, సాంఘిక స్వేచ్ఛ, స్వేచ్ఛ పేరిట యధేచ్ఛలాంటిదవుతోందని, ఎలాంటి బాధ్యత లేనిదవుతోందని అందరము అనుకుంటూనే ఉన్నాము. లేకపోతే ఇంత అవినీతి పెరగదు, ఇన్ని దుర్మార్గాలు, దుష్ట చర్యలు పెరగవు, సమాజం, కుటుంబం ఇంత ఎవరికి వారే యమునాతీరే లాంటిది కాదు.
కుటుంబం కుటుంబం కాక పోవడానికి కుటుంబ పెద్దలు కుటుంబ పెద్దల్లా వ్యవహరించకపోవడం, సంఘం సంఘం కాకపోవడానికి సంఘ పెద్దలు, దేశం దేశం కాకపోవడానికి దేశ పెద్దలు పెద్దల్లా వ్యవహరించకపోవడమేనని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదేమో!
ఈనాటి యువతకు ఆదర్శాలు కల కుటుంబాలు, ఆదర్శాలు కల సంఘాలు కరువైపోతున్నాయి. వారికి రోల్ మోడల్స్ లాంటి వారు లేకుండా పోతున్నారు, వారి లాగా నడుచుకోవడానికి. వీటికన్నింటికీ కారణం విద్యాలయాలలో, మరీ విశ్వవిద్యాలయాలలో సాంఘిక సామాజిక మానవీయ శాస్త్రాల అధ్యయనాల ప్రాధాన్యత తగ్గిపోవడమేనని అనక తప్పదు. వాటి ప్రాధాన్యత పెరగనిదే కుటుంబంలో, సంఘంలో, దేశంలో ఆదర్శనీయులైన పెద్దలను మనము సృష్టించుకోజాలమని కూడా అనక తప్పదు.
సాంఘిక సామాజిక మానవీయ శాస్త్రాల అధ్యయనాల గిరాకీ పెరగాలంటే దానికొరకు ఆ శాస్త్రాలకు చెందినవారు వాటి ప్రాముఖ్యత గురించి తగినంత మేరకు పనికట్టుకుని ఉధృతంగా ప్రచారాలు చేపట్టవలసి ఉంటుంది. అలాంటి ప్రచారాన్ని ఒకఉద్యమంలా కూడా చేపట్టవలసి ఉంటుంది.
ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలు ఈ పనికి పూనుకోవాలి, పూనుకునేవారికి తగినంత చేయూత నివ్వాలి, చేదోడువాదోడుగా నిలవాలి. ఈ శాస్త్రాలు నిలవాలంటే, నిలదొక్కుకోవాలంటే మరి వేరే మార్గం లేదు. ఇలాంటి ప్రచారాలు లేనందువలననే వీటిని చదివేవారు దినదినం తగ్గుతున్నారు.
వీటికి చెందిన అధ్యయనాలు ఇలాగే సాగుతే ఇవన్నీ రానురాను మూతపడే రోజులు సమీపిస్తాయి. ఇంతవరకే ఎన్నో విద్యాలయాలలో, విశ్వవిద్యాలయాలలో వీటిని కోరేవారు చాలా తగ్గిపోయారు. అసలు విద్యార్ధులకు వీటిగురించి సదవగాహన కల్పించడంతో పాటు, ఇవి చదవడం వలన అనేకానేక ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని నచ్చజెప్పడం, వాటి గురించిన సమాచారం అందించడం ఒక ఉద్యమం లాంటి పని. ఈ పని చేపట్టాలని ప్రత్యేకంగా సాంఘిక సామాజిక మానవీయ శాస్త్రాలకు చెందిన వారిని, విశ్వవిద్యాలయాలను కోరుతూ ఈ కోరికను కొత్త మా కొత్త సంవత్సర కోరికగా జయంతి వైపునుండి అందజేస్తున్నాం.
* * *
సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న “జయంతి” విద్య – సాహిత్య – సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది.
జయంతి పత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.