బండచాకిరీ, బట్టీ చదువుల బందీగా బాల్యం!

పొద్దు పొడిచిన దగ్గరనుండి
పొద్దుగూకిన ఆనక కూడా
చాకిరీ పళ్ళచక్రాలకింద
నుజ్జునుజ్జయ్యే పనివాళ్ళకూ కలలుంటాయి!

* * *

కళ్ళు తెరిచిన నుండి
రెప్పవాల్చే వరకూ
పుస్తకాల బట్టీలో
ఈసడింపు ఈటెల్లో
కుమిలిపోయే చిన్నారులకూ కలలుంటాయి!

* * *

“శాంతములేక ఏకాంతముగా
దిగ్భ్రాంతిలో మునిగి గుటకలువేస్తూ
మెటికవిరుస్తూ ఇటకూర్చుండిన
ననుచూస్తుంటే నవ్వొస్తోందా?!”

– అని శ్రీశ్రీ అంతటి ప్రజాకవితాతేజం కలం కూడా ఈ దేశం పిల్లల్ని చూసి సిగ్గుతో చివికిపోయింది!

నేటి భారతదేశంలో బాలకార్మికులు 115 మిలియన్లున్నారు. పేద కుటుంబాల ఆదాయంలో దాదాపు 37 శాతం బాలకార్మికుల చాకిరీనుంచే వస్తోందని ఒక అంచనా.
రాజస్థాన్ రంగురాళ్ళలో, ఆఫ్ఘనిస్తాన్ బొమికల వ్యాపారపు సమాధుల్లో, పాకిస్థాన్ తివాచీ పరిశ్రమలో, మార్కాపురం పలకల్లో, శివకాశీ బాణసంచా కర్మాగారాల్లో, ఇప్పుడిప్పుడే ఫ్రాంక్ పాల్సన్ డాక్యుమెంటరీతో (ఈ సంచికలోనే ‘బ్లడ్ ఇన్ ద మొబైల్’ డాక్యుమెంటరీ పరిచయ వ్యాసం చూడండి) బయట సభ ఆర్డీ కాంగో గనుల్లోని నికృష్ట జీవన, బాలకార్మిక బానిసత్వంలో ఈ వ్యవస్థ ఎంత కుళ్ళి, పురుగులు పట్టిపోయిందో ఋజువు పరుస్తున్నాయి!

పదవతరగతి తెలుగుపరీక్షలో “బాలకార్మిక వ్యవస్థ- నిర్మూలన” గురించి ఎన్ని వందలసార్లు వ్యాసరూప ప్రశ్న ఎదురైనా- ఆ బాలకార్మికుల బండచాకిరీ కష్టాలనుండి వారు గానీ ఈ సృజన రాహిత్యపు గొట్టు మార్కుల చదువులనుండి వీరుగానీ పసిలోకం ఇప్పటికీ విముక్తి కానేలేదు!

తల్లీతండ్రీ ఆదరణ కరువై, పేదరికం బరువై, చాకిరీ తప్పనిసరై, బడికి వెలియై, పసితనం గాయమై బాలకార్మికులైన స్థితి ఒకటి ఉందని అందరూ అంగీకరిస్తూనే వున్నారు!

ఈ విషాదానికి తోడు-

“సీతాకోకచిలుకవై వికసించాల్సిన బాల్యం
పుస్తకాల వత్తిళ్ళలో చితికిపోయింది
సృజన గువ్వలు కావాల్సి బాల్యం
పరీక్ష ప్రశ్నలుగా మిగిలిపోయింది
గమ్యంకోసం వెతకాల్సిన బాల్యం
బడి పశువులై గిరికీలు కొట్టాల్సి వచ్చింది”
అంటూ పదవ తరగతి విద్యార్థులు పి.భీమశంకర్, అనిల్ కుమార్ పండా ఉద్వేగపూరితంగా ఒక కవిత (‘ప్రజాసాహితి’ మార్చి 2012- బాలసాహితి) లో వ్యక్తమయ్యారంటే- తల్లితండ్రులూ, పోషణా, చదువుసంజలూ, తిండీబట్టా ఇన్నున్నా జీవితాన్ని వెలిగించలేని, సంతోష చంద్రశాల కాకుండచేసే విషకోరలేవో మెత్తగా దిగబడుతున్నాయన్నమాట!

“నకనక ఆకలి
నమలిన పేగుల
పెయ్యికాలి నువు పడుకున్నా
అయ్యో! పాపం అనుకోడు
పోనీ పసివాడనుకోడూ
కనికరించడూ యజమానీ”
(భూపాల్- కవితనుండి- ‘ప్రజాసాహితి’ ఏప్రిల్ 2008)
ఇలాంటి బాలకార్మికవ్యవస్థగానీ,
“పక్షుల రెక్కలనిండా
స్కూలు పుస్తకాలు
ఇక ఎగరవు – ఇక పాడవు”
(బి.వి.వి. ప్రసాద్ హైకూ) అనే చదువుల రాపిడిలోని కొత్త రకం బాలకార్మిక వ్యవస్థగానీ విషాదరాగాలే వినిపిస్తున్నాయి.

ఈ సిగ్గూ ఎగ్గూలేని పదవీవ్యాపారుల అవినీతిపాలన కారణంగా అన్నింటితోపాటు ‘రేపటి పౌరులు’ ఎలా మసిబారి, కునారిల్లుతున్నారో- తలచుకుంటే ‘నవభారత నందనం’ చీడపట్టి పోతోందని అర్థమై హృదయం బరువెక్కి పోతుంది.

ఒక బాల్యానిది గుండెల్ని కాల్చే ఆకలిమంట! ఇంకో బాల్యానిది సృజనాత్మకంగా ఎదగనివ్వని వ్యవస్థీకృత అణచివేత!

బతుకుల్లో చిచ్చుపెట్టి చలికాచుకునే దళారీ ఆర్థిక, రాజకీయ విధానాలు మధ్యాహ్న భోజనాన్ని అధ్వాన్న భోజనాలు చేసాయొక పక్క. అనాథ బాల్యం అభద్ర జీవితాన్ని అలగాసైన్యంగా రూపాంతరీకరిస్తోంది మరోపక్క.

ఎన్నికల ఎత్తుగడగానో, అంతర్జాతీయ మార్కెట్ వ్యూహంలో భాగంగానో బ్రిడ్జ్ స్కూళ్ళలాంటి బాలకార్మిక పాఠశాలలు పెట్టినా, చిత్తుశుద్ధిలేని ఈ ఏర్పాట్లు కంటితుడుపు చర్యలుగానూ, మొక్కుబడులుగానూ, కొందరి ‘బొర్రలు’ నింపేవిగానూ మిగులుతున్నాయి.

“గ్రాసమింత లేక కడు కష్ట పడుచున్న
విద్యయేల నిలుచు వెడలుగాక
పచ్చి కుండనీరు పట్టిన నిల్చునా”
అన్న 17 వ శతాబ్దినాటి వేమనంత ఇంగితాన్ని పరిశీలించే సాంస్కృతిక స్థాయి మన పాలకుల్లో లేదు కనుకనే- “పిల్లల చదువు – తల్లితండ్రుల బాధ్యత” అని చేతులు దులుపుకొని తేలికగా ఊపిరి పీల్చుకుంటున్నారు.

పులులు జీవకారుణ్య సభ పెట్టినట్లు – బాలలహక్కుల అంతర్జాతీయ విలువల్ని వ్రీరు ప్రపంచ వేదికల మీద ప్రదర్శనలకు పెడుతున్నారు!

“పాలుతాగే ప్రాయంలో – పాలపేకట్ల వేటలో”… పడి వేసట చెందే బాల్యంగానీ.
“అమ్మా!మేం బతికే వున్నాం! యుద్ధరంగంలో శత్రువు పర్యవేక్షణలో
తమ్ముడూ” నాకు భయంవేస్తోందిరా! ఇక్కడ అంతా నిశ్శబ్దం! స్మశాన నిశ్శబ్దం! శవాలు పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నట్లు శవాలు మాట్లాడుతున్నట్లు”(హాస్టల్ నుంచి వుత్తరం’ కవిత-కెరటం’ రచన-‘ప్రజాసాహితి’ జూన్ 2001)

అనే అక్షరాలా ఆక్రోశపు బాల్యంగానీ, బిక్కు బిక్కుమంటున్న చీకటి పొలిమేరల్లో “రెప్ప కాటేసిన పాపల” కథలు గానీ-ఏవీ ఈ పాలనావ్యవస్థ గుండెల్ని కదిలించలేవు!

“అయ్యవారికి చాలట అమ్మాయిల మానాలు
ఆడపిల్లల కిపుడు కొత్త పాఠాలు
భారతదేశం మన పితృభూమి
భారతీయులందరూ మన బావమరుదులు గారు
బ్రహ్మకైనా తప్పదు రిమ్మ తెగులు” (పాటిబండ్ల ..)

శ్రీకాకుళం జిల్లా కిల్లోయిలోగానీ, విజయనగరంజిల్లా బొబ్బిలిలోగానీ, ఇటీవల విశాఖజిల్లా చోడవరం మండలం, కోనాంలో గానీ, ఇక్కడ-అక్కడ అని కాదు-ఎక్కడ బాలికల హాస్టళ్ళున్నాసరే అవన్నీ లైంగిక దోపిడీకేంద్రాలే!

సాంస్కృతిక పతన విలువలకు మురుగ్గుంటగా స్థావరమైన ఈ విద్యారంగం సామాజిక జవాబుదారీతనాన్ని భ్రష్టు పట్టిస్తోంది!

“పరలోకంలోని నరకానికి మనవాళ్ళు ఈ లోకంలోనే బ్రాంచీలు తెరిచారు. అవే-పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు” అని చెలంగారు ఏనాడో అన్నారంటే ఉలిక్కి పడనవసరం లేదు. నగ్నంగా ఋజువులు కనిపిస్తూనే వున్నాయి. అందుకే దేశంలో వివిధ రూపాలలో “బాలకార్మిక వ్యవస్థలు” అతి జుగుప్సాకరంగా కొనసాగిపోతున్నాయి.
ఎనిమిదిన్నర కోట్ల తెలుగువాళ్ళలో ఆరేళ్ళలోపు పిల్లలు 86,42,686 మంది వున్నారంటే ఈ శైశవ ప్రపంచాన్ని ఇంకా ఇదే ఆర్థిక, సాంఘిక నిచ్చెనమెట్ల గమ్యాలకే చేర్చాలనుకుంటున్నారని ప్రజాస్వామిక స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకిక్కడ ఇంకా హామీ లేదని మన పాలనా వ్యవస్థ విధానాలు స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద లోని బడిపిల్లల్లో 70 శాతం మందికి పోషకాహార లోపం వుంది. డయేరియా వల్ల మరణించేవారిలో 61 శాతం బాలలు, పోషకాహార లోపం కలవారే.
సంపన్నవర్గాల పిల్లలు కూడా సమతుల్యంలేని ఆహార వినియోగం వలన గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, టైప్-2 డయాబెటీస్ బారిన పడుతున్నారు. పేదలు సన్నిపాతం, క్షయ మొ. వ్యాధుల బారిన పడుతున్నారు.

ఇన్ని వాస్తవాల్ని పక్కన బెట్టి కార్పోరేట్ షైలాకులకు విద్యారంగాన్ని ఎరగా పెట్టాలన్ని చూస్తున్నారు. పేదల్ని దిక్కు మొక్కు లేనివారుగా, సంపన్నుల బిడ్డల్ని అరాచక జీవులుగా మిగులుస్తున్నారు. అటు సర్కారీ విధానాలూ, ఇటు రవిశంకర్ లాంటి – జీవితాన్ని ‘కళ’ పెళ మరిగించే కుహనా సామాజిక వేత్తలూ, ప్రపంచీకరణ శక్తులకు ఊడిగం చేయడానికి పోటీ పడుతున్న జగన్ లాంటి దుందుడుకు స్వార్థశక్తులూ మాతృభాషల సమాధి కడుతున్నారు. ఆంగ్లీకరణ పేరుతో వ్యాపారుల ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నారు.
చీకటిని కాలుస్తూ నిరంతరం చలిస్తున్న ఈ భూగోళం మీద నిలబడిన వాళ్ళంగా “నాకు కనంబడు నానా తారికలనేక వర్గాలనంత రోచులు-దిక్కు దిక్కులా దివ్యగీతములు” (శ్రీశ్రీ) అంటూ పిల్లల్ని క్రాంతి శీకులుగా మలిచే ప్రత్యామ్నాయ విద్యా, సాంస్కృతిక కార్యాచరణని రూపొందించుకోవాలి.

20వ శతాబ్దపు ప్రజా ఉద్యమస్ఫూర్తికీ, 21వ శతాబ్దపు విద్యార్థి యువతరానికీ నడుమ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ సుమారు 26 సం.లు ఉక్కు గోడను కట్టగలిగింది. ఇప్పుడు “గోడల్ని బద్దలు కొట్టడమే మన పని”(శ్రీశ్రీ)

శాస్త్రీయ, ప్రజాతంత్ర విలువల పునాది మీద నిలబడి ఈ దివాలాకోరు బానిస విద్యావిధానాలతో నిజమైన పిల్లల ప్రేమికులైన తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ, సాహిత్య, సాంస్కృతిక రంగాలూ, సామాజిక ప్రజాతంత్ర, విద్యార్థి యువజన కార్యకర్తలూ మహిళలూ, ఒక రాజీలేని సంఘర్షణ పడాల్సిందే. శ్రమ జీవన క్రియాశీల సృజనాత్మక విద్య కోసం స్వార్థ మూర్ఖశక్తులతో తలపడాల్సిందే! సర్దార్ అలీ జాఫ్రీ అన్నట్లు “నిరంతర కార్యచరణమే జీవిత లక్ష్యం” కావాలి.

(ఏప్రిల్ 30- శ్రీ శ్రీ జయంతి; బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం:)

-సంపాదకులు
ప్రజాసాహితి, ఏప్రిల్ 2012

* * *

ప్రజాసాహితి ఏప్రిల్ 2012 సంచిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ అనుసరించండి.

ప్రజాసాహితి ఏప్రిల్ 2012 On Kinige

Related Posts:

  • No Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>