రెండు దశాబ్దాలుగా తెలుగువారి జీవితంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు మూలం ప్రపంచీకరణ. మన తెలుగువాడు పి.వి. నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాక ప్రవేశపెట్టిన ఉదారవాద ఆర్థిక విధానాలు ఫలితంగా ప్రైవేటీకరణ విశ్వరూపం దాల్చింది. మార్కెట్ శక్తులు విస్తరించాయి. ఈ కారణంగా గాలి, నీరు కూడా అమ్మకపు సరుకులయ్యాయి. నీటితో కోట్లాది రూపాయలలో వ్యాపారం సాగుతుంది. కానీ ఆ నీటి చెంత పని చేసే వాడికి మాత్రం మంచినీళ్ళు కూడా లభించవు. ఈ కఠోర వాస్తవాన్ని హృదయం చెమర్చే రీతిన కథగా రాశారు జి. ఉమామహేశ్వర్. ఆ కథ పేరు ‘వాటర్’. నీళ్ల కోసం యుద్ధాలు జరిగే ఈ పరిణామానికి మూలం ప్రపంచీకరణ అనుకూల విధనాల్లో వుంది. దీనిని నర్మగర్భంగా చెబుతూ పాఠకులని ఆలోచింపజేస్తారు రచయిత.
ఉమామహేశ్వర్ పదేళ్ళ పైబడి కథలు రాస్తున్నారు. మొదటిసారిగా ‘పరాయోళ్ళు‘ శీర్షికన ఆయన కథల సంపుటి వెలువడింది. ఇందులో పద్నాలుగు కథలున్నాయి. రెండు కథలు మినహా మిగతావన్నీ ఉదారవాద, ఆర్థికవాద విధానాల దుష్ప్రభావం ప్రజల జీవితాన్ని ఏ విధంగా చిన్నాభిన్నం చేసిందో చెబుతాయి. ‘అభివృద్ధి’ గురించి పాలకులు చెప్పే కబుర్లని తిరస్కరించే చెంచుల చైతన్యస్థాయిలోని పరిణితిని ‘చెంచుమిట్ట’ కథ చెబుతుంది. రకరకాల స్కీములతో మనుషులని లోబరుచుకోవాలని చూసే మార్కెట్ మాయాజాలాన్ని తూర్పూరాబట్టే కథ ‘గొర్రె చచ్చింది’. అవసరం లేనివాటిని అవసరాలుగా భ్రమింపజేసి సొమ్ము చేసుకునే మార్కెట్ కుతంత్రాలని ప్రశ్నించే కథ ‘ది ధూల్‌పేట్ ఇండస్ట్రీస్ (పై) లిమిటెడ్’. జనాల బలహీనతల మీద ఆడుకునే మార్కెట్ వ్యూహాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో ఈ కథలో చూస్తాం.
‘పరాయోళ్ళు’ కథ ఇవాళ తెలుగునాట నెలకొన్న రాజకీయాలకు సరిగ్గా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎక్కడివాళ్ళు ఎక్కడికైనా వెళ్ళచ్చు, తప్పు లేదు. కానీ తమ ఊరునీ, తమ బతుకునీ దెబ్బతీస్తామంటే మాత్రం పరాయోళ్ళ దౌష్ట్యాన్ని ప్రశ్నిస్తారు. ప్రపంచీకరణ సందర్భంగా ఎక్కడ్నించి ఎక్కడికయినా వెళ్ళి బతకడం సాధారణాంశం. ఈ విధంగా ఇందులోని పద్నాలుగు కథలు విభిన్న సమాజికాంశల్ని చర్చకు పెడతాయి. ప్రభుత్వ ఆర్థిక విధానాల ఫలితంగా చెదిరిపోతున్న బతుకు జాడల్ని పట్టి చూపుతాయి. సామాజిక సంక్షోభాలకు సంబంధించిన అనేక ప్రశ్నల్ని సంధిస్తాయి.
– వై. వసంత
(22 ఏప్రిల్ 2012 నాటి వార్త ఆదివారం అనుబంధం లోని పుస్తక సమీక్ష నుంచి)
* * *
పరాయోళ్ళు కథాసంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.
పరాయోళ్ళు On Kinige