నడుస్తున్న చరిత్ర మే 2012 సంపాదకీయం

తెలుగు’పెరియార్‌’ అయ్యుండాల్సిన సత్యమూర్తి

* * *

ఆర్ధిక విముక్తితో హెచ్చుతగ్గులులేని సోషలిస్టు సమాజం ఏర్పడుతుందనీ అందుకు మార్క్సిజమే సరియైున దారి అనీ నమ్మినవారు మనదేశంలో కమ్యూనిస్టు రాజకీయ పంథాలో నడిచారు. ఎత్తుగల్లో, ఉద్యమరీతుల్లో వచ్చిన అభిప్రాయభేదాలవల్ల వారు వేర్వేరు బాటల్లో నడిచినా అందరి లక్ష్యమూ సోషలిస్టు సమాజ స్థాపనే. అయితే, భారతదేశంలో వ్రేళ్లూనికొని ఉన్న కులవ్యవస్థ కమ్యూనిస్టు పార్టీలనూ, ఉద్యమాలనూ ప్రభావితం చేసింది.

బడుగుల సమస్యలన్నిటికీ అంతిమ పరిష్కారం కూడ మార్క్సిస్టు లక్ష్యసాధనలోనే ఉందని, సోషలిస్టు సమాజ స్థాపనతో తమ ఆర్ధిక సమస్యలతోపాటు సామాజిక వెనుకబాటుతనం కూడ మటుమాయం అవుతుందని, కమ్యూనిస్టు నాయకులైన సత్యమూర్తి లాంటి వారు భావించారు. అయితే కొన్ని సందర్భాలలో కలిగిన చేదు అనుభవాలతో లోలోపల సంఘర్షణకు గురై, కళ్లముందు కన్పించే వాస్తవాలకు తలొగ్గి విప్లవాగ్ని జ్వాలల్లోంచి ఎగసిన ఒక జ్వాలగా, ఒక సామూహిక అస్తిత్వానికి ప్రతినిధిగా ఆయన తలెత్తాడు. స్వాభిమానం నుండి ఎగసిన కవితా ఖడ్గంగా శివసాగరుడిగా గొంతు విప్పాడు.

తెలుగు నుడిపై ఆయనకున్నంత పట్టు చాలా తక్కువ మందిలో చూస్తాం. ఆరేళ్ల క్రిందట మూడుసార్లుగా ఆయనతో వివరంగా మాట్లాడిన సందర్భాల్లో తన అనుభవాలను, అభిప్రాయాలను ఆయన నాతో చెప్పారు. దళిత సమాజపు వర్తమాన సంఘర్షణను ఆయన విశ్లేషించిన తీరు, దానికి పరిష్కారాలుగా ఆయన సూచించిన మార్గాలు అచ్చెరువు గొల్పుతాయి.

మార్క్సిస్టు సిద్ధాంతం పట్ల ఆయనకున్న నమ్మకం అప్పటికి ఏమీ సడల్లేదు. కాని, దళిత జనులకేగాక, మొత్తం బడుగు వర్గాలందరికీ సామాజిక గౌరవమూ, సాంస్కృతిక మర్యాదా లభించే పరిస్థితులుంటేనే రాజకీయంగా అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతామని ఆయన గట్టి నిర్ణయానికే వచ్చాడు. అప్పటికప్పుడు గానీ, సమీప కాలంలోగాని మార్క్సిస్టు విప్లవ మార్గంలో బడుగులు పయనించం సాధ్యం కాదనీ, కులాధిపత్య వర్గాల పికిలి నుండి ఉద్యమ సంస్థలను విడిపించం అయ్యేపని కాదనీ ఆయన అభిప్రాయ పడ్డారు.

అంబేద్కర్‌ మార్గం సరైనదేగాని, ఆ బాటలో నడిపించగల నేతలు లేకపోవడమే బాధ కలిగిస్తున్నదని సత్యమూర్తి అన్నారు. ఇప్పుడు శారీరకంగా శక్తి నశించినందున తాను కొత్తగా ఉద్యమ నిర్మాణం చెయ్యగలననుకోవడం లేదని, కొత్తతరం ముందుకు వస్తుందని మాత్రం నమ్మకముందని ఆయన అన్నారు.

భాష విషయంలో తన అభిప్రాయాల్ని చెప్తూ బడుగువర్గాలు తమ భాషనూ, సంస్కృతినీ దూరం చేసుకోకుండనే ఆంగ్లాన్ని కూడ బాగా నేర్చుకోవాలన్నారు. ఆంగ్లాన్ని నేర్చుకోబట్టే ఉన్నతవర్గాల నుంచి నాయకులు తయారయ్యారనీ, అంబేద్కర్‌ ఆంగ్లం నేర్చుకొని, ఉన్నత చదువులు చదివివుండకపోతే, జాతీయస్థాయి నాయకుడుగా ఎదగగలిగేవాడు కాదనీ అన్నారు. అయితే, వేల ఏండ్లుగా తమ వారసత్వమైన భాషాసంస్కృతుల పునాదుల మీద నిలబడే, వాటి అండతోనే ఈ దేశపు బడుగువర్గాలు తేలిగ్గా ఆధునిక విద్యా సంపదను అందుకోగలుగుతాయన్నారు. బడుగుల భాషలో ప్రాచీన విజ్ఞానాన్నీ, ఆధునిక విజ్ఞానాన్నీ అందకుండ చేయడం కోసమే అసలైన తెలుగు నుడిని త్రొక్కివేశారన్నారు. ఒకనాడు సంస్కృతం, ఇప్పుడు ఆంగ్లం ఆధిపత్యంతో తమదైన విజ్ఞానాన్ని కోల్పోవడంతోపాటు, ఆధునిక విజ్ఞాన ప్రగతినీ అందుకోలేకపోతున్నారని అన్నారు. అందువల్ల – ప్రజల తెలుగులోనే అత్యంత ఆధునిక విజ్ఞానమంతా వారికి అందుబాటులోకి రావాలన్నారు. చైనాలో జరుగుతున్నదిదే అనీ, చైనాలో ఉత్పత్తులు అన్నిరంగాల్లో పెరగనికి ప్రజల భాషలో అత్యాధునిక విజ్ఞానాన్నంతా వారికందించమే కారణం అని సత్యమూర్తిగారన్నారు. (ఇదే మాటను ఈ ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాషోద్యమ సమాఖ్య నిరసన దీక్షాశిబిరంలో మాట్లాుతూ మార్క్సిస్టు పార్టీనేత బి.వి. రాఘవులు కూడ అన్నారు).

తెలుగు భాషోద్యమం పట్ల సత్యమూర్తి గారి విశ్లేషణ, ఉద్యమం ఎలా ముందుకు సాగాలో ఆయన చెప్పిన తీరు మరపురానిది. ఇలాంటి అవగాహన ఇప్పుడు దళితనాయకులుగా పోరాటాలు చేస్తున్నవారిలో ఎంతవరకు ఉన్నదో ఎవరికివారు ఆలోచించుకోవలసిందే.

తెలుగు భాషోద్యమం బడుగులకు వ్యతిరేకమైనదనే ఆరోపణను ఆయన త్రోసిపుచ్చారు. తెలుగు బడుగుల భాష. వారి భాష వారికెలా వ్యతిరేకమవుతుంది? వారి సొత్తు అది.. అని అన్నారాయన. ‘సంస్కృతాన్ని విపరీతంగా తెచ్చి తెలుగును తొక్కివేశారు. అసలు చదువునే మాకు అందకుండ చేశారు. మా భాషలో ఏదీ నేర్చుకోలేని స్థితిని తెచ్చిపెట్టి, ఇప్పుడు ఇంగ్లీషును కూడ అందకుండ చేస్తున్నారు అన్నదే మావాళ్ల బాధ’ -అని సత్యమూర్తిగారు స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ బడులలో తప్ప ప్రయివేటు బడులలో చేరగల స్తోమత బడుగులకెక్కడిది? అందువల్లే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం కావాలని వారంటున్నారు. దీన్ని ఎలా తప్పుపట్టగలం? అని ఆయన ప్రశ్నించారు.’మా భాషలో మాకు ఆధునిక విజ్ఞానాన్నంతా అందివ్వండి, ఉద్యోగాలివ్వండి, బ్రతుకుదెరువుకు మార్గాలు చూపండి. ఇదే సరైనదారి. అలా ఇవ్వలేనప్పుడు ఉన్నతవర్గాలతోపాటు మేమూ ఇంగ్లీషు బడులలో చదువుకునే మార్గాలు కల్పించండి. వారు చదివే చదువే మాకూ కావాలి. అందుకు మా వాళ్లకు రిజర్వేషన్లు కావాలి.’ ఇదీ సత్యమూర్తి గారి వాదం.

”ఇంగ్లీషు మీడియంలో చదువులు మాకూ కావాలని కోరుతున్నామంటే అర్థం మా తల్లిభాష తెలుగును వద్దంటున్నామని కాదు. మమ్మల్ని అణగదొక్కేందుకు ఆయుధంగా మరో భాషను ఉపయోగించుకోవద్దని అంటున్నాము. మాదగ్గర ఉన్న బలమైన ఆయుధం మా తల్లిభాష తెలుగు. దాని శక్తి మాకు తెలుసు. మా భాషలోనే మాకు సైన్సూ, లెక్కలూ, అన్నీ కావాలి. అది సాధ్యంకాక పోవడనికి కారణం ప్రభుత్వం అగ్రకులాధిపత్యంలో ఉండమే. అందువల్ల మా భాషను అణగద్రొక్కుతున్నారు. ఐనా, అది మా సాంస్కృతిక చైతన్యవాహినిగా మాలో ఎప్పుడూ బలంగానే ఉంటుంది. మా ప్రభుత్వం వచ్చినపుడు అది అన్నిరంగాల్లోనూ విజృంభిస్తుంది. అప్పటిదాకా మా బిడ్డలను అణగారిపొమ్మని చెప్పలేంగదా. కనుకనే ఉన్నతవర్గాల పిల్లలతో సమంగా మాకు చదువుల్లోనూ అన్ని అవకాశాలూ కావాలంటున్నాం.” – ఇదీ వారి సిద్ధాంత సారాంశం.

సత్యమూర్తి గారు వాస్తవవాది. అందువల్లే ఆయన కవితలు చిరకాలం నిలిచిపోయేంతగా గుర్తింపుకొచ్చాయి. తెలుగులో వచ్చిన ప్రజా కవిత్వాన్ని విలువకడితే శివసాగర్‌ కవిత మొదటివరుసలో నిలబడుతుంది. ఇతర కవుల కవితలు కూడ కొన్ని ఇదే వరుసలోకి వచ్చినా, వాటిలో పోరాట నేపథ్యంలోంచీ, బడుగు జీవితాల నేపథ్యంలోంచీ వచ్చినవి ఒక చేతివ్రేళ్లమీద ఎంచదగినంత మందివే.

ఆయనతో మాట్లాడినప్పుడు నాకనిపించింది – ఈయన తెలుగువారికి ‘పెరియార్‌’ అయితే ఎంత బాగుణ్ణు అని. పెరియార్‌ రామస్వామి నాయకర్‌ తమిళనాడులో నిర్మించిన ద్రవిడ ఉద్యమం బడుగువర్గాల సామాజిక రాజకీయ చైతన్యానికి, తమిళ భాషా సంస్కృతులు బలోపేతం కావడనికి దారితీసింది. అందుకు కారణం ఆ ఉద్యమ స్వభావంలో ఉంది. అక్కడి బడుగువర్గాలు ఎక్కువగా పాల్గొన్నందువల్లనే తమిళనాట సామాజిక రాజకీయోద్యమాల్లో స్థానిక భాషా సంస్కృతులు కీలకాంశాలు అయినాయి. అంతటి మార్పును తెలుగునాట తేగల నేతల అక్కర మనకు ఉంది.

సత్యమూర్తి గారు 84 ఏళ్లు జీవించాడు. ఒక రాజకీయ యోధునిగా, విప్లవకవిగా ఆయన ఎక్కువకాలం శ్రమించాడు. సామాజిక సంస్కర్తగా, జాతి పునర్నిర్మాణ దీక్షతో ఆయన కొన్నేళ్లయినా శ్రమించివుంటే, దాని ఫలితం బడుగువర్గాల మీద బలంగా ఉండేది. వారి సాంస్కృతిక రాజకీయ పునరుజ్జీవనానికి రాచబాట పడేది కూడ. ఆయన ఆ మార్గాన్ని ఎంచుకొనే సమయానికే ఆయన శరీరం పట్టుతప్పింది. అదను కుదరలేదు. ఆ జీవితం తాను నమ్మిన ఆశయాల సాధనకై చేసిన కృషిలోనే ముగిసింది. ఆయన స్ఫూర్తితో బడుగువర్గాల నేతలు అస్తిత్వ ఉద్యమాలకు భాషాసాంస్కృతిక బలాన్ని కలిగించినపుడే శక్తివంతమైన సామాజిక రాజకీయ పోరాటాల్ని తీర్చిదిద్దగలుగుతారు.

సామల రమేష్ బాబు

* * *

నడుస్తున్న చరిత్ర మాసపత్రిక డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. తాజా సంచిక కోసం ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

నడుస్తున్న చరిత్ర మే 2012 On Kinige

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>