ఇపుడంతటా తెలంగాణ సంగతులే చర్చనీయాంశాలు. గత నవంబర్ నుండి కొనసాగుతున్న ఈ వాతావణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు అట్లాగే ఉంటుందని చెబితే అది సరియైన అంచనా అవుతుంది. 2001 నుండి 2009 వరకు ఒక కథ అయితే, గత ఏడాది నవంబర్ నుండి రెండవ కథ. ఈ కథలోనే తెలంగాణ ఉద్యమం బలోపేతమైంది. వ్యవస్థీకృత రూపాన్ని సంతరించుకున్నది. భాగ్యనగరంమొదలుకొని మారుమూల చిన్న పల్లెల వరకు ‘జాక్’ లు ఏర్పడ్డాయి. ఒకవైపు రాజకీయ పోరాటాలు ఉధృతమవుతోంటే, అదే వేగంతో సాంస్కృతిక ఆలోచనలు, అన్వేషణలు కూడా వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా పుస్తకం ‘తెలంగాణ అస్తిత్వ పోరాటం‘ (The Telangana Struggle for Idendity) రూపొందింది. ఐదువందలకు పైగా పేజీలున్న ఈ వైవిధ్య వ్యాస సంకలనాన్ని తెలంగాణ సాంస్కృతిక వేదిక ప్రచురించింది. ప్రసిద్ధ విద్యావేత్తలు డాక్టర్ వెలిచాల కొండలరావు, ఆచార్య రాఘవేంద్రరావులతో పాటు సుప్రసిద్ధ దర్శకులు బి. నర్సింగరావు ఈ సంకలనానికి సంపాదకత్వం వహించారు. సంకలనంలో తెలుగు-ఇంగ్లీషు వ్యాసాలున్నాయి. ప్రముఖుల తాజా రచనలు, ప్రసిద్ధుల పాత వ్యాసాలు కూడా కనబడతాయి. నాటి వ్యాసాల అవసరం నేడు మరీ ఎక్కువగా ఉందని ఈ వ్యాసాలు చదివితే అర్థమవుతుంది.
ఇంగ్లీషు వ్యాసాల్లో విషయ పరిజ్ఞానాన్ని బాగా పెంచగలిగే రచనలు కొన్ని, మరికొన్ని నాటి హైదరాబాద్ స్మృతి పరీమళాల్నినిండుగా వెదజల్లేవి. హైదరాబాదీ సంస్కృతిలోని ప్రత్యేకతల్ని ఇవి విప్పి చెప్పాయి. ఉన్నతాధికారిగా సేవలందించిన నరేంద్ర లూథర్ ఇంగ్లీషులో ఎంతో చక్కని రచయిత. ‘And still I long for Hyderabad’ పేరుతో ఆయన రాసిన వ్యాసం అద్భుతంగా ఉంది. 1998లో లూథర్ రచించిన ‘Hyderabad the power of glory’ అన్న పుస్తకం నుండి ఆ వ్యాసాన్ని తీసుకున్నారు. హైదరాబాదీయత్ పై డాక్టర్ ఎం.ఏ.ఖాన్ మంచి వ్యాసాన్ని రచించారు. సి.రాఘవాచారి, రమామేల్కోటే, కె.విజయ రామారావు, హసనుద్దీన్ అహమద్ వంటి ప్రముఖుల వ్యాసాలు బాగున్నాయి. ‘హిస్టారికల్ తెలంగాణ’ పేరుతో చరిత్రకారుడు డాక్టర్ జె.రమణయ్య ఇక్కడి చరిత్రను సంక్షిప్తంగా సింహావలోకనం చేశారు. వీటితోపాటు ఆచార్య జి.హరగోపాల్, సిహెచ్. హనుమంతరావులు రచించిన వ్యాసాలు విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. సంకలన సంపాదకుల్లో ఒకరైన వి.కొండలరావు సంస్కృతికి సంబంధించిన వివరణలతో కొన్ని వ్యాసాలు రచించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటికి సమర్పించిన అంశాల్ని ఇందులో పొందుపర్చారు. ఇకపోతే ‘The city I know’ పేరుతో ప్రసిద్ధ సినీ దర్శకులు శ్యాంబెనగల్ రచించిన వ్యాసం సుదీర్ఘమైన స్మృతి గీతం వలె అద్భుతంగా ఉంది. ఇంగ్లీషు వ్యాసాలన్నీ చదివిన తర్వాత హైదరాబాద్ నగరపు నాటి సంస్కృతిపై అవగాహన పెరుగుతుంది. తెలంగాణ పోరాటం వెనుక ఉన్న సాంస్కృతికమైన ఆరాటాలు బాగా అర్థమవుతాయి.
తెలుగు వ్యాసాల్లో కొన్ని ఆణిముత్యాలు. ఆనాటి కిన్నెర వంటి పత్రికల నుండి ఎంపిక చేసిన వ్యాసాలు తెలంగాణ గత వైభవాన్ని శ్రావ్యమైన సంగీతం వలె మనముందు నిలుపుతాయి. తెలంగాణ నాటకాలు, తెలంగాణలో తెలుగు భాషా సాహిత్యాల వికాసం – అనే శీర్షికలతో ‘ఆంధ్ర బిల్హణ’ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి రచించిన వ్యాసాల్ని ఈ పుస్తకంలో చేర్చారు. ఇందులో తెలంగాణ నాటకాలు కొన్ని విస్తృత విషయాల్ని ఆవిష్కరించింది. మాదిరాజు విశ్వనాథరావు వంటి అజ్ఞాత నాటక రచయితల్ని పరిచయం చేసింది. నాడు నిజాం కళాశాలలో నిర్వహించిన ‘ఆంధ్రాభ్యుదయోత్సవాల’ పరిచయ వ్యాసాల్ని సంకలనంలో పొందు పరిచారు. సుప్రసిద్ధ విమర్శకులు జి.రామలింగం ఆ రోజుల్లో రచించిన ‘తెలంగాణ, సీమ-కవుల దర్శనం’ విలువైన వ్యాసం. ప్రసిద్ధ చరిత్రకారులు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు రచించిన ‘తెలంగాణము ప్రాచీన శిల్పకళ’ వ్యాసం ఎంతో విలువైనది. జానపద కళల్లో తెలంగాణ ప్రత్యేకతను జయధీర్ తిరుమలరావు వ్యాసం విశ్లేషించింది. తెలంగాణ సంస్కృతిపై కె.శ్రీనివాస్ రాసిన రెండు వ్యాసాలు పలు మౌలికమైన అంశాల్ని పాఠకులకు పరిచయం చేస్తాయి. సాహిత్య చరిత్ర రచనలో కవులను అంచనా వేయడంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆచార్య ఎస్వీ రామారావు వ్యాసం వివరించింది – డాక్టర్ గండ్ర లక్ష్మణరావు ‘తెలంగాణ ప్రాచీన కవిత్వ దృక్పథం’ ఎన్నో సూత్రీకరణల్ని ప్రతిపాదించింది. ఈ సూత్రీకరణలతో భవిష్యత్తులో ఎంతోమంది పరిశోధక విద్యార్థులు ముందుకు కదలవచ్చు. తనముందు చోటుచేసుకుంటున్న పరిణామాలపై తనదైన రీతిలో స్పందించవలసిన బాధ్యత మేధావులది. ”తెలంగాణ అస్తిత్వ పోరాటం” గ్రంథం వెలువడడానికి ప్రధాన ప్రేరణగా నిలిచిన డాక్టర్ వెలిచాల కొండలరావు ఈ రకమైన బాధ్యతగల మేధావిగా వ్యవహరించారు. తెలంగాణ గతం – వర్తమానం – భవిష్యత్తుల్ని వివరిస్తూ సమాచార ప్రతిపాదనలతో, సవిమర్శకమైన వ్యాఖ్యలతో రమారమి పాతిక వ్యాసాల్ని రచించారు. ఇవి ఒక క్రమంలో లేకపోవచ్చు కానీ బలమైన ప్రతిస్పందనలకు ప్రతిరూపాలు. ఆరు దశాబ్దాల కాలవ్యవధిలో నిరంతరం కొనసాగిన పక్షపాత వైఖరిని ఈ వ్యాసాలు ప్రశ్నిస్తున్నాయి. స్వతహాగా విద్యారంగంతో ప్రత్యక్ష సంబంధం ఉంది కనుక ఆ రంగానికి సంబంధించి మరింత బలమైన వ్యాసాల్ని కొండలరావు రచించారు.
”హైదరాబాద్ ఒక చాందినీ మహల్, పండగ సందడిగా వెలిగే ఒక మహఫిల్; ఆకాశం మతిపోగొట్టే తారల ముజ్రా, హైదరాబాదంటే పురాతన మట్టిలోంచి ప్రేమగా వీచే సుగంధ సమీరం” అంటూ ఆశారాజు రాసిన కవిత్వం భాగ్యనగరపు నిసర్గ రాగమయతత్వాన్ని అనుభూతిమయంగా వర్ణించింది. పాగల్ షాయర్ కావ్యం నుండి సంకలనం కోసం ఎంపిక చేసిన ఆశారాజు కవితలు హైదరాబాద్‌ను వస్తువుగా చేసుకున్న వచన కవిత్వంలో మణిపూసలు.
ఇంతటి విపుల వ్యాస సంకలనంలో ఒకటి రెండు చిన్న లోపాలూ కనబడతాయి. వ్యాసాలు ఒక క్రమపద్ధతిలో లేకపోవడం ఒక లోపం. తెలుగు విభాగంలో ఒకటి రెండు వ్యాసాల్ని తీసుకోకున్నా పెద్దగా లోపమేదీ ఏర్పడేది కాదు. ఇంగ్లీషులో ‘Summing up – Regionalism in India’ వంటి ఒకటి రెండు వ్యాసాలు లేకున్నా ఫర్వాలేదేమో. ప్రసిద్ధ పరిశోధకుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఎంతో శ్రమతో ‘ముంగిలి’ అనే గ్రంథాన్ని రచించారు. తెలంగాణ సాహిత్య చరిత్ర ఇది. ఈ గ్రంథం వెలువడి ఒకటిన్నర సంవత్సరాలు దాటుతోంది. అందులో సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఆచార్య రవ్వాశ్రీహరి, డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి రాసిన వ్యాసాల్ని ఈ సంకలనంలో తిరిగి ముద్రించారు. ప్రస్తుత సంకలనంలో ఇవి అవసరంలేదేమో. దీనికి బదులుగా సుంకిరెడ్డి పరిశోధనలో వెలుగు చూసిన డజనుమంది గొప్ప కవుల పరిచయాల్ని సంక్లిప్త వ్యాసంగా ప్రచురిస్తే ఇంకా బాగుండేది. ఇంత పెద్దవ్యాస సంకలనంలో ఇటువంటి చిన్న లోపాల్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవలసిన అవసరం లేదు.
”తెలంగాణలో కవులు పూజ్యము” అన్న మడుంబై రాఘవాచార్యుల వారి ప్రశ్నకు ”గోలకొండ కవుల సంచిక” ద్వారా సురవరం ప్రతాపరెడ్డి సరియైన సమాధానం చెప్పారు. అట్లానే ”తెలంగాణ రాష్ట్రం ఎందుకు?” అని ప్రశ్నిస్తున్న సీమాంధ్ర మేధావి వర్గానికి, నాయకులకు ”తెలంగాణ సాంస్కృతిక వేదిక” చెప్పిన జవాబే ”తెలంగాణ అస్తిత్వ పోరాటం” వ్యాస సంకలనం.
కొండలరావుగారు అభినందనీయులు.
– డా. జి. బాలశ్రీనివాసమూర్తి
(జయంతి త్రైమాసిక పత్రిక, ఏప్రిల్ – జూన్ 2011 సంచిక)
* * *
“తెలంగాణ అస్తిత్వ పోరాటం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
తెలంగాణా అస్తిత్వ పోరాటం On Kinige