“టీచర్లకు మానసిక రుగ్మతలుంటే…”

టీచర్లను రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటిరకం పుట్టుకతోనే టీచర్లు. రెండో రకం ద్వేషంతో కూడుకున్న క్రమశిక్షణావాదులు. పుట్టుకతోనే టీచర్లుగా గుర్తింపు పొందినవారితో సమస్యలేదు. వారు తమ పనిని, పిల్లలను ప్రేమిస్తారు. పిల్లలు వారిని ప్రేమిస్తారు. ఇక రెండోరకం వారితోనే సమస్యంతా. రుగ్మతలతో కూడిన వారి ఆధిపత్య ధోరణి పిల్లలను భయకంపితులను చేస్తుంది. వారు పిల్లలనేగాక తమ వృత్తిని గూడ ద్వేషిస్తారు. టీచర్ అంటే పిల్లలు భయపడుతున్నారంటే ఆ టీచర్ నిజంగా చెడ్డవాడే! ఇది ఏ టీచర్ కైనా వర్తించే గీటురాయి. ఆ టీచర్ నూటికి నూరుశాతం ఫలితాలుసాధించినప్పటికీ విద్యార్ధుల మనసులో మాత్రం వారికి శూన్యస్థానమే. కొన్ని సబ్జెక్టులపట్ల పిల్లలకు ఏర్పడే కాంప్లెక్స్‌లనుబట్టి ఈ విషయం స్పష్టంగా చెప్పవచ్చు. టీచర్ అంటే ఎక్కువ భయపడే పిల్లలు ఆ టీచర్ బోధించే సబ్జెక్టు అంటే గూడ ఎక్కువ భయపడతారు.

“టీచింగ్ అంటే పాఠాలు చెప్పటం మాత్రమేకాదు. టీచింగ్ అంటే పిల్లలతో పాటు కలిసి జీవించటం. వారిని అర్ధం చేసుకోవటం, వారిలో ఒకరుగా మెలగటం. ప్రముఖ టీచర్ హోమర్ లేన్ చెప్పినట్లు పిల్లల ముఠాలతో కలసిపోవటం. పిల్లల అభిప్రాయాలను వారి మనోభావాలను తెలుసుకునే ఓపిక, సహనం ఉపాధ్యాయులగుండా”. రచయిత ఎ.ఎస్.నీల్ అన్నట్లు దురదృష్టవశాత్తు టీచర్‌కు మాత్రమే దెబ్బలు తినే పిల్లలు సిద్ధంగా ఉంటారు. వారి ఉన్మాదానికి పిల్లలే బలిపశువులు. కాని ఉపాధ్యాయుల సమర్థత తెలుసుకోవటానికి పిల్లలు అసలైన న్యాయమూర్తులు. దురదృష్టవశాత్తు ఇతర వృత్తుల వారితో పోల్చినప్పుడు “టీచర్లకు ఇతరుల నుండి నేర్చుకోవటం ఇష్టముండదు. పెద్ద వయసు ఉపాధ్యాయులకైతే నేర్చుకోవలసిన అగత్యమే లేదనుకుంటారు. ఇక్కడ మనం అహం యొక్క అంతులేని శక్తిని చూడవచ్చు” అన్న నీల్ గారి అభిప్రాయం ఒప్పుకోదగినది.

“పిల్లలకు మూడు లేదా నాలుగు సంవత్సరాలు వయసు వచ్చేవరకు ఇంటి అవసరం ఉంటుంది. కుటుంబానికి భావావేశపరంగా అతుక్కుపోకుండా ఆ వయసులో పిల్లలను బోర్డింగ్ స్కూల్ కు పంపాలి. ఆ స్కూల్లో వారు కోరుకున్నంత సంతోషం లభించాలన్న ఎ.ఎస్.నీల్ గారి అభిప్రాయం ఒప్పుకోదగింది కాదు. ఎందుకంటే అంత చిన్న వయసులో కుటుంబ సభ్యులమధ్య పెరిగితేనే వారిలో సంపూర్ణ మూర్తిమత్వం ఏర్పడుతుంది. కనీసం 15 సంవత్సరాల వయసు వరకు పిల్లలు తల్లిదండ్రులతో ఉండటమే వాంఛనీయం. అప్పుడే వారిలో కలిగే శారీరక, మానసిక మార్పులు కనుగుణంగా తల్లిదండ్రులు వారినొక కంట కనిపెడుతుంటారు. ఇదే హాస్టల్ లో అయితే అంతమంది మధ్య వ్యక్తిగతంగా వారి ప్రవర్తనను పట్టించుకునే వీలు ఉండకపోవచ్చు.

టీచర్లకిచ్చే ట్రయినింగులో పిల్లల మనస్తత్వశాస్త్రం ప్రధానమైన ఒక అంశంగా ఉండాలి. “పిల్లవాడిని అర్థం చేసుకో” అన్నది ట్రయినింగ్ లక్ష్యం కావాలి. ఈ లక్ష్యం ‘నిన్ను నీవు తెలుసుకో’ అనే లక్ష్యంతో ముడిపడి ఉండాలి. అన్న నీల్ గారి సూచన మన ప్రభుత్వాలు గూడ ఆచరణలో పెట్టదగినది. రచయిత అభిప్రాయపడినట్లుగా ‘యూనిఫారంలో ఏదో ఒక బందీ స్వభావం, స్వేచ్ఛను వ్యతిరేకించే గుణం ఉన్నాయని తను స్థాపించిన ‘సమ్మర్ హిల్’ పాఠశాలలో యూనిఫారం లేదని చెప్పారు. జైలు యూనిఫారం, సైనికుల యూనిఫారంలో అలాంటి గుణం ఉంటుందేమోగాని పాఠశాలలో మాత్రం తప్పనిసరిగా యూనిఫారం ఉండాలి. మామూలు దుస్తులకు అనుమతిస్తే విద్యార్ధులలో బీద, గొప్ప తేడాలు స్పష్టంగా కన్పించి,తాము తక్కువవారమనుకునే అవకాశముంది.

సమాజానికి ఉపాధ్యాయులు మూలస్తంభం వంటివారు. అయితే నేను వారి వృత్తికి మాత్రం తగిన గౌరవం లభించటం లేదు. విద్యను సృజనాత్మకంగా రూపొందిస్తే, సృజనాత్మకత కలిగిన స్త్రీ, పురుషులు ఈ వృత్తిలోకి ఆకర్షితులవుతారు. ఈరోజున విద్యారంగం మందగొడులను మాత్రమే ఆకర్షిస్తున్నది. ఈ విద్యారంగంలో పని మందగొడులకు మాత్రమే తగినట్లుగా ఉన్నది. విద్యలో కావలసిందేమిటంటే టీచర్ వ్యక్తిత్వం. స్కూళ్ళలో మంచికీ చెడుకీ టీచర్ల వ్యక్తిత్వమే ప్రధాన భూమిక పోషిస్తున్నది. టీచర్ ప్రేమను లేదా ద్వేషాన్నిగాని భయాన్నిగాని పిల్లలకు సంక్రమింపజేయవచ్చు. కానీ బోధనావృత్తిని అల్పంగా పరిగణించినంత కాలం టీచర్ పిల్లలకు భయాన్ని మాత్రమే అంటగట్టగలిగే ప్రమాదమున్నదన్న నీల్ గారి అభిప్రాయం ఎన్నదగినది.

ఎ.ఎస్.నీల్ అన్నట్లుగా భవిష్యత్తులో స్వేచ్ఛకోసం పిల్లలను తయారుజేయటానికి ప్రతి స్కూలులోను స్వయంపాలన, స్వయం నిర్ణయాధికారం అమలు కావాలి. గుజరాతీ మహోపాధ్యాయుడు గిజూభాయి బధేకా, రవీంద్రనాథ్ టాగూర్ ఆశించినట్లుగా మన విద్యా విధానం మార్పు చెందాలి. అప్పుడే దేశానికి ఉత్తమ పౌరులను అందించగలం.

ఎ.ఎస్.నీల్ గారి 14 అధ్యాయాల ‘ది ప్రాబ్లమ్ టీచర్’ను చక్కని తెలుగులో “టీచర్లకు మానసిక రుగ్మతలుంటే…” అనే పేరుతో డా. సుంకర రామచంద్రరావు గారు అనువదించారు. విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తప్పక చదవాల్సిన పుస్తకమిది. ఒకప్పుడు ప్రతి ఉపాధ్యాయుని చేతిలో ఏదో ఒక మంచి పుస్తకము కనిపించేది. కాని, నేటి ఉపాధ్యాయుల చేతుల్లో సెల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్ బ్రోచర్లు, చిట్ ఫండ్ కంపెనీల కరపత్రాలు, ఫైనాన్స్ లెక్కలు, జీవిత భీమా పాలసీలు మాత్రమే కనిపిస్తున్నాయి. వృత్తికన్నా ప్రవృత్తికే ప్రాధాన్యతనిస్తున్న రోజులివి. ప్రతి ఉపాధ్యాయుడు తప్పక చదవాల్సిన పుస్తకమిది. అప్పుడే మానసిక రుగ్మతలేమిటో వాటిని ఎలా వదిలించుకోవాలో తెలుస్తుంది.

పూదోట శౌరీలు
(నడుస్తున్న చరిత్ర జూన్, 2012 నుంచి)

* * *

” టీచర్లకు మానసిక రుగ్మతలుంటే…” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

టీచర్లకు మానసిక రుగ్మతలుంటే… On Kinige

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>