మనిషికి ఉండాల్సిన ‘ మెలకువ’

ప్రముఖ కథా రచయిత్రిగా పి. సత్యవతి తెలుగు పాఠకులకు, సాహితీప్రియులకు సుపరిచితులు. ఆమె రచించిన ఓ పద్నాలుగు కథలే ఈ ‘మెలకువ‘. కథలన్నీ చిన్నవే అయినా వాటిల్లోని సారం గొప్పది. చిన్న సంఘటనల వెనుక దాగి ఉండే పెద్ద నిజాలు, సాధారణమైనవిగా వినిపించే సంభాషణల వెనుక పొంచి ఉండే మానవ ప్రవృత్తులూ ఈ కథల్లో దర్శనమిస్తాయి. వీటిల్లో ఎదురయ్యే మనుషుల్లో ఎక్కువ మంది- భూమి నుండి, గ్రామీణ పరిసరాల నుండి దూరమైన మొదటి లేదా రెండో తరం నగర జీవులు. త్వరితగతిన యాంత్రికమూ, సంక్లిష్ట భరితమూ, అమానుషమూ అవుతున్న నగర జీవనపు బాధితులు. అయితే ప్రధాన పాత్రలన్నీ కూడా తమ చుట్టూ పరుచుకున్న వలయాలని ఛేదించి ముందుకి సాగిన స్త్రీలవి. “జీవితం ఒక అనుదిన చర్యగా, స్వయంచరితంగా మారబోయే ప్రమాదఘంటికలు మోగబోయినప్పుడు చప్పున వాటిని సృజనతో ఆపాలి” అని సత్యవతిగారే స్వయంగా పేర్కొన్నారు. అందుచేత ఈ కథలన్నీ జీవితానికి బాగా దగ్గరగా, విశాలమైన సృజనాత్మక వనంలో సంచరిస్తాయి.

ఆస్తి పంపకాలు వెల్లడించే వాస్తవాలు (‘భాగం’), ఏం చేసినా (నోరున్న) ఆడవాళ్ళే చెయ్యాలనే నిజం (‘భారవాహిక’), ఇంట్లోని పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాలంటే బయటకుపోయి గౌరవంగా పనిచేసుకోవాలనే స్త్రీల అవగాహన (‘కాడి’), మారుతున్న పరిస్థితుల్లో స్త్రీ పురుష సంబంధాల్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం (‘ఆవిడ’), అర్థవంతమైన జీవితాన్ని, కనీసం అమెరికా ఆశయాన్నయినా సమర్థవంతంగా చేరుకోగల సామర్థ్యం, నైపుణ్యం కల్పించని నేటి చదువులు (‘ఒక రాణి – ఒక రాజా’)… ఇలాగే మరెన్నో కోణాలు. ఇక తలమానికమైన ‘మెలకువ’ కథలో- ఎన్నో సంవత్సరాలపాటు సాగిన సహవాసంలో, కాపురంలో ఏర్పడే మాటలకు అందని, మాటలు అక్కర్లేని పరస్పర అవగాహన, సమతుల్యాల్ని సున్నితంగా, హాస్యభరితంగా చిత్రీకరిస్తూనే- ‘పల్చని గాజుగోడలు’ పొరలుగా ఏర్పడకుండా ఉండాలంటే, జీవితాన్ని ఆస్వాదించాలంటే- నిత్యం మేల్కొని ఉండాలనే గంభీరమైన విజ్ఞతను కలగజేస్తారు రచయిత్రి. మనం అనవసరంగా వాడే కొన్ని ఇంగ్లీషు మాటల్ని చక్కని తెలుగులో ఎలా చెప్పుకోవచ్చో సత్యవతిగారు సూచిస్తారు : ‘చెక్క మొహం’, ‘చదివే కళ్ళజోడు’, ‘పిలిచే గంట’- ఇలాంటి పద ప్రయోగాల్లో.

చిన్న మాటల్లోనే పెద్ద విషయాలు చెప్పవచ్చనీ, వస్తువే శైలిని నిర్దేశిస్తుందనీ (‘ఆత్మలు వాలిన చెట్టు’, ‘నేనొస్తున్నాను..’) జీవితంలో ఏదీ కూడా పైకి కనిపించేటంత సరళంగా ఉండదనీ, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కావాలంటే సంఘర్షణ తప్పదనీ ఈ కథలు మనకు తెలియజేస్తాయి. కథలన్నీ సెలయేరుల్లా గలగలా సాగిపోయినా వాటిల్లో నిశ్శబ్ద గంగానదీ ప్రవాహం లాంటి గాంభీర్యం ఏదో దాగి ఉన్నదనిపిస్తుంది. ఇందుకు కారణం బహుశా తీర్పు చెప్పే ధోరణిలో కాకుండా ఔదార్యం, కారుణ్యభావంతో, మనుషులంటే గౌరవంతో రచయిత్రి ఈ కథల్ని సృష్టించినందువలన కావచ్చు. జీవితాన్ని, తెలుగు భాషని, సాహిత్యాన్ని ప్రేమించేవాళ్ళు మాత్రమే కాక కొత్త గా రాస్తున్న వాళ్ళు, రాయాలని ఉత్సాహపడేవాళ్ళు కూడా సత్యవతిగారి ఈ కథల నుండి చాలా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ముందుమాటలో శివారెడ్డిగారన్నట్టు ‘జడప్రాయ యాంత్రిక రచనా విధానాన్నించి రక్షించేది అధ్యయన అన్వయా లే”. ఇవి రెండూ ఈ కథల్లో మెండుగా కనిపిస్తాయి.

ఉణుదుర్తి సుధాకర్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 2 సెప్టెంబర్ 2012)

* * *

“మెలకువ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.
మెలకువ On Kinige

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>