ఇవి మహనీయుల స్వరభాస్వరాలు

మరణించిన వారు బతికి ఉన్న సమయంలో చెప్పిన మాటలు మధురంగా, ఒక్కోసారి ఆశ్చర్యంగా, ఒక్కోసారి అద్భుతంగా గోచరిస్తాయి. అయితే వారి మాటలను ఏరి కూర్చి ‘అభౌతిక స్వరం‘ అనే పేరుతో పుస్తక రూపం ఇచ్చారు మాధవ్ సింగరాజు. నిరంతరం ఆలోచిస్తూ, అపుడపుడు అతి దగ్గరివారితో నవ్విస్తూ అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు ఉండే మాధవ్ కలం నుంచి ఒక దినపత్రికలో వారం వారం జాలువారిన ధారావాహికకు పుస్తక రూపం ఇది. ప్రతి వారం పాఠకులకు విసుగు కలిగించకుండా, అందరినీ ఆకట్టుకునేలా రాయడమంటే మాటలు కాదు. కానీ ఎక్కడా వైవిధ్యం చెడకుండా ఒక ప్రవాహంలా తనదైన శైలిలో సాగిపోతుంది ఈ రచన. ఇక్కడ ఒకటి రెండు ఉదాహరణలందించి ఈ పుస్తకాన్ని రుచి చూపాలనిపిస్తోంది.

చార్లీ చాప్లిన్ అధ్యాయంలో ఇలా ఉంది.
“దగ్గర్నించి చూస్తే ఏ జీవితమైనా గొప్పగా ఉండదు. లాంగ్ షాట్‌లో చాప్లిన్ మీకు అందంగా కనిపించడమే, జీవితంలోని విషాదం. నాలో అహంకారం, అరాచకం మాత్రమే కాదు, ఇంకా అనేకం ఉన్నాయి. బద్దకం, అబద్ధం, అసంబద్ధత అన్నీ కలిస్తే నేను. నా కారును నేను ఎక్కువ దూరం డ్రైవ్ చెయ్యలేదు. నడపడం ఇష్టం అలా ఎంత దూరమైనా, కొంచెం స్విమ్మింగ్ వచ్చు, ఆటలు ఆడడం రాదు, ఆ మధ్య ఒక పత్రికలో నా ఫొటో వచ్చింది. పోలో ఆడుతూ గుర్రం పక్కన నిలబడి ఉన్నట్లు. అదో జోక్….. విశ్రాంతి కోసం కొరొనాడో వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఒకడు తన పోలో గేమ్ డ్రెస్ ఇచ్చి, దాన్ని తొడుక్కుని ఫొటో దిగమన్నాడు. అపుడు తీసింది ఇది” అంటూ చెప్పుకొచ్చారు. ఎదిగిన వారు కొద్దిగా ఒదిగి ఉండాలంటారు. అదే విధంగా ఎదిగిన వారు ఎప్పుడూ వాస్తవాలు చెప్పుకోడానికి వెనుకాడరు. ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు.

ఇక ఒక కవి అదీ భారత దేశానికి నోబెల్ బహుమతి తెచ్చిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఊహలు, కలలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఒక మచ్చుతునక. “రాత్రి చిత్రమైన కల వచ్చింది. కలకత్తాను మహత్తరమైన మంచు మేఘమేదో కమ్మేసింది. ఇళ్ళు భవనాలు కనిపించడం లేదు. అప్పుడు నేను పార్క్ స్ట్రీట్‌లో గుర్రపు బగ్గీపై వెళుతున్నాను. సెయింట్ జేవియర్స్ కాలేజి దగ్గరకు రాగానే ఒక్క సారిగా ఆ భవంతి పెరగడం మొదలైంది. చాలా వేగంగా, ఎత్తుగా, చిక్కటి మంచుని చీల్చుకుంటూ అలా ఆకాశంలోకి పెరుగుతూ ఉంది. ఊర్లోకి ఎవరో కొత్త మనుషులు వచ్చి ఇలాంటి మాయలు చేస్తున్నారని జనం వింతగా చెప్పుకుంటున్నారు” అంటూ ఇది సాగుతుంది. ఆ కవి ఊహాజనిత ఘటనపై ఎంత బాగా చెప్పారో ఇది తెలియజేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో వ్యక్తిది ఒక్కో ప్రత్యేకత. ఇలా సుమారు 50 మంది అభౌతికి స్వరాలను ఇందులో వినిపించారు. పుస్తక ముద్రణలోనూ ఒక ప్రత్యేకత కనిపించేలా ప్రయోగాలు చేసారు. పుస్తకం మొదటిదైనా ఎంతో అనుభవం దాని వెనుక దాగి ఉందని పాఠకులకు తెలిసిపోతుంది.

టి వేదాంత సూరి, ఆదివారం అనుబంధం, వార్త దినపత్రిక 28 అక్టోబరు 2012

* * *

అభౌతిక స్వరం On Kinige

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>