జీవన కల్లోల దృశ్యాల చిత్రకారుడు

గాంధీని చూసినవాడు అనే పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలో బోట్స్వానా నుంచి తాతగారి గ్రామానికి అన్నాచెల్లెళ్లు ఇద్దరూ వస్తారు. అది ఎన్నికల సమయం కూడా, ఆ సందర్భంలో వాళ్ళు ఆ గ్రామంలోని ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులకు విస్తుపోతారు. వాళ్ళు “విన్నదాన్నిబట్టి, చదివినదాన్ని బట్టి ఇక్కడ బహుశా ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్పగా ప్రజాస్వామ్యం ఎన్నికల పద్దతి అమల్లో ఉంది… కాని ఆచరణలో జరుగుతున్నది ఏమిటి?… ఈ దేశం ఎంత గొప్పది…. ఇక్కడ ఎన్ని పుణ్యనదులు, ఎన్ని ఎడారులు… ఎంత దాక్షిణ్యం…ఎంత క్రౌర్యం… ఎంతజ్ఞానం… ఎంత అజ్ఞానం… ఎన్ని నీళ్ళు… ఎంత నీళ్ళకరువు… ఎన్ని కులాలెన్ని, మతాలు ఎన్ని గుడులెన్ని, గోపురాలెన్ని, క్షేత్రాలుఎన్ని, పూజాగృహాలెన్ని, పూజావిధానాలుఎన్ని, ఎంత ఐశ్వర్యం ఎంత ఆకలి! ఎందరెందరు మఠాధిపతులెన్ని ఆరాధన పద్దతులు… ఎన్ని భాషలు… ఎంత నిశ్శబ్దం… ఎంత వైవిధ్యం… మళ్ళీ ఎంత ఏకత్వం! ఆలోచిస్తూవుంటే ఆశ్చర్యమనిపించింది. ఒకప్పటిచప్పన్నారు దేశాలు, మరొకప్పటి ఐదువందల పైచిలుకున్నా పెద్దరాజ్యాలన్నీ కలిపి అప్పటి దారి పుణ్యమాఅని ఏకఖంతమై భాసిల్లింది ఈ భూమి!”

ఈ కథలో డ్రాయింగ్ మాస్టారు గొప్ప ఆశావాది. ఆయన అన్నా, చెల్లెళ్ళకు చెప్పింది: “ఈ దేశం తీరే అంత! ఎంత శాంతి ఉందో అంత అశాంత ఉంది. ఎంత సంతృప్తి ఉందో అంత అసంతృప్తి ఉంది. ఎంత జీవకారుణ్యం ఉందో అంత కర్కశత్వమూ ఉంది. ఎన్ని రంగుల చర్మాలున్నాయో అంత ఐకమత్యమూ ఉంది. ఈ వ్యవస్థకు యాభై ఏళ్ళ వయస్సు వచ్చింది. ఇక ఇప్పుడే ప్రమాదమూరాదు. బాలారిష్టాలన్నీ దాటాయనే అనుకోవచ్చు. వ్యక్తులవల్ల లోలోపల మురికి, అమానుషత్వం, కల్తీ, అవినీతి, లంచగొండితనం, బాంబుల సంస్కృతీ అన్నీ ఉంటాయి. ఇవన్నీ పైపొరలు… సముద్రంలో పైపై రొదలాగా! లోపల అంతా ప్రశాంతతే!”-

డ్రాయింగు మాస్టారు లాగే పెద్దిభోట్ల సుబ్బరామయ్య పై పొరల్ని చూశాడు. సముద్రంలో పైపై రొదలాగా ప్రశాంతతనూ చూశాడు. రెండూ ఇష్టమే. అయితే ఒక భావుకుడిగా, ఒక సామాజిక అనుభవజ్ఞుడిగా సామాజిక పరివర్తనను గమనిస్తూ అంతః సంఘర్షణకులోనై ఒక సృజనాత్మక జీవిగా లోలోపల పొరలపైకి కూడా దృష్టిసారించాడు. ప్రశాంతత వెనుక ఉన్న జీవన సంఘర్షణను గమనించాడు. ఆయనను ఏకఖంతంగా బాసిల్లిన ఈ భూమి ఆశ్చర్యానికీ లోనుచేసింది. జీవితంలోని అశాంతీ, అసంతృప్తీ, కర్కశత్వమూ, వ్యక్తుల లోలోపల మురికీ, అమానుషత్వమూ, కల్తీ, అవినీతీ, లంచగొండితనము, బాంబుల సంస్కృతీ, కలచివేశాయి. స్వాతంత్ర్యానంతరం లిక్కరుగాంధీల పుట్టుక దిగ్ర్బాంతికీ, కోపానికీ గురిచేశాయి.

దాదాపు అయిదు దశాబ్దాలుగా కథలురాస్తున్న పెద్దిభోట్ల కథారంగస్థలం గుంటూరు, విజయవాడ చుట్టు పక్క పరిసరాలే. మధ్యతరగతి, కింది మధ్యతరగతి మనుషులు, పేదలు-కడుపేదలు, జీవితంలో కాట్లాడి పైకెగబాకుతూ పోతున్న కొత్తతరం ధనికులు- వీళ్ళు ఆయన కథలో పాత్రలు, ఎండా, వానా, మబ్బులు, నేపథ్యంలో ఒక విషాద బీభత్సవాతావరణంలో చాలా కథలు నడుస్తాయి. అంతర్లీనంగా జీవన విషాదం పరచుకొని ఉంటుంది. సామాన్యుడి దుస్థితిలోని సామాన్యుడిలాగా అడపాదడపా కంఠస్వరంలో వ్యంగ్యం తొంగిచూస్తూ ఉంటుంది. ఇది విషాద జనిత వ్యంగ్యం. సమాజంలోని క్షైణ్యత పట్ల ధర్మాగ్రహంతో కూడిన వ్యంగ్యం.

పెద్దిభోట్ల నాల్గవతరం కథకుడు. స్వాతంత్ర్యానంతరం వచ్చిన సామాజిక మార్పును, పరివర్తనను అనుభవించిన వాడు. దిగజారిపోతున్న ఆర్థికస్థితిగతుల్ని, పట్టణీకరణ అమానవీయ పరిస్థితుల్ని గమనించిన పెద్దిభోట్ల బడుగుజీవుల బతుకు బాధల్ని విన్నంత కన్నంత అక్షరీకరించాడు. పట్టణీకరణ నిజమైన అభివృద్దికి చిహ్నంకాదు. పట్టణీకరణ క్రమంలోని అధోజగత్తు విస్తరణ, చీకటి నేర సామ్రాజ్య వికాసం, సనాతన వృత్తుల్లోనివారు కూడా క్రూరవాణిజ్య సంస్కృతి ముందు మోకరిల్లేస్థితి, విషమయవస్తు సంస్కృతి- కథకుడిగా పెద్దిభొట్లను కలిచివేసిన అంశాలు. అయితే పెద్దిభొట్ల రచయితగా నిరాశావాది కాదు. ఒకరకంగా చెప్పాలంటే విమర్శనాత్మక వాస్తవికవాది.

సుబ్బరామయ్య నాకు దాదాపు నాల్గు దశాబ్దాలకుపైగా మిత్రుడు. మంచి మాటకారి, ప్రగతిశీలవాది, అభ్యుదయరచయితల ఉద్యమంలో సాన్నిహిత్యం కలవాడు. అభ్యుదయ వాదిగా శ్రోతలమనస్సులను ఆకట్టుకునే సాత్వికోద్వేగ ఉపన్యాసకుడు. పరిచయస్తులకు ఆయన ముఖంలో, మాటల్లో ఉత్సాహమే కన్పిస్తుంది. మదిలో నింపుకున్న వ్యధకన్పించదు.

ఒక సీరియస్ కథకుడిగా తెలుగు కథానికా సాహిత్యంలో సుబ్బరామయ్యది ఒక ప్రత్యేక ముద్ర. సమాజంలో ఎందరో సాధారణంగా గమనించని విభిన్న జీవన పార్శ్వాలను ఒక అనుకంపతో ఆవిష్కరించిన కథా సృజనకారుడు. కథన కౌశలానికి నిదర్శనం.

- కేతు విశ్వనాథ రెడ్డి

స్థలం: హైదరాబాద్

తేది: 12, జూలై, 2010
పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు – 2 On Kinige

Visit now to rent/buy eBook http://kinige.com/kbook.php?id=191

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>