వోడ్కా విత్ వర్మ

ప్రముఖ సినీ విమర్శకుడు, గీత రచయిత సిరాశ్రీ సుప్రసిద్ధ సినీదర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై రాసిన పుస్తకం “వోడ్కా విత్ వర్మ“.
స్కూలు కుర్రవాడిగా ఉన్నప్పుడు వర్మ సినిమా వాల్ పోస్టర్ చూసి మతిపోయిన ఓ కుర్రాడు, వర్మతో కలసి వోడ్కా టేబుల్ వద్ద కూర్చునే స్థాయికి చేరి అదే వర్మ గురించి ఒక పుస్తకం రాసాడు. ఆ కుర్రవాడే సిరాశ్రీ. ఆ పుస్తకమే వోడ్కా విత్ వర్మ.
రామ్‌గోపాల్ వర్మ అంటే సాధారణ ప్రజలలో, సినీజీవులలో, సన్నిహితులలో రకరకాల అభిప్రాయాలున్నాయి. కొందరికి రామ్‌గోపాల్ వర్మ ఓ వ్యసనం, మరికొందరి అసహ్యం. సైకో, అతివాది, సినీతీవ్రవాది…ఇలా రకరకాల విశేషణాలు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో నిజానిజాలు కనుగొనేందుకు, రామ్‌గోపాల్ వర్మ అంతరంగంలోకి, మనసులోకి తొంగి చూసేందుకు రచయిత ప్రయత్నించారు.
వర్మలో – రీల్ వర్మ, మీడియా వర్మ, రియల్ వర్మ అనే మూడు పార్శ్వాలున్నాయని రచయిత అంటారు. వర్మ తన గురించి తాను ఏమనుకుంటాడో చెప్పలేకపోయినా, వర్మ ఏమి అనుకుంటాడో రచయిత ఊహించారు. వర్మ గురించి ఇతరులు ఏమనుకుంటారో చెప్పారు.
తనని సార్ అని కాకుండా రాము అని వర్మ ఎందుకు పిలిపించుకోవాలనుకున్నారు? వర్మ రాముడు కాదు గోపాలుడు అని రచయితకి ఎందుకు అనిపించింది? సర్కస్‌లో రింగ్ మాస్టర్‌లా మీడియా అనే సింహం జూలు పట్టుకుని రామ్‌గోపాల్ వర్మ ఎలా ఆడగలిగారు? అమితాబ్ బచ్చన్‌ని వర్మ తిట్టాడా, పొగిడాడా? భారతీయులకి పిచ్చగా నచ్చేసి, హాలీవుడ్‌లో మాత్రం టాప్ హండ్రెడ్ సినిమాల జాబితాలోకి చేరలేకపోయిన సినిమా ఏది? శివ సినిమాలో సైకిల్ చైన్ పట్టుకున్న చెయ్యి నాగర్జునది కాదా? ఓ సుప్రసిద్ధ రచయితకీ, వర్మకీ ఉన్న ఉమ్మడి లక్షణం ఏమిటి? వర్మలోని టెక్నీషియన్ని అహంభావి మింగేస్తున్నాడని ఎవరన్నారు? అందరూ అనుకునేలా రామూలో తిరుగుబాటు ధోరణి లేదని ఎవరన్నారు? వర్మని ఆయన మేనమామ నత్తతో ఎందుకు పోల్చారు? వర్మ గురించి ఆయన మాజీ భార్య, కూతురు ఏమనుకుంటున్నారు? ఒకప్పటి రాము మార్క్ ఇప్పుడు కనిపించడం లేదని వర్మ మేనమామ ఎందుకన్నారు? తన జీవితంలో అత్యంత ముఖ్యులైన తల్లిదండ్రుల గురించి, భార్యాబిడ్డల గురించి వర్మ అభిప్రాయం ఏమిటి? ….. ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబులు ఈ పుస్తకంలో దొరుకుతాయి. ఇవే కాకుండా సినీప్రముఖులు రామ్‌గోపాల్ వర్మ మీద వెల్లడించిన అభిప్రాయాలు, కొన్ని అరుదైన ఫోటోలు ఉన్నాయి.
రామ్‌గోపాల్ వర్మపై రాసిన ఈ పుస్తకం ఆయన జీవిత చరిత్ర కాదూ, ఆయన ఆత్మకథా కాదు. రామ్‌గోపాల్ వర్మని అర్థం చేసుకోడానికి ఓ ప్రయత్నం లాంటిది. సినీదర్శకుడిగా, వ్యక్తిగా రామ్‌గోపాల్ వర్మ నచ్చినా నచ్చకపోయినా, వర్మ గురించి రాసిన ఈ పుస్తకం మాత్రం పాఠకులని చివరిదాక ఆసక్తిగా చదివిస్తుండనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

* * *

“వోడ్కా విత్ వర్మ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేసిన్ ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి.
వోడ్కా విత్ వర్మ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>