మచ్చల గుర్రం – మధుబాబు – free preview!

మచ్చల గుర్రం

విపరీతమైన దాహం వేసింది వారుణికి. అదేపనిగా తడబడటం మొదలు పెట్టాయి అడుగులు. గిర్రుగిర్రున తిరగసాగాయి కళ్లు. ‘ఇక నడవడం నావల్లకాదు. నా పని అయిపోయింది’ అస్పష్టంగా అంటూ చతికిలబడింది ఒక చెట్టు మొదట్లో.

బరిశె మాదిరిగా పొడుగ్గా ఉన్న ఒక చెట్టు కొమ్మని బిగించి పట్టుకుని, ఒక్కొక్క అడుగే ముందుకువేస్తున్న చంద్రుడి ఒళ్ళు ఝల్లుమంది ఒక్కసారిగా.

తన వెనుకవస్తున్న మానవుల గురించి పట్టించుకోలేదు అప్పటివరకూ ఆ మహావ్యాఘ్రం. అసలు వారు తనను అనుసరిస్తున్నట్లుగా కూడా దానికి తెలియదు.

ఉన్నట్లుండి వినవచ్చిన మాటల శబ్దాన్ని ఆలకించగానే గుండెలు జలదరించేటట్లు గాండ్రిస్తూ గిర్రున తిరిగింది వెనక్కి.

“వెళ్ళిపో వారుణీ. వెనక్కి వెళ్ళిపో… అసలు ఈ ప్రదేశంలోనించి దూరంగా పారిపో” అని వారుణిని హెచ్చరిస్తూ, చేతుల్లో ఉన్న చెట్టుకొమ్మతో ఆ భీకరమృగాన్ని ఎదిరించటానికి సిద్దపడ్డాడు చంద్రుడు.

అప్పటికి మూడు మాసాలనించీ ఆ అడవిలో విశృంఖలంగా విహరిస్తోంది ఆ క్రూరమృగం. ఎక్కడినించి వచ్చిందో తెలియదుగాని, వచ్చీ రావటంతోనే అడవి అంచున ఉన్న ఉత్పలమహర్షి ఆశ్రమం మీద పడింది దాని కన్ను.

పగలు-రాత్రి తేడాలేకుండా అవకాశం అంటూ లభించిన వెంటనే దాడిచేయటం మొదలుపెట్టింది ఆశ్రమంలో హాయిగా జీవించే సాధుజంతువుల మీద.

నాలుగు గోవులు, ఎనిమిది జింకలు, పది పండ్రెండు కుందేళ్ళు, రెండు నెమళ్ళు కనిపించకుండా పోయేసరికి చిరాకుపడ్డాడు ఉత్పలమహర్షి.

“ఆ వ్యాఘ్రాన్ని హతమార్చితీరాలి… ఆ పని చేసిన వారికి ఆరు రోజులు హరిహరపురంలో జరిగే వసంతోత్సవాలను చూసి ఆనందించే అవకాశం కల్పిస్తాను” తనకు ఎంతో ప్రీతిపాత్రమైన రెండో నెమలి మాయమైపోయిన రోజున అందరూ వింటూ ఉండగా ప్రకటించాడు.
మచ్చల గుర్రం On Kinige

అరువదిమందికి పైగానే చదువుకుంటున్నారు ఆ ఆశ్రమంలో. కళింగ కామరూప మగధ పాంచాలరాజులకు చెందిన రాజకుమారులున్నారు వారిలో.

విదర్భ, విరూప, వైరోచన దేశాలకు చెందిన రాకుమార్తెలున్నారు. రాజ్యాలు లేకపోయినా తత్సమానమైన వైభోగాలను అనుభవించే వణిక్‌ సార్వభౌముల బిడ్డలున్నారు. దండనాయకుల బిడ్డలు, దళపతుల సంతానాలు చాలామంది భక్తిశ్రద్ధలతో విద్యాభ్యాసం చేస్తున్నారు.

ఉత్పలమహర్షి ప్రకటనను వినగానే ఉప్పొంగాయి వారి శరీరాలు. పోటీలుపడి తమ ఆశ్రమంమీద అఘాయిత్యానికి పాల్పడుతున్న ఆ క్రూరమృగాన్ని వెదకటం ప్రారంభించారు. అందరూ అనుసరించిన మార్గాన్ని వదిలి అడుగు తీసి అడుగువేయటం అతికష్టమని అనిపించే ఉత్తర దిశలోకి వచ్చారు వారుణి, చంద్రుడు.

చురకత్తులవంటి ముళ్ళు కలిగివున్న పొదలు, దట్టమైన చెట్లు, ఎగుడుదిగుళ్ళతో నిండి వున్న నేల – సూర్యుడు నడిమింటికి చేరుకునే సమయానికల్లా పూర్తిగా అలసిపోయింది వారుణి. తాము ఎక్కడ ఉన్నారో, ఎందుకు వచ్చారో, మర్చిపోయి నోరు విప్పింది.

తను మాట్లాడిన రెండే రెండు మాటలు ఎటువంటి ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయో చూసేసరికి ఒక్కసారిగా నిలువు నీరయిపోయింది ఆమె.

“నువ్వు కూడా వచ్చేయ్‌ చంద్రా… నువ్వు ఒక్కడివే దాన్ని ఎదిరించలేవు. వచ్చేయ్‌” అని చంద్రుడిని హెచ్చరిస్తూ, తాను ఏ చెట్టుకింద కూలబడిందో ఆ చెట్టును పట్టుకుని పైకి ఎగబాకటానికి సిద్ధం అయింది.

తన వెనుకే అతను వచ్చేస్తాడని అనుకున్న ఆమె ఆలోచనకు మొదట్లోనే విఘాతం కలిగింది. వెనక్కి వచ్చేయటం కాదుకదా… అసలు ఆమె మాటలు తనకు వినబడనట్లే ఆ భీకరమృగాన్ని ఎదిరించాడు చంద్రుడు.

అతని చేతుల్లో ఉన్న చెట్టుకొమ్మతగిలి రెండుచోట్ల గాయపడింది ఆ పులి శరీరం… ఎర్రటి నెత్తురు వెల్లువలా బయటికి వస్తోంది… భరించరాని బాధతో దానికి పిచ్చిపట్టినట్లు అవుతోంది. చెవులు చిల్లులు పడిపోయేటట్లు దారుణంగా గాండ్రిస్తూ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరింది.

విచ్చుకత్తుల మాదిరి కనిపిస్తున్నాయి దాని పంజాలకున్న గోళ్ళు. అవి తగలటం అంటూ జరిగితే చంద్రుడి పని అక్కడికక్కడే పూర్తి అయిపోతుందని అర్ధమైపోయింది వారుణికి. వెనుకా ముందు చూడకుండా, ఎగబాకుతున్న చెట్టును వదిలి, ఎగిరి నేలమీదికి దుమికింది. కింద ఉన్న ఒక పెద్ద బండరాయిని రెండు చేతులతోను పట్టుకుని బలంగా విసిరింది. చంద్రుడి తలమీదికి లంఘించబోతున్న ఆ వ్యాఘ్రపు శిరస్సుకు తగిలింది ఆ బండరాయి. కళ్ళు బైర్లుకమ్మాయి కాబోలు – గుండెలవిసిపోయేలా అరుస్తూ ఒక పక్కకు పడిపోయిందా మృగం.

“కొట్టేయ్‌ చంద్రా. ఆలస్యం చేశావంటే అది మన ఇద్దర్నీ కరకరా నమిలేస్తుంది. లేచి నిలబడకముందే నాశనం అయిపోవాలి” అని చంద్రుడిని హెచ్చరిస్తూ, కిందనించి ఇంకో బండరాయిని అందుకున్నది వారుణి.

ఆమె హెచ్చరికను అక్షరాలా అమల్లోపెట్టాడు చంద్రుడు. చెట్టుకొమ్మని గాలిలో గిర్రున తిప్పుతూ దెబ్బమీద దెబ్బగా నాలుగుదెబ్బలు వేసేశాడు నెత్తిమీద.

ఐదో దెబ్బ వేయకముందే గింగిరాలు తిరుగుతూ వచ్చి తగిలింది వారుణి విసిరిన బండరాయి.

మూడుమూరల ఎత్తు, తొమ్మిదిమూరల పొడవు ఉన్న ఆ భీకర ప్రాణికి తట్టుకోవటం అసాధ్యమైపోయింది. ఎదిరించే ఆలోచనని విరమించుకుని అక్కడి నించి పారిపోయే ప్రయత్నం చేసింది. మూడు అడుగులు కూడా వేయకముందే గురిచూసి మెడమీద వేశాడు చంద్రుడు బలమైన వేటు. పచ్చి చిరిచింతకొమ్మ విరిగిపోయినట్టు ఛట్‌మని శబ్దం చేస్తూ విరిగిపోయింది దాని మెడ ఎముక. ఆఖరిసారిగా బావురుమని ఒక వికృతశబ్దం చేసి ముందుకు పడిపోయింది అది.

లావుగావున్న మరో బండరాయిని పట్టుకుని దాని దగ్గిరికి దుముకబోతున్న వారుణి చెయ్యి పట్టుకుని ఆపేశాడు చంద్రుడు. “దాని పని అయిపోయింది వారుణీ…. చచ్చి స్వర్గానికో, నరకానికో వెళ్ళిపోయింది. నువ్వు స్థిమితంగా నిలబడు…. ముందు ఆ బండని అవతల పారేయ్‌” మృదుస్వరంతో ఆమెకు చెప్పాడు.

అప్పుడు, ఆ మువ్వన్నెల మెఖం ఇక లేచి తిరుగాడ లేదని నిశ్చయంగా తెలిసిన తరువాత తగ్గిపోయింది వారుణిని ఆవరించుకుని ఉన్న ఆవేశం. వెంటనే గుర్తుకు వచ్చాయి ఆమెకు తన శారీరక బాధలు.

“దాహం వేస్తోంది. కళ్ళు తిరుగుతున్నాయ్‌” అంటూ మళ్ళీ నేలమీద చతికిలబడిపోయింది.

చేతుల్లోనే ఉన్న చెట్టుకొమ్మని అవతలికి విసురుతూ చిరునవ్వు నవ్వాడు చంద్రుడు. నవ్వినప్పుడు అతని బుగ్గలు సొట్టలు పడతాయ్‌… అతనికి తెలియకుండానే కళ్ళు అరమూతలుగా మూసుకుంటాయి.

అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు మాత్రం అలా అనిపించలేదు వారుణికి.

“చచ్చిపోతున్నానురో దేవుడో అని నేను దేబిరిస్తుంటే ధ్వజస్తంభం మాదిరి నిలబడి చిలకనవ్వులు నవ్వుతున్నావ్‌.. నీకు అసలు మతిలేదు….” చివాట్లు మొదలుపెట్టింది.

నవ్వుతూనే పొదల్లోకి పోయాడు చంద్రుడు. పది నిమిషాల తరువాత కనిపించింది ఒక నీటిగుంట.

ఆగి ఆగి వీస్తున్న చిరుగాలుల తాకిడికి అలలు రేగుతున్నాయి అందులో. అరచేయి వెడల్పున విచ్చుకుని అందంగా కనిపిస్తున్న తామరపూలు, వాటికి సంబంధించిన ఆకులు అన్నీ ఉయ్యాలలు ఊగుతున్నాయి ఆ అలల మీద. బయటికి చెప్పకపోయినా చంద్రుడి గొంతు కూడా ఎండుకుపోయినట్టుగానే ఉంది.ఎదుట కనిపించిన జలాశయాన్ని చూడగానే పరుగు పరుగున పోయి ఆ నీటిలో దూకాలన్న కోరిక కలిగింది అతనికి.

అయినా సరే తొందరపడలేదతను….

నెమ్మదిగా నీటి అంచును సమీపించి, దక్షిణహస్తాన్ని నెమ్మదిగా అతి నెమ్మదిగా జాచాడు.

ఛట్‌మంటూ నీటిని చీల్చుకుని ఆ చేతిని పట్టుకోబోయింది వికృతరూపంలో ఉన్న ఒక మకరి.

అటువంటి ప్రమాదం ఏదో ఒకటి ఉండి వుండవచ్చని ముందుగానే ఊహించి ఉండటం వల్ల వేగంగా చేతిని వెనక్కి లాగేసుకున్నాడు చంద్రుడు.

దొరక్క దొరక్క ఒక మానవుడి చేయి దొరకనే దొరికిందన్న సంతోషంతో పైకి లేచిన మకరికి నిరా శే మిగిలింది. తిరిగి నీళ్ళల్లో పడిన తర్వాత అలవాటు ప్రకారం అడుగు భాగంలోకి వెళ్ళిపోలేదు అది. పటకా కత్తుల వంటి కోరలన్నీ బయటికి కనిపించేటట్టు ఇంత లావున నోటిని తెరిచి బహుక్రూరంగా చూసింది అతనివంక.

ఇప్పటికే ఒక ప్రాణాన్ని బలితీసుకుని వున్నాను. వెంటవెంటనే నిన్నుకూడా చంపి జీవహింస చేయటం నావల్లకాదు… నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రాకుండా వుంటే చాలా సంతోషిస్తాను” అంటూ గబగబా ఇంకో పక్కకి బయలుదేరాడు చంద్రుడు.

మూడు బారల దూరం అతన్ని అనుసరించింది ఆ మకరం. అతను నీటిలో అడుగుపెట్టటం జరగదని నిశ్చయం అయ్యేసరికి నిరాశగా వెను తిరిగింది.

అటువంటి పరిణామం కోసమే ఎదురు చూస్తున్నాడు చంద్రుడు. అది వెనక్కి మరలిన మరుక్షణం, దగ్గిర్లో వున్న తామరాకులు రెండింటిని పుట్టుక్కున తెంపాడు. మిఠాయి పొట్లం మాదిరిగా చుట్టి నీటిని నింపుకున్నాడు.

తను మోసపోయినట్టు గ్రహించి పొడవాటి తోకతో నీటిని దబ్బున బాదుతూ మళ్ళీ అతనికేసి వచ్చింది ఆ మకరం. మాటలు రాకపోయినా దాని కళ్ళల్లో కనిపిస్తున్న క్రోధభావాల్ని గమనించి తనలో తను నవ్వుకుంటూ వెంటనే వెనక్కి బయలుదేరాడు చంద్రుడు.

“ముష్టి మూడు దోసిళ్ళ నీళ్ళు తీసుకురావటానికి ఇంతసేపా? నీకు అసలు ఎదుటివాళ్ళ బాధల్ని గురించి పట్టించుకోవటం చేతకాదా?” తామరాకుల దొన్నెలో వున్న నీరు ఒలికిపోకుండా జాగ్రత్తగా వస్తున్న అతన్ని చూసి అమ్మోరుతల్లిలా అరిచింది వారుణి.

“ఎక్కువగా అరిస్తే గొంతు చినిగి, శబ్దపేటిక పాడయిపోతుంది. శాశ్వతంగా మూగతనం వచ్చేస్తుంది. నోరు మూసుకుని తాగు. కాసిని నాకు కూడా మిగుల్చు” తామరాకుల దొన్నెను అందిస్తూ చెప్పాడు చంద్రుడు.

“నోరు మూసుకుని నీళ్ళు ఎలా తాగుతారోయ్‌? నీకు అసలు బుద్ధిలేదు” అంటూ గుటకలేసింది వారుణి.

“చాలా రుచిగా వున్నాయ్‌. నువ్వు అక్కడే తాగి రావాల్సింది. ఎందుకు తాగలేదు?” అంటూ ఆఖర్లో నాలుగు గుటకల నీటిని మిగిల్చి అతనికందిస్తూ అడిగింది.

ఏమరుపాటుగా వుంటే ఎగిరి చెయ్యిపట్టుకోవటానికి సర్వసిద్ధంగా వున్న మకరిని గురించి ఆమెకు చెప్పలేదు చంద్రుడు. “ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. గురువుగారు మనకోసం ఆందోళనపడుతూ వుంటారు… వెంటనే బయలుదేరకపోతే చీకటి పడిపోతుంది. చీకట్లో దారితప్పామంటే ఎటు పోతామో తెలుసుకోవటం కష్టం” అంటూ ప్రాణాలు వదిలేసిన మహా వ్యాఘ్రాన్ని అమాంతం పైకెత్తి భుజంమీద వేసుకున్నాడు.

“దీన్ని హతమార్చటమే ముఖ్యం. మనవెంట తీసుకుపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు” వచ్చిన దారినే వెనక్కి వేగంగా నడుస్తూ అన్నది వారుణి.

“గురువుగారు గాని, గురుపత్నిగాని ఏమీ అనుకోరు. మనం చెప్పింది విని సంతోషిస్తారు. మన సహాధ్యాయులు కొందరికి అనుమానపు రోగం వుంది. ఓ పట్టాన నమ్మరు” ఆమె వెనకే అడుగులు వేస్తూ చెప్పాడు చంద్రుడు.

“వాళ్ళు నమ్మితే మనకేమిటి, నమ్మకపోతే ఏమిటి? మనం చేయవలసిన పనిచేసేశాం. అది చాలదా?” సూటిగా అతనివైపు చూస్తూ అడిగింది వారుణి.

“చాలదు. హరిహరపురంలో జరిగే వసంతోత్సవాలకు మనం వెళ్ళాలంటే ఈ క్రూరమృగం మరణించినట్లు అనుమానం లేకుండా అందరికీ తెలియాలి. అలా తెలియాలంటే సాక్ష్యం వుండాలి” చెప్పాడు చంద్రుడు.

వసంతోత్సవాల ప్రసక్తి వచ్చేసరికి ఆనందంతో అరమూతలు పడ్డాయి వారుణి కనులు. “ఎనిమిది సంవత్సరాల నించీ ఈ అడవిలో వుంటూ నాగరికతకు దూరంగా బతుకుతున్నాం. విద్యాభ్యాసం పేరుతో ఎన్నెన్నో అనుభూతులను, అనుభవాలను కోల్పోతున్నాం…. వసంతోత్సవాలలో పాలుపంచుకోవటం అంటే నా మనస్సు ఉప్పొంగిపోతున్నది” తన్మయత్వంగా చెప్పింది అతనికి.

ఆ మాటలు గురుదేవులుగాని, గురుపత్నిగాని వినటం జరిగితే ఎలా స్పందిస్తారో ఊహించటానికి ప్రయత్నిస్తూ సాధ్యమైనంత వేగంగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు చంద్రుడు.

* * *

బండి చక్రాల వంటి పెద్ద పెద్ద కళ్ళతో, కత్తుల మాదిరి కనిపించే కోరలతో, పరమ భయంకరంగా కన్పించే వికృత స్వరూపం ముందు నిలబడి గుప్పిళ్ళతో వెదజల్లాడు వార్షికుడు పసుపు, కుంకుమల్ని.

“పలుకు తల్లీ…. నీ బంగారు నోటిని తెరిచి మా మహారాజు బతుకును గురించి మంచి పలుకులు పలుకు” అంటూ అర్ధించాడు.

“రక్తపు వాసన చూపించకుండా పలకమంటే ఎలా పలుకుతారురా? ఆకలి అధికంగా వుంది. ఆహారం లేనిదే మాట బయటికి రాదు” ఉన్నట్లుండి వినవచ్చాయి ఆ మాటలు ఆ ఆకారం నోటినించి.

“తీసుకురండిరా… బలి జంతువుల్ని పడేసి ఈడ్చుకు రండి” ఖంగుమంటున్న కంఠంతో తన అనుచరులకు చెప్పాడు వార్షికుడు.

నల్లగా నిగనిగ మెరిసే శరీరాలతో పెద్ద మట్టిగుట్టల్లా కనిపించే అడవిదున్నలు ఆరింటిని అతి ప్రయత్నం మీద అక్కడికి లాక్కు వచ్చారు అతని అనుచరులు.

మూడు మూరల పొడవున్న బలిఖడ్గాన్ని పట్టుకుని చెలరేగిపోయాడు వార్షికుడు. ఛటాఛటామని తెగి వికృత స్వరూపపు పాదాల దగ్గర పడిపోయాయి ఆ జీవాల తలలు. ఎర్రటి రక్తం ఒక్కసారిగా చివ్వున పైకి ఎగసి ఆ ఆకారపు పాదాల చుట్టూ పడింది.

“ఇచ్చాను తల్లీ. బలి ఇచ్చాను… పెదవులు తడుపుకుని మాకు మంచిమాటలు చెప్పు….” ఖడ్గాన్ని కిందపెట్టి చేతులు జోడిస్తూ అడిగాడు వార్షికుడు.

“నాకు మంచి కనిపించటం లేదురా… మృత్యువు కనిపిస్తోంది… సింహాసనం మీద కూర్చున్న మీ చక్రవర్తి జుట్టు పట్టుకుని కిందికి లాగటం గోచరిస్తోంది” ఉన్నట్లుండి మాట్లాడింది ఆ వికృతరూపం. మనస్సు ఉప్పొంగిపోయే తీపి మాటలు వినవస్తాయని ఎదురుచూస్తున్న వార్షికుడి ఒళ్ళు చలిగాలి వీచినట్టు జలదరించింది.

“ఎవరు? సర్వం సహా చక్రవర్తి, అసమాన శౌర్యసాహసాలు కలిగినవాడు, ఈ వార్షికుడిని అమితంగా అభిమానించేవాడు అయినటువంటి భుజంగ భూపతిని సింహాసనం మీది నించి కిందికి లాగగల మొనగాడు ఎవడు?” ఖంగుమంటున్న కంఠంతో అడిగాడు.

“భుజంగ భూపతేకాదు – కాలం కలిసిరాకపోతే భూమిని మోసే ఆదిశేషుడు కూడా అవమానాలపాలు కావాల్సిందే… విధి లిఖితానికి తలవంచాల్సిందే” చెప్పిందా ఆకారం.

“వీలుకాదు…. ఈ వార్షికుడు బతికివుండగా అలా జరగటానికి అసలు వీలు లేనేలేదు… సమస్తమైన పూజలు చేస్తాను…. సర్వశక్తుల్ని ఆవాహన చేస్తాను. ఆరు నూరైనా సరే నా చక్రవర్తిని రక్షించుకుంటాను” ఆవేశంగా అన్నాడు వార్షికుడు.

“జరగబోయేది చెప్పమని అడిగావు. చెప్పాను. నమ్మటం, నమ్మకపోవడం నీ ఇష్టం… నాతో పని అయిపోయిందా?” అడిగిందా కంఠం.

“ఆరు జీవాల ఉసురును దిగమింగి అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా? ఎవరివల్ల ఆ ప్రమాదం వస్తుంది? ఎలా వస్తుంది? వివరాలు చెప్పు” అడిగాడు వార్షికుడు.

“చామంతిచాయ మేను…. నవ్వితే సొట్టలుపడే బుగ్గలు. ఎదిరిస్తే అధఃపాతాళానికి సాగనంపే బలిష్టమయిన హస్తాలు… వెనకాల సన్నజాజి తీగవంటి నారీమణి…. వివరాలు కనిపించటంలేదురా… ఇప్పటికి ఇవే ఆఖరి మాటలు….” తీవ్రంగా ఆలోచించి మాట్లాడుతున్నట్టు ఆగిఆగి చెప్పుకొచ్చిందా ఆకారం….

“అసంభవం…. అతి బలసంపన్నుడయిన నా చక్రవర్తిని సాధారణమైన వీరుడు ఎదిరించటం అసంభవం…. వాడివెనుక ఒక ఆడది వుంటే – నా చక్రవర్తి వెనుక యంత్ర తంత్ర మంత్ర విద్యల్లో మొనగాడినయిన నేను వుంటాను….” చెప్పాడు వార్షికుడు.

“నువ్వు కాదు, నేను వెనుక నిలబడినా జరుగబోయేది ఏదో జరిగే తీరుతుంది. అక్రమ కృత్యాలతో, మదమాత్సర్యాలతో క్షణక్షణం రోజురోజు నిముష నిముషం మహా పాపకృత్యాలు కావిస్తూ చెడుకు ప్రతిరూపంగా తయారవుతున్న మీ భుజంగ భూపతికి చాలా దగ్గిర్లోనే వున్నది పతనం…” అంటూ మాటల్ని ఆపింది ఆ రూపం.

ఇంకా ఏదో చెపుతుందని ఊపిరి బిగపట్టి ఎదురు చూశాడు వార్షికుడు. ఎంతసేపటికీ మాట్లాడకపోయేసరికి, విపరీతమయిన ఆలోచనలతో ఒక్కసారిగా ముడుతలు పడింది అతని నుదురు.

“ఇంకా కొన్ని మహిషాల్ని బలి ఇచ్చి ఇంకోసారి ఆవాహన చేయండి దొరా” నెమ్మదిగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు అతని అనుచరుల్లో ఒకడు.

“అది వీలుపడని పనిరా… అమావాస్య అష్టమగడిలో వున్నప్పుడే మనకి అందుబాటులోకి వచ్చే శక్తి ఇది. మామూలు సమయాల్లో మహిషాలనే కాదు, మన తలల్ని నరికి బలిగా ఇచ్చినా పన్నెత్తి పలుకదు…” గట్టిగా నిట్టూరుస్తూ వివరించి చెప్పాడు వార్షికుడు.

“మరి ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? వినిపించిన మాటల్ని తీసుకుపోయి చక్రవర్తి చెవులకు చేరవేయటమేనా?” వెంటనే అడిగాడు ఆ వ్యక్తి.

తనను సింహాసనం మీదినించి కిందికి లాగే మొనగాడు ఒకడు భూమి మీద వున్నాడని తెలిసిన మరుక్షణం చక్రవర్తి మొఖంలో ఎలాంటి మార్పు వస్తుందో ఊహించుకునేసరికి పచ్చని వేపాకులు కొన్ని నమిలినట్టు పరమ చేదుగా తయారయింది వార్షికుడి నోరు.

సభా భవనం దద్దరిల్లిపోయేటట్లు పొలికేకలు పెడుతూ సింహాసనం మీది నించి లేస్తాడు, తన చేతికి ఎల్లప్పుడు అందుబాటులో వుండే ఖడ్గాన్ని తీసుకుని “వద్దు…. ఈ మాటల్ని మనం ఆయనకి చెప్పవద్దు” తనకు తెలియకుండా బిగ్గరిగా అరిచాడు వార్షికుడు.

“రాబోయే వసంతోత్సవాలకు హరిహరపురం వెళ్ళాలని చక్రవర్తి ఆకాంక్ష. రాజధాని వదిలి ఎక్కడికయినా బయలుదేరేముందు మంచి చెడులు చూడమని మనకి వర్తమానం పంపించే అలవాటు ఆయనది. మరి ఇప్పుడు ఏమని చెప్పాలి?” అడిగాడు ఆ అనుచరుడు.

“అంతా మంచే జరుగుతుందని చెప్పేస్తే సరిపోతుంది… సింహాసనం మీదినించి పడిపోవడం ఇప్పటికిప్పుడు జరగబోవడంలేదు కదా… ఆ సమయం వచ్చే లోపల ఏదో ఒక ఉపాయం ఆలోచించుకోవచ్చును” ఉన్నట్లుండి పెదవులు విప్పి తను అనుకుంటున్నది బయటపెట్టాడు ఇంకో అనుచరుడు.

“ఆ ఆటలు చక్రవర్తి ముందు సాగవురా… జరగబోయే చెడును చెప్పటంతోపాటు ఆ పరిస్థితిని తప్పించుకునే మార్గం చెప్పేస్తే సంతోషిస్తాడు…” రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్న వార్షికుడు వెంటనే అన్నాడు.

“అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమని మీ ఆజ్ఞ?” అడిగాడు మొదటి అనుచరుడు.

“మన కాలపిశాచి విగ్రహం పాదాల దగ్గిర కాలకూట విషానికంటె భయంకరమైన మంత్రాలు లిఖించబడిన మంత్రం గ్రంథం వుంది. దాన్ని తీసుకురండి….”

వెంటనే కదలబోయిన అనుచరుల్ని మళ్ళీ తానే చేతులు తట్టి వెనక్కి పిలిచాడు. “బలి కావాలని అంటుంది కాలపిశాచి. గ్రంథపఠనం చేసిన తర్వాత ఇస్తామని వాగ్ధానం చెయ్యండి” అని చెప్పాడు. తలలు ఊపి ఆ మందిరంలోనించి బయటికి పరిగెత్తారు వాళ్ళు.

* * *

“మూడు మూరల ఎత్తు, తొమ్మిది మూరల పొడుగు…. అబ్బో…. దీన్ని మానవమాత్రుడు ఎవరూ వధించలేరు. అది కూడా సరైన ఆయుధం లేకుండా వట్టి చెట్టుకొమ్మతో పడగొట్టడం – నాకు నమ్మకం లేదు.”

ఆశ్రమం వెలుపలవుండే ఒక బండరాయిమీద చంద్రుడు పడవేసిన మహావ్యాఘ్రపు శరీరాన్ని అదేపనిగా చూస్తూ నాలుక చప్పరించాడు ఉన్మత్తుడు.

అతని అసలు పేరు అదికాదు. అయినా అందరూ అతన్ని అలాగే పిలుస్తారు. అతను మాట్లాడితే మౌనంగా నిలబడి వింటారు. ఎందుకంటే అతను సామాన్యుడు కాదు, పాంచాలరాజ్యానికి కాబోయే మహారాజు.

“నువ్వు చెప్పింది నిజమే మిత్రమా… అసలు జరిగింది ఏమిటంటే ఈ దుష్టమృగం మన చంద్రుడి మీదికి లంఘించే సమయంలో అక్కడికి కొందరు వనదేవతలు వచ్చారు. పాంచాల రాజ్యానికి కాబోయే మహారాజు ఉన్మత్తుల వారితో కలిసి చదువుకుంటున్నామని వారికి నేను చెప్పాను. వెంటనే వారి చేతుల్లోనించి మెరుపులు బయటకువచ్చి దీన్ని అంతం చేసేశాయి” ఎవరికీ తెలియని మహారహస్యాన్ని బయటపెడుతున్నట్టుగా మొఖంపెట్టి చెప్పింది వారుణి.

“మిత్రమా…. వారుణి నిన్ను వెక్కిరిస్తోంది” అందరూ ఫక్కున నవ్వడంతో ఉన్మత్తుడి చెవిలో అదే విషయాన్ని ఊదాడు అతని స్నేహితుడు ఒకతను.

ఎర్రబడిపోయాయి ఉన్మత్తుడి కళ్ళు.

గట్టిగా బిగుసుకున్నాయి పిడికిళ్ళు.

పటపటమని శబ్దం చేశాయి దంతాలు.

“ఏం జరుగుతోంది ఇక్కడ?” గంభీరంగా వినవచ్చింది ఉత్పల మహర్షి కంఠం.

మంత్రం వేసినట్టుగా మాయమైంది ఉన్మత్తుడి ఆవేశం. అసలు కోపం అంటే ఎలా ఉంటుందో తెలియనట్లు అమాయకంగా చూస్తూ నిలబడిపోయాడతను.

అతన్ని మరింతగా ఆటలు పట్టించటానికి సంసిద్ధురాలై ఉన్న వారుణి కూడా నిలుచుండిపోయింది ఏమీ ఎరుగనిదానిలా.

పరమ శాంతమూర్తి మాదిరిగా కనిపించే ఉత్పలమహర్షిలో అణిగిమణిగి ఉంటుంది దారుణమైన కోపం. ఆశ్రమ నియమాలకు విరుద్ధంగా నడుచుకున్నా, అనవసరమైన గొడవలకు కారణమైనా, ఆ పని చేసినవారి మీద అగ్నిహోత్రం మాదిరి విరుచుకుపడతాడాయన. శిక్ష కఠినంగా ఉంటుంది. ఒక్కోసారి ఆశ్రమ బహిష్కారం విధింపబడవచ్చు.

ఉత్పల మహర్షి ఆశ్రమంలో నుంచి బహిష్కృతుడైన విద్యార్ధికి విద్యను నేర్పే సాహసం ఎవరూ చేయరు. నిరక్షర కుక్షి మాదిరి బ్రతుకవలసిందే. తన ఆగమనాన్ని గమనించి శిలా విగ్రహాల్లా బిగుసుకుపోయిన విద్యార్థులందరి వంకా చాలా నిశితంగా చూశాడాయన ఇప్పుడు.

“అసలు ఇక్కడ జరుగుతున్నదేమిటి?” అడిగాడు.

“అదీ… అసలు విషయం ఏమిటంటే…. మన చంద్రుడు” తడబడకుండా ఉండటానికి విశ్వప్రయత్నం చేస్తూ మాటలు మొదలుపెట్టాడు ఒక విద్యార్థి. అంతలోనే గురువుగారి చూపు మహా వ్యాఘ్రపు శరీరం మీదికి మరలాయి.

“అరెరే…. ఇది సుభోది పర్వతాల మధ్య సంచరించే దుష్ట దుర్మార్గపు జీవి. చర్మం చాలా మందంగా ఉంటుంది. మామూలు ఆయుధాలతో దీన్ని నిర్జించటం కష్టం… మెడ ఎముక విరిగితే తప్ప దీని ప్రాణాలుపోవు” ఆశ్చర్యంగా మాట్లాడుతూ మరికొంచెందగ్గరికి పోయి మరింత నిశితంగా చూశాడు ఉత్పల మహర్షి.

“అదే జరిగింది గురుదేవా! మన చంద్రుడు ఒక సామాన్యమైన చెట్టుకొమ్మతో దీని మెడని విరిచేశాడు” ఎంత బిగపట్టుకున్నా అణిగివుండని ఉత్సాహంతో చెప్పింది వారుణి.

వారుణి చెప్పినదానికి సంతోషంగా తల ఊపవలసిన గురుదేవుడు చటుక్కున తలతిప్పి సూటిగా చూశాడు ఆమె మొఖంలోకి.

“ఎక్కడో అడవిలో చంద్రుడు చేసిన ఘనకార్యాన్ని గురించి నీకెలా తెలిసింది?” కనులు చిట్లిస్తూ అడిగాడు.

End of Preview.

Rest of the book can be rented / bought @ http://kinige.com/kbook.php?id=192


Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>