ఒక పెద్ద కుదుపు కుదిపి సడన్‌గా ఆగిపోయింది శ్యామ్ సుందర్ డ్రయివ్ చేస్తున్న అంబాసిడర్.
అంతకు వారంరోజుల క్రితమే ఖరీదు చేసిన వెహికల్ అది. ఎంత పిచ్చిపిచ్చిగా నడిపినా మరో ఆరు ఏడు నెలలవరకూ ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాదని నొక్కి నొక్కి చెప్పాడు ఆ కారును అంటగట్టిన ఆటో మైబైల్ షోరూమ్ ఓనర్.
నోటికి వచ్చిన ఘాటయిన మాటలన్నిటినీ ఉపయోగించి అతన్ని తిట్టిపోద్దామనుకున్నాడు శ్యామ్‌సుందర్. ప్రక్కనే వాసంతి కూర్చుని ఉన్నదనే విషయం గుర్తుకువచ్చి, తన ఇరిటేషన్ని తనలోనే అదుముకున్నాడు.
‘మోటార్ వెహికల్స్‌నే కాదు, మిరియాల పొడుమునుకూడ బాగా ఆలోచించి ఖరీదు చేయాలి. రోడ్డుమీద నడుస్తూ నడుస్తూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇదిగో…. ఇలాగే వుంటుంది.’ అతని మనసులోని ఆలోచనల్ని అతి తేలికగా పసికట్టి కూల్‌గా తన అభిప్రాయాల్ని వెల్లడించింది వాసంతి.
సిటీ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలో సెక్రటరీగా పనిచేస్తున్నది ఆమె. ఆ సంస్థకు యజమానులలైన ఇద్దరిలో రెండోవాడు శ్యామ్‌సుందర్.
తనకు ఇవ్వవలసిన నాలుగు నెలల జీతంలో ఒక్క పైసా కూడా ఇవ్వకుండా, ఆ కారుకు ఖరీదు చేసి తీసుకు వచ్చిన క్షణంనుంచీ వాసంతి సరయిన అవకాశం కోసం ఎదురు చూస్తోందని అతనికి తెలుసు. అనుకోని విధంగా ఆమె చేతికి దొరికిపోవటం తల కొట్టేసినట్లయింది అతనికి. విసురుగా క్రిందికి దిగి, ఊడి అవతల పడిపోయేటంత గట్టిగా డోర్‌ని మూశాడు.
“అనవసరమైన ఆవేశంలో మునిగి ఇంజన్లో చేతులు పెట్టడం వేస్టు. ఆరునెలల గారెంటీ ఇచ్చాడు ఈ పుష్పక విమానాన్ని మీకు పంపకంచేసిన పెద్దమనిషి. దగ్గిర్లో ఏదయినా ఫోన్ వుందేమో చూసి అతనికి కబురు అందించండి….తోసుకు పోవటానికి నలుగురు మనుష్యుల్ని తెచ్చుకోమని చెప్పండి.” తను కూడా క్రిందికి దిగి రోడ్డుకు రెండోప్రక్కన నిలబడుతూ అన్నది వాసంతి.
మరింతగా ఇరిటేట్ అయిపోయాడు శ్యామ్‌సుందర్. బోనెట్‌ని తెరిచి ఇంజన్లో తల దూర్చాలనే ఆలోచనను వెంటనే విరమించుకొని, అల్లంత దూరంలో అగుపిస్తున్న ఒక వెలుగువైపు అడుగులు వేశాడు
సిటీ సెక్యూరిటీ సర్వీసెస్‌కి సంబంధించిన ఒక ఎస్సైన్మెంట్ మీద బెంగుళూరు వెళ్ళివస్తున్నాడు అతను, వాసంతి.
అప్పటికి రాత్రి పదిగంటలు అయింది. సిటీ ఇంకో ఆరు గంటల ప్రయాణ దూరంలో వున్నదనగా వచ్చిపడింది ఆ ట్రబుల్.
అవటానికి అది మెయిన్‌రోడ్డే అయినా, ఆ సమయంలో తమ గోడును వినిపించుకొని, ఏదయినా హెల్ప్ చేయగలవారు చాలా తక్కువ మంది కనిపిస్తారని తెలిసి కూడా ముందుకుపోయాడు శ్యామ్‌సుందర్.
కారు దగ్గర వుండగా కనిపించిన వెలుగు, అప్పుడే మూతబడబోతున్న ఒక బడ్డీకొట్లోనుంచి వస్తున్న పెట్రోమాక్స్లైటు కాంతి అని అర్థమై మరింత వేగంగా నడిచాడతను. బడ్డీకొట్టు తలుపులు పూర్తిగా మూసుకోక ముందే అడ్డుపడి, యజమానిని పలుకరించాడు.
“ట్రంకురోడ్డుకదా….వచ్చేపోయే వాహనాలు, లారీలు ఏవైనా ఇక్కడ ఆగి సిగరెట్లు, పచ్చిమిరపకాయ బజ్జీలు కొనుగోలు చేస్తారనే ఆశతో ఈ సమయం వరకూ బడ్డీని తెరిచి వుంచుతాను….పెట్రోమాక్స్ లైటుకు కావల్సిన కిరసనాయిలు ఖర్చుకూడా గిట్టుబాటు కావటంలేదు….” శ్యామ్‌సుందర్ చూపించిన సిగరెట్ పాకెట్ని తీసిస్తూ, తన గోడును వెళ్ళబోసుకునానడు ఆ బడ్డీ వోనర్.
పచ్చిమిరపకాయ బజ్జీల పేరును వినేసరికి నోరు ఊరింది శ్యామ్ సుందర్‌కి. ఒక పెద్ద సత్తుపళ్ళెం నిండా పేర్చివున్న ఆ తినుబండారాల వైపు చేయి వూపబోతుండగా, వెనకనుంచి అతని వెన్నుమీద గట్టిగా కొట్టింది వాసంతి.
“నీకు కూడా కావాలా బజ్జీలు? నువ్వుకూడా తింటావా?” అటువంటి పదార్థాలను చూసి ఆమె అసహ్యించుకుంటుందని తెలిసి వుండటం వల్ల, ఆశ్చర్యంగా అడిగాడు శ్యామ్‌సుందర్.
“వాటి అవతారాన్ని జాగ్రత్తగా చూడండి….ఖచ్చితంగా మూడు రోజులై వుంటుంది వాటిని తయారుచేసి…..”లోగొంతుకతో అతనికి మాత్రమే వినిపించే టట్లు చెప్పింది వాసంతి.
బజ్జీలను ఆరగించాలనే కోరిక పూర్తిగా నశించిపోయింది ఆ మాటల్ని వినేసరికి శ్యామ్‌సుందర్‌కి.
“ఏదో ఒక అడ్డుపుల్ల వేసి ఎదుటి మనిషి ఉత్సాహంమీద చన్నీళ్ళు చిలకరించటంలో నువ్వు స్పెషలిస్టువి అయిపోయావు…. నిన్ను వెంటబెట్టుకు రావటం చాలా పెద్ద పొరపాటు అయిపోయింది” కచ్చ నిండిన కంఠంతో అంటూ, బడ్డీ యజమానికి తన బాధను గురించి చెప్పుకున్నాడు.
“దయ్యాలు తిరిగే వేళలో రోడ్డుమీద ఆగిపోవటం ఎంత ఇబ్బందిగా వుంటుందో మీకు తెలిసే వుంటుంది. ఏదో ఒక విధంగా సిటీలోకి మన గురించి మెస్సేజి పంపించాలి….దగ్గిర్లో ఫోన్ సౌకర్యం ఏదయినా వున్నదా?” అని అడిగాడు.
టెలివిజన్ ప్రసారాల్లో అగుపించే క్విజ్ ప్రోగ్రాం పార్టీసిపేంట్ మాదిరి సీరియస్ ముఖం పెట్టి, తన బడ్డీ వెనుక భాగంలోకి చూపించాడు ఆ పెద్దమనిషి.
“నాలుగు కిలోమీటర్ల దూరంలో వుంటుంది మా గ్రామం. మొత్తం నాలుగే నాలుగు టెలిఫోన్లు వున్నాయి. బిల్లులు కట్టలేదని మూడింటికి కనెక్షన్ కట్ చేశారు. నాలుగో ఫోన్ మా గ్రామ సర్పంచ్గారిది….పీకల దాకా మందుకొట్టి హాయిగా నిద్రపోతూ వుంటాడు. నిద్రలేపి కూర్చోబెట్ట గలిగే చాతుర్యం మీకు వుంటే నిముషాలమీద పని పూర్తి అయిపోతుంది” అంటూ అసలు విషయాన్ని అతినెమ్మదిగా వివరించి, బడ్డీ తలుపుల్ని లాక్ చేసుకున్నాడు.
బడ్డీ వెనుక భాగంలో నిలబెట్టివున్న అతని సైకిల్వంకా, అతని వంకా మార్చి మార్చి చూశాడు శ్యామ్‌సుందర్. సర్పంచిగారి ఇంటివరకూ లిఫ్ట్ ఇస్తాడేమో నని ఆశించాడు.
“వెనుక టైర్లో గాలి చాలా తక్కువగా వుంది. డబుల్స్ ఎక్కితే ఢామ్మని ట్యూబ్ పేలిపోతుంది….” అంటూ తన నిస్సహాయతను వెల్లడించి అతని సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయాడు. బడ్డీ యజమాని.
“వెనుక టైరు బాగానే వున్నది. డబుల్సు మాత్రమేకాదు, త్రిబుల్సు ఎక్కినా కూడా ఆ ట్యూబుకు ఏమీ కాదు….” అతను వంద అడుగుల దూరం వెళ్ళిన తరువాత మెల్లిగా కామెంట్ చేసింది వాసంతి.
“అంటే నీ ఉద్దేశం ఏమిటి? ఈ మాట నువ్వు నాకు ఎందుకు చెపుతున్నట్టు?” విసుగ్గా ఆమెకేసి తిరుగుతూ అడిగాడు శ్యామ్‌సుందర్.
“ఈ చీకటి వేళలో మనకు సహాయపడేవాళ్ళు దొరరు…. ఈ బడ్డీ యజమాని మాటలమీద నమ్మకముంచి గ్రామంలోకి వెళ్ళటం అనవసరం. తాగి తలకు పోసుకుని మత్తుగా పడివుండే సర్పంచిగారిని నిద్ర లేపటం అసంభవం…..” ఆగి ఆగి వీస్తున్న చలిగాలిని తట్టుకోలేక పమిటెచెంగును భుజాల చుట్టూ చుట్టుకుంటూ చెప్పింది వాసంతి.
“అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి?” వెంటనే ప్రశ్నించాడు శ్యామ్‌సుందర్.
“నిద్రమత్తులో డ్రయివ్ చేసే లారీ డ్రయివర్లు మీ పుష్పక విమానాన్ని ఢీకొట్టకుండా జాగ్రత్తలు తీసుకొని, లెఫ్ట్ రైట్ అనుకుంటూ నడక మొదలుపెట్టటం చాలా మంచిది. తెల్లవారే సమయానికి సిటీకి దగ్గర్లోకి వెళ్ళిపోవచ్చు. చల్ల బాటు వేళలో కాలినడక ఆరోగ్యానికి చాలా మంచిది” అంటూ వెనక్కు తిరిగి అంబాసిడర్ వైపు అడుగులు వేసింది వాసంతి.
ఆ సలహాను ఆచరణలో పెట్టడం కంటె, ఆమెను కార్లో కూర్చోబెట్టి తాను వెనుకనుంచి నెట్టుకుంటూ పోవడమే చాలా మంచిదని శ్యామ్‌సుందర్‌కి తెలుసు.
కాలినడక ఆరోగ్యానికి చాలా మంచిదని అనుకుంటూ, ఆమెను నడిపిస్తే, ఇంకో పది సంవత్సరాలు గడచిన తర్వాత కూడా ఆ ఇన్సిడెంట్‌ని ఆమె మర్చిపోదు. తనను మర్చిపోనీయదు. అవకాశం అభించినప్పుడల్లా ఆగర్భశత్రువు మాదిరి సూటీపోటీ మాటలతో చురలు వేస్తూనే వుంటుంది.
ఆరునెలల గ్యారంటీ విషయాన్ని కొద్దిసేపు ప్రక్కనపెట్టి, ఇంజన్ని చెక్ చేయాలనే నిర్ణయానికి వచ్చేశాడు శ్యామ్‌సుందర్. వడి వడిగా అడుగులు వేస్తూ, అంబాసిడర్‌ని సమీపించి, బోనెట్మీద చేయివేయబోతుండగా కలిగింది అతనికి ఆ అనుమానం.
“గెటిన్ వాసంతీ….గెటిన్…..కమాన్ క్విక్ !” అని వాసంతిని హెచ్చరిస్తూ, రోడ్డుకు ఆవలివైపున ఎత్తుగా ఎదిగివున్న ఒక చింతచెట్టు దగ్గరికి పరుగుతీశాడు.
అంతకు ముందువరకూ అతనిమాటల్ని, చేతల్ని నిర్మొహమాటంగా ఆక్షేపిస్తూ వచ్చిన వాసంతి, ఈసారి అటువంటి పని చేయలేదు. ఒక్క ఉదుటున డోర్‌ని తెరిచి, అంబాసిడర్ వెనుక సీటులోకి జంప్ చేసింది. తన హేండ్‌బ్యాగ్‌లో వున్న చిన్న ఫిస్టల్ని చేతుల్లోకి తీసుకుంటూ ఊపిరి బిగబట్టి చూసింది.
చింతచెట్టు క్రిందికిపోయి, పాతిక గజాల దూరంలో వున్న ముళ్ళపొదల కేసి పరిశీలనగా చూశాడు శ్యామ్‌సుందర్. పది నిమిషాల పాటు చూసిన తరువాత కూడా ఆ పొదల్లో ఎటువంటి కదలికా కనిపించకపోయే సరికి మెల్లగా వెనక్కి వచ్చాడు.
చేతిలోకి తీసుకున్న ఫిస్టల్ని హేండ్బేగ్లోకి నెడుతూ, బిగపట్టిన ఊపిరిని తేలికగా బయటికి వదిలింది వాసంతి.
నిన్న తెరిచిన ఒక పేటిక!
నేడు చదువుతున్న ఒక పుస్తకం!
రేపు ఒక పరమ రహస్యం…..
మృదు స్వరంతో పాట మాదిరి రిధమిక్‌గా అంటూ కారులోంచి దిగి అతని ప్రక్కకు వచ్చింది.
చింత చెట్టుకు ఆవలగా వున్న పొదల్లో ఏవో ఆకారాలు నిలబడి తమను వాచ్ చేస్తునట్లు అనిపించి అటుకేసి వెళ్ళాడు శ్యామ్‌సుందర్. నీడల్ని చూసి బెదిరే మనిషిగా వెక్కిరిస్తోంది వాసంతి.
వద్దు వద్దని ఎంతగా చెప్పినా ఆమెను తనవెంట, పంపిన తన పార్టనర్ వాత్సవమీద కారాలు మిరియాలు నూరుకుంటూ, బోనెట్‌ని ఎత్తి ఇంజన్ని చెక్ చేశాడు శ్యామ్‌సుందర్. ఇరవయ్ నిమిషాల పాటు ఆలోచించినా అది ఆగిపోవటానికి కారణం అర్థంకాకపోవటంతో బోనెట్‌ని క్రిందికి దించేశాడు.
ఎడమచేత్తో స్టీరింగ్‌ని మానిప్యులేట్చేస్తూ, భుజాన్ని విండో అందుకు ఆనించి కారును రోడ్డు ప్రక్కకు నెట్టాడు.
మరో రెండు మూడు గంటల్లో తెల్లవారుతుందనగా, నిద్రమత్తు ముంచుకు వస్తూ ఉంటుంది ట్రంకురోడ్లమీదా, నేషనల్ హైవేస్మీదా హెవీ లోడ్ వెహికల్స్‌ని నడిపే డ్రైవర్లకు.
అంతకు ముందే వాసంతి హెచ్చరించినట్లు తమ దారికి సమీపములో ఆగిపోయి వున్న వాహనాలను నిర్మొహమాటంగా ఢీకొట్టేస్తూ వుంటారు వాళ్ళు.
రోడ్డు అంచుకు నాలుగు గజాలు అవతలికిపోయిన తర్వాత అంబాసిడర్‌ని ఆపి, డోర్స్ అన్నిటినీ జాగ్రత్తగా లాక్చేశాడు శ్యామ్‌సుందర్. వెనక సీటులో తన బ్రీఫ్‌కేస్‌ను చేతుల్లోకి తీసుకొని లెఫ్ట్‌రైట్ మొదలుపెట్టాడు.
“చింతచెట్టు క్రింద నిజంగానే కదలికలు కనిపించాయా?” ఒక పావు కిలోమీటరు దూరం వెళ్ళిన తర్వాత మెల్లగా ప్రశ్నించింది వాసంతి.
ఆ రోడ్డుమీద ప్రయాణం చేసే వెహికల్స్ ఏవైనా కనిపిస్తే లిఫ్ట్ అడగటా నికి నిశ్చయించుకుంటూ, మౌనంగా తల వూపాడు శ్యామ్‌సుందర్.
ఆపైన అనవసరమైన మాటలతో అతన్ని డిస్టర్బ్ చేయలేదు వాసంతి. పెద్ద పెద్ద ఇండస్టిృయల్ ఎస్టేట్స్‌లో వుండే రకరకాల ఫ్యాక్టరీలకు సెక్యూరిటీ సిస్టమ్స్‌ని అరేంజి చేయటమే కాకుండా, చిన్న చిన్న దొంగతనాల దగ్గర్నుంచి, ఎన్నెన్నో నేరాలనుకూడా ఇన్వెస్టిగేట్ చేయటం సిటీ సెక్చూరిటీ సర్వీసెస్ స్పెషాలిటీ.
అటువంటి పనుల్లో తలదూర్చటం వల్ల, క్రైమ్ వరల్డ్‌లో చాలా మందికి పూర్తిగా గుర్తుండిపోయారు శ్యామ్‌సుందర్, అతని పార్టనర్ వాత్సవ.
వారి ఇన్వెస్టిగేషన్స్ మూలకంగా కటకటాల వెనక్కి వెళ్ళినవాళ్ళు, వాళ్ళ జోక్యం మూలకంగా రకరకాల నష్టాలు ఎదుర్కొన్న వాళ్ళు ఎంతోమంది వున్నారు. ఏమాత్రం అవకాశం లభించినా కక్ష తీర్చుకునే ప్రయత్నాలు చేస్తూనే వుంటారు వాళ్ళు.
గతంలో తము ఫేస్చేసిన అటువంటి ఇన్సిడెంట్స్‌ని గుర్తుకు తెచ్చు కొనేసరికి, చుట్టూ వున్న వాతావరణం ఒక్కసారిగా వెచ్చబడిపోయినట్లు, స్వేద బిందువులు ఆవిర్భభవించాయి ఆమె ముఖంమీద.
అనవసరమైన కామెంట్స్ చేసి అంబాసిడర్‌ని రిపేరు చేయకుండా తను అడ్డుకోవడం జరిగిందేమోనన్న గిల్టీఫీలింగ్ ఆమెను ఆవరించుకున్నది.
ఆ ఆలోచనలతో సతమతం అవుతూ వుండడం వల్ల, ఒక అరగంట గడిచిన తరువాత వున్నట్లుండి శ్యామ్‌సుందర్ ఆగిపోవటాన్ని గమనించలేదామె. అతనిమీద పడబోతూ, ఆఖరి క్షణంలో తమాయించుకున్నది. పమిటె చెంగును మరింత టైట్‌గా భుజాలకు చుట్టుకుంటూ ప్రశ్నార్థకంగా అతని ముఖంలోకి చూసింది.
“నా ముఖంలోకి చూసినందువల్ల ఉపయోగం ఏదీ వుండదు…. ముందుకు చూడు” లోగొంతుకతో ఆమెను హెచ్చరిస్తూ, ఆమె చేతిని పట్టుకొని రోడ్డుప్రక్కకు నడిపించాడు శ్యామ్‌సుందర్.
అతని కంఠంలో ప్రతిఫలిస్తున్న అదోరకమైన ఎగ్జయిట్‌మెంట్‌ని వెంటనే గుర్తుపట్టి, మరింత ఖంగారుకు గురిఅయింది వాసంతి.
తను చేయదలచుకున్న పనుల్ని సాధించడం కోసం ఎంతమొండిగా ముందుకు దూసుకుపోతాడో, అంతకు రెట్టింపు మొండితనంతో తనకు సంబంధంలేని వ్యవహారాల్లో వేళ్ళు పెడతాడు శ్యామ్‌సుందర్.
ఎక్కడయినా, ఏదయినా ట్రబుల్ స్టార్ట్ అవుతూ వుండటాన్ని తను చూడటం అంటూ జరిగితే రెప్పపాటు కాలంలో అక్కడికి వెళ్ళిపోతాడు.
అతను చూడమన్నట్లు ముందుకు చూస్తూ, తన ఆలోచనలు యదార్థ రూపాన్ని ధరించటానికి ఎంతోవ్యవధి అవసరంలేదని అర్థం చేసుకున్నది వాసంతి.
వారు నిలబడిన ప్రదేశానికి సరిగ్గా వంద గజాల దూరంలో కనిపిస్తోంది ఒక ఎత్తయిన వంతెన.
ఒకరినొకరు నెట్టుకొంటూ, ఒకరితో మరొకరు కుస్తీలు పడుతున్నట్లుగా గుంపుగా కనిపిస్తున్నారు అరడజనుమంది ఆగంతకులు ఆ వంతెన మీద.
“తప్పతాగి, ఆ మైకంలో వళ్ళు తెలియక అలా నెట్టుకుంటున్నారు… .రెండు నిమిషాలపాటు ఓపికపడితే వాళ్ళదారిన వాళ్ళు వెళ్ళిపోతారు” తడి ఆరిపోతున్నట్లు తయారయినా కంఠంతో మెల్లిగా అన్నది వాసంతి.
“తప్పతాగిన బేచ్ కాదు అది …. లావుపాటి సూట్‌కేస్‌ను పట్టుకున్న ఒక అమాయకుడిని అడ్డగిస్తున్నారు ఐదుగురు దొంగరాస్కెల్స్. అతని సూట్‌కేస్‌ను స్వాధీనం చేసుకొని పారిపోవటానికి ట్రైచేస్తున్నారు వెంటనే చెప్పాడు శ్యామ్‌సుందర్.
అతని మాటలు యదార్థమని అరక్షణం తరువాత అవగతమయ్యే సరికి, నోరు మరింతగా తడి ఆరిపోయిన అనుభూతి వాసంతిని ఆవరించుకొన్నది.
“వాళ్ళ గొడవ ఏదో వాళ్ళనే పడనిద్ధాం….తెల్లవారేవరకు లెఫ్ట్‌రైట్ కొట్టాలని నిర్ణయించుకున్నాం కాబట్టి, ఒక పదినిముషాలపాటు ఇక్కడే నిలబడితే ఇప్పుడు మనకు రాబోయే నష్టం ఏమీ వుండదు. మనం ఎట్టి పరిస్థితిలోనూ ముందుకు పోవద్దు” ఆందోళనగా అంటూ శ్యామ్‌సుందర్ చేతిని గట్టిగా పట్టుకొన్నది.
సరిగ్గా అదే సమయంలో, బాధాసూచకమైన శబ్దాలు చేస్తూ వంతెన మధ్యలో వెల్లకిలా పడిపోయాడు సూట్‌కేసును పట్టుకుని వున్న వ్యక్తి.
“కొట్టండి….తల పగిలిపోయేటట్లు కొట్టండి….. కొట్టండి….”బిగ్గరగా అరిచాడు అతన్ని చుట్టుముట్టి వున్న ఆగంతకుల్లో ఒకతను.
అంతకుముందు అటూఇటూ చిందులు తొక్కటంలో క్రింద పడిపోయిన లావుపాటి లాటీవంటి చేతికర్ర నొకదాన్ని క్రిందినించి తీశాడు మరోవ్యక్తి.
ఆపైన క్షణం కూడా ఆలస్యం చేయలేదు శ్యామ్‌సుందర్. వాసంతి చేతిని వదిలించుకొని వింటినుంచి వెలువడిన బాణంలా వంతెనమీదికి పరుగు తీశాడు.
గుండెలనిండా గాలిని పీల్చుకోవటానికి కాబోలు రెండు క్షణాలు ఆగాడు చేతికర్రను పట్టుకున్న వ్యక్తి. రాకెట్ మాదిరి వేగంగా దూసుకువస్తున్న ఆకారాన్ని గమనించి, అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేశాడు.
తను వంతెనమీదికి చేరుకునేలోపల, అతను క్రిందపడిపోయిన వ్యక్తిని ఎటాక్ చేయదలచుకుంటే ఎలా అడ్డుకోవాలో తెలియక, చెవులు చిల్లులుపడి పోయేలా బిగ్గరగా అరిచాడు శ్యామ్‌సుందర్.
“రండి రండి….అందరూ వంతెనమీదికి వచ్చేయండి….ఒక్క దొంగ రాస్కెల్‌ని కూడా అవతలికి పోనీయకూడదు….రండి రండి….” అని ఆ చుట్టుపట్ల సంచరిస్తున్న తన ఫ్రండ్స్ని పిలుస్తున్నట్లుగా కేకలు పెట్టాడు.
మరింత అయోమయానికి గురైపోయాడు చేతికర్రను పట్టుకున్న వ్యక్తి. ఛెంగున ప్రక్కకు దూకి, వంతెన క్రింది భాగంలోకి తొంగి చూశాడు.
తిరిగి అతను తల పైకి ఎత్తే సమయానికి, అతని సమీపంలోకి చేరుకోనే చేరుకున్నాడు శ్యామ్‌సుందర్.
“రండి రండి ….అందరూ రండి” అని తన అరుపుల్ని కంటిన్యూ చేస్తూనే అమాంతంగా గాలిలోకి ఎగిరి అతని గుండెమీద తన్నాడు.
అతనంత వేగంగా కదలగలడని వూహించకపోవడం వల్ల, వెనక్కి దూకి ఆ దెబ్బనుంచి తనను తాను కాపాడుకోవటానికి ప్రయత్నం చేయలేదా వ్యక్తి.
బరువైన కాంక్రీట్ దిమ్మలు రెండు ఒకేసారి వచ్చి తన గుండెలకు తగిలినట్లు కీచుగా అరుస్తూ, వెనక్కి తూలాడతను.
అతని గుండెలకు కనెక్ట్ అయిన పాదాలు, నేలమీదికి దిగిన మరుక్షణం, రెండు అడుగులు ముందుకు వేశాడు శ్యామ్‌సుందర్. అతని చేతి లోని లాటీవంటి కర్రను తన స్వాధీనం చేసుకుని, రెట్టించిన వేగంతో మిగిలిన వారిమీద కలబడ్డాడు.
వెర్రి ముఖాలు వేసుకొని చూస్తున్నారు వారందరూ….మోటారు వెహికిల్స్‌లో తప్ప కాలినడకన ఆ సమయంలో అటుగా వచ్చేవారెవరూ వుండరనే విశ్వాసంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటున్నారు వారు- అనుకోని విధంగా వచ్చిపడిన ఆ పర్సనాలిటీని ఎలా ఎదుర్కోవాలో వారికి అర్ధం కాకముందే, పూనకం వచ్చిన మనిషిలా వారిని చెల్లా చెదురు చేసేశాడు శ్యామ్‌సుందర్. చేతికర్రను గిర్రుగిర్రున త్రిప్పుతూ దొరికిన వారిని దొరికినట్లు విరగబాది వెనక్కి నెట్టేశాడు.
వంతెనకు అటు ఇటు నిర్మించబడివున్న కాంక్రీట్ రెయిలింగ్స్ని పట్టుకుని అర్జంటుగా క్రిందికి జారిపోయారు వారిలో ఇద్దరు. వంతెన అవతల దట్టంగా ఎదిగివున్న పొదల్లోకి పోయి అదృశ్యం అయ్యారు మరో ఇద్దరు.
దుస్తుల్లో దాచుకొని వున్న పొడవాటి పేష్కప్‌ని బయటికి తీసి, పెద్దపులిలా తన మీదికి దుముకబోయిన అఖరి వ్యక్తి భుజాలు విరిగిపోయే టట్లు చేతికర్రను విసిరాడు శ్యామ్‌సుందర్.
బాధను భరించటం అసాధ్యం అయింది కాబోలు, వెర్రిగా అరిచి, పేష్కప్‌ని వదిలేశాడు ఆ వ్యక్తి. అంతకుముందు రెండు క్షణాలక్రితం తన సహచరులు ఇద్దరు వంతెన క్రిందికి జారిపోయినట్లు, కాంక్రీట్ రెయిలింగ్స్ని పట్టుకుని జారలేదతను. ఒలింపిక్స్ డైవింగ్ పోటోల్లో పాల్గొంటున్నట్లు అమాంతంగా ఎగిరి, వంతెనక్రింద ప్రవహిస్తున్న ఒక వాగులోకి దూకేశాడు.
అతను వదిలేసిన పేష్కప్‌ని వెతికి చేతిలోకి తీసుకున్నాడు శ్యామ్‌సుందర్. సన్నపాటి వెంట్రుకను కూడా రెండుగా చీల్చగలిగేటట్లున్న దాని పదునును ఎడమచేతి చూపుడు వేలితో పరిశీలిస్తూ, క్రిందపడిపోయిన వ్యక్తికి కుడిచేతిని అందించబోయాడు.
కృతజ్ఞత ఉట్టిపడే చూపులతో ఆ చేతిని అందుకొని పైకి లేవాలి ఆ వ్యక్తి అతని అంచనా ప్రకారం. తను క్రిందపడిన తర్వాత కూడా వదిలి పెట్టకుండా గట్టిగా పట్టుకొని వున్న తన సూట్‌కేసును వదిలి అతనికి నమస్కారం చేయాలి. తన ప్రాణాల్ని కాపాడటానికి ఆకాశంలో నుంచి వూడిపడిన దేవదూతవని వల్లిస్తూ థేంక్స్ చెప్పుకోవాలి.
అటువంటి వాటిల్లో ఒక్కటి కూడా చేయకపోగా, దెబ్బతిన్న అడవి జంతువు మాదిరి వికృతంగా ముఖం పెట్టి, చాలా వయొలెంట్‌గా బిహేవ్ చేశాడా వ్యక్తి. శ్యామ్‌సుందర్ చేతిని అవతలుక విసిరికొట్టాడు. నేలకు తాటించిన రబ్బరు బంతి మాదిరి వేగంగా పైకి లేచి, ఒక్కసారిగా పిక్కబలం చూపించాడు.
రెండు క్షణాలు పట్టింది శ్యామ్‌సుందర్‌కి తన ఆశ్చర్యం నుంచి తేరుకోవటానికి, తేరుకున్న వెంటనే, గురిచూసి విసిరాడతను లాటీ వంటి చేతికర్రని.
గింగిరాలు తిరుగుతూపోయి, ఆఘమేఘాలమీద వెళ్ళిపోతున్న సూట్‌కేసు పర్సనాలిటీ పాదాలమధ్య దూరింది అది.
బాలెన్స్ తప్పి ముందుకు పడిపోయాడా వ్యక్తి. పడిన వెంటనే పైకి లేవటానికి ప్రయత్నించేలోపల, మెరుపువేగంతో అతన్ని సమీపించి, చేతికర్రతో భుజాలమీద బలంగా మోదాడు శ్యామ్‌సుందర్.
గావురుమని అరిచి మరోసారి రోడ్డును కౌగలించుకున్నాడా వ్యక్తి. స్పృహ తప్పటం వల్ల కాబోలు, సూట్‌కేసును వదిలేశాడు.
అవసరం అయితే మరో దెబ్బ వేయటానికి రెడీ అవుతున్న శ్యామ్‌సుందర్ దగ్గిరికి పరిగెత్తుకువచ్చి, అతి బలవంతంగా తన స్వాధీనం చేసుకున్నది యమదండం మాదిరి మారిపోయిన చేతికర్రని.
“మతిపోయినట్లు ప్రవర్తించటం ఈమధ్య నీకు బాగా అలవాటు అయిపోయింది. ఇతన్ని కాపాడటం కోసం హీరో మాదిరి పరిగెత్తుకువచ్చి, ఇప్పుడు నువ్వు చేస్తోంది ఏమిటి?” పట్టరాని కోపంతో, అతను తన బాస్ అనే మాటను మరిచిపోయి, యకాయకిని ఏకవచనంతో సంబోధిస్తూ అడిగేసింది.
అరగంటకు కనీసం ఆరు వెహికల్స్ అయినా అటూ ఇటూ తిరుగుతూ వుండే ఆ రోడ్డుమీద అప్పటికి ఒక గంటనుంచీ ఒక్క వాహనం కూడా కనిపించనం దుకు ఆశ్చర్యపోతూ, పాంటు జేబులో భద్రంగా దాచుకొని వున్న సిగరెట్ పాకెట్ని బయటికి తీశాడు శ్యామ్‌సుందర్. సిగరెట్‌ని వెలిగించుకొని పొగను గుండెలనిండా పీల్చుకొంటూ చిరునవ్వు నవ్వాడు.
కోపం వస్తే రాక్షసుడి మాదిరి చిందులు తొక్కే శ్యామ్సుందర్నే చూసి వున్నది వాసంతి. ఒక మనిషి భుజాలు విరిగిపోయేటట్లు కొట్టి అలా చిద్విలాపంగా చిరునవ్వుల్ని చిందించే శ్యామ్సుందర్ని అంతకుముందు ఎన్నడూ చూసి వుండలేదు.
“ఆర్ యూ ఆల్రైట్ ? వంతెనమీద దెబ్బ ఏదీ తగలలేదుకదా!” ఆందోళనను అణచుకోవటానికి ప్రయత్నిస్తూ అడిగింది.
తన హీరోయిజానికి బెదిరి దూరంగా పారిపోయిన వ్యక్తులెవరయినా తన చర్యల్ని గమనించేందుకు ఆ చుట్టుపట్ల తచ్చట్లాడుతున్నారో లేదో ఒకసారి గట్టిగా చూసుకుని ఆమెకు సైగ చేశాడు శ్యామ్‌సుందర్.
“మనం చేసిన సహాయాన్ని తలుచుకొని పరవశించిపోతూ మన పాదాలకు నమస్కారం చేయవలసిన ఈ పెద్దమనిషి పిచ్చిపట్టిన శునకం మాదిరి మనమీదికి ఎగబడటానికి ఏదో కారణం వుండే వుంటుంది….అదేమిటో తెలుసుకోనిదే ఇక్కడ్నించి అవతలకు పోవటం నాకు చేతకాదు. సాయంపట్టు వాసంతీ…..ఇతన్ని అవతలకు తీసుకుపోవటానికి హెల్ప్చేయి.” అంటూ అచేతనంగా పడివున్న ఆ వ్యక్తిని అమాంతంగా భుజం మీదికి ఎత్తుకున్నాడు.
అతని ఆలోచన ఏమిటో అర్ధం చేసుకోవటానికి విపరీతమయిన ప్రయత్నం చేస్తూ, ఆ వ్యక్తి వదిలేసిన సూట్‌కేసును తను తీసుకున్నది వాసంతి.
పాంటు జేబులో నుంచి ఒక పెన్సిల్ టార్చిని బయటికి తీసి, దాని వెలుగులో దారి చూసుకుంటూ రోడ్డుకు ఎడమచేతి వైపున వున్న పొదల్లోకి దారితీశాడు శ్యామ్‌సుందర్. పాతికగజాల దూరం వెళ్ళిన తరువాత అగుపించిన ఒక చిన్న మెరక ప్రదేశంలో భుజంమీది వ్యక్తిని పడుకోబెట్టి, అతని బుగ్గల్ని తట్టాడు.
అర నిముషం తరువాత కనులు తెరిచాడా వ్యక్తి……
అంతకుముందు మాదిరిగానే వికృతంగా చూస్తూ, ప్రక్కకు దొర్లే ప్రయత్నం చేశాడు.
“ఇతని ప్రవర్తన నాలో రకరకాల అనుమానాల్ని రేకేత్తిస్తోంది. తాపీగా కూర్చొని ఒకసారి ఆ సూట్‌కేసు ఓపెన్చేయి వాసంతీ….
అందులో ఎటువంటి నిధి దాచిపెట్టబడి వున్నదో జాగ్రత్తగా చూడు….” అని షర్టును పట్టుకొని వెనక్కి లాగుతూ వాసంతిని హెచ్చరించాడు శ్యామ్‌సుందర్.
ఆ మాటల్ని ఆలకించి మరింత పట్టుదలగా ప్రయత్నించాడా వ్యక్తి అతని చేతుల్ని వదిలించుకొని అవతలకు పారిపోవటానికి.
నిర్ధాక్షిణ్యంగా మరో దెబ్బవేసి అతనికి మరోసారి స్పృహ తప్పించాడు శ్యామ్‌సుందర్. వాసంతి వెంటబెట్టుకు వచ్చిన చేతికర్రను గిర్రుగిర్రున తిప్పి, సూట్‌కేసు మీద బలంగా మోదాడు.
ఫట్‌మని శబ్దం చేస్తూ పగిలిపోయింది దాన్ని పట్టివుంచిన తాళం.
దానంతట అదే తెరుచుకుంది సూట్‌కేసు…..
శ్యామ్‌సుందర్ ఫోకస్ చేసిన పెన్సిల్ టార్చి వెలుగులో అందులోని నిధి నిక్షేపాల్ని చూసి ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయింది వాసంతి.
కనులు తిరిగి క్రింద పడిపోతున్న అనుభూతి కలిగేసరికి చేతుల్ని క్రింది ఆనించి పడిపోకుండా తమాయించుకున్నది.
End of Preview.
Rest of the book can be read @ http://kinige.com/kbook.php?id=197
మధు బాబు గారు నమస్తే, నాపేరు విజయభాస్కర్ రెడ్డి, నేను మీ అభిమానిని, మీ రచన శైలి అంటే నాకు చాల ఇష్టం , నేను కూడా దాదాపు పది నవలలు వ్రాసాను, నా నవలలు మద్రాస్ లోని వి వి యన్ పబ్లికేషన్ వారు ప్రచురించి వున్నారు, ఈ విధంగా మిమ్మల్ని కలవడం నాకు చాల ఆనందంగా వుంది, అనుకోకుండా కినిగే బ్లాగు లో మీ నవల చదవడం జరిగింది ,కృతజ్ఞతలు.