మిసిమి–జూన్ 2011

ఏడాది క్రితం మిసిమి సంపాదకులం సంచిక తీరుతెన్నులు పునర్మూల్యాంకనం చేయ సంకల్పించి, అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకుని చర్చలు చేశాము.

తరువాత పరిమాణం, పరిమితులు నియమించుకుని నూతనరీతిలో పాఠకుల ముందుకు మిసిమిని తీసుకువచ్చాము. మార్పులు ఆహ్లాదకరంగా వున్నాయని, వ్యాసాలు చదివేందుకు సరళంగా వున్నాయని, విషయసూచికలు సమాజహితం కోరే విధంగా ఉన్నాయని, రూపురేఖలు కనులకింపుగా వున్నాయనీ ఎక్కువ శాతం పాఠకులు తమ ఉత్తరాల ద్వారా తెలియజేశారు. ఇంత మార్పు అవసరమా ? ఇది మేధావుల పత్రిక కదా అన్నవారూ లేకపోలేదు. ఇప్పటికి పన్నెండు సంచికలు క్రొత్త మూసలో వచ్చినా, మేము ప్రతినెలా ఒక పరీక్షగానే చూస్తున్నాము. ఈ ప్రస్థానంలో ఎందరో రచయితలు, వ్యాసకర్తలు మిసిమి కి సహకరించి ప్రోత్సహించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ – వారి సహకారాన్ని ఆహ్వానిస్తున్నాము.

మిసిమి జూన్ 2011 On Kinige

మేము ముఖ్యంగా దృష్టి పెట్టింది – తెలుగు నుడికారం, జాతి చరిత్ర, వ్యక్తుల కథనాలు, ప్రపంచ, జాతీయ సాహిత్యం-ఇవే గాక సంగీత, నాటక, నృత్యరూపకాలపై కూడా వీలయినంత సమాచారం అందించాలనే ప్రయత్నం చేస్తున్నాము. అయితే సాహిత్యపరంగా ఎటువంటి కొరత రాకపోయినా, మిగతా సారస్వత శాఖలపరమైన రచనలు అంతగా అందుబాటులో లేకపోవటం-ఆ విధంగా పాఠకులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నామనే ఇబ్బందికి గురికాక తప్పటంలేదు. నాటకం, శాస్త్రీయ సంగీతం – వివిధ నాట్య రీతుల గురించి వ్రాసేవారిని గుర్తించి వారి సహకారాన్ని పొందటం మాకు సంకటంగానే వుంటోంది.

ఇక భాష విషయంలో ప్రత్యేకంగా చెప్పవలసింది ఏముంది? ఇప్పటికీ నన్నయ్య, తిక్కనాది ప్రబంధ కవుల కవిత రీతులు – శ్రీనాథ, సోమనాథకవుల ప్రౌఢిమను తెలియజెప్పే విశ్వవిద్యాలయ సెమినార్ పత్రాలే వస్తున్నాయి – లేదా గురజాడ అప్పారావు కన్యాశుల్కం, శ్రీరంగపు శ్రీనివాసరావు మహాప్రస్థానమే ప్రధాన వస్తువులైన ‘ఆధునిక’ వ్యాసకర్తల రచనలూ వస్తున్నాయి. గురు-శిష్య ప్రచార వ్యాసపరంపరలకు అంతగా ఎదురు చూడవలసిన పని వుండటం లేదు.

గత దశాబ్దపు కవితారీతులు – కథా సంకలనాలు, నవలా పోకడల గురించి ముదింపుజేసే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఇప్పటికి వచన కవితల తీరుతెన్నులు మూల్యాంకనం కొంతవరకు ఇవ్వగలిగాము. ఇంకా కథ – నవలల విషయాలలో మా ప్రయత్నం – అభ్యర్థనలతోనే నడుస్తోంది.

ఎంతో ఉత్సాహంగా ‘కవిత’లను ప్రోత్సహించాం. ఉద్విగ్నత, బావసాంద్రత ఏ విధంగా వుంటే పాఠకులను చదివించగలమో తీరూ-తెన్ను చూపే కవితలను అందించాం. లబ్ద ప్రతిష్ఠుల కవితావాహినులే మమ్ములను ముంచెత్తుతున్నాయి గాని, మా ప్రయత్నం అంతగా సఫలం కాలేదనే అంగీకరిస్తున్నాము.

ఈ సంచికలో ప్రముఖమైన ప్రసంగ వ్యాసం కులదీప్ నాయర్‌ది. అఖండ భారతాన్ని చీలికలవడం కళ్ళారా చూసిన పాత్రికేయుడు – మహాత్ముని చివరి క్షణాలను దగ్గరగా చూడగలిగిన ప్రత్యక్ష సాక్షి – నేటి ప్రసార మాధ్యమాల దుస్థితి – దిగజారుడు తనం గురించి ఆయన ఆవేదన అర్థం చేసుకోవచ్చు. అంతకంటే దారుణం – ఏ దేశ స్వాతంత్ర్యం కోసం – స్వపరిపాలనకోసం అసువులు బాసిస బాపు-ఆశయం ఇప్పటి ప్రజాస్వామ్యపు విపరీత ధోరణులు – వాక్ స్వాతంత్ర్యం పేరుతో మాధ్యమాలు సృష్టిస్తున్న గందరగోళ పరిస్థితులు, అదే దేశాన్ని ఎంత అధోగతికి మళ్లిస్తున్నాయో ఆలోచిస్తే – ‘సత్యాగ్రహం’ కలుగుతుంది. ప్రపంచంలో మరోచోట ప్రజాస్వామ్యం కోసం తిరుగుబాట్లు జరుగుతున్నాయి – మన దేశంలో ప్రజాస్వామ్యపు దుష్పరిపాలనపై హజారే లాంటి వాళ్లు తిరుగుబాటు చేయాల్సివస్తోంది!

మిసిమి పుటలను విలువైన, కాలాతీతమైన పరిశోధక, చారిత్రక, మానవశాస్త్రపరమైన రచనలతో పరిపుష్టం చేయాలని, ‘చింతనాత్మక సారస్వతం’తో పాఠకులకు మరింత చేరువ కావాలనే ప్రయత్నంతో మరో సంవత్సరంలో ఈ ‘పునర్వికాస సంచిక’ తో అడుగు పెడుతున్నాము.

- సంపాదకులు.

To buy eBook of Misimi June 2011 visit now http://kinige.com/kbook.php?id=198

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>