వేయిరంగుల వెలుగు రాగం
ఆదూరి సత్యవతీ దేవి
కవితలు
హరివంశీ పచ్రురణలు
విశాఖపట్నం.
Veyirangula Veluguraagam
(Collection of Poems.)
By
Aduri Satyavati Devi
First Edition: January 2006.
Cover Design : Satyam–Shivam–Sundaram
© Author
For Copies:
Aduri Satyavati Devi
50–52–2, Seetammadhara,
Visakhapatnam – 530 013, (A.P.), India.
Ph : (0891) 2536741
.
Price : Rs. 50/–
ఊరకే నన్నుండనీక
యిన్ని మాటలూ, పాటలూ, నేర్పి
నాకొక లోకాన్ని బహూకరించిన
ఈ పచ్చని ప్రణవ పక్రృతికి
విషయ వరుస
వెన్నెలవృక్షం మీద వాలిన పక్షులు:
జలపాతగీతం – కొన్ని అభిపాయ్రాలు
ఆ కొమ్మపై నీవు… ఈ కొమ్మపై నేను…
ఒక చిద్రూప లక్ష్మి కవితలు
తమిళభాషలో ఒక వినమ్రమైన పదబంధం వుంది. అది సామెతో, పొడుపుకథో, వ్యవహారిక సత్యమో, తాత్విక సత్యమో నేనెన్నడూ విచారించుకోలేదు. అది నా అనుభవ పరిధిలోకి అనేకసార్లు చొరబడి, నాశక్తికి వున్న పరిమితులేవో జబ్బమీదకొట్టి మరీ తెలియజేస్తుంటుంది. “ఊమనార్కండకన” (మూగవాడు కన్నకల) అన్నదే ఆ పదబంధం! మూగవాడికి స్వప్నంలో ఒక మహాద్భుత సుందరదృశ్యం కనిపించింది. తనను పరవశింపజేసిన మధురమైన గంధర్వగానం వినిపించింది. వాటిని అభివ్యక్తీకరించలేడే! చేతివేళ్లతోనూ, పొంగివస్తూన్న అశ్రుజలంతోనూ వ్యర్థప్రయత్నంచేసి నిస్పృహలోకి జారిపోతాడు. నిశ్శబ్దలోకంలోకి వాడి అనుభూతి అదృశ్యమైపోతుంది.
మా పెద్దమ్మాయిలాంటి ఆదూరి సత్యవతీ దేవి కొత్తకవితా సంపుటి చదివినప్పుడల్లా నేనుపడే కృత్యాదవస్థ మూగవాడు కన్నకలే. పురాణయుగాల్లో నైమిశారణ్యంలో సత్రయాగానికి తరలివస్తూన్న ఋషులు, ఎన్నేళ్లనుండో దట్టంగా పరుచుకుపోయిన ఎండుటాకుల మీద నడుస్తూగూడా ఏ శబ్దకాలుష్యాన్నీ సృష్టించేవాళ్లుకాదట. హిమాలయ ఊర్ధ్వశిఖరాల మధ్య, మానవుడెన్నడూ కాలుపెట్టని మార్మికలోయల్లో, తపస్వి అయిన ఏ కర్ణుడో, పర్వతపుత్రుల సాయంతో నిర్మించుకొన్న ఆశ్రమఛాయల్లో వేలాది వత్సరాల వయసుగల దారువృక్షాలు దాచివేసిన ఒక కుండులో ఎవరిపూజకో వికసిస్తున్న బ్రహ్మకమలం – ఆమె కవితా చరణం! అంటే ఆ అస్పష్టవ్యాకులతను, ఆ నీరవ నిశ్చల నిశ్శబ్ద భావుకతను అర్థంచేసుకుంటేనే ఆమె ఖండికల అంతరార్ధం గోచరమవుతుందని అనుకొనే వాణ్ణి. అవి దూరంగా పోయేవి – మొనమొన్నటి దాకా.
అసూయాద్వేషాలు, మాత్సర్యకాలుష్యాలు, హింసాపూరిత నినాదాలు, పరస్పర నిందలు, పాకులాటలు, పైరవీల పాటలతో నిండిపోయిన సాహితీలోకంలో మాట!Her secular message comes like a fresh breath of life to a suffocating people– అనిగూడా అనుకొనేవాణ్ణి. కాని కవిత్వ తత్వపరామర్శలో నాకు ఓనమాలు గూడా తెలియవు. ఇప్పుడు తప్పదు. ఒక అనుభూతి గీతం రాయాల్సిందే. అశీస్సులివ్వలేని పితృ వయస్కుడు పుట్టుకతోనే అంధవృద్ధుడు!
ఆమె కవిత్వదర్శనం – నారద, తుంబురుల నాదోపాసన. ఆ భావగంభీరతకు –
వాక్చాతుర్యం పునాదికాదు. ఏ ఉపాసనా వరంతో ఆ కవిత్వ శబ్దమైత్రి అలవడిందో తెలియదు. ఎచ్చోటా శబ్దకాలుష్యం కానరాదు. ఆమెPoetic Concernsఏవో– ఈ సంపుటిలోని “పచ్చనిగీతం” చదివాక నాకుతెలిసింది. ఆమె ప్రకృతి ఆరాధన నిసర్గంకాదు. సృష్టినుండి, సమధర్మం నుండి దూరంగా జరిగిపోతూ తన సహజ విధిఅయిన సాత్విక గుణాన్ని విసర్జించి, రజస్తమో గుణ చీకటిదారులు పట్టిన మానవుడికి హెచ్చరికగా యీ పచ్చటి గీతం. ఉపనిషత్ సారాంశాన్ని ఈ శతాబ్దపు యాంత్రిక మానవుడికి తల్లి ఉగ్గుపాలలాగా – యీ పచ్చని గీతం.
నేను కథలు, నవలలు, నాటకాలు, వేదాంత గ్రంథాలు ట్రావెలాగులు కన్నా – కవితా సంపుటాల్నే ఎక్కువ చదివే అలవాటు కలవాణ్ణి. కవిత్వం గురించి ప్రచురణ అయినంత సాహిత్యం – ఏ ప్రక్రియమీదా రాలేదు. ఇంత వైవిధ్యమూ అందులో లేదు. ఇన్నివేల నిర్వచనాలు మరి దేనికీ లేవు. ఇది నిరంతర చర్చ, నిర్విరామకృషి. మేధో ప్రతీక. కవిత్వం వజ్ర సన్నిభం. కుసుమ కోమలం. దుఃఖంతో వ్రాసేదీ, ద్వేషంతో రాసేది – ఏది కవిత్వంకాదు? అని ప్రశ్నిస్తాడు – అరకొరజ్ఞాని. దానికొక పరిభాషవుంది. కులతత్వవాదులకు, మత దురహంకారులకూ గూడా అది వాహికే. జిజ్ఞాసువుకు, జీవన్ముక్తుడికీ, భక్తుడికీ, భిక్షువుకూ అది ఆలంబనమే.
కన్నీరు తుడిచేదే కవిత్వం అన్నాడు ఖలీల్ జిబ్రాన్. పోయెట్రీ ఈజ్ ప్రేయర్ (ఒక ఆరాధనా విశేషం) అంటారు సాహితీ వేత్త శ్రీశీ వడలి మందేశ్వరరావుగారు. మొదటిది మాతృధర్మం. రెండవది శాంతి స్థాపనకు కెటాలిక్ ఏజెంట్. కవితాత్మ ఎప్పుడు సాక్షాత్కరిస్తుంది? సాంప్రదాయ అనుసరణలోనా, సాంప్రదాయ విచ్ఛేదంలోనా? చాలా సందర్భాల్లో సాంప్రదాయమే నీ – వునికికి అర్థం యిచ్చేది. నీ సంస్కారానికి మూల స్థంభంగా నిలిచేది.
ఆదూరి సత్యవతీ దేవి – కవితాత్మ కేవలం ఊహాశిల్పనైపుణ్యమేకాదు. సౌందర్య సునిశత్వ వ్యక్తీకరణేగాదు. ఈ మహాసృష్టి అంతరార్ధాన్ని మార్మిక పొరల్లో దాగివున్న అర్థతాత్పర్యాల్ని, సత్య ప్రియత్వాన్ని శిల్పసౌందర్యంతో, అద్వైతవేదాంతంతో మధురంగా గానం చేయటమే.
నాకనిపిస్తుంటుంది – ఇన్ని లక్షల కవితాచరణాల్లో, ఇన్నివేల కవుల్లో కవయిత్రుల్లో – కాలప్రవాహంలో కొట్టుకుపోకుండా నిలిచేదెంతమంది – అని. ఇంతద్వేషం, కాఠిన్యం, కాలుష్యం, ఆక్రోశం అసహనం వాఙ్మయంలో భాగంగా నిలిచిపోతే – ఈ ముందుతరం ఆరోగ్యంగా జీవించగలదా? అని అనేకమంది ప్రశ్నిస్తున్నారు.
సత్యాగ్రహం నిలుస్తుంది. సమన్వయం నిలుస్తుంది సహృదయం నిలుస్తుంది. సత్యవతీదేవి కవిత్వం తప్పక నిలుస్తుందని నా విశ్వాసం. సృష్టీ, మనిషి, మట్టి, ఆకాశం, జలపాతం, ప్రార్థనాగీతం, అగోచర శక్తి, శిశువు, నవ్వూ, పువ్వూ, వెన్నెల చలవ, ఆదిశక్తి, పరమ పురుషుడూ – పేర్లు వేరుగాని “అంతా ఒకటే” అని చెప్పే తాత్విక భావనా ప్రపంచం ఆమె కవితాలోకం. కవిత్వపు వెన్నెల మొగ్గలని – ఆమె నిర్మించిన పదచిత్రమంతా వేదశాంతి సూక్తమే. అట్టి మాతృగీతాలకు మరణం వుండదు.
టి.యస్. ఇలియట్ కవిత్వాన్ని నిర్వచిస్తాడు. Genuine Poetry Can Communicate before it is understood. మొదటి చరణంతోనే కవిత్వభాష గుబాళింపు పఠితను స్పృశిస్తుంది. ఆమె కవితా ఖండిక ఆసాంతం చదివితే అర్థమూ స్ఫురిస్తుంది. అది సంగీతభాష. శిశుభాష. గోవుల కంటిభాష, మాతృభాష.
ఆదూరి దంపతులు – మైత్రేయీ, యాఙ్ఞ్యవల్క్యుల వంటివారు. మంచి సాహిత్య పఠనం, పోషణ ఆరాధనా వారి ప్రవృత్తి. ఎవరి ప్రక్రియలో వారు సిద్ధులు, సిద్ధార్ధులు. వారి సాహితీ బంధుత్వం నన్నెప్పుడూ ముగ్ధుణ్ణి చేస్తుంది. ఈ నాలుగు వాక్యాల పరిచయం – నా అభిమానాన్ని ప్రకటించే యత్నమేగాని యీ కవితా సంపుటిలో విముక్త నిత్యవిహంగాల వంటి ఖండికల్ని సంపూర్ణంగా అంచనావేసేందుకు గాదు. అందుకు నేను అశక్తుణ్ణి. ఒక భావుకుడన్నాడు – నువ్వు యీక్షణాన చదువుతున్నది గొప్పకవిత్వమో కాదో నాకు తెలియదు. కాని నీకు తరచుగా జ్ఞాపకం వచ్చే పంక్తులున్న కవిత్వమే నిజమైన కవిత్వం. శ్రీశీమతి సత్యవతీదేవి Prolific Creativity, Extreme Fluency చాలా అరుదైన కాంబినేషన్. నేను మళ్లీ మళ్లీ చదువుకొనే ఖండకావ్యాల్లో యీమెవీ వున్నాయి. కృష్ణశాస్త్రిగారు తన కవితా పంక్తుల్ని ముగిస్తూ –“ఇక హిమర్తువు వలదు, ఇక నిశీధము వలదు”అని వెన్నెలకు ఉదయ సంధ్యకు సిగ్నల్ యిస్తారు.
ఈ పుస్తకంలో నేను చూసిందంతా వెన్నెలే. నేను చదివినదంతా ఉషఃకిరణాల చైతన్యమే. ఇది కవిత్వం మీద ప్రేమనుపెంచే ఖండకావ్యం అని నా సహపాఠకులూ గొంతుకలుపుతారని నా ప్రగాఢ విశ్వాసం.
(సంపూర్ణం)
విజయదశమి–2005, సికింద్రాబాద్
రాయాలనిపించినప్పుడే…
రాయకుండా వుండలేననిపించినప్పుడే కవిత్వం రాస్తూ
ఇలా సాగే నా రచనావ్యాసంగానికి
అన్నివిధాలా సహకారాన్నందిస్తున్నారు మా వారు.
పరమసాత్వికులూ, తాత్వికులూ మేధావులూ గొప్పకథకులూ
శ్రీశీ మునిపల్లె రాజు గారి పితృవాత్సల్యం
నన్ను కదిలించి కన్ను చెమరింపచేసింది.
నా కవిత్వానికి అభినందనలూ, ఆశీస్సులూ అందిస్తూ
ఎందరో పెద్దలు, విజ్ఞులు, ప్రోత్సహించినందుకు వారు నాకు
స్మరణీయులు. వారందరినీ నా పుస్తకంలో నిలుపుకోవాలనే
ఆకాంక్షతో యీ అభిప్రాయాల ముద్రణ.
పొట్టిశ్రీశీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచ్చిన
గుర్తింపు, ప్రోత్సాహం మరువలేనిది.
వీరందరికీ నా వందనాలు
–ఆదూరి సత్యవతీ దేవి
‘జలపాతగీతం‘ చదివాను. అనుభూతి, ఆలోచన కమనీయంగా సంగమించిన కవితాసంపుటి అది. “రాగాన్ని వేదికే భావం”, “మాటకి ప్రాణం పోయాల్సిన వేళ”, “వసంతం ఒక పంచవన్నెల పాట”, “పద్యమయ్యేవేళ”– ప్రత్యేకించి పేర్కొనదగిన మంచి కవితల్లో కొన్ని. కృత్రిమ జీవితానికి ‘కొబ్బరాకు మబ్బులకింద నవ్వు మొలకల సీమ సింగారం‘ అందమైన అభివ్యక్తులు. ‘రాగాన్ని వెదికే భావం‘ కవిత ముగింపు చాల బాగుంది.
–జ్ఞానపీఠ పురస్కారగ్రహీత, పద్మభూషణ్, డా|| సి. నారాయణరెడ్డి (లేఖ, తే. 16.3.97)
‘జలపాతగీతం‘ అందింది. అన్నీ ఇంచుమించుగా మంచి కవితలే. ‘రోజూ చూసే దృశ్యమే‘ అన్న కవిత ఎంతో బాగుంది.
‘దృష్టపూర్వా అపిహ్యర్థాః| కావ్యేరస పరిగ్రహాత్ / సర్వేనవా ఇవా –భాంతి| మధుమాస ఇవద్రుమాః‘ అని ప్రాచీనులననే అన్నారు. దీనికి మీ కవిత గొప్ప పునసృష్టి.
–ముదిగొండ వీరభద్రయ్య (లేఖ, తే. 11.3.97)
‘జలపాతగీతం‘ చదివాను. ఆపాతమధురంగా ప్రవహించిన మీ కవిత్వ గానాన్ని ఆకర్ణించాను. ఈ దశాబ్దంలో మీది విలక్షణమైన గొంతు. కొన్ని కవితల్లో భావాన్ని; యింకా కొన్ని కవితల్లో శిల్పాన్ని, మరికొన్ని కవితల్లో ధ్వనిలో గుప్పెళ్లతో వెదజల్లారు….
–డా|| నాగభైరవ కోటేశ్వరరావు (లేఖ, తే.10–4–97)
ఆదూరి సత్యవతీ దేవి గారి జలపాతగీతం మనోజ్ఞంగా సాగిపోయింది. అక్షరాలను పూలుగా పరచినట్లు, భావాలను అత్తర్లు పన్నీర్లుగా చల్లినట్లు, అర్థాలు ఆర్ద్రాతి ఆర్ద్రమై పరిమళించినట్లు, తమ కవితలను శిల్పీకరిచిన రసజ్ఞ కవయిత్రి యీమె. లలితమైన భావాలు వీరి స్వంతం. తనకు యీ లోకానికంతటికీ ఇష్టమైన ఏవస్తువు పైనైనా మమకారం చూపడానికి ఆ వస్తువులకు హానికలిగించే శక్తులను సుతిమెత్తగా మందలించడానికి ఆ లలిత భావాలనే ప్రయోగిస్తారు. ఏ సంఘటనను స్పృశించినా అద్భుతమైన భావనాపరంపర జలపాతంలా ఎగిసిపడుతుంది. వస్తువైవిధ్యాన్ని పాటిస్తూనే రూపవైశారద్యాన్ని సాధించారు కవయిత్రి.
–ఆచార్య నాయని కృష్ణకుమారి (తే. 23.4.97)
‘జలపాతగీతం‘ అందింది. మొదటి పుస్తకంలో కవిత్వం ఆరంభమై రెండో పుస్తకంలో మలుపు తిరిగి, మూడో పుస్తకంలో ముచ్చటైన మీ సొంత మార్గం ఏర్పడింది. మీ కవితా ప్రయాణంలో కొంత భాగానికి నేను ప్రత్యక్ష సాక్షిని కావటం నాకు సంతృప్తికరంగా సంతోషంగా వుంది.
–చే.రా. (లేఖ, తే. 11.3.97)
నులివెచ్చని సంవేదన– మనోనేత్రం ముద్రించిన ఆర్ద్రమైన ఛాయాచిత్రాలు:
పొద్దుటి పూట గడ్డిపరకపై వాలిన మంచు బిందువును ముద్దుపెట్టుకున్నట్లనిపిస్తుంది ఈ సంకలనంలోని కొన్ని కవితలను చదివితే. మేఘాలై తిరిగివచ్చి గుండెలో వెచ్చని కన్నీటి జలపాతాలను వొంపినట్లు ఒక ఆనంద విషాదం. ఎందుకో ఏమిటో తెలిసీ, చాలాసార్లు తెలియక, కలిగే వేదనలోంచి పుట్టే అక్షరాలకు ఎంత మహత్తు! ఈ కంటితో అందాన్నే చూడగలగడం ఒక వరం. ఈ మనసుతో బాధనే పాడగలగడం అంతకన్నా గొప్ప వరం. ప్రేమించే తాహతును బట్టే బాధపడే అర్హత లభిస్తుందేమో!
ఏకాంత జలపాతాల్ని నిబ్బరంగా వొంపుకుని గీతమై ధ్వనించిన ఆదూరి సత్యవతీ దేవికి ప్రకృతే తాత్త్విక భూమికను కట్టబెట్టింది. ప్రకృతిని అపారంగా ప్రేమిస్తూ, ప్రాకృతిక నియమాలతో మనిషి సహజాతి సహజంగా లయించాలని ఆమె అత్యాశపడుతున్నారు. యంత్రయుగ బీభత్సంలో అనాది సౌందర్యాల కేన్వాసు ఛిన్నాభిన్నమైపోవడం ఆమెను అమితంగా వేధిస్తోంది. మనిషి మరగా మారడం ఆమెకు దిగులుగా ఉంది. అందుకే పరాయీకరణలో అస్తిత్వాన్ని కోల్పోతున్న మనిషికి ఆమె పచ్చని వసంతాల రుచి చూపిస్తున్నారు. “ఎంత నిరుపేదతనం / మనిషికీ మనిషికీ మధ్యన” అని వాపోతూ. “మిత్రమా మిత్రమా / రెండు స్వప్నాల మధ్య / రెండు ప్రపంచాల మధ్య / ఒక గందర్వగానం / నిరంతరం సాగనీ” అని ప్రేమగా అర్థిస్తున్నారు. సత్యవతీ దేవి కవిత్వానికి లాలనగా ఆందోళన రేకెత్తించే అరుదైన సుగుణం ఉంది. మనిషి ఎన్నటికైనా ప్రేమవైపే నడవక తప్పదు కదా అన్న ఆశావాదమూ ఉంది. అంతేకాదు, చూపుల జీవన కాంక్షల్ని రెప్పల పొత్తిళ్ళలో కరిగిస్తూ, ప్రకృతి ఔన్నత్యాన్ని విడమరచి చెబుతూ మనిషితనం అంటే ఏమిటో ఈ కవిత్వం గుర్తుచేస్తుంది.
జీవరాసుల మనుగడకై / ఆరు ఋతువుల్నీ తరగతి గదులుగా మలచుకొని / తానే ఒక పాఠశాలై చరిస్తూ / ఇచ్చిపుచ్చుకునే సందర్బాలన్నింటినీ సమతూకాలుగా చేసి / అర్పించుకొనే సంస్కారాన్ని మనిషిని / వనాల నుంచీ, గనుల నుంచీ, జీవనదుల నుంచీ / నీలాంబర జలధారల నుంచీ గ్రహించమని ప్రకృతి తన తొలిపాటగా వినిపించిందని అంటారు. కంటికి కనిపించే దృశ్యాలను చిత్రికపడుతూ, ఆ క్రమంలో తానే దృశ్యంలో లీనమై కవిత్వాన్ని వినిపిస్తారు సత్యవతీదేవి.
మౌనంలో జీవశక్తిని, దుఃఖంలో సౌందర్యాన్ని దర్శించగలుగుతున్నారు. కనుకే, “నన్ను నేను చూసుకునేదీ / తెలుసుకునేదీ / ఒక యథార్థ దుఃఖలిపిలోనే” అంటారు. ఆ లిపిలోనే సౌందర్య సీమలు సాక్షాత్కరిస్తాయి. ఎవరో అన్నట్లు, తీయని పాటలన్నీ విషాద ఘడియల్లోంచి పుట్టినవే కదా!
–పసునూరు శ్రీశీధరబాబు, ఇండియాటుడే 30 ఆగష్టు 1997
కవిత్వ ‘జలపాతగీతం‘
అనేకానేక వాదాల వివాదాల్లో కవిత్వం గతి తప్పిపోతున్న కాలమిది. అప్పుడప్పుడు మళ్ళీ కృష్ణశాస్త్రి, తిలక్ లాంటి కవులు ఎక్కడో తచ్చాడుతూ మండుటెండలో ‘జలపాతగీతాల‘ వుతున్నారు. ‘రెక్క ముడవని రాగం‘ నుంచి ‘జలపాత గీతం‘ వరకూ ఆదూరి సత్యవతీదేవి గారి కవితాగానం, ఆమెను చదివిన సాహితీప్రియుల్ని అలా వెంటాడుతూనే ఉంటుంది. ప్రకృతి స్వరాలను అక్షరాలుగా పేర్చి పచ్చటి పాటలుగా మలిచే గొప్ప శిల్పి సత్యవతీదేవి.
“జీవదానం చేసి పునర్జన్మనివ్వటం / బతుకులోని ఒక భాగాన్ని / ఎప్పటికీ కొత్తగా మెరిపించటం / ఈ అక్షరాలకి తెలుసు”– ఆమె మాటల్లోనే కాదు, మనక్కూడా ఈ కాసిన్ని అక్షరాలే చాలు తమకాన్ని తీర్చేందుకు. సత్యవతీదేవి గారు పాట నుంచి కవిత్వం వైపు మళ్ళేరు కాబట్టి సహజంగానే అస్పష్టత ఆమె జోలికి పోలేదు. ప్రకృతి పచ్చదనమంత సున్నితంగా కవిత్వమల్లగల నేర్పు ఈమె రచనల్లో కన్పిస్తుంది. ఈమెతో కవిత్వం నిజంగానే ప్రేమలో పడింది. ఎంత కవిత్వమైనా ‘ఏ చేతులు పూచిన ఋతువులో‘! నంటూ పాట తాలూకు ‘లయ‘ వినిపిస్తుంది.
కవిత్వమంటే భావుకత్వమనీ, ప్రేయసీ ప్రియుల మధ్య పావురాయిపట్టుకొచ్చే ప్రేమ సందేశమనీ అర్థాలుండేవి. దాన్ని చెరిపేస్తూ కవిత్వమంటే విప్లవమనీ, సమాజాన్ని మార్చే సాధనమనీ జనం గుండె గొంతుకలో కొట్టుకునే ప్రాణధారనీ శ్రీశీశ్రీశీ లాంటి ఆధునికలు నిరూపించారు. దీన్ని కూడా కాదని… కవిత్వమంటే సామాన్యులకు అర్థం కాని అస్పష్టతనీ, గందరగోళ పదాల కూర్పనీ, అర్థాలను బద్దలుకొట్టి నిఘంటువులక్కూడా అందని కొత్తర్థాలు రాయటమని ఓ తరం పోటీపడింది. దాన్ని భూజానేస్కుని శిష్యరికం చేయటానికే మరోతరం కవిత్వం రాసింది. ఇదీ కాదని… కవిత్వమంటే దళిత, మైనారిటీ, స్త్రసీ వాదాలనీ కవిత్వం జుట్టు పట్టుకుని కులమతాల కుళ్ళు రాజకీయాల్లో ముంచి తేల్చుతున్నారు కవులు. ఈ సదర్భంలో ఎవరు రాసిన కవిత్వం వాళ్ళే చదువుకుని తృప్తి పడాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకంటే ఇన్ని గందరగోళాల మధ్య నిజమైన పాఠకుడు ఎక్కడో తప్పిపోతున్నాడు. అయినా అక్కడక్కడా కొంతమంది ప్రకృతి కవులు పాఠకులని సేదతీరుస్తూనే ఉన్నారు. అలాంటిదే సత్యవదీదేవిగారి కవిత్వం. “యుగాలనాటి సంగీతం / యవ్వనాల మోహవేగం / జలజల పారు గీతం / జలపాతగీతం.” కృత్రిమత్వం, నటనలూ మనుషుల్లో పేరుకుపోవటం, నిజంగా మన నవ్వుల్ని మనమే నటించాల్సి రావటం పంత దారుణమో కదా! మనిషి తనను తానే వెలిగించుకుని ఒక వెన్నెల ముక్కయి బయటకు రావాలని కవి అభిలాష. కవిత్వానికి వస్తు పరిమితులు లేకపోయానా ఈ తరహా ప్రకృతి కవిత్వంలో స్పష్టమైన అనుభవాల్ని అనుభూతించటం సత్యవతీదేవిగారికి మొదట్నుంచీ అలవాటు. కొన్ని అనుభవాలు జీవితంలో చాలా చిన్న సంతోషాలని మాత్రమే కలిగించి జారిపోతుంటాయి, మళ్ళీ మనం వాటిని గుర్తుంచుకోం. కాని సత్యవతీదేవి గారు ఆ క్షణాల్ని అందంగా పట్టుకుంటారు. వాటికి అక్షరరూపమిచ్చి ఆ అనుభవాలను పునర్జీవింపజేసి ఒకే ఆనందాన్ని పదేపదే అనుభూతిస్తారు. మనకూ పంచిపెడ్తారు.
–జావేద్, వార్త దినపత్రిక 11 ఆగష్టు 1997
వేదనాభరితం జలపాత గీతం
అనాది సౌందర్యాల ప్రకృతి కాన్యాసు ఛిన్నాభిన్నమై మనిషిలోని మనిషితనం డిగ్రేడ్ అయిపోతున్న పరిస్థితుల పట్ల ఆవేదన,. ఆదూరి సత్యవతీదేవి గారి ‘జలపాత గీతం‘లో నిదానంగా ప్రవహిస్తుంది.
దుఃఖలిపిని తెల్సి కొత్తగా సుఖ దుఃఖాలు రెండూ సమమేనన్న తాత్విక బోధను కావిస్తారు.
“నన్ను నేను చూసుకునేదీ తెలుసుకొనేదీ ఒక యదార్థ దుఃఖ లిపిలోనే / ఒక్కొక్క దెబ్బా తగిలి జీవితం పెచ్చులూడిన గోడలా అందవిహీనమై పోతున్నదే అని / భాధ మెలిపెట్టినప్పుడల్లా దెబ్బ వెనుక సన్నివేశం నన్ను మరో ప్రక్కకు మళ్లించి /కొమ్మలు తెగినా చిగురించటం మానని చెట్టును చూపెట్టేది / ఉరిత్రాళ్ళకు వ్రేలాడిన త్యాగాల్ని చూపెట్టేది అప్పట్నించి గాయం నాకు ఆత్మీయమై పోయింది / ఓటమి నన్ను మెరిపించి గెలుపువైపు నడిపించే గురువై సాకింది. / నిజంగా ఆ కన్నీటి చెమ్మే తెలియకపోతే / జీవితం ఎంత రసాస్వాద భోజ్యాన్ని కోల్పోయేదో కదా!”అంటారు కవయిత్రి!
దుఃఖమే ఒక గురువై సుఖ పడడం నేర్పుతుంది. నరికిన చెట్టు మళ్ళీ హరితత్వాన్ని పొందిన విధంగా ఆశా జీవియై మళ్ళీ జీవించడం మొదలెడతాడు. దుఃఖాన్ని ఆస్వాదించ నేర్చుకోలేనివాడు సుఖాన్ని కూడా సరిగా ఆస్వాదించలేడనేది కవయిత్రిగా లోకానికామె ఇచ్చే సందేశం.
21వ శతాబ్దంలో మనమెన్ని విధాల శాస్త్ర విజ్ఞానంలో అభివృద్ధిని సాధించి ముందుకు సాగుతున్నామనుకున్నా ఓమూల మనమీనాడు పర్యావరణ కాలుష్య రాక్షసి పెనుకోరల్లో చిక్కుకొని ఉన్నామన్న నిజం మనల్ని భయకంపితుల్ని చేయక మానదు. సర్వప్రకృతి సంపదే ఛిద్రమై ఓజోన్ పొరకు చిల్లులు పడడం మూలాన సర్వమానవాళి మనగడ ఒక తేలిక ప్రశ్నగా మిగిలిపోయింది. చెట్లు నరికివేస్తున్నాం. ప్రాణవాయువు లుప్తమై రోగాలబారిన పడుతున్నాం. ప్రకృతిలో దినదినం విడుదలయ్యే మృత్యు పొగల్లోచంద్రుడు సహితం కానరాకుండా పారిపోతున్నాడు. ఈ ప్రకృతి విధ్వంసనలో ఈ విషపు గాలుల్లో చిరునవ్వుల చిన్నారులకేదీ రక్ష? ఈ విషాద – భయానక పరిస్థితుల నేపథ్యంలోనే కవయిత్రి –
‘విజ్ఞానం పెరిగి పెరిగి / ఈనాటి యుగవేగం కూడా / మనిషి గెల్చుకున్న విజయమే / కానీ– / నీడలా వెన్నంటి పోరాడుతున్న కాలుష్య గాలులూ / నిరంతరంగా ఆకాశాన్ని చిల్లులు పొడుస్తున్న / క్లోరో ఫ్లోర్ కార్బన్లూ మిథైల్ బ్రోమైడ్లూ / ఓజోన్ పొరని చేదిస్తూ ఒక వికృత వేషంలో / దేశదేశాల పసిపిల్లల్నీ నమిలి మింగేయటానికి / బయలుదేరిన కంసుని దూతలల్లే భయం కొల్పుతున్నాయి.‘ అంటారు.
ఆధునిక విజ్ఞానం పేరుతో ఎన్నో మనం సాధించవచ్చు. ఆ శాస్త్రసీయ విజయాలన్నీ ఈ ఘోర విషకాలుష్య వాతావరణం ముందుదిగదుడిపే అవుతాయి. నేడు లెక్కల్లో తేలింది 65% శకటాలవల్ల వచ్చే కలుషితమయిన గాలి నగరాల్లో వ్యాపిస్తోందిట. దీనిని అరికట్టే నాధులేరీ? మానవులంతా కలిసికట్టుగా ఎదిరిస్తేనే ఈ విశాల వసుంధర క్షేమంగా ఉంటుంది. ఈనాటి మానవాళికిదొక సవాల్‌గా పరిణమించింది. మేధావులూ, కవులూ కదలిరండి – పర్యావరణాన్ని రక్షించుకొనే మార్గాలను అన్వేషించండి. అదే కవి తపన. అదే ఆదూరి సత్యవతీదేవిగారి ఆవేదన.
ఆదూరి సత్యవతీదేవి దుఃఖం తత్వ చింతనా కలిపి కలబోసిన కవిత్వమే –‘జలపాత గీతం‘ ఒక ¬రు మనచెవుల్లో నినదిస్తుంది. కొన్ని కవితలయితే చక్కటి ప్రకృతి శోభను మన కళ్ళకు కట్టే పెయింటింగులు. ఆమె కలం అప్పుడప్పుడు కుంచెగా మారిపోతుంది. మరిన్ని నూతనవిలువల్ని ఆధునిక సాహిత్యంలోకి తీసుకురాడానికి ఈమె ప్రయత్నిస్తున్నారు.
–ఎస్.ఏ. పద్మనాభ శాస్త్రి, ఆంధ్రభూమి 2 జూన్ 1997.
సౌందర్యం అనుభూతుల సమ్మేళన ప్రవాహం –‘జలపాతగీతం‘
జలపాతం స్వచ్ఛతకూ, వేగానికీ, మార్పుకూ, సౌందర్యానికీ ప్రతీక!
ఆదూరి సత్యవతీదేవి రాసిన ఈ కవితలు మానవ జీవన జలపాతంలో ఒక్కో గీతాన్ని ఆలపిస్తున్నాయి. ఒక్కోరాగాన్ని నినదిస్తున్నయి. కవితలన్నింటి నిండా పరచుకున్న అండర్ కరంట్ మానవతే ! సృష్టినీ, మనిషినీ సౌందర్యమయంగా చూస్తూ మాయమవుతున్న మనిషితనం కోసం విలపిస్తున్న హృదయసుధ ఈ ‘జలపాతగీతం‘
చినిగిపోయిన పచ్చల కేన్వాసు; రాగాన్ని వెదికేభావం, జలపున్నమి; మాటకి ప్రాణం పోయాల్సిన వేళ; పలుచనయిపోతున్న పచ్చదనం; వసంతం ఒకపంచ వన్నెలపాట; పరిమళలహరి; ఒక హరితవసంతానికై; వెలుగు విహంగం; పద్యమయ్యే వేళ; జలపాతగీతం;– యివన్నీ కవితల పేర్లు. ఇవి ఎంతమనోహరంగా వున్నాయో, కవితల్లోని కంటెంటు కూడా అంతే ఆలోచనా స్పోరకంగా వుంది. సౌందర్య దృష్టితో చూడడం ఒక ఎత్తైతే, ఆ సౌందర్య అనుభూతిని అక్షరబద్ధం చేసి మనోహరంగా అక్షరచిత్తరువులను మనముందు నిలపడం యింకా గొప్ప !
మనిషితనాన్ని మరచి, త్యజించి మతం, కులం, భాష, ఆలోచన, వాదం, నమ్మకం, దేశం, యిలా చాలా రకాలుగా మనల్ని మనమే ఖండఖండాలుగా చేసుకోవడం, కోసుకోవడం స్పందించే ఎవరినైనా కలచివేస్తుంది. సత్యవతీదేవిగారు దాన్ని గొప్పగా చిత్రించి రంజింప చేశారు.
ఏదో వివక్షతతో, విభిన్న సిద్ధాంతాలతో, సెన్సేషన్ ఉబలాటంతో చాలా రకాలుగా కవిత్వం చలామణి అవుతున్నవేళ ఒక్క మానవజాతేకాదు, సృష్టితో మమేకమై మానవతని సౌందర్యంతో, ఆలోచనతో రంగరించి అందరికోసం, ఆర్తితో కవిత్వం రాయడం సత్యవతీదేవిగారి ప్రత్యేకత. దాన్ని ఆదరించి, ఆస్వాదించి, అటువంటి కవిత్వం మరింత రావాలని ఆశించడం మనందరి వంతు!
జీవదానం చేసి పుర్జన్మ నివ్వటం; బతుకులో ఒక భాగాన్ని ఎప్పటికీ కొత్తగా మెరిపించడం; ఈ అక్షరాలకి తెలుసు; (ఈ కాసిన్ని అక్షరాలే…) నేను ముందుకీ అవి వెనక్కీ పరుగుల ఆటే ఆటగా; నన్ను పసితనంలోపడవేసేవి; ప్రతి ఉదయం నాకొక మిఠాయి పొట్లాం దొరికేది; రేపటికై ఒక తీపికల మిగిలేది… (చినిగిపోయిన పచ్చల కేన్వాసు); విచ్చీ విచ్చని మొగ్గలాలిత్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి; వెన్నునంటి పలికేపాట గురితప్పిపోతుంది; (జలపున్నమి); తరతరాల మానవుడు; బుద్దిని అరగదీసి; చిక్కని మైత్రీ సుగంధాన్ని మనముందుంచి–
“వెండి గిన్నెలోని పాల బువ్వలా / శుచి పక్వంచేసి అందించిన సారాన్ని / రుచిరార్థాలెరుగని కాకుల్లా నేల పాలుచేసి / వెన్నెలకు రక్తపు మరకలంటిస్తున్నవేళ / ఆనందం నిషేధమే”అంటారు. (మాటకి ప్రాణం పోయాల్సిన వేళ)
ఇందులో ఏ కవితా ఖండికను ఆఘ్రాణించినా యింతవరకు మనం చెప్పుకున్న అంశాలు బోధపడతాయి. అందుకే ఆదూరి సత్యవతీదేవిగారి కవితలను చదవడం అంటే – పశ్చిమాకాశంలోని సాంధ్యతారను ఆనందించినట్టు, నీలిమేఘాల కడ్డంగా ఎగిరే తెల్లకొంగను ఆనందించినట్టు, రసానుభూతి పొందుతానని సంజీవ్‌దేవ్ చెప్పుకున్నారు. అదెంతో నిజం. అందుకే ఈ కవితా దర్పణంలో మసకపోయిన మన మానవతకు నగిషీలు దిద్దుకుందాం !
చివరగా నాకు బాగా నచ్చిన కవితాఖండిక (“శాపాలా? బహూమానాలా?”నుంచి)
“. . . నీడలా వెన్నంటి పోరాడుతున్న కాలుష్య గాలులూ / నిరంతరంగా ఆకాశాన్ని చిల్లులుపొడుస్తున్న క్లోరోఫ్లోరో కార్భన్లూ మిథైల్ బ్రోమైడ్లూ / ఓజోన్‌పొరను ఛేదిస్తూ / ఒక వికృతవేషంలో / దేశదేశాల పసిపిల్లల్ని నమిలి మింగేయటానికి బయలుదేరిన కంసుని దూతలల్లే భయం గొల్పుతున్నాయి. / చెంగల్వపూదండల్ని కబళించనున్నాయి. / భూమిమీద వనరుల్నీ వనాల్నీ ఎండగట్టి /గ్రహాంతరాళాల్నిండా పొగధూళుల్ని నింపి / మానవజీవిత భద్రతను జీరోడిగ్రీకి దింపి / గడగడలాడిస్తున్న యీ శాస్త్రసవిస్తృతి / ఎవరి సుఖస్వప్నాలకోసం? ఏ ఉజ్వల బాల్యాలకోసం?
–నాగసూరి వేణుగోపాల్, ఆహ్వానం మాసపత్రిక, ఏప్రిల్ 1998
మనిషీ మనిషీ పలకరించుకుంటూ వుండాలి
మంచు వెన్నెల కాసినట్లు… వెలుగురేక చొరబడినట్లూ
కళ్ళలోంచి చిందే ప్రేమానురాగాలకు
కడుపులో చలివేంద్రం చేరినట్లుండాలి
పువ్వు పక్కన పువ్వు అమరినట్లు
తీగ సుతారంగా పందిరిపై వొదిగినట్లు
మొగ్గలోంచి సుగంధం పైకెగసినట్లు
ఎంతో లాలిత్య తమకంగా
మనిషీ మనిషీ అల్లుకుంటూ వుండాలి
వీడని మమకారంతో –
గట్టు కటూ యిటూ
రెండు నీటిపాయలు ప్రవహించినట్లు
చెట్టాపట్టాలేసుకొని
రాగరసాన్ని కలబోసుకొని
సంగీతమొలికే స్వరతంత్రులల్లే
భావరసం చిప్పిల్లుతూ
అలా అలా నడుస్తూ వుండాలి
కాలం వెంట స్నేహ పిపాసతో –
ఒక గుండెలో మ్రోగే అలారం చప్పుడుకు
మరొకరు సమయం సిద్ధం చేసి వుంచాలి
ఒక చల్లని వెన్నెల మాసం విడిది చేసినట్లు
జల్లు జల్లులుగా కవితా సుగంధం కురిసినట్లు
ఎల్లవేళలా పచ్చపచ్చగా
ఆత్మీయత పండించుకుంటూ వుండాలి
మనిషీ మనిషీ జతజతలై వికసిస్తూ వుండాలి.
ఎప్పుడూ జీవితంలోని ఒక భాగాన్ని
మనసులోని ప్రేమ జలపాతంలో తడుపుతూ
వడలని పత్ర గుచ్ఛాన్నీ
తరగని వసంత సోయగాన్నీ
సరళ సుందరంగా
తనకు తానుగా జాగ్రత్త చేసే వుంచాలి
మనిషి కోసం… మరోతరం కోసం.
మిత్రమా! మిత్రమా!
నీకైనా నాకైనా
చెమరించే గుండే కదా
అసలు సిసలు మూలధనం!
– రచన మాస పత్రిక, జూన్ 2001
అనంతమైన రాగాల రసధ్యానానికి
ఒక స్వరపేటిక చాలు
స్వరంలోకి మధురసంగా హృదయాన్ని
ప్రవేశపెట్టగలిగే నేర్పుంటే
గానలోకపు జ్ఞాననిధులు దొరికినట్లే
ఎప్పటికప్పుడు లలితంగా పరవశించటానికి
ఒక కంఠాన్ని పదిలపరచి వుంచితే చాలు
ఐక్యతారాగాల రస సంగమానికీ
పండిన ఆ భావ మాధుర్యాలకీ
పరిసరాలన్నీ శుభ్రజ్యోత్స్నా పులికిత యామినులవుతాయి
దేహం నించి మనస్సుని తోడ్కొని పోయే ఆ దివ్యశక్తికి
మతంలేదు… మరే ఆచ్ఛాదనా లేదు.
శతశత తారకల ఆకాశం
నిత్యం కోటి కోటి దీప్తులతో
నిశ్శబ్దంగా శాంతి ప్రవచనాల్ని వల్లిస్తూ వుంటురది
తెల్లగా పట్టువస్త్రసం పరచినట్లున్నా
నీలంగా రంగులీనినా
సింధూర నారింజ పచ్చదనాల్లోసమ్మోహనమై
అలంకారాల్ని మార్చుకుంటున్నా
అంతరంగాన్ని మాత్రం ఒరులసేవకై సిద్ధపరచి ఉంచుతుంది
తనకి అందనంత దూరంలో వున్న ధరిత్రి కళ్యాణానికై
వెన్నెల గంగల్ని వొంపుతుంది
వర్షధారల శుభాశీస్సుల్ని పంపుతుంది.
నేలతల్లి తనువు మురిసి ఫలరసానందమైన వేళ
తరువులన్నీ కృతజ్ఞతాభారంతో
నభోరాసికి వందనాలర్పిస్తాయి
ఈ స్నేహాలకి మాటలు లేవు
ఈ బంధాలకి మతాలు తెలియవు
అన్ని విడివిడి శక్తులూ కలివిడిగా యేకమై
ఒక సూత్రంపై నడుస్తూ
మనిషికి పాఠాల్ని బోధిస్తాయి
ఒక్కోచోట అక్షరాలు అటుమొదలై ఇటు ముగుస్తాయి
అర్థాలూ వాక్యాలూ మరోచోట వెనకా ముందైనట్లు తోస్తాయి
ఒక్కోచోట అష్టదళ పద్మాలై సార్వజనీనమైన విషయాన్ని
ఒక శబ్దధారలో బంధిస్తాయి.
అవి కవిత్వమై మనుషుల్ని ఏకం చేస్తాయి.
అటువంటి సౌందర్యాల భాషా సంగమాన్ని
సారించగల చూపుంటే ఆస్వాదించగల నేర్పుంటే
ప్రపంచ సంస్కృతిని ఒక దర్పణంలో వీక్షించనూ వచ్చు
పవిత్ర సందర్భాల సారాంశాన్ని ఆచరించనూ వచ్చు
దానికి మతం మానవతే!
ఎక్కడున్నా పువ్వులు నవ్వులొలుకుతూనే వుంటాయి
ఎటువైపు ప్రయాణించినా నదులు తీపిదారులే అవుతాయి
ఎన్ని సౌందర్యాలు సొంతమైనా ఎన్ని సామ్రాజ్యాలు గెల్చుకున్నా
సహజాతి సహజమైన స్థానమే బలీయమైనది
తిరిగీ తిరిగీ ఎదిగీ ఎదిగీ చివరికి మనిషి కోరుకునేది
మరో మనిషి ఆత్మీయతానురాగపు స్పర్శనే
ఆ అనుభూతికి కొలతలు లేవు
ఆకలికి లేనట్లే… శోకానికీ ఆనందానికీ లేనట్లే !
–ఆంధ్రప్రదేశ్, మాస పత్రిక, మార్చి 1999
End of the preview, rest of the book can be read @ http://kinige.com/kbook.php?id=214