పాఠకుల దాహం తీర్చే ‘కథల కడవలు’

తెలుగు కథకి ఇప్పుడు కొంత ప్రాధాన్యత ఏర్పడింది. పలు పత్రికలు కథలను విరివిగా ప్రచురిస్తున్నాయి. కథా సాహిత్య గ్రంథాలను పాఠకులు కొని చదివి ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు కవిత్వానికి ఉన్న ‘విలువ’ నేడు కథ ఆక్రమిస్తున్నది. ఐతే, కథా రచన నిజంగా అంతగా అభివృద్ధి చెందిందా? అనే ప్రశ్న లేకపోలేదు. కవితలకు లేని వార్షిక పోటీలు, వార్షిక సంకలనాలు కథల విషయంలో ఎక్కువగా వెలువడుతున్నాయి. కథా రచయితలూ స్వీయ సంకలనాలు వెలవరిస్తున్నారు. ప్రాంతీయ విషయ విభాగాల వారిగా కొన్ని సంకలనాలు అచ్చవుతున్నాయి. సాహిత్య పేజీలలో కథాసాహిత్యంపై వ్యాసాలూ అచ్చవుతున్నాయి. ఇంత జరిగినా- ‘నిజంగా కథారచనలో గణనీయమైన వాసి పెరిగిందా?’ అనిపిస్తుంది.
ఇంకా కథ వినోద ప్రధానంగానే ఉంది. సామాజిక కథలు తగ్గుముఖం పట్టాయి. వ్యక్తిగత సమస్యలు, కుటుంబపరమైన ఇతివృత్తం ఇంకా పెత్తనం వహిస్తూనే ఉంది. బాధ కలిగించే విషయమేమంటే- ఉద్యమాలు, పోరాటాలు ఇతివృత్తం కాలేకపోవడం. ఐతే, సమాజంలోని వెలికిరాని బతుకులపై, సామాజిక కోణాలపై కొన్ని మంచి రచనలు రావడం శుభపరిణామం. ఇదంతా ఇతివృత్తపరంగా జరిగే పరిశీలన. వస్తువులో వచ్చిన నవ్యత కథారచన శైలిలో ఉన్నదా? అన్నది రెండో పరిశీలనాంశం. నిజానికి తెలుగు కథ ఎక్కువగా కుంటుపడింది ఈ రంగంలోనే. దీటైన రచయితలు ఉన్నా కొత్తశైలిని నిర్మించుకున్నవారు చాలా తక్కువే.
ఇతర భాషలలో కనుపించే శైలీపరమైన ప్రభావాలు మన కథాసాహిత్యంపై పడడం గమనించాలి. ముఖ్యంగా పాశ్చాత్య సాహిత్యంలో వెలువడిన శైలులను కొందరు తెలుగుకీ పరిచయం చేశారు. కానీ, వారిలో చాలామంది ఇవి ఫలానా కథలకు, కథారచయితలకు ఆధారం అని ఎప్పుడూ, ఎక్కడా పేర్కొనలేదు. వస్తుశైలుల ప్రభావానికి లోనుకాకూడదని ఎవరూ అనరు. కానీ, చూచాయగానైనా పేర్కొనకపోవడం నిజాయితీ రాహిత్యంగానే భావించాలి. అలా పేర్కొనడం రచయిత వ్యక్తిత్వానికి వనె్నతెస్తుందే తప్ప మరోటికాదు. నిజాయితీ కొరవడిన దాఖలాలు కూడా నేడు ఎక్కువే అనిపిస్తున్నది.
ఏదిఏమైనా కథావార్షికాల కోసం కాకుండా ఇతివృత్తం ప్రేరేపించగా రాసిన కొన్ని రచనలూ వచ్చాయి. అలాంటి వాటిలో ‘సింహాలపేట’ ఒకటి. నవ్యత, వైవిధ్యం, సంక్షిప్తత ఈ కథలకు ప్రాణం. పదాలు కావచ్చు. వాక్యాలు కావచ్చు. భావ చిత్రాలు కావచ్చు. కథ మొదలు, తుది ఏదైనా స్ట్రైకింగ్‌గా చెప్పడం ఈ కథల లక్ష్యం.
‘సింహాలపేట’ సంకలనం రచయిత రమణ జీవి వృత్తిపరంగా ఆర్టిస్ట్. బొమ్మలు అతని వ్యక్తీకరణ. భుక్తికోసం పలు పత్రికల్లో పనిచేశాడు. సాహిత్యం అతని ఆరో ప్రాణం. కవిత్వం, కథ- కవలల వంటివి.. అతని లాగే. మిగిలిన ఏ ప్రక్రియ జోలికిపోకుండా వీటినే పంచేంద్రియాలంత ప్రాణంగా చూసుకుంటున్నాడు. రెండు కథా సంపుటాలు, కవిత్వ సంపుటాలు అచ్చేసినా రమణజీవి తనను సాహిత్యజీవిగా క్లెయిమ్ చేసుకోడు.
రాయడం వరకే తన బాధ్యత. పుస్తకాల రూపంలో వెలువడడం వాటి అదృష్టం అనుకుంటాడు. నిమిత్తంగా కనిపించే కథకుడి కలం మనిషి బతుకుల్లోని జీవవైవిధ్య వైరుధ్యాలు పాఠకులని విస్మయపరుస్తాయి. పనె్నండు కథలు అన్నీ ఏకబిగిన కొత్తవలయాలు సృష్టించి పాత్రల్లో పాఠకులని ఒకరిగాచేస్తాయి. ఈ కథాపఠనం మొదలెడితే ఆపడం కష్టమే. అలాగని చదువుతూ పోలేం. ఏదో విచలిత భావన. వైకల్యపు ఆలోచనల కొనసాగింపు.
చాలా కథలు ఈనేల మీదే జరిగాయి. అదో అది చిరునామా. అదో అతను ఈ మనిషేనేమో అనిపిస్తుంది. కొద్ది కథల్లో పరాయి సంస్కృతిలో పరాయి సమాజంలో కనుపించే మనుషులు కనుపిస్తారు. ‘చివరి మనిషి’ కథ అలాంటిదే. దేశీయత, పాశ్చాత్యీకరణ రెండు జంట భావనలుగా స్వారీ చేస్తాయి. సమాజ వాస్తవికత, ఆది భౌతిక భావన రెండు ఏక కాలంలో సయ్యాటలాడుతాయి. కనిపించే పర్యావరణం వంటి సమస్యలు, కనిపించని సమస్యల గూళ్ళల్లో చిక్కుకున్న సుంకన్నలు మనని రెండువేపులా పలకరిస్తుంటారు.
ఈ కథలన్నీ లోగడ ప్రముఖంగా అచ్చయినవే. కానీ, పుస్తకంలో ఒకచోట అచ్చుకావడంవల్ల పాఠకుడిని ప్రభావితం చేయగలిగిన ‘చానెల్’ ఏర్పడింది. రమణజీవి ఇప్పుడు కథకుల పట్టికలో చేరక తప్పదు. ఆ పట్టిక తయారుచేసే వారి ప్రిఫరెన్స్‌ని బట్టి అతని స్థానం ఉంటుంది. ఇప్పుడు కథా సాహిత్యాన్ని నిర్దేశిస్తున్న ధనిక ప్రచురణకర్తల చేతిలో రమణజీవి ఇరుక్కుంటాడా? జారిపోయిన తన అస్తిత్వాన్ని నిలుపుకుంటాడా?
నిజానికి ఇవి మంచి కథలుగా భావించి వార్షిక కథా సంకలనాలలో అచ్చయినవెన్ని? వాటిల్లో స్థానం సంపాదించనివి మంచి కథలు కావా? ఈ సవాలు తెలుగు కథాసాహిత్య రాజకీయాన్ని బట్టబయలు చేస్తున్నది. వార్షిక సంకలన రూపకర్తల అనైతికతకి ప్రశ్న గుర్తుగా నిలుస్తుంది. వారానికో గుడ్డు పొదిగిన కోడిలా ఏడాదికో కథాసంకలనం అనే చట్రం ఏర్పరుచుకునే కంటే తద్బిన్నంగా మరో మంచి ఆలోచనచేసే తరుణం వచ్చింది.
కథా వార్షికాసురులు, సాహితీ పేజీల నిర్వాహకులు, కథారచయితల కన్నా పాఠకులు చాలా తెలివి మీరారు. నిజంగా మంచి కథ ఏదో పసిగట్టి దానిని సొంతం చేసుకుంటున్నారు. ఈ కథలకు ఒక పాఠక వర్గం ఏర్పడింది. వారి దాహాన్ని ఈ కథల కడవలు తీర్చుతాయి. అందుకు రచయితకు అభినందనలు. మంచి పుస్తకం అచ్చేసిన ‘పర్‌స్పెక్టివ్’ వారికి కూడా.

బి.విద్యాసాగర్‌రావు, ఆంధ్రభూమి అక్షర పేజి, 20/07/2013

* * *

సింహాల పేట” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

సింహాల పేట On Kinige

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>