కినిగె స్మార్ట్ స్టోరి కాంపటీషన్ గురించి సుప్రసిద్ధ బ్లాగరు, రచయిత కొత్తపాళీ అభిప్రాయం
“నాకో చిన్న థియరీ ఉంది. ఇప్పటికి తెలుగులో అనేక అస్తిత్వవాద సాహిత్యాలు వచ్చాయి. ఇవన్నీ చూశాక అస్తిత్వవాద సాహిత్యం అంటే ఏవిటి అంటే .. ఒక వర్గానికి చెందిన మనుషులు తమ కథల్ని తామే చెప్పుకోవడం అని నాకనిపించింది. మరి ఇప్పుడు కథలూ నవల్లూ రాస్తున్న వారందరూ నలభైలు దాటిన వాళ్ళే కనిపిస్తున్నారు. యువత గొంతెక్కడ? యువతకీ సాహిత్యంలో అస్తిత్వం నిలబడాలి అంటే వాళ్ళ కథల్ని వాళ్ళే చెప్పుకోవాలి. లేకపోతే వంకర చిత్రీకరణలే కనబడతాయి – ఇప్పటికే ఆ ధోరణులు మన కథల్లో కనిపిస్తున్నై.
తెలుగు కథల్లో యువత అస్తిత్వానికి స్వాగతం పలుకుతున్నారు కినిగె వాళ్ళు ఈ కథల పోటీతో.
ఇంతకంటే మంచి అవకాశం మరోటి ఉండబోదు.
రండి యువతరానికి ప్రతినిధులారా, మీ మీ కథలు చెప్పండి.”
కినిగె స్మార్ట్ స్టోరి కాంపటీషన్ గురించి సాహిత్య విమర్శకుడు శ్రీ జంపాల చౌదరి అభిప్రాయం
“గొప్పగా వ్రాయడానికి ఎక్కువ మాటలు అవసరం లేదు.
ఏసుక్రీస్తు మొదట చూపించిన మహిమ – నీటిని ద్రాక్షాసవంగా మార్చటం – గురించి ఒకాయన The conscious water saw its God and blushed అని ఒక్క వాక్యంలో చెప్పాడట.
నేను శాస్త్రీయ పత్రాలు వ్రాయటం మొదలుబెట్టిన రోజుల్లో మా ప్రొఫెసర్గారు ఒక సూత్రం చెప్పారు. నువ్వు వ్రాయదలచుకున్నదంతా వ్రాసేశాక, దాన్ని అంతకు సగం మాటలతో తిరగవ్రాయి. దాంట్లో సగం మాటలతో మళ్ళీ తిరగవ్రాయి. నువ్వు చెప్పదలచుకున్నది క్లుప్తంగా, స్పష్టంగా అప్పుడు చెప్పగలుగుతావు అని.
కల్పనా సాహిత్యంలోనూ ఈ సూత్రం బాగా పని చేస్తుంది. గొప్ప తాత్విక విషయాలను కొద్ది మాటలలో హైకూలలో, తేటగీతుల్లో, ఆటవెలదులలో చెప్పటం మనకు తెలుసు. యువ కథకులను తక్కువ మాటల్లో కథలు వ్రాయటానికి కినిగె సంస్థ ఈ స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ ద్వారా ప్రోత్సహించటం ముదావహం, అభినందనీయం.”
కినిగే స్మార్ట్ స్టోరి కాంపిటిషన్ (2013) వివరాలకు ఇక్కడ చూడండి:
http://teblog.kinige.com/?p=2773