‘ఒక మారుమూల గ్రామంలో వెన్ను బద్ద విరిగి పక్కకు ఒరిగిన పాతపడిన ఇంట్లో నులక మంచం మీద కట్టెలా పడి ఉన్న దేవమ్మను చూడ్డానికి కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనుమరాళ్ళు అందరూ వస్తున్నారు’ అంటూ ‘భూదేవి‘ నవల ప్రారంభమవుతుంది. ఇది పల్లె జీవితానికి అద్దం పట్టిన నవల. గ్రామీణ వాతావరణం… అక్కడి కుటుంబాల స్థితిగతులు… వారి మనస్తత్వాలను… ముఖ్యంగా దేవమ్మ పాత్రను… ‘భూదేవి’ నవలలో చక్కగా చూపించారు రచయిత సింహప్రసాద్. ప్రధాన పాత్ర కథా ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కడా చిరాకు లేకుండా సాగిపోతుంది. భూదేవి ఓర్పుకు పెట్టింది పేరు అంటుంటాం.. ఆ రకంగా నవలలోని పాత్రకు తగిన పేరు ఎంచుకుని న్యాయం చేశారు. ఎన్నో కష్టాలు ఓర్చి పిల్లలను పెద్దవాళ్ళుగా చేసి తీర్చిదిద్దిన తర్వాత .. ఎవరిదారి వారు చూసుకుని తనను పట్టించుకోకుండా వదిలేయడంతో కుమిలిపోతోంది. చివరికి స్నేహితుడు నాని చెప్పిన మాటలతో… కన్నీళ్ళు తుడిచే చేతుల కోసం ఎందరో ఆశగా ఎదురుచూస్తున్నారని… వారి కోసం పనిచేయడానికి మళ్ళీ సిద్ధమవుతాననడంతో నవలను ముగిస్తారు. నవల పల్లెవాసులకే కాదు! ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణ వాసులకు కూడా అతికినట్టు సరిపోతుందని చెప్పవచ్చు. అంతేకాదు! ఆ సంఘటనలు మన చుట్టు పక్కలో.. మన ఇంట్లోనో జరిగినట్లు ఉంటుంది. ఏ పాత్రకు, ఆ పాత్ర ఏ లోపం లేకుండా కథను సహజంగా తీర్చిదిద్దారు. ‘నడవటానికి పాదాలుండాలి గాని లోకం నిండా దారులే.. పరోపకారానికి మనస్సుండాలి గానీ చేయడానికి ఎన్నెన్నో మార్గాలు’ వంటి మనస్సును హత్తుకునే ఎన్నో వాక్యాలు ఈ నవలలో ఆకట్టుకుంటాయి.
– జి.వేణుమాధవరావు, ప్రజాశక్తి ఆదివారం అనుబంధం, 10 నవంబరు, 2013
* * *
‘భూదేవి’నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్‌పై ఆర్డర్ చేయడం ద్వారా ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.
భూదేవి On Kinige
Pingback: వీక్షణం-59 | పుస్తకం