రన్ ఫర్ ది బోర్డర్
(షాడో స్పై థ్రిల్లర్)
రచన:
మధుబాబు
© Author
© Madhu Baabu
This digital book is published by -
కినిగె డిజిటల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్.
సర్వ హక్కులూ రక్షించబడ్డాయి.
All rights reserved.
No part of this publication may be reproduced, stored in a retrieval system or transmitted in any form or by any means electronic, mechanical, photocopying, recording or otherwise, without the prior written permission of the author. Violators risk criminal prosecution, imprisonment and or severe penalties.
రన్ ఫర్ ది బోర్డర్
ఫెళ ఫెళా రావాలు చేస్తూ పైకి లేచాయి అగ్నిజ్వాలలు. సుడులు తిరుగుతూ గాలిలో కలుస్తున్నాయి నల్లటి పొగలు. ఎర్రటి నాలుకల్ని విరజాచి కనిపించిన వస్తువు నల్లా మాడ్చి మసి చేస్తున్నాడు అగ్నిదేవుడు. హాహాకారాలు చేస్తూ ఆ మంటలమీద కలబడుతున్నారు హమీర్ పురపౌరులు.
“నారాయణ్ సాబ్ బయటకి రండి నారాయణ్ సాబ్ ’’ అన్న అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి దిక్కులన్నీ.
గాఢ నిద్రలో వున్న నారాయణ్ వులిక్కిపడి లేచి కూర్చున్నాడు. గదినిండా ఆవరించుకున్న పొగలను చూసేసరికి అతనికి మతిపోయింది. గబగబా లేపాడు భార్యను. పక్కగదిలో కూతుళ్ళను మేల్కొలిపి బయటికి వచ్చాడు.
ఉన్నట్లుండి దురుసుగా వీచటం ప్రారంభించింది ఈదురుగాలి. మరో పది గజాల ఎత్తుకు లేచాయి మంటలు. భవనం మొత్తం వాటి బారిన పడింది. ఖణేల్ ఖణేల్ మంటూ పగులుతున్నాయి కిటికీలకు వున్న కొయ్య పలకలు.
మంటల్ని ఆర్పటానికి ప్రయత్నిస్తున్న హమీర్ పురాపౌరులకు, అది అసాధ్యమైన పనిగా తోచింది. పైకి లేచిన మంటలు ఎర్రటి నిప్పురవ్వల్ని నలుదిక్కులకు విరజిమ్ముతున్నాయి.
గోలుగోలున ఎడుస్తున్న భార్యను ఎడమ చేత్తో గుండెలకు అదుముకుని, కుడిచేత్తో పెద్దకూతుర్ని సందిట యిముడ్చుకుని రాతిబొమ్మలా నిలబడి వున్నాడు నారాయణ్. కట్టుబట్టలతో బయటకి వచ్చాడతను. అతని సర్వస్వం ఆ యింట్లో వున్నది- అగ్నిదేవుడికి ఆహుతి అవుతూ.
మిగిలిన యిళ్ళు మంటలకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనం. ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయటం జరిగింది. అది వచ్చే సూచనలు కనిపించటం లేదు.
ఉన్నట్లుండి అందరి దృష్టి మంటలకు ఆహుతి అవుతున్న నారాయణ్ భవంతి – పై భాగానికి మరలింది . అయ్యో అయ్యయో అన్న అరుపులు ఆకాశాన్ని అంటుకున్నాయి.
రెండవ అంతస్తులో వున్న పిట్టగోడ మీదికి ఎక్కింది కుక్కపిల్ల – జాలిగా అరుస్తూ క్రిందవున్న జనాన్నంతా కలియచూస్తున్నది తన యజమాని కోసం.
బయటికి వచ్చిన క్షణం నుంచీ దానికోసమే వెదుకుతున్నది నారాయణ్ చిన్న కూతురు కార్తి. అది తమతో పాటు పారిపోయి వచ్చిందనే అనుకుంటున్నదామె.
బాల్కనీ మీదవున్న కుక్కపిల్లను చూడగానే కెవ్వున అరిచి ముఖద్వారం వైపు పరుగు తీసింది.
"అమ్మా కార్తీ!!” పెద్దగా అరిచాడు నారాయణ్.
భవనం ముందు నిలబడి వున్న పదిమంది పౌరులు కార్తిని వడిసి పట్టకొని వెనక్కి లాక్కు వచ్చారు.
"నాన్నా! నా టైగర్ !! నా టైగర్ చచ్చిపోతుంది నాన్నా …. నన్ను వదలండి నాన్నా ….” గోలు గోలున ఏడ్వసాగింది కార్తి.
ముఖద్వారంలో నుంచి పైకి పోవటానికి అవకాశం ఏమైనా వుందేమోనని ప్రయత్నించారు కొందరు పౌరులు. కొలిమిలో నుంచి వెలువడుతున్న నిప్పురేకుల్లా – వేగంగా బయటకి వస్తున్నాయి మంటలు. చూస్తుండగానే విరిగి నిప్పులు వెదజల్లుతూ నేలన పడింది ద్వారబంధం.
బాల్కానీ మీది నుంచి జంప్ చేయటానికి సిద్ధంగా వుంది టైగర్ ….
"నారాయణ్ సాబ్ ! మేమందరం కాచుకుంటాం….. దూకమని చెప్పండి…” ఆత్రుతగా అన్నాడొక పౌరుడు.
కూతుర్ని వదిలి భవనం దగ్గరికి పరుగు తీశాడు నారాయణ్.
"టైగర్, జంప్! జంప్ బేబి ….. జంప్!! " బిగ్గరగా అరిచాడు గొంతు చించుకొని, ముందుకాళ్ళను వంచి తోక విదిలించింది టైగర్…… దూకిన మరుక్షణం పట్టుకోవటానికి సిద్ధంగా వున్నారు పాతిక మంది పౌరులు.
అంతవరకూ నల్లటిపొగలు వెలువరిస్తున్న కిటికీ ఒకటి భగ్గుమంటూ మంటల్ని పైకి విరచిమ్మింది. నిలువెత్తున లేచాయి మంటలు…… భయపడి బాల్కానీలోకి దూకేసింది టైగర్.
అది అరుస్తున్న అరుపుల్ని వినలేక చెవులు మూసుకున్నారు అక్కడ గుమిగూడిన వారందరూ.
కార్తి కళ్ళముందున్న ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నది. మూడు వారాల పసికూనగా వున్నప్పుడు టైగర్ ని తన స్వంతం చేసుకున్నదామె. పాల పీకతో పాలు పట్టి పసిబిడ్డకంటే ఎక్కువగా చూసుకున్నది. ఆటల్ని నేర్పింది. అల్లరి చేస్తే కొట్టి తిట్టింది. ఇరవై నాలుగు గంటలు తన వెంటనే వుంచుకొని పెంచింది. టైగర్ ఆమెకు పెంపుడు కుక్క గాదు. ప్రాణాలకంటె ఎక్కువ అయిన ఒక ఫ్రెండ్.
తన కోసమే టైగర్ అరుస్తున్నదని కార్తికి తెలుసు. తను రెండు నిముషాల పాటు కనిపించక పోతే అలాగే అరిచేదది.
కాళ్ళు నిలువలేదు కార్తికి….. తనను ఎవరు చూడటం లేదని నిశ్చయించుకోగానే, బాణంలా పోయి ముఖద్వారంలో జొరబడింది.
గొల్లుమన్నారు జనం…..
"అమ్మా కార్తీ….. కార్తీ !!” అంటూ అటు పరుగుతీశాడు నారాయణ్.
ముఖద్వారంలో సుడులు తిరుగుతున్న పొగలలోకి పోయి అదృశ్యమైపోయింది కార్తి , నారాయణతో పాటు మరో నలుగురు పౌరులు ప్రాణాలకు తెగించి అటు దూకారు.
దడ దడలాడుతూనే నేలకూలింది మెదటి అంతస్తు మీద వున్న డ్రాయింగ్ రూమ్. పెద్ద పెద్ద కాంక్రీట్ పలకలు శెగలను వెలువరుస్తూ ముఖద్వారాన్ని మూసి వేశాయి.
"నారాయణ్ సాబ్ ! వద్దు….. ప్రాణాలు పోతాయి…..” అంటూ అతన్ని పట్టుకొని వెనక్కి లాగారు అతనితో పాటు పోయిన పౌరులు.
పిచ్చిగా చూశాడు నారాయణ్…. వెర్రిగా అరుస్తూ వారిని విదిలించి కొట్టాడు. మరో పదిమంది చేరి అతన్ని యివతలికి లాక్కు వచ్చారు.
"కార్తీ….కార్తీ!” అంటూ స్పృహ తప్పి పడిపోయింది అతని భార్య…
రెండవ అంతస్తు మీద ప్రత్యక్షమయింది కార్తి. ఆమె సాహసానికి మెచ్చి అగ్నిదేవుడు ఆమెను చూసీ చూడనట్లు వదిలేశాడు కాబోలు – మంటలు విరచిమ్ముతున్న మెట్ల మీది నుంచి సురక్షితంగానే పైకి పోగలిగిందామె.
కార్తిని చూడగానే సంతోషంతో ఎగిరి గంతులు వేసింది టైగర్ . దాన్ని గుండెలకు అదుముకొని, వెనుదిరిగింది కార్తి.
ఫెట ఫెటారావాలు చేస్తూ కూలిపోయాయి మేడ మెట్లు. బాల్కానీ సగభాగం విరిగి నేలమట్టం అయింది.
“నిచ్చెనలు! నిచ్చెనలు తీసుకురండి…. ’’ పెద్దగా అరిచారెవరో.
రెండు క్షణాలలో ప్రత్యక్షమయ్యాయి నాలుగు నిచ్చెనలు. ఉడతల్లా వాటిమీదికి పాకారు నలుగురు పౌరులు. నాలుగు అడుగులు కూడా పోకముందే భూకంపం వచ్చినట్లు కంపించింది ఆ భవనమంతా. నిచ్చెన్లు ఆనించిన గోడ నడుమకు విరిగి లోపల పడిపోయింది . చావుతప్పి కన్ను లొట్ట పొయినట్లు, క్రిందపడి, ప్రాణాలు దక్కించుకున్నారు ఆ నలుగురూ.
కార్తిని క్రిందకి రప్పించే మార్గం లేదు. భవనమంతా వీక్ అయిపోయింది. ఏ క్షణంలో నయినా కూలిపోవటానికి సిద్ధంగా వున్నది.
నిర్ఘాంతపోయి చూస్తున్నారు అక్కడ గుమిగూడిన పౌరులందరూ…. నోరు తెరచి పెద్దగా అరిస్తే, ఆ అదుటుకు భవంతి కూలిపోతుందేమో అన్నంత భయంతో రాతిబొమ్మల్లా నిలబడిపోయారు – మాట పలుకు లేకుండా.
ఒక చివరగా నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్న ఇరవై రెండు సంవత్సరాల యువకుడు తల విదిలిస్తూ ముందుకు అడుగు వేశాడు.
మరుక్షణం అతని చేయి పట్టుకున్నాడు ప్రక్కనే వున్న లావుపాటి వ్యక్తి.
"గురో! నువ్వు లేనిపోని గొడవల్లో తలదూర్చి మన కొంపలు ముంచకు. నువ్వు ఆ మెడ ఎక్కి సర్కస్ ఫీట్లు చేయటం మొదలు పెట్టావంటే, ఎవరో ఒకరు నిన్ను గుర్తు పట్టకుండా వూరుకోరు. గుర్తు పట్టిన మరుక్షణం మన బాబాయిలకు ఫోన్ చేస్తారు” అన్నాడు వెనక్కి లాగుతూ.
“అలా అని ఆ చిన్నారి తన ప్రాణాలు కోల్పోతుంటే చూస్తూ వూరుకో మంటావా?” అతని చేతిని విదిలించుకుంటూ ముందుకు అడుగు వేశాడా యువకుడు.
"ప్రపంచంలో ప్రతిరోజూ ఎంతమంది చిన్నారులు యిలా ప్రమాదాల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవటం లేదు? వాళ్ళందర్నీ రక్షిస్తున్నామా? నా బంగారం! రా బాబూ! వెళ్ళిపోదాం….” గడ్డం పట్టుకొని బ్రతిమలాడాడు ఆ లావుపాటి వ్యక్తి.
వినిపించుకోలేదా యువకుడు. గబగబా ముందుకు పరుగెత్తి, మంటలు విరజిమ్ముతున్న భవనానికి ఎడమ ప్రక్కకు చేరుకున్నాడు.
పెద్ద బావి ఒకటి వున్నదక్కడ. మర మనుషుల్లా నీళ్ళు తోడి ఫైర్ బ్రిగేడ్ కి అందిస్తున్నారు పదిమంది పౌరులు.
ఇద్దరి చేతుల్లో వున్న చేంతాళ్ళను లాక్కున్నాడు యువకుడు. వాటి కొనలను ఒకటిగా ముడివేసి, అక్కడికి సమీపంలోనే వున్న కొబ్బరిచెట్టు మీదికి ఎగబ్రాకాడు. మంటల వేడికి మోడుబారిపోయిందది. దాని ఆకులు నల్లగా కమిలిపోయి సెగలను వెలువరుస్తున్నాయి. ఆ వేడిమిని లక్ష్య పెట్టకుండా మట్టల మధ్య నిలబడ్డాడు యువకుడు.
ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తున్నారు జనమంతా.
అతను ఏమి చేయబోతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు.
చేంతాటి రెండవ కొనను వుచ్చుముడి వేసి, త్రాటినంతా చుట్టచుట్టాడు ఆ యువకుడు. మొదటి కొనను ఎడమ చేతితో పట్టుకొని, త్రాటి చుట్టను గిరగిరా తిప్పాడు గాలిలో.
సగం కూలిపోయిన బాల్కానీ మీద జయస్థంభంలా నిలబడి వుంది ఒక కాంక్రీట్ స్తంభం . యువకుడి చేతిలో నుంచి ముందుకు దూకిన త్రాటిచుట్టూ…… గాలిలో ఎగిరిన త్రాచుపాములా పోయి ఆ స్థంభం మీద పడి , దానిచుట్టూ మెలకలు దిరిగింది. బలంగా గుంజాడు యువకుడు ఉచ్చుముడి బిగుసుకున్నది. కొబ్బరి చెట్టుకు భవనానికి మధ్య ఒక త్రాటి వంతెన తయారయింది.
హర్షద్వానాలతో మార్మోగిపోయిందా ప్రదేశం….ఆ యువకుడికి సాయం చేయటానికి కొబ్బరి చెట్టు మీదికి ఎక్కారు నలుగురు ఉత్సాహవంతులు.
రెండవ కొనను కొబ్బరి చెట్టుకు ముడివేసి త్రాటికి వ్రేలాడబడ్డాడు యువకుడు.
"జాగ్రత్త! జాగ్రత్త” అన్న అరుపులు ఎక్కువైపోయాయి….. మంటల్ని చూడటం మాని అతని వంకే చూడసాగారు అందరూ.
ఆ యువకుడి చూపులన్నీ త్రాటికి పది అడుగుల క్రింద వున్న కిటికీ మీద వున్నాయి. ఏ క్షణంలోనైనా పగులుతుందది. పగిలిన మరుక్షణం మంటల్ని వెలువరుస్తుంది. ఆ మంటలు త్రాటిమీదికి వస్తేనే వుంది అసలు తంటా.
అడుగు అడుగు చొప్పున ముందుకు జరిగి బాల్కానీని సమీపించాడతను. కాలు ఎత్తి సిమెంటు పలకమీద వెయ్యబొతుండగా …. దడదడా కూలిపోయాయవి .
త్రాటిని భరిస్తున్న కాంక్రీట్ స్తంభం …. ఏటవాలుగా పక్కకు వంగింది. గొల్లున అరిచారు క్రిందవున్న జనమంతా .
పెదవులు బిగబట్టి గాలిలోకి లేచాడు యువకుడు.
క్రిందినుంచి వినవస్తున్న అరుపుల్ని లక్ష్య పెట్టకుండా కాళ్ళు ఎత్తి బాల్కానీ చివర వేశాడు.
పొగ కొట్టుకొని మలినమైన ముఖంతో, కన్నీరు విడుస్తూ నిలబడి వున్నది కార్తి….. అతన్ని చూడగానే ఒక అగ్నిజ్వాల మీది నుంచి యివతలకి దూకి, ఎదురు వచ్చింది బావురుమంటూ.
"డోన్ట్ వర్రీ డార్లింగ్! ఫికర్ మత్ కరనా!” అంటూ ఆమెను బాహువుల్లో పొదవుకున్నాడా యువకుడు.
కిటికీలోనుంచి వెలువడుతున్న మంటలు , చేంతాటిని అంటీ అంటనట్లు అంటుకున్నాయి….కాంక్రీట్ స్తంభం కొంచెం పటిష్టంగానే వుంది….. మరో రెండు మూడు నిమిషాలు వున్న చోటనే వుంటుంది.
క్రింద వున్న వారందరూ చేతులు పైకిఎత్తి యువకుడి వంకే చూస్తున్నారు. వారి భావాలతో తనకు నిమిత్తం లేనట్లు ఖణేల్ ఖణేల్ వంటున్నది భవనం…..
కార్తి చేతుల్ని మెడచుట్టూ చుట్టుకున్నాడు యువకుడు. టైగర్ ని తన భుజం మీద ఎక్కించుకొని త్రాటి మీద వ్రేలాడబడ్డాడు.
గలగలలాడుతూ కూలిపోయింది బాల్కానీ లోని మరికొంత భాగం . వైల్డ్ గా అటూయిటూ వూగటం ప్రారంభించింది….. కాంక్రీట్ స్తంభం.
ఆ యువకుడి మెడను గట్టిగా కౌగిలించుకొని కళ్ళు మూసుకున్నది కార్తి . తోక ఆడిస్తూ ఆనందంగా అతని బుగ్గలను నాలుకతో తడి చేయసాగింది – టైగర్.
భగ్గుమంటూ పైకి వచ్చాయి త్రాటి క్రింద వున్న కిటికీలోని మంటలు. నల్లటి పొగలు వెలవడసాగాయి చేంతాడు మీదినుంచి.
పెదవులు బిగించి, పళ్ళ బిగువున పక్కకు జరుగుతున్నాడు ఆ యువకుడు. అప్రయత్నంగా అతని చూపులు క్రింద వున్న బావివైపు మరలాయి.
పదిమంది పోలీస్ కానిస్టేబుల్స్ నిలబడి వున్నారక్కడ. హడావుడిగా వారితో మాట్లాడుతున్నాడు వారి సబ్ యిన్ స్పెక్టర్ .
యువకుడి కళ్ళు తన సహచరుడి కోసం వెతికాయి. కొబ్బరి చెట్టు చుట్టు నిలబడివున్న జనంలో వున్నాడతను. రెండు చేతుల్ని ఎత్తి నెత్తిమీద పెట్టుకొని కళ్ళు ఆర్పుతున్నాడు.
ఉన్న శక్తినంతా కూడగట్టుకుని చేతుల్ని కదిలించడం ప్రారంభిం చాడు యువకుడు. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టారట…. వారి చేతికి చిక్కకుండా తప్పించుకోవాలి. పటపటమంటూ తెగాయి రెండు త్రాటి పొరలు . బాల్కనీ మీద కాంక్రీట్ స్తంభం మరికొంచెం క్రిందకు వంగింది.
కెవ్వున అరిచారు క్రింద వున్న ప్రజలు.
కళ్ళు మూసుకుని మరింత వేగంగా ప్రక్కకు జరిగాడా యువకుడు. ముప్పై అడుగుల క్రింద వుంది నేల, పడటం అంటూ సంభవిస్తే సున్నంలోకి కూడా మిగలకుండా నుగ్గు నుగ్గు అయిపోతాయి ఎముకలన్నీ.
తోకను నిఠారుగా ఎత్తి గురగురలాడుతూ యువకుడి చెవిని ముద్దు పెట్టుకుంది టైగర్.
"బ్లడీ యిడియట్! నీకు యింతకంటే మంచి అదును మరోకటి కనిపించలేదా!” చక్కిలిగిలిని తట్టుకోలేక కసురుకున్నాడు ఆ యువకుడు.
ఆ మాటలు విన్న కార్తి ఫక్కున నవ్వింది తన భయాన్ని ఒక్కక్షణకాలం మర్చిపోయి, ఫట్ మంటూ తెగింది చేంతాడు. కిటికీలోంచి వెలువడిన మంటలు దాన్ని పూర్తిగా తినేశాయి.
రివ్వున పోయి కొబ్బరిచెట్టును గుద్దుకున్నాడు యువకుడు. ఆఖరి క్షణంలో ఒక చేతిని ముందుకు జాచి ఆ అదటును తట్టుకుని జర్రున క్రిందకు జారాడు. చెట్టు మీద రెడీగా ఉన్న సాహసవంతులు తలా ఒక చేయి అందించి అంచెలంచెలుగా అతను మోస్తున్న బరువులను తాము అందుకున్నారు.
యువకుడు నేలకు దూకిన మరుక్షణం అతన్ని చుట్టుముట్టింది ప్రజావాహిని. బాంబులు పడినట్లు శబ్దాలు చేస్తూ కూలిపోయింది నారాయణ్ భవంతి. దాన్ని గురించి పట్టించుకున్న వారెవరూ లేరు.
కార్తిని గుండెలకు అదుముకొని, టైగర్ ని చంకలో యిరికించుకుని, యువకుడి చేతులు పట్టుకున్నాడు నారాయణ.
"బాబూ! నువ్వెవరివో నాకు తెలియదు. డబ్బుపోతే రేపు సంపాదించుకోవచ్చు. నా బిడ్డపోతే తెచ్చుకోగలనా?” అంటూ గద్గద స్వరంతో కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాడు.
"నారాయణ్ సాబ్! అతన్ని మా యింటికి తీసుకుపోదాం ….. మన హమీర్ పురా ఆతిధ్యం ఎలా వుంటుందో రుచి చూపిపంపుద్దాం…..” నారాయణ్ స్నేహితుడొకడు పెద్దగా అరిచి చెప్పాడు.
"అవును….. అలాగే చేయాలి. అతని సాహసానికి తగిన గౌరవం చేయాలి!!” పెద్దగా అరచి తమ హర్షాని తెలియచేశారు మిగిలిన ప్రజలందరూ.
వారి మధ్య చిక్కుపడిన యువకుడి కళ్ళు…… చుట్టూ క్రమ్ముకువస్తున్న పోలీసుల్ని గమనించాయి. పదిమంది వున్నారు వారు. పది మంది యిన్ స్పెక్టర్లు వారిని లీడ్ చేస్తున్నారు.
Rest of the book can be read @ http://kinige.com/kbook.php?id=244